ఇదియె నాకు మతము (పెద తిరుమలాచార్యుల రచన)

ఇదియె నాకు మతము ఇది వ్రతము
వుదుటుల కర్మము వొల్లనికను

నిపుణత హరి నే నిను శరణనుటే
తపములు జపములు ధర్మములు
నెపమున సకలము నీవే చేకొను
వుపమల పుణ్యములొల్ల నే యింకను

హరి నీ దాసుడ ననుకొనుటే నా
పరమును యిహమును భాగ్యమును
ధర నీ మాయల తప్పుతెరువులను
వొరగీ సుకృతము లొల్ల నే యింకను

నారాయణ నీ నామము దలచుట
సారపు చదువులు శాస్త్రములు
యీరీతి శీ వేంకటేశ నిన్ను గొలిచితి
వూరక ఇతరము లొల్ల నే యింకను


శ్రీమాన్ తాళ్ళపాక పెద తిరుమలాచార్యుల వారి సంకీర్తన! వ్రతము అనగా నిరంతరం పట్టువీడక చేయు సాధన అని అర్ధం. తాళ్ళపాక కవులు తమ వంశ ఖ్యాతికి మూలపురుషుడైన అన్నమయ్య గారు అనుగ్రహించిన వైష్ణవమతాన్ని, విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని అనుసరించారు. ఈ సిద్ధాంతంలో ‘శరణాగతి’ కి మిక్కిలి ప్రాధాన్యత కలదు! ‘శరణాగతి’ అంటే ‘అన్యాధా శరణం నాస్తి’ త్వమేవ శరణం మమ’ అన్న భావన! అందుకే ఇక్కడ పెద తిరుమలయ్య స్వామితో ‘నువ్వు తప్ప నాకు ఇంకా ఏమీ వద్దు’! అని అంటున్నాడు. మానవులమైన మనమంతా పుణ్యం కోసం పాకులాడతాం! కాని ఇక్కడ పెదతిరుమలయ్య ఆ పుణ్యం కూడా వద్దంటున్నాడు! ఎందుకొ తెలుసా? పాపమైనా, పుణ్యమైనా అనుభవించి తీరవలసిందే! ఆ పుణ్యస్థలం పూర్తయిన తరువాత మళ్ళీ భౌతిక జన్మలు, వాటివల్ల కలిగే అనర్ధాలు ఆవృతమౌతాయి. అందుకే ఇక్కడ పెదతిరుమలయ్య వాటన్నిటినీ వేంకటేశ్వరునికి సమర్పించి, తన వద్ద ఏమీ ఉంచుకోకుండా, ఒక్క నారాయణ నామాన్ని, దాస్యాన్ని స్వీకరించి వ్రతమాచరిస్తున్నాడు.

ఉదుటు = భారమైన
నెపము = కారణము, వ్యాజము;
ఉపములు = పోలికలు

 
ఇదె శిరసు మాణిక్య
ఇదె శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు నాకె
అదనెఱిగి తెచ్చితి నవధరించవయ్యా!

రామ నిను బాసి నీరామ నే చూడగ నా
రామమున నిను పాడె రామరామ యనుచు
ఆ మెలుత సీతయని యపుడు నే తెలిసి
నీ ముద్ర వుంగరము నే నిచ్చితిని

కమలాప్తకులుడ నీకమలాక్షి నీపాద
కమలములు తలపోసి కమలారి దూరె
నెమకి యాలేమనునే నీదేవి యని తెలిసి
అమరంగ నీసేమమటు విన్నవించితిని

దశరధాత్మజ నీవు దశశిరుని చంపి, యా
దశనున్న చెలిగావు దశదిశలు పొగడ
రసికుడ శ్రీ వేంకట రఘువీరుడ నీవు
శశిముఖి చేకొంటివి చక్కనాయ పనులు

అన్నమయ్య ఆంజనేయ స్వామి అవతారం ఎత్తి రామునితో ఇలా అంటున్నాడు, ఓ రామయ్యా! ఇదిగో! అమ్మ సీతమ్మ నీకిచ్చిన శిరోమణి! అవధరించవయ్యా! లంకలో రామ రామయని గానం చేస్తున్న నీ రామ (రామ = స్త్రీ, రాముని భార్య సీతమ్మ) ను చూసి, నీ విచ్చిన ఉంగరం ఆ సీతమ్మకు ఇచ్చినీక్షేమ సమాచారం విన్నవించి, ఆమె నీకు ప్రతిగా ఇచ్చిన ఈ శిరోమణి తెచ్చాను. ఓ సూర్యవంశ శ్రేష్టా! కమలాక్షియైన సీతమ్మ నీ పాదకమలములను చిత్తములో తలపోసి విరహవేదనతో చంద్రుని సైతం నిందిస్తున్నదయ్యా! లంకంతా వెదకి, వేదనతో ఉన్న ఆ మాతృమూర్తిని నీ భర్య అని తెలుసుకుని, నీ క్షేమ సమాచారాన్ని ఆమెకు విన్నవించానయ్యా! ఓ దశరథ కుమారా! దశ కంఠుడైన రాముణ్ణి సంహరించి సీతమ్మను కాపాడవయ్యా! అంటూ ముగింపులో వేంకటాద్రిపైన కొలువైన రఘువీరుడా! నీవు పై కార్యాన్ని చక్కబెట్టి శశిముఖి యైన సీతమ్మను చేపట్టావు అని మంగళం పాడాడన్నమయ్య!


శిరసు మాణిక్యము = శిరోమణి; ఆరామము = వనము; మెలుత = స్త్రీ; దశశిరుడు = పదితలలు గల రావణుడు; శశిముఖి = చంద్రబింబం వంటి ముఖం గలసి (సీతమ్మ); నెమకి = వెదకి; లేమ = స్త్రీ; సేమము = క్షేమము; కమలారి = కమల + అరి = కమలములకు శత్రువు = చంద్రుడు; దశరథాత్మజ = దశరథుని కుమారుడవైన ఓ శ్రీరామా!
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech