పన్నీటి పలకరింపు

                                                            - రాధిక  (శ్రీమతి గెద్దాడ కస్తూరి ప్రసాద్)

  నా పేరు విశాల. నేను సాఫ్ట్ వేర్ ఇంజనీర్ని. మీరో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ని పెళ్ళి చేసుకున్నారు. ఇద్దరం అమెరికా వచ్చేసాము. ఇందులో విచిత్రమేమీలేదు. అమెరికాలో ఉద్యోగం చేయడం చాలా కష్టం. అయినా తప్పదు. నేను కష్టాలను వెతుక్కుంటూ వచ్చాను. అవి నన్ను వెతుక్కోలేదు. ఇందులోని వెతలు అన్నీ నేను నోరు మూసుకుని భరించాల్సిందే. నేను అమెరికాకి రావడానికి మరో ముఖ్య కారణం ఉంది. మా అమ్మకు నాతో పాటు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళు చిన్నవాళ్ళు. వాళ్ళను నేను పోషించనక్కరలేదు. అమ్మ దగ్గర ఆస్థి బాగానే ఉంది. నాన్నగారు కూడా ఇంకా రిటైర్ కాలేదు. మా అత్తమామలది పూర్వకాలపు మనస్తత్వం. ఆడపిల్ల తరచుగా పుట్టింటికి వెళ్ళకూడదు. తల్లిదండ్రుల మంచి చెడ్డలు కొడుకు చూడాలి. ఒకసారి పెళ్ళైన ఆడది చెట్టు నుండి నరికివేయబడిన కొమ్మలా అయిపోవాలి గాని మరలా ఆ చెట్టుకు అతుక్కుకోకూడదు. వాడినా, పాడైనా, పాతితే మరలా మొక్కగా మొలచినా అన్నీ అత్తింటిలోనే అంటారు. అలాగే అసలు నన్ను పుట్టింటికి పంపరు. పంపినా ఒక్క పూటలో వచ్చేయాలి. ఫోన్ లో కూడా ఎక్కువ మాట్లాడకూడదు.

ఈ పద్ధతులు నాకు ఇబ్బందికరంగా ఉన్నాయి. నేను పెళ్ళి చేసుకున్నానా, అక్కడ చనిపోయి ఇక్కడ పుట్టానా, కిడ్నాప్ చేయబడ్డానా ఏదీ నాకు అర్ధం కావడం లేదు. అసలు ఆడపిల్లకు మగపిల్లకు ఎందుకు తేడాలు. అందర్నీ తల్లి నవమాసాలు మోసే కదా కంటుంది. మగవాడికి ఆడదానికంటే మరో రెండు కాళ్ళు, రెండు చేతులు ఎక్కువ ఉన్నాయా? మేమిద్దరం సమానంగా సంపాదిస్తున్నా నాకు విలువలేదు. నేను వేపాకు, కరివేపాకు .,. మావారేమో తమలపాకు!

ఇండియాలో ఉండి అమ్మానాన్నలకు దూరంగా ఉండే కన్నా ఇలా ఉద్యోగ రీత్యా వలస వచ్చేయడం మంచిదనిపించింది నాకు. ఏ రెండేళ్ళకో, మూడేళ్ళకో ఇండియాకు వెళ్ళినప్పుడు మా పుట్టింటికెళ్ళచ్చులే అనుకుంటా. అదీ చుక్కెదురే అయ్యింది. మనసుకి భయంతో అదురే మిగిలింది.

మేము ఇండియా వెళ్ళినప్పుడు కూడా అదే పరిస్థితి. రేషన్ బియ్యం లాగా అక్కడా రేషనే నాకు. ఒక్కపూటే ఉండనిచ్చారు. నాకు ఆశ తీరనే లేదు. ఎంతో దుఃఖం ముంచుకొచ్చింది. మా అత్తమామలను ఎదిరించి మా వారితో గొడవపడలేను. ఎంతోమంది విడాకులు తీసుకుని కష్టాలు పడుతున్న యువతీ, యువకుల్ని చూశాను. వారి దారిలోనే నేను నడవదలుచుకోలేదు. ఒక్కోసారి ఓర్పు కష్టాలనిస్తుంది. తిరుగుబాటు నష్టాలనిస్తుంది. ఏం చేయాలి? ఎలా బ్రతకాలి? దేవుడు మనుషుల్ని తన నేర్పరితనంతో ఒకరికి ఉండే రూపంగానీ, గుణం గానీ మరొకరికి లేకుండా తయారుచేస్తున్నాడు. అలా చేయడానికి మట్టి బొమ్మను చేస్తే దానిని భూమి మీదకు పంపి ఆ ఆకారాన్ని నీటిలో తడిపేస్తున్నాడు. పెన్సిల్ తో గీస్తే రబ్బర్ తో తుడిపేస్తున్నాడు. అందుకే భూమి మీద ఏ ఇద్దరి అభిప్రాయాలు కలవడం లేదు. అలాంటి ఇద్దరిలో ముఖ్యంగా ఉన్నది నేను, మా అత్తగారు.

మా అత్తగారు, మామగారు అమెరికా వచ్చారు. ప్రతీ సంవత్సరం రావడం, వెళ్ళడం వాళ్ళకు ఇబ్బందిగా ఉందని, ఇండియాలో ఇంక వారికి పిల్లలు ఎవరూ లేకపోవడంతో ఆస్తులన్నీ అమ్మేసుకుని అమెరికాలో గ్రీన్ కార్డు తీసేసుకున్నారు. ఇంక వాళ్ళు ఇక్కడే ఉండిపోవచ్చు. త్వరలోనే సిటిజెన్ షిప్ కూడా వచ్చేస్తుంది. ఇండియా నుండి అమెరికాకు దేవుళ్ళు, అత్తమామలు, తల్లిదండ్రులు కూడా వచ్చేస్తున్నారు. మా అత్తగారి దృష్టిలో మా అమ్మ కలుపు మొక్క. ఆవిడేమో కల్పవృక్షపు ముక్క.

మా అత్తగారు.. మామగారు పనిభారం ఎక్కువయింది. వాళ్ళకు అన్నీ వండి టేబుల్ మీద పెట్టి వెళ్ళాలి. మధ్యాహ్నం లంచ్ టైమ్ లో భోంచేసారా లేదా అని అడగాలి. మరలా ఆఫీసు నుండి వచ్చి అన్నీ వేడివేడిగా వండాలి. వాళ్ళు ఉదయం వండినవి రాత్రి తినరు. వాళ్ళు అమెరికాలో ఉన్నారన్నమాటే గానీ అన్నీ ఇండియా పద్ధతులే. ముఖ్యంగా కోడలిని సాధించడంలోను, ఆంక్షలు పెట్టడంలోను అవి మరీ ఎక్కువయ్యాయి. మేమిద్దరమే ఉంటే వండుకుంటే వండుకుంటాం లేకపోతే లేదు. ఫ్రిజ్ లో కూరలుంటే అవి తినేస్తాము. లేదంటే బయటకు వెళ్ళి తినేస్తాము. కానీ వాళ్ళకు అలా కాదు. బయటకు ఇండియన్ హోటల్ కు వెడదామంటే బోల్డంత ఖర్చు ఎందుకు అని వారిద్దరూ రారు. బయట అమ్మే ఇడ్లీపిండి, దోసెల పిండి తెచ్చి టిఫిన్ చేస్తే పిండి పుల్లగా ఉందనో, బాగాలేదనో వంకలు పెడతారు. ఈ పనుల కంటే నన్ను ఎక్కువ బాధ పెట్టేది నన్ను మా తల్లిదండ్రులతో మాట్లాడనివ్వకపోవడం. ఇండియాలో ఉంటే కనీసం పనిమనిషిని పెట్టుకుని పని తగ్గించుకునేదానిని. ఆఫీసు నుండైనా వాళ్ళ దగ్గరకు వెళ్ళి చూసివచ్చేదాన్ని. ఇక్కడ ఆ అవకాశాలు లేక అమెరికా ఎందుకొచ్చానా అనే బాధ నాలో రోజురోజుకీ ఎక్కువవుతోంది. అయినా మనుష్యుల మనస్తత్వాలు మంచిగా ఉంటె ఏ దేశమైనా ఒకటే మా అమ్మానాన్నల విషయంలో మా అత్తగారిది అహంకారం. నా తల్లిదండ్రులది హాహాకారం. మధ్యలో మా వారు నలిగిపొతున్నారు. ఆయన ఓ నల్లేరు. నేనేమో కన్నీరు.

ఇద్దరు పిల్లలు పుట్టారు. వారిని చూడడానికి మా అమ్మా నాన్న రాలేదు. ఇప్పుడు వాళ్ళు అంత అవసరమా, మేమున్నాముగా తోడుగా అంటూ మా అత్తగారు వాళ్ళను రానీయలేదు. అన్నీ ఇండియా పద్ధతులు పాటించే మా అత్తగారు ఈ విషయంలో పాటించలేదు. నన్ను పురిటికి పుట్టింటికి పంపలేదు. నేను వెళ్ళకపోవడానికి మరో కారణం ఉంది. అమెరికాలో పుట్టిన పిల్లల వల్ల తల్లిదండ్రులకు బెనిఫిట్ ఉంటుంది.అందుకే అమెరికాలో పిల్లల్ని కనడానికి అందరూ ఇష్టపడతారు. అందుకే ఇక్కడ ఎక్కడ చూసినా చిన్న పిల్లల తల్లులు కనబడుతుంటారు.

నాన్నగారికి హార్ట్ ఎటాక్ వచ్చిందని ఫోన్ వచ్చింది. నేను ఇండియా వెళతానని అంటే ససేమిరా వద్దన్నారు. నాకు చాల దుఃఖం వచ్చింది. ఆఫీసులో ఏడుస్తూ పని సరిగా చేయలేక పోయాను. మా మేనేజర్ ఇండియా ఆవిడే నార్త్ ఆవిడ. ఆవిడ నా వాలకం కనిపెట్టి ఏమిటి సంగతి అని అడిగింది. నాకు దుఃఖం ఎక్కువై బోరున ఏడ్ఛేశాను. నా పెళ్ళైన దగ్గరనుండీ జరుగుతున్న సంగతులన్నీ చెప్పేసాను. ఆవిడ నన్ను చాలా ఓదార్చింది. కాస్త మనసుకి తేలికనిపించింది. నీ ప్రోబ్లమ్ నేను పరిష్కరిస్తానులే అంది. బాబోయ్ మా అత్తమామలతో ఏమైనా మాట్లాడతారా వద్దని అంటూ భయంగా ఆవిడ వేపు చూశాను. మాట్లాడనులే అన్నారు.

ఆ మర్నాడు నేను ఆఫీసుకి వెళ్ళేసరికి ‘విశాల నీకొక కొత్త పని అప్పజెపుతున్నాను.’ నీవు బిజెనెస్ విజిట్ కి విదేశాలు అప్పుడప్పుడు వెళ్ళవలసి వస్తుంది. ప్రస్తుతం పది రోజుల పని అంది. ఎక్కడికి మేడమ్ అన్నాను నిర్లిప్తంగా. ఇండియాకు అందామె. ఒక్కసారిగా నాకు ఒళ్ళు పులకరించింది. ఇది కన్నీటిలో పన్నీటి పలకరింపు.
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech