సిలికానాంధ్ర విశేషాలు

తెలుగుగడ్డపై పురుడుపోసుకుని తెలుగువారి సంస్కృతీ కేతనాన్ని ఖండాంతర సీమల్లో ఎగురవేసిన కూచిపూడి నాట్యకళారూపం భారతీయ సంస్కృతికి సువర్ణ మణిహారం అనడంలో ఎటువంటి సందేహం లేదు. సిధ్ధేంద్ర యోగులవారు కల్పించిన జవజీవాలతో అభినయప్రధానమైన ఈ సంప్రదాయం ప్రపంచాన్నంతటినీ ఆకట్టుకుని మురిపిస్తూనే ఉన్నది. అంతటి మహోన్నతమైన మన సంప్రదాయాన్ని ఉన్నతాసనంపై ప్రతిష్టించుకుని స్నిగ్ధపు శోభలతో అనునిత్యమూ అలరారేలా కృషిచేయాల్సిన బాధ్యత తెలుగువారందరిపైనా ఉంది.

సిలికానాంధ్ర సంప్రదాయానికి పెద్దపీట వేస్తూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సంస్కృతీ దీప్తులను దిగంతాల వరకూ పరివ్యాప్తం చేయడానికి అనునిత్యమూ తపిస్తూనే ఉంటుంది. ఆ ఉద్దేశ్యంతో కొత్త ఆలోచనలకూ ఎల్లపుడు రూపకల్పన చేస్తునే ఉంటుంది. సంప్రదాయపు మెచ్చుతునకైన కూచిపూడి నృత్యానికి అందలమెక్కించి జగద్వ్యాపితం చేయడం ప్రస్తుత సంకల్పం. ఆ స్ఫూర్తితో కొత్తగా చేపడుతున్న ఉత్సవమే "అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం".

సాధారణంగా ప్రవాసపు సంస్థల కార్యక్రమాల్లో ఓ భాగంగానో లేక ఆరంగేట్రం గానో ప్రసిధ్ధులైన నర్తకుల కార్యక్రమాలో కూచిపూడి నృత్యానికి సంబంధించి చూస్తూ ఉంటాం. అయితే అంతర్జాతీయ స్థాయిలో ఒక మూడు రోజుల పాటు కళాకారులందరూ ఒక గొప్ప ఉత్సవ రూపంలో కలిసుకుని, ఒక గొప్ప సమ్మేళనం నిర్వహించడం చాలా అరుదు. సరిగ్గా అలాంటి అరుదైన సంకల్పాన్ని భుజానికెత్తుకుంది సిలికానాంధ్ర.

కూచిపూడి నృత్యం పట్ల ఏమాత్రం ఆసక్తి, అభిమానం ఉన్నవారందరూ ఈ ఉత్సవానికి ఆహూతులే. వర్ధిష్ణువుల నుంచి లబ్ధ ప్రతిష్టులైన నర్తకీ నర్తకులు పాల్గొని తమ ప్రతిభను పదును పెట్టుకునేందుకు, తమ పాటవాన్ని ప్రదర్శించేందుకు, మరిన్ని మెళకువలను తోటివారి నుండి తెలుసుకుని మరింత విజ్ఞానం పెంపొందించుకునేందుకు, రంగ రంగ వైభవంగా కూచిపూడి కళారూపాల ప్రదర్శనలు తిలకించేందుకు ఇది మహత్తరమైన అవకాశం.

ఐదు తరాల కళాకారులు ఒకే వేదికపై గజ్జెకట్టి కూచిపూడి కళామతల్లికి నీరాజనాలు సమర్పిస్తారు. నిర్విరామ ప్రదర్శనలు, అభినయపూర్వక ప్రసంగాలు, సదస్సులు, శిక్షణా కార్యక్రమాలు, పోటీలు ఇలా రకరకా రూపాల్లో కళాసేవ చేసుకోవడానికి, చూసుకోవడనికి సుముహుర్తం 2008 జూన్ నెలలో 20, 21, 22 తారీకులు. అందరికీ స్వాగతం పలుకుతోంది.

మరిన్ని విశేషాలకు ఈ లంకెను అనుసరించండి.

మరిన్ని విశేషాలకు ఈ లంకెను అనుసరించండి.