సుజననీయం: పేరులో ఏముంది?

-- ప్రఖ్య వంశీ కృష్ణ


"భా" అంటే వెలుగు అని, "రతి" అంటే ఆసక్తి అని, భారతీయులు అంటే వెలుగుయందు ఆసక్తి కలవారని అర్ధం. వెలుగు అంటే జ్ఞానానికి ప్రతీక కాబట్టి విజ్ఞాన సముపార్జనలో అసక్తి కలవారు అని అర్ధం. భారతదేశాన్ని ఎంతో మంది గొప్ప ప్రభువులు పాలించినా ఏ ప్రభువు పేరో లేక గొప్ప మంత్రో లేక గొప్ప గురువు పేరో పెట్టక దేశానికి అర్ధవంతంగా పేరు పెట్టడం జరిగింది. భరతుడు పాలించిన దేశం కాబట్టి ఆ పేరు వచ్చింది అనే వాళ్ళూ ఉన్నారు. నిజమేమిటో మనం ఇవేళ నిరూపించలేకపోయినా నిఘంటువుల్లో వెతికితే మాత్రం పైన చెప్పిన అర్ధమే దొరుకుతుంది. అర్ధవంతంగా పేర్లు పెట్టబడి ఇప్పటివరకూ ఉన్న నాగరికతలు కొన్నిటిలో మనదీ ఒకటి అని మాత్రం ఘంటాపధంగా చెప్పవచ్చు. మన పేరు వెనకే ఎంతో గొప్ప అర్ధం ఉన్నది అని తెలిస్తే పులకించనివారెవరుంటారు. కనీసం భావపరంగా అయినా ఉన్నతంగా అనిపించడానికి దోహదపడేది, మనకు అనునిత్యమూ స్ఫూర్తినిచ్చేది, మన అస్తిత్వం తెలిపేది మన మూలాలను తెలియజెప్పేది మన దేశం పేరే.

ఆపై మనమీద అంతగా ముద్ర వేసి మనలను అనునిత్యమూ మనమేమిటో గుర్తుచేసేది మన స్వంత పేరు. "అష్టావక్రుడు" అన్నా, "కృష్ణుడు" అన్నా ఇంకా వ్యాసుడు అన్నా వారి వారి పేర్లు వారు చేసిన పనులబట్టో లేక వారి లక్షణాలబట్టో వచ్చినవే. సత్య కాలంలో అందరూ నియమాలు తప్పకుండా ప్రవర్తించేవారు కాబట్టి వారి పేర్లు ఏమి పెట్టినా పెద్ద పట్టింపు లేదు. అందుకే, వారి అస్తిత్వాన్ని సూచించేవిగా పేర్లు పెట్టుకునేవారు. ఆ తరువాతి కాలాల్లో ధర్మం ఒక్కొక్క పాదం తగ్గుతూ వచ్చింది అని పురాణాలు చెప్పినదాన్ని బట్టి ఎందుకైనా మంచిదని మనుషుల పేర్లు, సమాజం గుర్తించి, గౌరవించిన మంచి మంచి నాయకుల పేర్లు పెట్టుకోవడం మొదలైంది. "రామయ్య" అన్నపేరు పెట్టుకున్నవాడు రావణసురునిలా రాక్షసంగా ఉండేందుకు కొద్దిగా అన్నా జంకుతాడేమో అన్న ఆశతో అలాంటి పేర్లు పెట్టడం ప్రారంభమయింది.

పేరు సరే! పేరుకు తగ్గట్టు మనం ప్రవర్తిస్తున్నామా? అన్నది మనం అనునిత్యమూ మనలను మనం వేసుకోవలసిన ప్రధానమైన ప్రశ్న. గొప్ప నాయకులు అందరిచేతా ప్రస్తుతింపబడి "దేవుళ్ళ"య్యారు. కానీ వారి పేర్లు పెట్టుకున్నా ఆయా భావజాలాలని ఆచరణలో పెట్టలేకపోయినవారు కేవలం "రామయ్య"లుగానే మిగిలిపోయారు. "సంతోష్" అన్నవాళ్ళు ఎంత విషాదంగానూ, "హరిశ్చంద్రుడ"న్నవాడు అబధ్ధాల పుట్టగానూ ఇలా ఎంతో మంది మనకు ప్రతినిత్యమూ పేర్లకు విరుధ్ధంగా ప్రవర్తించేవారు తారసపడుతునే ఉంటారు.

మానవ జీవితానికి ఎన్నో అద్భుతాలను సాధించాల్సిన ఆవశ్యకతలున్నాయని, అందువలనే మానవులు సృజించబడ్డారనీ భారతదేశపు దార్శనిక మేధావులైన ఋషుల మాట. ఋషులంటే గడ్డలూ మీసాలు పెంచుకుని ముక్కు మూసుకుని అడవుల్లో కూర్చుని ఏదో దేవుడు ప్రత్యక్షమవటానికి పడిగాపులు కాసేవాళ్ళు కాదు అని తెలుసుకుని, ఏక దీక్షగా అనేక అంశాలపై పరిశోధన చేస్తూ ఆ ఆలోచనలో తమను తాము మఱచిపోయి తాము శారీరకంగా శుష్కించినా లోకానికి పనికివచ్చే విజ్ఞాన సముపార్జన చేసి ఆ సుజ్ఞాన కాంతితో వెలిగిపోయేవారని సరిగా అర్ధం చేసుకుంటే వారి మాటలు ఎందుకు మనకు ముఖ్యమో తెలుస్తుంది.

ఎవరమూ నరకుడని పేరు పెట్టుకోము, తాటక అనో లంఖిణి అనో పిలిపించుకోము. దీనికంతటికీ కారణం, మనం ఎల్లవేళలా పదిమందిలో మంచిగా గుర్తింపు ఉన్న వాటితోనే మనలనూ ముడివేసుకోవడానికి ప్రయత్నించడం. అలా మంచి విషయాలతోనో మంచి వాటితోనో కలగలసిన వాళ్ళమనో, ఇంకా గొప్పగానో మనమూ అందరిలోనూ అనిపించుకోవాలని పడే తపనే అధికం. అంటే స్థూలంగా అందరమూ మంచితోనే ముడివేసుకునే వాళ్ళమే. ఒక గొప్ప తత్వవేత్త చెప్పినట్లు, మనం తప్పు చేశామనో తప్పు చేస్తున్నామనో భావన మనలను క్షణం కూడా బతకనీయదు. యే పని చేసినా, మనం ఆ పని చేయడం వెనుక ఉన్న మంచి కారణాలనే వెతుక్కుంటాం. ఏదన్నా తప్పు చేసినా, అటువంటి కారణాలే చూపి మనం ఎందుకు మంచివాళ్ళమో మన ఆత్మకి, మన చుట్టుపక్కలవాళ్ళకీ నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తాం. మన చుట్టుపక్కలవాళ్ళు మనలా ఆలోచించనపుడే, మనలాగా మంచిగా అనుకోనపుడే కోపాలు, తాపాలు, విభేదాలు చివరకు శతృత్వాలూ ఇలా క్రమంగా ఏర్పడుతుంటాయి. దుర్యోధనుడి దృష్టిలో ఆలోచిస్తే మరి పాండవులు ఎంత కౄరులో అర్ధం అవుతుంది.

మంచీ చెడు అన్నవి సాపేక్షమైనవే. ఎవరూ ఇది మంచి అనో ఇది చెడు అనో విస్పష్టంగా చెప్పలేకపోవచ్చు. ఒకళ్ళకి మంచి మరొకళ్ళకి చెడు అవ్వచ్చు. అయితే, ఈ తేడాని కనుగొనేది, సమయ-సందర్భానుగుణంగా ప్రవర్తించగలిగేదీ, కూలంకషంగా విషయ పరిజ్ఞానమున్న మేధస్సు. ఈ మేధస్సు వివేకం కూడి విచక్షణతో ప్రవర్తించి సమాజానికి ఏది శాశ్వత సుఖాన్ని అందించగలదో తెలియజెప్పగలుగుతుంది. విజ్ఞానం పెంపొందినపుడే వివేకమూ, తద్వారా పాత్రత, దానినుండి చివరకు సుఖము లభిస్తాయి. ఇవన్నీ పెంపొందాలంటే ముందు చాలా చదవాలి. మనకు తెలియని విషయాలూ ఉంటాయని గుర్తించి వాటిని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తెలియని విషయాలు తెలియజెప్పేదే కదా విద్యాభ్యాసం అంటే! అనగా అట్టముక్కలపై మన పేరు చివరన అంటే డిగ్రీలు కాక, మన మనసునంటే, మేధో హద్దులు చెరిపివేసే "భారతీ" విజ్ఞానం.

ప్రతి మనిషికీ, చదువుకోనివాడికీ మంచీ చెడూ తెలుసు. వివేకము లేనివాడు తనకు కలిగే లాభ నష్టాలను అనుసరించే మంచి చెడులను చెప్పగలడు. కానీ వివేకవంతుడు తనకు నష్టం జరిగినా అందరికీ లాభం సమకూరే మంచిని సంతోషంగా ఆహ్వానిస్తాడు. అందుకు మెదడూ, మనసూ విశాలమవాలి. అందుకే విజ్ఞాన సముపార్జన చేయాలి.

అటువంటి వివేకవంతమైన విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, ఆ కాంతులతో ప్రజ్ఞా దీప్తులుగా ప్రపంచానికీంతటికీ వెలుగులు పంచడానికి గొప్ప వాహికలుగా మనం తయారవడానికే మన ద్రష్టలు మనకు అనునిత్యమూ స్మరించుకునే మన పేరు, మన దేశం పేర్లలోనే స్ఫూర్తిని నింపారు. మన కళ్ళ ఎదురుగా కనిపించే దాన్ని కళ్ళు తెరచి చూడడమే మనం చేయవలసినది.

"ఇండస్ వేలీ" కి చెందినవాళ్ళం కాబట్టి "ఇండియన్" అని మనలను మనం పిలుచుకుంటే నేటి భౌగోళిక, రాజకీయ హద్దుల రీత్యా నిజమే అవుతుంది కానీ స్ఫూర్తిమమతంగా అయితే అనిపించదు. నేను "భా-రతీయుణ్ణి" అని అనుకున్నపుడల్లా ఆ అర్ధం తెలిసిన భావన మన ఆత్మ విశ్వాసాన్ని ఇనుమడింపజేస్తుంది. ఈనాటి "ఇండియన్స్"లో లోపించినది అని అనేకమంది మేధావులు బల్లగుద్ది మరీ నొక్కివక్కాణిస్తున్న "ఆత్మ విశ్వాసం" తప్పకుండా దొరుకుతుంది.
భవదీయుడు

ప్రఖ్య వంశీ కృష్ణ


సుజనరంజని భిన్న అభిప్రాయాలకు వేదిక మాత్రమే. ఇందలి రచయిత(త్రు)ల అభిప్రాయాలను మనస్ఫూర్తిగా గౌరవిస్తాము.