జీవితం అంటే..?

                                                               - డాక్టర్ బి.జయరాములు

  ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మానవుడు బుద్ధి, వాక్కు, హృదయం కలిగి విలక్షణమైన జీవిగా పరిగణింపబడుచున్నాడు. భగవంతుని సృష్టిలో మానవుని సృష్టి విలక్షణంగా ఉంది. మానవేతర ప్రాణులు ఎందుకు జీవిస్తున్నాయో తెలియకుండా జీవిస్తున్నాయి. మానవుడు మాత్రం
తాను విలక్షణంగా జీవిస్తూ ఇతర ప్రాణులను, సృష్టిలోని శక్తిని తనకనుగుణంగా మలచుకుని వ్యక్తిగా, సామాజికునిగా, మేథావిగా వైలక్షణ్యాన్ని సాధించాడు. ఇలాంటి విలక్షణతకు కారణం మానవునిలో భగవంతుడు నిక్షేపించిన శక్తే. భగవంతుడిచ్చిన ఆ శక్తిని (power) సద్వినియోగం చేసుకుంటూ సక్రమంగా జీవించడమే నిజమైన జీవితం. మనలో (అంటే మానవునిలో) ఉన్న ఆ శక్తులేమిటో, తద్వారా మన జీవితం ఎలా మలచుకోవాలో విశ్లేషించడమే ఈ వ్యాసం యొక్క ఉద్దేశం.

మనిషిలో పంచకోశాలుంటాయని భారతీయ తత్త్వశాస్త్రం చెబుతూంది. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, జ్ఞానమయ, ఆనందమయ కోశాలైదు. అన్నమయ కోశం మనిషి ప్రాథమిక అవసరాలను తెలుపుతూంది. ఏ ప్రాణికైనా ఆహారం (అన్నం) అవసరం. దానితో ప్రాణం నిలుస్తుంది. మానవులెవరైనా ఆహారం లేకుండా జీవించడం సాధ్యం కాదు. అందుకే మొదట అన్నమే భగవంతుడని ‘భృగువల్లి’ (ఉపనిషత్తు) చెబుతుంది. (అన్నం బ్రహ్మేతి వ్యజానాత్). రెండోది ప్రాణం. ప్రాణం అంటే గాలి అని అర్ధం. ఉఛ్ఛ్వాశ, నిఛ్ఛ్వాసాల ద్వారా ప్రాణమయ కోశం పరిపూర్ణం చేయబడుతూ జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలకు చైతన్యాన్ని, శక్తిని సమకూరుస్తుంది. మనలో పంచప్రాణాలు (ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన) ఉంటాయి. అవి చైతన్య వంతంగా ఉంటే మన శరీరం, బుద్ధి, మనస్సు సక్రమంగా పనిచేస్తాయి. ప్రాణాయామాదులు మన ఊపిరితిత్తులకు, ఇంద్రియాలకు శక్తిని సమకూరుస్తాయి. అందుకే అన్నమయ కోశం కంటే ప్రాణమయ కోశం విశిష్టమైనదిగా భావిస్తారు. (ప్రాణో బ్రహ్మేతి వ్యజనాత్). ఈ రెండు కోశాల పరితుష్టి సకల ప్రాణి సమానమైనది. మూడోది మనోమౌయ కోశం. సంకల్ప, వికల్పాలకు మూలమైంది మనసు. స్పందనలకు, భావావేశాలకు ఆలయం. మన మనస్సే బంధమోహాలకు కారణమైనదిగా విజ్ఞులు భావిస్తారు. (మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః). ఋషులు, శాస్త్రజ్ఞులంతా మనో నిగ్రహం అవసరమని చెబుతారు. ఏకాగ్రతకు (concentration) మనోనిగ్రహం అవసరం. అది తపస్సు (ఎల్లప్పుడూ తపించడం - మాటిమాటికీ అనుకుంటూ ప్రయత్నించడం) వల్ల సాధ్యం. మనోమయ కోశ పరితృప్తిని బట్టి ఆయా మానవుల వైయుక్తిక, సాంఘిక, సాంస్కృతిక స్థాయిని నిర్ణయించవచ్చు. అందుకే మన మనస్సే భగవంతుడన్నారు( మనో బ్రహ్మేతి వ్యజనాత్).

మనం మనో నిగ్రహంతో సాధించేది జ్ఞానం. ఈ జ్ఞానం రెండు రకాలు. ఒకటి భౌతిక జ్ఞానం. రెండోది తాత్త్విక జ్ఞానం. ఈ సృష్టిని గురించి (భౌతిక, రసాయన, జీవ, శరీర, మనస్తత్వ, పదార్ధాది శాస్త్రాల పరిజ్ఞానం), మానవ మనస్తత్వాన్ని గురించి అధ్యయనం చేయడం తెలుసుకోవడం భౌతిక జ్ఞానం. మనం ఎందుకు పుడుతున్నాం, పుట్టుకకు ముందు ఎక్కడున్నాం? పోయాక ఎక్కడికెళతాం? బతికున్నప్పుడు ఏం చేయాలి? ఎలా జీవించాలి? అనే ప్రశ్నలకు సమాధానాలను వివరించేది తాత్త్విక జ్ఞానం. ఈ జ్ఞాన సముపార్జనకు మన జ్ఞానమయకోశం పరితపిస్తూ ఉంటుంది. జ్ఞానమయ కోశానికి పరితృప్తి కలిగించాలి. అదే అజ్ఞానమే పరమాత్మగా భావించబడింది. (జ్ఞానం బ్రహ్మేతి వ్యజనాత్). శరీరానికి సంబంధించిన అన్నమయ, ప్రాణమయ కోశాలను, మనస్సుకు సంబంధించిన మనోమయ కోశాన్ని, బుద్ధికి సంబంధించిన జ్ఞానమయ కోశాన్ని దాటి చివరకు మనం అందుకోవలసింది ఆత్మకు సంబంధించిన ఆనందమయ కోశాన్ని. మానవుడు ఆకలి, అన్నం అనే ప్రాథమిక దశ నుండి దాటి (చైతన్యం, స్పందనల దశల్ని అధిగమించి ఆలోచన అంతర్దృష్టి, వివేకాలను పొందాలి. వాటిని గూడా దాటి, మనస్సు, వాక్కు చెప్పలేని జ్ఞానావధిని దాటి ఆత్మస్థితిని పొంది అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందాలి. (యలోవాచానివర్తంతే అప్రావ్యమనసా సహ) ఆ అనందమయకోశ పరిపూర్తితో జీవితం సఫలమవుతుంది.ఇలా పంచకోశ పరితృప్తిని మనిషి పొందుతూ తాను సమాజానికి, ప్రకృతికి తోడ్పడుతూ, ఆత్మగౌరవం కలిగి, అంతర్దృష్టి కృషి వివేకంతో జీవిస్తూ తాత్త్విక స్థాయి నందుకొని ఆనందాన్ని పొందడమే జీవితం.

ఈ పంచకోశాలకు పరితృప్తి కలగడానికి దోహదం చేస్తూ కనిపించకుండా ఉండి శక్తినందించేవి (Invisible acts of power) నందించేవి మన వెన్నెముక మూలం నుండి బ్రహ్మరంధ్రం (మాడు) దాక అక్కడక్కడ (భగవంతునిచే) నిక్షిప్తం చేయబడ్డ సప్తచక్రాలు. భారతీయ యోగశాస్త్రంలో వీటిని గురించి వివరంగా చెప్పారు. (These are Seven Chakaras, Seven Holy Sacraments in Christianity, Seven Major Energy Categories in Western mysticism, caroline miss). ఈ ఏడు చక్రాలు మనలోని శక్తి కేంద్రాలు. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ, సహస్రారం అనే ఈ సప్త చక్రాలు క్రమంగా గుహ్వ, జననాంగ, నాభి,హృదయ, కంఠ, బ్రహ్మర్మధ్య, బ్రహ్మరంధ్ర స్థానాలలో ఉంటాయి.

మానవుని జీవితావసరాలకు (అన్నం మొ..) సంబంధించి ఉంటుంది మూలాధారచక్రం. ఇది మానవ తెగ (Tribes) కు సంబంధించింది. దీని ప్రధాన ఉద్దేశ్యం (motto) `మనమంతా ఒక్కటే’ (we are all one ) అనేది. మూలాధారం అంటే ప్రధానమైన ఆధారం. తిండి, బట్ట, ఆశ్రయం, ఆత్మరక్షణ లాంటవి పొంది ఇతరులతో కలిసి జీవించడానికి శక్తినిచ్చే మూలాధార చక్రం. ఇది అన్నమయ్య కోశ పరితృప్తికి దోహదపడే శక్తినందిస్తుంది. ఇక రెండొ చక్రం స్వాధిష్టానం. వ్యక్తికి ఇతరులకు బాంధవ్యాన్ని (relationship) పెంచే శక్తినిస్త్తుంది. కామం, సృజనాత్మకత, మొదలైన లక్షణాలను కలిగి స్వీయరక్షణ శక్తినిస్తూ జననాంగ స్థానంలో ఉంటుంది. దీని ప్రధానోద్దేశం ‘ఒకరినొకరు గౌరవించుకోవాలి’ (Honor one another) అనేది ఇది వ్యక్తికి సమాజంలో పలువురితో మెలగడానికి అవసరమైన శక్తిని ఇస్తుంది. అది చైతన్యరూపంలో మనిషిలో ప్రవహిస్తూ ప్రాణమయ కోశానికి శక్తినందిస్తుంది. (స్వ + అధిష్టానం = స్వాధిస్ఠానం) తనను తానుగా సమాజంలో నిరూపించుకోవడానికి అవసరమైన శక్తిని ఇది సమకూరుస్తుంది.

‘మణిపూరం’ అనే మూడో చక్రం యొక్క ప్రధానాంశం ‘అహం’ (Self). `తన్ను తాను గౌరవించుకోవడం’ లేదా ‘ఆత్మగౌరవం కలిగి ఉండడం’ (Honour oneself) దీని ప్రధానోద్దేశం. స్వీయ వ్యక్తిత్వం, స్నేహం, ఆత్మగౌరవాలను పెంపొందించుకోవడానికి దోహదపడే శక్తినందిస్తుంది. ఇది నాభి స్థానంలో ఉండి మూలాధారంతో పాటు స్వాధిష్టానానికి అనుబంధింపబడి ప్రాణమయ కోశానికి పరితృప్తిని కలిగిస్తుంది. ఈ మూడు చక్రాలు భౌతిక జీవితం సజావుగా సాగడానికి దోహదం చేస్తాయి.

‘అనాహతం’ హృదయ స్థానంలో ఉండే నాలుగో చక్రం. ప్రేమ, దయ, క్షమ, ఆర్ధ్రత, అనే గుణాలకు ఆలవాలమైంది. దీని ప్రధాన లక్షణం ప్రేమ (love) ఈ చక్రం ద్వారా ప్రేమ దివ్యమైన శక్తి’ (love is divine power) అది నిరూపించబడుతుంది. ఇది మూలాధారాది మూడు చక్రాలకు, విశుధ్దాది మూడు చక్రాలకు ఇరుసుగా ఉండి రెండింటిని అనుసంధానిస్తూ పరిపూర్ణత్వం కలిగించడానికి దోహదం చేస్తుంది. ఇది మనోమయ కోశ పరితృప్తికి శక్తినందిస్తుంది. దీని తర్వాత కంఠస్థానంలో ఉండే ‘విశుధ్ద చక్రం’ మానవుని కోరిక, ధర్యం, స్వీయాభివ్యక్తికి ఇది దోహదం చేస్తూ మనస్సుకు, వాక్కుకు విశుద్ధతను (purified) కలిగిస్తుంది. ఈ ‘విశుద్ధత’ ఉద్దేశం వైయుక్తిక కోరికను దివ్యత్వానికి చేర్చడం. (Surrender personal will to divine will). ఇది మనోమయ కోశానికి పరితృప్తి కలిగిస్తూనే ‘జ్ఞానమయకోశానికి పాదులు తీస్తుంది.

భ్రువోర్మధ్యం (బొనుముడి)లొ ఉండే ఆజ్ఞాచక్రం మానవుని వివేకానికి (wisdom) మూలమై, సత్యాన్ని మాత్రమే కోరమని (seek only the truth) నిర్దేశిస్తుంది. ఈ చక్రం ఆలోచన, అంతదృష్టి, వివేకం, ఆశావాదం, అనేవాటికి శక్తి నందిస్తూ జ్ఞానమయ కోశానికి పరితృప్తి కలిగిస్తుంది. సత్యశోధనకు మూలమైన ఈ చక్రపు శక్తి మనిషిని లోకంలో మేథావిగా, జ్ఞానిగా నిలుపుతుంది. అందుకే Alfred Lord Tennyson `knowledge' comes but wisdom lingers' అన్నాడు. ఇది మానవుని జీవితంలో ప్రధాన లక్ష్యమే కాని అంతిమ లక్ష్యం కాదు.

ఏడోది ‘సహస్రార చక్రం’. హిందూ తత్త్వ శాస్త్రంలో సహస్రారం (కమలం) మోక్షానికి సంకేతంగా భావిస్తారు. ఈ చక్రానికి మూలమైన పదం ‘విశ్వాసం’ (faith). భగవంతునిపై విశ్వాసం కలిగిఉండి, భూతాన్ని (past) తలవక, భవిష్యత్తును (future) భావించాక వర్తమానంలో వర్తిస్తూ(live in the present moment)ఆత్మను తెలుసుకుని తద్వారా (ముఖ్యంగా ధ్యానం ద్వారా) మోక్షం పొందాలని ఈ చక్రం యొక్క శక్తి ప్రేరేపిస్తుంది. ఈ మోక్షమే ఆనందం. ఆనందోబ్రహ్మేతి వ్యజనాత్’ అనే ఉపనిషద్ద్వాక్యం ప్రకారం ఆనందం నిరంతరంగా పొందడమే మోక్షం అదే భగవంతుడు అందుకే ‘రసోవైసః’ అన్నారు. బ్రహ్మరంధ్రం స్థానంలో ఉండే ఈ ‘సహస్రారచక్రం’ ఆనందమయ కోశానికి పరితృప్తిని కలిగిస్తుంది.

ఈ విధంగా మనలో వెన్నెముక (spinal card) ఆధారంగా ఉండే చక్రాలను యోగశక్తితో చైతన్యవంతం చేస్తూ, వాటిద్వారా అన్నమయాది పంచకోశాలకు పరితృప్తిని కలిగిస్తూ భౌతిక జీవితం నుండి ఆధ్యాత్మిక జీవితాంతం దాకా పయనించి ఆనందం పొందడమనే లక్ష్యాన్ని చేరడమే జీవితం యొక్క పరమావధి.

సుఖం, సంతోషం, ఆనందం అనే మూడు పదాలను పర్యాయ పదాలుగా వాడుతూ ఉంటాం. కానీ ఈ మూడింటి అర్ధాలు వేరు. సుఖం శరీరానికి సంబంధించింది. ఇది అన్నమయ, ప్రాణమయ కోశాలకు పరితృప్తి కలిగించడం ద్వారా లభిస్తుంది. ఇది భౌతికావసరాలను తెలుపుతుంది. సంతోషం మనసుకు సంబంధించింది. అనుకున్నది సాధించడం వల్ల గానీ,అనుకోనిది లభించడం వల్ల (లాటరీ) గానీకళలను దర్శించడం వలన గానీ మనసుకు కలిగేది సంతోషం ఇది మనోమయ కోశానికి పరితృప్తిని కలిగించడం ద్వారా లభిస్తుంది. చివరి ‘ఆనందం’ ఆత్మకు సంబంధించింది. ఆత్మకు (పరమాత్మకు) సంబంధించిన జ్ఞానాన్ని పొందడం వల్ల ఇది లభిస్తుంది. జ్ఞానమయ, ఆనందమయ కోశాలకు పరితృప్తి కలిగించడం వల్ల ఇది లభిస్తుంది.

మానవుడు తాను సత్ప్రవర్తన కలిగి, అవసరమున్నతోటి మానవులకు సాయపడుతూ, ఆత్మ గౌరవం, అంతర్దృష్టి, వివేకం కలిగి తాత్త్విక స్థాయి నందుకొని ఆనందాన్ని పొందడమే జీవితం’ అని ఈ వ్యాసం సారాంశం.

`Faith is noti passive, it is an active force. And with it we can move mountains' - Carotine Myss.
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech