తెలుగు తేజో మూర్తులు : చిత్రకళా రత్న - డాక్టర్ కొండపల్లి శేషగిరి రావు

-- ఈరంకి వెంకట కామేశ్వర్

తమ తమ రంగాలలో నిష్ణాతులై, విశిష్టత పెంపొందించుకుని, పేరు ప్రఖ్యాతులనార్జించి "గొప్పతనం" సాధించిన తెలుగువారెందరో ఉన్నారు. వాళ్ళు యెదుర్కున్న ప్రతిబంధకాలు, సంక్లిష్ట పరిస్థితులు; అనుభవించిన నిర్భందాలు, పడిన ఆవేదన, చేపట్టిన దీక్ష, చేసిన కృషి, సాధన; కనపరచిన కౌశలం, సాధించిన విజయాలు, ఆ విజయ రహస్యాలు, ఇలాటి విషయాలని పరిశీలించి, సమీకరించి, పొందు పరచి ఈ కధనాలలో మీ ముందు ప్రస్తుతీకరిస్తున్నాం.

చిత్రం గీయడానికి ముడిసరుకులైన - రంగు,(తూలిక), కుంచె, కాగితమో, కిట్టనార (గుడ్డా, కాన్వాస్) అందిస్తేచాలు, వారి కుంచె మాంత్రిక శక్తి గా మారి చిత్తరువులు కళాఖండాలుగా రూపుదిద్దు కుంటాయి. వీరి చిత్ర కళాత్మక శక్తికి యెంత సామర్ధ్యం వుంది అంటే మనోహర దృశ్యాలు, మనోజ్ఞ భావాలు సైతం కళావస్తువులుగా రూపాలు దాలుస్తాయి. "రూప రుచి"ని ఆస్వాదించిన మేటి జాతీయ చిత్రకారుడు, చిత్రకళా రత్న డాక్టర్ కొండపల్లి శేషగిరిరావు గారు.

చిత్రీకరణ నైపుణ్యం, వస్తువు యొక్క బహిర్గత అర్ధమేకాక, అంతర్గతాన్ని తన అవగాహాన శక్తితో ఆకళించుకొని, చక్కటి ఊహతో అనుసంధానించి, విలక్షణమైన పద్దతిలో చిత్రకళా రూపాన్వయం చేస్తూ వచ్చారు శేషగిరిరావు గారు. తనదంటూ ఒక ప్రత్యేక చిత్రీకరణా పద్ధతి - "నీటి ఒరపు" ("అక్వా టెక్స్చర్") పద్ధతిని ప్రవేశ పెట్టేరు.

సప్త వర్ణాలతో ఆయన కుంచె మంత్ర దండంగా మారి మాంత్రిక శక్తితో చిత్రకళా రూపాలకు జీవం పోసి మనోజ్ఞ చిత్రాలు సృష్టించింది. కుడ్య చిత్రాలు (వాల్ పెయింటింగ్, ఫ్రెస్కొ), చిత్తరువు (పోట్రేట్) తైల వర్ణ చిత్రాలు (ఆయిల్ పెయింటింగ్), నీటి ఒరపు (అక్వా టెక్స్చర్), మ్యురల్ చిత్రాలు చిత్రణలో మేటి చిత్రకళా ప్రవీణుడిగా గుర్తింపబడ్డారు డాక్టర్ కొండపల్లి శేషగిరి రావు గారు . సమకాలీన ఆంధ్ర చిత్రకారులలో అగ్రగణ్యుడిగా వాసికెక్కేరు.

వీరి చిత్తరువులు చూసిన అచ్చెరువ పొందక తప్పదు. రూప రేఖ లావణ్యవంతమైన వీరి చిత్రాలు, సొబగులు విరజిమ్ముతూ, మార్ధవం ఉట్టిపడుతూంటాయి. నేత్ర పారవశ్యంగా ఉండి, విమలానందం కలిగిస్తాయి.

పుట్టు పూర్వోత్తరాలు, ఉదర నిమిత్తం ....

కొండపల్లి శేషగిరి రావు గారు, జనవరి 1924 లో, ఆంధ్ర ప్రదేశ్ వరంగల్ జిల్లా, మహబూబాబాదులో గోపాలరావు, రామచుడమ్మ దంపతులకు తృతీయ సంతానంగా జన్మించారు. చిన్నతనంలో దీనదయాల్ నాయుడు గారి ప్రోత్సాహంతో చిత్రకళలో అభిరుచి పెరిగింది. హయగ్రీవాచారి గారి సహాయంతో హనుమకొండలో కొంత కాలం చదువు కొనసాగించారు. కలిగిన కుటుంబంలో ఉండి, కాలం కలసి రాక, పలు కష్టాలను యెదుర్కోవాలసి వచ్చింది. తన విద్యాభ్యాసం, తదుపరి చిత్రకళాభ్యాసం కొరకు పలువురిని ఆశ్రయించ వలసి వచ్చింది.

మలుపు

మెహ్ది నవాజ్ జంగ్ బహదూర్ ఆదరణ, శేషగిరిరావు గారి కళాభ్యాసానికి పట్టుకొమ్మై నిలిచింది. జీవిత మార్గానికి ఓ నిర్ధిష్ట గమ్యం చేకూర్చింది. నివాసానికి ఓ గది, తినాడానికి భోజన సదుపాయం, చదువుకోడాని కాలేజీ సీటు ఇప్పించారు. చిత్రలేఖన విధ్యాభ్యాసం ముగిసిన తరువాత, మెహ్ది నవాజ్ జంగ్ బహదూర్ సహాయం, సిఫార్సుతో యేడాది పాటు, కోల్కతా విశ్వభారతి శాంతినికేతన్ లో నందాలాల్ బోస్ ని ఆశ్రయించి చిత్రకళలో మరిన్ని మెళకువులు నేర్చుకున్నారు. (సర్టిఫికెట్ కోర్స్ పూర్తి చేసారు)

సుప్రసిద్ధ చిత్రకారుడైన నందలాల్ బోస్ శిష్యరికంలో "వాష్ పద్ధతి" ని నేర్చుకున్నారు. అజంతా, ఎల్లోరా గుహాల చిత్రాలను (తిరిగి) గీసిన చిత్రకారుడు జలాలుద్దిన్ ద్వరా కొన్ని మెళకువలు నేర్చుకున్నారు. జైపూర్ లోని బనస్థలి విద్యాపీట్ లో "ఫ్రెస్కో" పెయింటింగ్ పద్ధతిని అభ్యసించారు కొండపల్లి శేషగిరిరావు గారు.

వృత్తి రీత్యా, ప్రవృత్తి రీత్యా చిత్రకళనే నమ్ముకున్నారు శేషగిరిరావు గారు. కేవలం చిత్రకళ మీదే ఆధార పడి సంసారం నెట్టుకు రావడం అంత సులభసాధ్యం కాదు. అందుకనే జీవితంలో అనేక కష్టాలను చవిచూడ వలసి వచ్చింది. ఇంట్లో తిండి గింజలు నిండుకున్న సందర్భాలు లేకపోలేదు. యెలాగో సంసార భాద్యతలు నెట్టుకొచ్చారు. ఈతి బాదలు యెన్ని ఎదుర్కున్నా చిత్ర కళారూపాల సృష్టిలో ఆరితేరారు. వారు గీసిన చిత్రాలు కళాఖండాలే.

"ఉదర నిమ్మిత్తం బహుకృత వేషం" అని వ్రాసేరు గురజాడ గారు. కాని చిత్రకళను నమ్ముకుని ఉదరపోషణ, సంసార బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించలేకపోయారు శేషగిరి రావు గారు. "కళలను నమ్ముకుని, అందులోను వృత్తిధర్మంగా పెట్టుకుని జీవనం సాగించడం తెలుగువాడికి యెంతో కష్టం, ప్రవృత్తిగా ఐతే కొంత నయం" అని సెలవిచ్చారు ప్రముఖ పాత్రికేయుడు జి కృష్ణ గారు. ఇది అక్షర సత్యం అయ్యింది శేషగిరి రావు గారి జీవిత విషయంలో. ఉదర పొషణకు యెంత శ్రమించినా కొన్ని సందార్భాలలో ఫలించ లేదు; యెందరినో ఆశ్రయించ వలసి వచ్చింది. వారాలు చేసుకుని కొంత కాలం మనుగడ సాగించారు. అయినా తాను నమ్ముకున్న కళను విడువక విశిష్ట కృషి చేస్తున్నే వచ్చారు. ఈయన చిత్రలేఖన నైపుణ్యాన్ని వీక్షించిన మెహ్ది నవాజ్ జంగ్ బహదూర్, ప్రశన్నులై అండగా నిలిచారు. ఇది శేషగిరిరావు గారి జీవిత మార్గాన్ని మళుపు తిప్పింది. జీవన, జీవిక మార్గం సులభం చేసింది.

నీటి ఒరపు (అక్వా టెక్స్చర్) పెయింటింగ్ పద్ధతికి శ్రీకారం

చిత్రలేఖనంలో నిపుణత సంతరించుకుని, విభిన్న ప్రక్రియల, ప్రయోగ లబ్ధ పరిజ్ఞానంతో, శేషగిరిరావు గారు, "అక్వా టెక్క్చర్" (నీటి ఒరపు) అన్న ఒక వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టారు. కళావస్తువు నిర్మాణాంలో ఓ కొత్త ఒరవడికి మార్గదర్శకులైయ్యారు. ఇవి కాక తైలం (ఆయిల్) చిత్రాలు; మ్యురల్స్; అనేకం రూపొందించారు ఈ చిత్రకళా ద్రష్ట.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వరంగల్లు జిల్లలోని పకాలా కాసారం, తటాక ప్రాంతం, అడవులు వీరిని యెంతో ప్రభావితం చేసింది. వీరు గీసిన యెన్నో బొమ్మలలో వాటి ముద్రలు కనిపిస్తూ ఉంటాయి. వీరు చిత్రీకరించిన పక్షులు, వన్య మృగాలు వీరి కళా నైపుణ్యానికి నిదర్శనాలు.

శేషగిరిరావు గారు సౌమ్యులు; మృదు భాషా స్వభావులు; చక్కటి అవగాహన, ఓర్పు, ఊహతో పాటు చిత్రకళా నైపుణ్యం కలిగినవారు. కాలానుగుణంగా చిత్రకళా పరిశోధకుడిగా వాసికెక్కారు. వీరి చిత్రాలు మనోహరంగా ఉండి, జీవం ఉట్టిపడుతూ ఉంటాయి.

చిత్ర, చిత్తానుభవాలు

చిత్రణలో ఆధిమ, భిత్తి, అలంకార కళలతో, పురాణ, ప్రభంధ, ఇతిహాస సంభంధమైన సన్నివేశాలే కాకుండా, ప్రకృతి సౌందర్యం, పశుపక్ష్యాదులు, జంతువుల చిత్రాలు అనేకం సృష్టించారు. ఈ అంశాలలో యెన్నో అపురూప చిత్రాలను రూపొందించారు. దాదాపు వెయ్యికి పైగా చిత్తరువులు నిర్మించారు.

వీటిలో నన్నయ్య, పోతన, తిమ్మరసు, అక్కన్న, మాదన్న, దమయంతి, సీతారాములు ఇత్యాది చిత్రాలు, విభిన్న కళా రీతులలో ని కళా రూపాలు వీరి కళా వైదుష్యానికి అద్దంపడతాయి. భారత దేశ జానపద చిత్రకళా రూపాలపై, ముగ్గులను ఉద్దేశించి పరిశోధనలు జరిపి సారాంశాలను వ్రాసి అందులో అంతర్గతమైన పలు విషయాలను ఉటంకించారు. భారత జాతీయ చిత్రకారుడిగా గుర్తింపు పొందేరు.

గీసిన చిత్రాలు - ఆయన కుంచెతో నిర్మించిన చిత్రాలలో యెంతో వైవిద్యం ఉంది. శేషగిరి రావు గారు రూపొందించ చిత్రాలలో కొన్ని:

  • హైదరాబాద్, అమీర్ పేటలోని మైత్రీవనం భవనంలో వీరు చిత్రీకరించిన అశ్వమేధం బొమ్మ ఉంది. (టైల్స్ పద్ధతి ఆదారంగా రూపొందించారు)
  • హైదరాబాద్ లో భారతీయ విద్యా భావన్ లో మ్యురల్ చిత్రాలు
  • ఆంధ్ర కేశరి టంగుటూరి ప్రకాశం చిత్తరువు అమెరికాలోని భారత దౌత్య కార్యాలయంలో ఉంది.
  • గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర "టాబ్లో" లు నిర్మించారు.
  • దేవులపల్లి రామానుజ రావు, శోభ పత్రికలో యెన్నో చిత్రాలను చిత్రీకరించారు.
  • సాలార్జంగ్ సంగ్రహాలయం (మ్యూజియం) లో కొన్ని చిత్రాలు
  • మహాత్మా గాంధి, రుద్రమ దేవి; రాముల వారి వనవాస చిత్రాలు; వేంకటేశ్వర స్వామి చిత్రం; శాలివాహన; అన్నమాచర్య; తానీషా; బూర్గుల రామకృష్ణ రావు చిత్రాలు
  • ఆంధ్ర ప్రభుత్వ సమాచార, టూరిజం శాఖల అతిధి గృహాలలో పెట్టేరు.
  • దదాపు 300 పైగా వాటర్ పెయింటింగ్ చిత్రాలు గీసేరు.

ఇర్రి (డీర్), కణితి (సాంబార్), కస్తూరి మృగం (మస్కెడ్ డీర్) వన్య జీవులతో పాటు తురగం, కోతి, పులి, సింహం ఇత్యాది జంతువులను తన చిత్రపటాలలో చక్కగా సమన్వయీకరించారు. రూప రుచిని తెలుసుకుని ఆస్వాదించ గలిగారు కొండపల్లి శేషగిరి రావు గారు. కాబట్టే, వారి చిత్రాలే, వారి కళా సృష్టికి, సామర్ద్యానికి నిదర్శనాలు. చిత్రకళాభిమానులకు శేషగిరి రావు గారి చిత్రాలు జగత్ చిత్రకళా రత్నాలే. వీరి కళారూపాలలోని వస్తువులను అర్ధం చేసుకున్న వారికి కొండపల్లి వారి చిత్రాలు అత్యంత ఆకర్షనీయంగా, నేత్రానందకరంగా ఉంటాయి. వీరి ప్రత్యేకతలలో మరొకటి - పల్లెటూళ్ళలోని ముగ్గులు సేకరించి తద్వివరణలతో పొందుపరిచారు.

శేషగిరిరావు గారి అద్బుత సృష్టిలోని కొన్ని కళాఖండాలు
శకుంతలశకుంతల ఆశ్రమం
లచ్చిగుహుడి నావలో సితారామ లక్ష్మణులు
అహల్యా శాప విమోచనందమయంతి


ఇవి కాక సీతారాములు, దుర్గా దేవి, గోదా దేవి, ఝాన్సి లక్ష్మి బాయి, గుహుడి చిత్రాలు; ప్రముఖులలో దేవులపల్లి వారి చిత్రం, రాజీవ్ గాంధి చిత్రాలు, శకుంతలా దుష్యంతుల కధ, 18 వాటర్ కలర్ చిత్రాలలో రూపొందించారు.

ఫైన్ ఆర్ట్స్ కాలేజీ లో ఆచర్యుడిగా పని చేసి 1984 లో "రెటైర్" అయ్యారు. తరువాత కొంత కాలం ఎస్ వి కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కి ప్రిన్సిపాల్ గా వ్యవరహించారు. నరసింగ రావు, సురేష్ బాబు వంటి చిత్రకారులకు గురువు. రాజయ్య, పి టి రెడ్డి వంటి చిత్రకారులకు ప్రియుడు. 1988 లో భారత ప్రభుత్వం వీరిని "జాతీయ చిత్రకారుడిగా" గుర్తించి ఎమిరిటస్ ఫెల్లోషిప్ ప్రదానం చేసింది.

1993 లో రాజీవ్ రత్న ఎవార్డు పొందేరు. 1996 లో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది. తరువాత, హంస ఎవార్డు (2003) అందుకున్నారు - (హంసా ఎవార్డు - 2006 నుండి కళారత్న ఎవార్డు గా వ్యవరారింపబడుతోంది). ఆంధ్ర ప్రదేశ్ కళా ఎకాడమి ఎవార్డు కూడా పొందేరు.

భారత దేశ స్వాతంత్ర సమరంలో పాల్గొన్న దదాపు అరవై వసంతాల తరువాత ప్రభుత్వం, జులై 2005 లో శేషగిరి రావు గారిని "స్వాతంత్ర సమరయొధుడిగా" గుర్తించి 3,000 రుపాయల ఉపజీవి వేతనం ఇస్తోంది. స్వాతంత్రం వచ్చిన ఇన్నేళ్ళ తరువాత వీరి సేవలు ప్రభుత్వానికి జ్ఞాపకం వచ్చింది!. మంచిదే మరి.

సహస్ర పూర్ణ చంద్రోదయాలను చూసి, వార్ధక్యంలోకి అడుగిడినా, కొండపల్లి చిత్రాలు మటుకు నేటికి జీవకళ ఉట్టిపడుతూ నేత్రానందకరంగా ఉండి, చిత్ర రూప స్వరూపాలను అందులో నిర్లిప్తమైన కధలను కళ్ళకి కట్టినట్టు కనిపిస్తూ ఉంటాయి. చిర ' సిరి ' ఆయనకు దక్కకపోయినా, చిత్రకళా యశస్వి స్థానాన్ని సంపాయించుకోగలిగారు. హైదరాబాద్ కళాభవన్లో, మధాపూర్ చిత్రశాలలో తన చిత్రకళాఖండాల ప్రదర్శన చేసారు - పలువురి మన్ననలను అందుకోగలిగారు.

కొండపల్లి శేషగిరిరావు గారి కుంచె వినూత్న ప్రయోగాలు, చిత్రలేఖణ పద్ధతులు, చిత్తరువుల విషయమూల అంతర్బహీకరణలు వారిని సమ్మున్నత శిఖరాలకు చేర్చింది. భావి చిత్రకారులకు ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. ఏతావాతా "శేషగిరి రావు గారి చిత్తరువులు చూడడమే ఓ ఎడ్యుకేషన్". మరి తప్పక చూస్తారు కదూ!. భావి తరాలకు భారత, ఆంధ్ర చిత్రకళా వైభవం ప్రతిమింబిస్తూ వీరి చిత్రకళా రత్నాలు నిలచిపోతాయి.

ఈ వ్యాస సంకలనానికి విషయ సేకరణకు తమ సహాయ సహకారలను అందించిన మిత్రులు రమాకాంత్, మాధురి అకినేపల్లి దంపతులకు, శేషగిరి రావు గారి కుమారుడు వేనుగోపాల రావు, నిహారిణి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.