 |
 |

కబుర్లు
- శ్యామలాదేవి దశిక, North Bruswick, NJ |
|
ఏమిటీ కారు ప్రయాణం బోరు కొట్టిందా?
ఇంకెప్పుడూ నేను పక్కన లేకుండా దూరప్రయాణాలు చెయ్యరా?
మీకు బాగా అలవాటయిపోయింది. నేను పక్కన చద్దిమూటల్లే ఉండటం.
బటను నొక్కగానే రికార్డు ప్లేయరు లోంచి కావల్సిన పాటలొచ్చినట్టు,
కారు స్టార్టు చెయ్యగానే మీకు కబుర్లు వినిపించాలి!
ఈ అలవాటు ఈనాటిదా?
నేను ఈ దేశం రాగానే మీరు అప్పుడే కొత్తగా కొన్న సెకండ్ హాండు షెవర్
లెట్ కారులొ మీ స్నేహితుడు శ్రీధరం గారిని చూడ్డానికి బయలుదేరాం
గుర్తుందా?
అది మన మొట్టమొదటి దూరప్రయాణం.
చీర నలక్కుండా నేను కారు ముందు సీట్లో కూర్చోగానే, మీరు గుప్పెడు
చిల్లరడబ్బులు, ఓ కాగితాల కట్టా నా ఒళ్ళో పడేశారు.
పెళ్ళికి వెళ్తూ పిల్లిని చంకన పెట్టుకుని వెళ్ళినట్టు ఈ చిల్లరమూట,
ఈ చిత్తుకాగితాలబొత్తి ఎందుకూ అని నేను అడిగేలోపే మీరు ‘వీటితో చాలా
పని ఉంది. ఇవి జాగ్రత్తగా పట్టుకుని నాకు అవసరమైనప్పుడల్లా
లెక్కపెట్టి చిల్లరడబ్బులు నేను మీ చేతిలో పెడ్తుంటే, మీరు టోల్
బూత్ లో కూర్చున్న వాడికి సమర్పించేవారు.
ఇలా వచ్చేపోయే వాళ్ళదగ్గర డబ్బులు తీసుకోవడమే అతని ఉద్యోగం అని
చెప్పి నవ్వారు.
నేను వెంటనే అబ్బ! మీరు కూడా ఈ బడిపంతులు (అదేలెండి, అసిస్టెంట్
ప్రొఫెసర్) ఉద్యోగం కాకుండా ఇలాంటి ఉద్యోగం చేస్తే మనకూ ఎంచక్కా
బోలెడు డబ్బులు వస్తాయి’ కదాఅని పైకి మీతో అనలేక మనసులో అనుకున్నాను.
మొగుడువాడు డ్రైవ్ చేస్తుంటే ఇలా టోల్ టిక్కెట్లు, చిల్లర డబ్బులు,
మ్యాపులూ గట్రా ఒళ్ళో పెట్టుకుని ఠంచనుగా అందించడం ‘అమెరికా
అర్ధాంగి కర్తవ్యం’ అని చెప్తే నిజమే కాబోలు అనుకున్నాను!
ఇలా ఈ దేశం వచ్చినప్పటి నుంచీ సిన్సియర్ గా నాలాంటి ఆడవాళ్ళు ఎంతో
మంది ఈ ఉద్యోగం చేస్తుంటే, చెప్పాపెట్టకుండా ఈజీ పాసులు-జీపీఎస్ లూ
పెట్టేసి మమ్మల్ని రీప్లేస్ చేయడం ఏం బాగాలేదు అంటాను.
మీకు గుర్తుందో, లేదో, నన్ను మధ్యమధ్యలో మ్యాపులు తెరిచి ఫలానా ఊరు
ఎక్కడుందో,మనం వెళ్ళాల్సిన ఊరు ఇంకెంత దూరం ఉందో చూడమనేవారు. ఆ
మ్యాపులో మీరు చెప్పే ఊళ్ళ పేర్లు ఎంత వెతికినా నాకు ఓ పట్టాన
కనిపించేవి కావు.
మ్యాపుని తలకిందులుగా పెట్టి చూస్తున్నానని, కింద చూడాల్సిన ఊరుని
పైన చూస్తున్నానని నన్ను కోప్పడుతూ ఉండేవారు.
స్టీరింగ్ వీల్ ని రెండుచేతులతో గట్టిగా పట్టుకుని టెన్షన్ గా
డ్రైవ్ చేస్తూ, మీరు దోవ తప్పడానికి కారణం నేనే అంటూ తప్పు నా
మీదకు తోసేవారు. మీరు దర్జాగా డ్రైవర్ సీట్లోకూర్చుని చాలా
శ్రమపడ్తున్నట్టు పోజులు కొడుతూ, నా చేత చక్కగా సేవలు
చేయించుకునేవారు.
మీరు దాహం అనగానే సోడా కేన్ లో స్ట్ఘ్రావేసి రెడీగా
పట్టుకునేదాన్ని.
ఆకలి అన్నప్పుడల్లా పచ్చడి అద్దిన ఇడ్లీ ముక్కలు, ఉప్మాలు, సాండ్
విచ్ లు నోటికందిస్తే గుటుకూగుటుకూమని తినేవారు!
ఇహ ఫుడ్డు లాగించాక మీకు నిద్ర రాకుండా కబుర్లు చెప్పమనేవారు.
నేను ఏమీ మాట్లాడకపోతే‘ఇదిగో నాకు నిద్ర ముంచుకొస్తోంది. నీ ఇష్టం’
అంటూ నన్ను బెదిరించేవారు.
మీ డబాయింపు చూసి నాకు నా చిన్నతనం గుర్తొచ్చేది.
మూడు మూన్నాళ్ళకు జ్వరం పడే నేను పథ్యం తిన్నాక నాతో గచ్చకాయలు,
చింతపిక్కలు ఆడకపోతే నిద్రపొతానని బెదిరించేదాన్ని. నన్ను
మెలుకువగా ఉంచడానికి అప్పుడప్పుడూ మా అన్నయ్య, అవసరమైతే మా నాన్న
కూడా నాతో ఆడేవారు.
అప్పట్లో మీరు కబుర్లు చెప్పమంటే నాకు ఏం చెప్పాలో తెలిసేది కాదు.
అందుకని మా ఊళ్ళో ప్రతియేటా జరిగే దేముడి ఉత్సవాల్లో
శాస్త్రులుగారు హరికథ ఎలా చెప్పేవారో, నీళ్ళకోసం నేను రోజూ చెరువు
దగ్గర అమ్మలక్కలు ఎలా మాట్లాడుకునేవారో, కీచుగొంతు కనకారావు
మేస్టారురోజూ క్లాసులో తెలుగు పద్యం ఎలా పాడేవారో, తర్వాత నేను
హైద్రాబాద్ కాలేజీలో చదువుతున్నప్పుడు మా హిస్టరీ మేడం గజనీ మహ్మద్
దండయాత్ర గురించి తెలంగాణా యాసలో ఎలా చెప్పేవారో ఇమిటేట్ చేసి
చెప్పేదాన్ని.
నా కబుర్లకు మీరు పడీ పడీ నవ్వేవారు.
ఆ నవ్వుల ప్రవాహంలో పడి మనం ఎగ్జిట్లు, రోడ్లు మిస్సవుతుండేవాళ్ళం.
పెద్దవాళ్ళెవ్వరు పక్కన లేని మనం, పిల్లకాకులమైన మనం, ఇంకా పిల్లలు
లేని మనం అచ్చు పిల్లలంలాగానే మన కొత్త జీవితాన్ని భలేగా ఎంజాయ్
చేసాం!
ఆ తర్వాత నెమ్మదిగా పిల్లలు-బాధ్యతలతో మన జీవితంలో మార్పు
వచ్చినట్టే ప్రయాణాల్లో నాకబుర్లు కూడా మారాయి.
పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు వాళ్ళ నర్సరీ రైములతోనూ, నేను
వినిపించే అన్నమయ్య పాటలతోనూ మన ప్రయాణాలు హుషారుగా ఉండేవి.
పిల్లలు కొంచెం పెద్దవాళ్ళయిన తర్వాత వాళ్ళకోసం నాకొచ్చిన కథలన్నీ
చెప్పేదాన్ని. నీతికథలతోపాతు కీలుగుర్రం, మాంత్రికుడు,
భేతాళుడులాంటి కథలు కూడా చెప్పేదాన్ని.
పిల్లలతో పాటు మీరు కూడా చెవులు నిక్కపొడుచుకుని వింటుండేవారు.
మీరు పిల్లల చదువు విషయంలో శ్రద్ధ తీసుకునేవారు కాదు.
అప్పుడప్పుడు పిల్లల ప్రవర్తన, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు మీకు
కోపం-చిరాకు తెప్పించేవి.
నేను మీతో సావకాశంగా మాట్లాడాలన్నా, మీకు నచ్చచెప్పాలన్నా, మీ
అంగీకారం తీసుకోవాలన్నా మనిద్దరం కారులో ప్రయాణం చేస్తున్నప్పుడే
కుదిరేది. మనం ఇంట్లో కన్నా కారులోనే ఎక్కువ మాట్లాడుకునేవాళ్ళం.
పిల్లల చదువులు, రిపోర్టు కార్డులు, వాళ్ళ తగువులు, బర్త్ డే
పార్టీలు, గ్రాడ్యుయేషన్లు, వాళ్ళు వెళ్ళే కాలేజీల గురించి వాళ్ళ
భవిష్యత్తు గురించి..
రెక్కలొచ్చిన పిల్లలు మనలాగే వాళ్ళ దోవలు వాళ్ళు వెదుకుకున్నారు.
ఆ రోజుల్లో మన కారులో రేడియోలూ, కేసెట్ ప్లేయర్లూ, లేకపోవడంతో
కాలక్షేపం కోసం కబుర్లు చెప్పుకుంటూ మనల్ని మనం ఎంటర్ టెయిన్
చేసుకున్నాం. తర్వాత తెలియకుండా అదే మనకు అలవాటుగా మారిపోయింది.
ఇన్ని సంవత్సరాలలో కొన్ని వందల మైళ్ళ ప్రయాణంలో మనం ఎన్నో సంగతులు
మాట్లాడుకున్నాం.
మన కుటుంబ విషయాలు సమస్యలతో పాటు మనకు నచ్చిన సినిమాలు, సంగీతాలు,
వెకేషన్లు, బేసుబాలులు, రాబోయే ఎలక్షన్లు, మీ బంధువులు, నావాళ్ళూ,
మన స్నేహితులు మన కమ్యూనిటీ...ఇలా ఎన్నెన్నో కబుర్లు
చెప్పుకున్నాం.
ఈ కబుర్లే మనల్ని నవ్వించాయి.
ఈ కబుర్లే మనల్ని ఆలోచింపచేశాయి.
ఈ కబుర్లే మనకు ఓదార్పునిచ్చాయి, ఊరటనిచ్చాయి.
ఈ కబుర్లే మనకు ధర్యాన్నిచ్చాయి.
ఈ కబుర్లే మనల్ని ముందుకు నడిపించాయి, నడిపిస్తున్నాయి.
మన ప్రయాణం చివరివరకూ మనం ఇలా కబుర్లు చెప్పుకుంటూనే ఉండాలి
ఏమంటారు? |
|
మీ
అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది
పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ
పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.
మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ
తెలుపవలసినది. (Note: Emails will not be shared to
outsiders or used for any unsolicited purposes. Please
keep comments relevant.)
|
 |
Copyright ® 2001-2009 SiliconAndhra. All
Rights Reserved.
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
Site Design: Krishna,
Hyd, Agnatech
|
|