 |
 |

ఎందరో మహానుభావులు -
తుమరాడ సంగమేశ్వర శాస్త్రి
- తనికెళ్ళ భరణి |
|
|
|
|
ఎంచేతనో తెలుగువాళ్ళకీ బెంగాలీవాళ్ళకీ బాగా కుదురుతుంది!
శరత్ తెలుగువాడనుకునే పాఠకులు బోల్డుమంది!! అలాగే ఠాగూర్
గీతాంజలిని గుడిపాటి వెంకటచలం మొదలు కొంగర జగ్గయ్య వరకూ
అనువదిస్తూనే ఉన్నారు.
అలాగే విజయాచక్రపాణిగారు బెంగాలీ నేర్చుకునే తెలుగులో
బోలెడు సినిమాలు తీసారు. ఏమైనా ఆ కట్టూ బొట్టూ పట్టూ కొంచెం
మన పద్ధతిలోనే ఉంటుంది! ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే!
దాదాపు డబ్భై ఎనభై ఏళ్ళ క్రితం మాట పిఠాపురం రాజా వారి
ఆహ్వానం మేరకు విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ పిఠాపురం
వొచ్చారు.రాజావారు విందూ గట్రాతో పాటు ఓ సాయంకాలం వీణాగాన
సభ ఏర్పాటు చేసారు!!
వేదిక మీదకి తెల్లనిమల్లు పంచె అంచు లాల్చీ పక్కజేబులో
పెట్టుకుని, అరచేతి వెడల్పు జరీకండువా, ముఖంమీద గంధం ధరించి,
పరిమళాలు వెదజల్లుతూ ఓ పుంభావ సరస్వతి వొచ్చి వీణ ముందు
కూర్చున్నాడు.
కళ్ళు మూసుకుని వీణని ’అమ్మా’ అని కళ్ళకద్దుకుని ఆ తర్వాత
వాయించడం మొదలెట్టాడు.
అంతే
హంసధ్వని,కాంభోజి, కమాస్ రాగధార ప్రవహిస్తోంది. శ్రోతలు
పరవశులైపోతున్నారు.
వెండిగడ్డంతో బంగారు ఛాయలో మెరిసిపోతున్న రవీంద్రుడి
కళ్ళనుంచి అశ్రుధారలు.. పులకించిపోయాడు విశ్వకవి.కరువుదీర
కావులించేసుకున్నాడు వైణికుణ్ణి
’స్వామీ మీరు నా గురువు’ అని దణ్ణం పెట్టేడు. ఆ పుంభావ
సరస్వతి పేరు తుమరాడ సంగమేశ్వర శాస్త్రి.
’నేను యావద్భారత దేశం తిరిగి అనేకమంది మహావిద్వాంసుల సంగీతం
విన్నాను.నాకు సంగీతం అంటే వెర్రి అని మీకు తెలుసుగా!
ఒక్కొక్క విద్వాంసుడిలో ఒక్కొక్క ప్రతిభ ఉంది. కానీ
సంగమేశ్వర శాస్త్రిగారు తన గోటిమీటుతో నా హృదయం
కరిగించేశారు. వీరిని నా గురువుగా గుర్తిస్తున్నాను’
అన్నాడు. విశ్వకవి.
అంతే సభ కరతాళ ధ్వనులతో దద్దరిల్లిపోయింది. పిఠాపురం రాజా
సైతం తెల్లబోయాడు. ’ఏంటీ నా ఆస్థానంలో ఇంత గొప్ప వీణా
విద్వాంసుడున్నాడా’ అని మనసులోనే నాలిక్కరుచుకున్నాడు. (బైటవారు
గుర్తిస్తే గానీ మన వాళ్ళను మనం పోల్చుకోలేం గదా! ఆఖరికి
కాళిదాసు శకుంతల చదివి డాన్స్ చేసిన ’గెటే’ గుర్తించాకే మన
కాళిదాసు మహాకవి అయ్యాడు! అదోఖర్మ.
టాగూర్ అంతటితో ఆగలేదు. ’గురూజీ మీరొచ్చి మా ’శాంతి నికేతన్’
లో విద్యార్థులకి వీణ నేర్పాలి ఇదే నా ఆహ్వానం అన్నారు.
ఆ రోజుల్లో సంస్థానం వదిలి బైటకెళ్ళాలంటే రాజావారి అనుజ్ఞ
అవ్వాల్సిందే. అయితేనేం పిలిచింది విశ్వకవి
పిఠాపురం రాజావారు గూడా పొంగిపోతూ ’వెళ్ళండి’ అని అనుజ్ఞ
ఇచ్చారు. తుమరాడ సంగమేశ్వర శాస్త్రిగారు స్థితప్రజ్ఞుడు
దేనికి పొంగిపోకుండా మనసులో ’లలిత అమ్మవార్ని’ తలుచుకుని
’అంతా నీదయ తల్లీ!! అని బెంగాలుకి బైలుదేరారు.
శాంతినికేతన్ లో కొన్ని నెలలుండి కొంతమందికి శిక్షణ ఇచ్చి
’వీణ' ను ప్రవేశపెట్టిన ఘనత శాస్త్రిగారిది ఆ వీణే ’సింహం’
తల బదులు ’హంస’ తలతో ఈనాటికీ అక్కడ వ్యాప్తిలో ఉంది.
ఆయన శాంతినికేతన్ నుండి తిరిగి వచ్చేసాక మరో ఇద్దరు సంగీత
కళాకారుల్ని ఈయన వద్దకు సంగీతం నేర్చుకోమని పంపించారు
టాగూర్.
ఆనాడు తుమరాడ సంగమేశ్వర శాస్త్రిగారి గురించి ఆనాటి
ప్రముఖులు కొంతమంది
పలికిస్తివయ్య నీ బంగారు వీణ
మీటిస్తివా వెలుగు మేళవించిన తంత్రి
ఓంకార కలశమ్ము ఝుంకార్ కకుభమ్ము
సామగీతా పూర్ణ శాంతి కుంభీఫలము
అని ప్రసిద్ధ రచయిత కవీ చిత్రకారుడూ శ్రీ అడివి
బాపిరాజుగారూ అలాగే పిఠాపురం దర్బార్ లోంచి ’రామా’ అన్న
నాదం బదులు ’రీ,మా’ అని వినిపిస్తోందని శ్రీ పానుగంటి
లక్ష్మీనరసింహారావుగారు.
ఆయనకి ఎన్నో బిరుదులు సన్మానాలూ జరిగాయి కానీ ఆయన ఎన్నడూ ఆ
బహుమతులను గానీ, ఆ కంకణాల్ని గానీ గండపెండేరాన్ని గానీ
ధరించేవారుకారట.
వాటిని వాడుకోవచ్చుగా అంటే ’బాబూ అవన్నీ అమ్మ దయవల్ల నేను
పొందిన తిరుపతి వెంకన్న సొమ్ములు మొక్కుబడి సొమ్ములు
వాడుకోవచ్చునా’ అని మందహాసం చేసేవారుట.
ఆయన ’వేయిసాధకం’ చేసేవారు. వేయిసాధకం అంటే ఒక రాగాన్ని
ఆపకుండా వెయ్యిసార్లు వాయించటం అన్నమాట. మధ్యలో ఏదైనా
అడ్డువస్తే మళ్ళీ మొదటినుంచే వాయించేవారు.
వీణని ఊర్ధ్వముఖంగా వాయించటం ఆయన ప్రత్యేకతల్లో ఒకటి.
ఏదేమైనా విద్యలో వినయ సంపన్నులూ నిరాడంబరులూ నిరంకుశులూ
అయిన తుమరాడ సంగమేశ్వర శాస్త్రిగారు పుట్టిన గడ్డలోనే మనం
కూడా పుట్టినందుకు గర్వపడొచ్చు.
తనకి మరణమాసన్నమౌతోందని ముందే గ్రహించిన శాస్త్రిగారు ఓపిక
తెచ్చుకుని వీణని తన గుండెల మీద పెట్టుకుని తుది శ్వాసవరకూ
’ఆనందభైరవి’ రాగాన్ని మీటుతూ అమ్మలో ఐక్యమైపోయారు.
|
|
|
|
|
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ
క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ
పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ
అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any
unsolicited purposes. Please keep comments relevant.)
|
 |
Copyright ® 2001-2009 SiliconAndhra. All
Rights Reserved.
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
Site Design: Krishna,
Hyd, Agnatech
|
|