గగనతలము-17                                
 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

గ్రహములు తొమ్మిది. ఇవి భూమిచుట్టూ వృత్తాకారమార్గములో వివిధకోణీయగతులలో భ్రమించు (తిరుగు) చున్నవి. ఇందు రాహు కేతువులను ఛాయాగ్రహములంటారు. వీనికి రూపము లేదు, అందువలననే వానికి ఆ పేరు వచ్చినది. చందృడు తిరుగు విమండలము మరియు సూర్యుడు తిరుగు క్రాంతివృత్తము యొక్క సంపాతబిందువులే రాహువు మరియు కేతువు. సంపాతబిందువనగ ఆ రెండు వృత్తములు కలియు చోటు అని అర్ధము.
ప్రస్తుతము మనము వేరే విధముగ తెలుసుకున్న కారణముగ వృత్తాకారమార్గము, సూర్యుడు తిరగడము వంటి విషయములు ఇబ్బందికరముగ ఉండవచ్చును. ప్రస్తుత ఖగోళవిజ్ఞానమునకు మన జ్యోతిషమునకు ఏ మాత్రము సంబంధము లేదని గ్రహించాలి. భూమిచుట్టూ గ్రహములు తిరగకున్ననూ భూకేంద్రమును దృష్టిలో ఉంచుకుని చూసినపుడు అవి భూమిచుట్టూనే తిరుగుతున్నట్లు కనిపిస్తాయి కాబట్టి.
ఇది మనను సర్ది చెప్పుకోవడానికి చేస్తున్న వ్యాఖ్యానము కాదు. ప్రపంచప్రసిద్ధి గాంచిన ఆర్యభటుని వచనమే ఇది. అవి వృత్తాకారమార్గములో కూడ తిరుగుటలేదు. కావునే వానికి ఉచ్చ మరియు నీచ స్థానములు మనము కల్పించుకున్నాము. గ్రహమునకు ఉచ్చస్థానమనగా గ్రహము భూకేంద్రమునుండి అత్యంత దూరములో ఉండు స్థానమని, నీచ యనగ భూమికి అత్యంత సమీపములో ఉన్న స్థానమని అర్ధము. గ్రహము వృత్తాకార కక్షలో తిరుగుతు దాని కేంద్రములో భూమిఉన్నచో ఈ విధముగ ఉచ్చ నీచను చెప్పుట సాధ్యమే కాదు. కావున మనము అవివేకముగ వ్యవహరించుటలేదన్న నిజమును గ్రహించాలి.
జాతకఫలములనేవి గ్రహముల కిరణముల ఆధారముగనే మనము చెబుతాము. ఆ కిరములు గ్రహముయొక్క స్థితిని మరియు స్థానమును బట్టి మనకు అందుతాయి. ఉదాహరణకు గంధకము మధ్యలో మనము ఉష్ణవికిరణముగల వస్తువును ఉంచినపుడు గంధకయుక్త వాయువు అచట ప్రసరించడము సాధారణవిషయము. ఇది చిన్న ఉదాహరణ. గ్రహములయొక్క కాంతి వాటినుండి వచ్చినది కాదని అది సూర్యకిరణ పరావర్తనము వలన వచ్చినదని మనకు తెలుసు.
సూర్యకాంతి నీటినుండి పరావర్తనమయినపుడు, అద్దముమీద పడి పరావర్తవమయినపుడు ఏ విధమయిన మార్పులు ఉంటాయో అదే విధముగ సూర్యకాంతి విభిన్న లక్షణములు కలిగిన గ్రహములపైన పడినపుడు వివిధరకములుగ కనిపిస్తుంది ప్రభావమును చూపిస్తుంది కూడ. ఇవి అన్నీ చిరు ఉదాహరణలు మాత్రమే. కానీ ఈ సిద్దాంతములనే మనము పూర్తిగా గ్రహములు, వానినుండి వెలువడు కిరణములు మరియు ఆ కిరణములు ప్రాణులపై చూపు ప్రభావములను ఊహించు సందర్భములో నిస్సంశయముగా ప్రయోగించవచ్చును.
రవి ఆత్మ. ఆత్మానుగుణముగనే వ్యక్తియొక్క స్వరూపస్వభావవ్యవహారాదులు ఉంటాయి. చందృడు మనస్సు. సుఖదుఃఖములను అనుభవించునది మనస్సు. వానికనుకూలముగ ప్రవర్తించుటకు ప్రేరేపించునది కూడ మనస్సే. బలమును ప్రభావితము చేయువాడు కుజుడు. బలమునే సత్త్వమని కూడ అంటారు. ఇదే విధముగ వాక్కును బుధుడు, జ్ఞాన సుఖములను గురుడు, మదమును శుకృడు మరియు దుఃఖమును శని ప్రసాదించుచున్నారు. అనగ మానవజీవితమునందు ఆ యా విషయములను ఆయా గ్రహములయొక్క బలాబలములను బట్టి అంచనా వేయవలెనని అర్థము.
రవి చందృలు రాజులు. కుజుడు సేనానాయకుడు. రాజకుమారుడు బుధుడు. శుక్రగురులు మంత్రులు, దాసుడు శని. జాతకుని జాతకములో జాతకుని లగ్నము మరియు రాశిపై అత్యధికముగ ఏ గ్రహముయొక్క ప్రభావమయితే ఉంటుందో ఆ గ్రహమునకు సంబంధించిన లక్షణములే సాధారణముగ వారిలో కనిపిస్తాయి. ఉదాహరణకు రవి లక్షణములతో ప్రభావితుడైన వ్యక్తి రాజసముతో మరియు దానికి సంబంధించిన అన్య లక్షణములతో కనిపిస్తాడు. అదే శని ప్రభావయుతుడు సేవకుని లక్షణములను అధికముగ కలిగి ఉంటాడు. సూర్య ప్రభావము కలిగినవాడు ఏ విధముగను లొంగు అవకాశములు లేనట్లే శని ప్రభావము కలిగినవాడు నయానా భయానా ఎవ్వరికైననూ లొంగు అవకాశములు మరియు ఎంతకైననూ తెగించు అవకాశములు కూడ ఎక్కువగ ఉంటాయి. ఇదే విధముగ మిగిలిన గ్రహముల విషయములోకూడ ఊహించవలెను.

రవి రక్తశ్యాముడు. అనగ పాటలపుష్పవర్ణము గలవాడు. చందృడిది గౌరవర్ణము. కుజుడు దీప్తగౌరుడు. అనగ దీప్తాగ్నిసమాన వర్ణము గలవాడు. మండుచున్న మంటయందలి తెల్లని ప్రకాశము ఏవిధముగ ఉండునో ఆ విధమైన వర్ణము కుజునిది అని అర్థము. దూర్వశ్యాముడు బుధుడు. తప్తకాంచనవర్ణము గలవాడు గురుడు మరియు తెల్లని దేహము కలవాడు శుకృడు. శనిది నీలవర్ణము. కృష్ణదేహుడు శని. ఈ గ్రహముల వర్ణన జాతకుని స్వరూప స్వభావములను తెలుయుటలో మరియు చోరాదులగూర్చి తెలుసుకొనుటలో పూర్తిగా సహకరించగలదు.

సశేషము.......
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech