సహనవ్రతం

-- శ్రీమతి సూరేపల్లి విజయ

ఉలగనాధానికి ఒక్క క్షణం ఆక్సిజన్ బార్‌లో కూచోని కూచోని కూడా ఊపిరాడక గిలగిల్లాడుతున్నట్టు అనిపించింది. ఉలగనాధం మెదడు ఉష్ణమండలమే అయింది.అతని మనసు రకరకాలుగా, వికవికాలుగా, రక, వికాలుగా ఆలోచిస్తుంది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడి జరిగిన వార్త. అయిదు నిముషాలకోసారి టి.విలో చూసినప్పుడు కూడా ఇంత షాకవ్వలేదు.టివీలో సునామీని లైవ్‌లో చూసినప్పుడు కూడా ఇంతగా బెదిరిపోలేదు. తను నిక్కర్లు వేసుకొనే వయసులో ప్రారంభమైన డైలీ సీరియల్ ఇంకా వస్తూ అందులోని హీరోయిన్ ఇంకా ప్రెగ్నెంట్‌గానే ఉంటూ, మనకు పుట్టబోయేది ఆడా, మగా...అని మొగుడూ - పెళ్ళాలూ ఇప్పటివరకు తేల్చుకోలేక పోతూ. ఆ సీరియల్ ఇంకా వస్తున్నప్పటికీ ఇంతగా బిక్క చచ్చిపోలేదు.

కానీ ఇప్పుడు, బెదిరి పోయాడు.ఆఫీసులో సీలింగ్ ఫ్యాను వంక చూస్తూ, ఫ్యాను ఫుల్లు స్పీడులో తిరుగుతున్నా చెమటలు కక్కుతూ ఉండిపోయాడు.

"ఒరే ఉలగా..." అన్న పిలుపు విని నిరాసక్తంగా తల తిప్పి చూసాడు. పక్క సీట్లోని పరాత్పరరావు.

సడంగా తనని "ఉలగా...." అని పిలిచేసరికి ఉలగనాధం కదిలిపోయాడు.

"ఒరే పరా..." అన్నాడు. గొంతుని గాద్గారికంగా మార్చి "ఏమైందిరా ఉలగా...." అడిగాడు పరాత్పరరావు.లంచ్ టైం కావడం వల్ల అందరూ లంచ్‌కి వెళ్ళారు.

"ఏమైందని అడిగితే ఆఎమని చెప్పమంటవురా....నా బ్రతుకు "మేన్‌రోబో" అయ్యిందిరా" అన్నాడు.

"అసలు ప్రాబ్లం ఏమిట్రా....ఎప్పుడూ స్టయిల్‌గా ఉండేవాడివి...ఎందుకిట్లా బేలగా బేవార్సుగా తయారయ్యావు...." డిటైల్స్ చెప్పమన్నట్టు అడిగాడు పరాత్పరరావు.

"హూ" అంటూ ఓ నిట్టూర్పు విడిచాడు ఉలగనాధం. "ఏంట్రా.....ఫ్లాష్‌బ్యాక్ చెబుతావా ...అయితqఎ సీలింగ్ ఫ్యాను వంక చూడు.....నీ ఫ్లాష్‌బ్యాక్ ఒక గంటలో పూర్తవ్వాలి...స్టాఫ్ క్యాటీను నుంచి వచ్చేస్తారు." పరాత్పరరావు విషయాన్ని డీటైల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు.

ఉలగనాధం ఓసారి సీలింగ్‌ఫ్యాన్ వంక చూసి ఓ.బి వాయిస్‌లో మొదలుపెట్టాడు."నా ఒన్ వైఫ్ సహన ....నా సహనాన్ని పరీక్షిస్తుందిరా...నిన్న ఉదయం నుంచీ నా సహనం ఐస్ ప్రూట్‌లా కరిగిపోతుంది. ఏం" నిర్ణమ్యం తీసుకోవాలో అర్థం కావటం లేదు. "ఆల్‌రైట్స్ రిజర్వుడ్" లా ఉన్న నా లైఫ్ 'ప్లీజ్ హ్యాంగ్ మీ లా తయారైంది.

"టైటిల్స్ తరువాత ..ముందు పిక్చర్ చూపించు" పరత్పరరావు చెప్పటంతో ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోయాడు ఉలగనాధం.

సోఫాలో కూచొని కాళ్ళు బార్లా జాపుకొని ఆవేళ్టి డలీ పేపర్ చదువుతూ "కా..ఫీ" అని కేకవేశాడు.

యాజిటీజ్గా రెండు నిముషాల్లో కాఫీ కప్పుతో భార్య రావాలి...నక్సల్స్ కౌంటెర్, పోలీసుల ఎన్‌కౌంటెర్, సినిమా నటి ఫినాయిల్ తాగి ఆత్మహత్య ప్రయత్నం చేయటం లాంటి మసాలా వార్తలు చదవటంలో ఆ విషయం మర్చిపోయి, ఎడిటెడ్, ప్రింటెడ్ అండ్ పబ్లిషెడ్ బై...అన్న చివరి పేజీ చివరి వాక్యం చదివ్చటప్పుడు, తన పెళ్ళాం, తనకు కాఫీ తెచ్చిపెట్టలేదన్న విషయం గుర్తుకొచ్చింది.

వెంటనే గట్టిగా "కా..ఫీ..ఏమై చచ్చింది..ఎక్కడ చచ్చావు" అంటూ గట్టి గా అరిచాడు.అయినా నో రెస్పాన్స్. తన వాయిస్ ఏకపాత్రాభినయంలా అనిపించింది.వెంటనే కోపం సర్రున వచ్చి, చర్రున లేచి కిచెన్‌లోకి వెళ్ళి చూశాడు.అక్కడ వైఫ్ లేదు.గ్యాస్‌స్టవ్ మీద పాలు పెట్టి ఉన్నాయి. స్తావ్ పక్కన కాఫీ పొడి ఉంది.స్టవ్ వెలిగించి లేదు.

భార్య కోసం వెదికి,హాలులోకి వచ్చేసరికి సోఫాలో టివీ పెట్టుకొని "ఎంతెంత దూరం..నువ్వు పోయేంత దూరం" సీరియల్ చూస్తూ కూర్చుంది.

ఉలగనాధానికి కోపం రెయిజైంది....ఏయ్...అప్పట్నించి అరుస్తూంటే వినిపించటంలేదా....కాఫీ తెసుకురమ్మని చెప్పిచచ్చానా..లేదా.." కోపంగా అడిగాడు పెళ్ళాన్ని.

వెంటనె ఉలగనాధం భార్య సహన కిచెన్ రూంలోకి వెళ్ళి స్టవ్ ఆన్ చేసింది.పోట్లగిత్తలా కిచెన్‌లోకి పరుగెత్తి ఏం చేస్తున్నావూ అని అడిగాను.

సహన మొగుడికి "కాఫీ" చేస్తున్నాను...అన్న యాక్షన్‌ని చూపించింది డైలాగ్ లేకుండా.

"నొటితో చెప్పి చావచ్చుగా" విసుక్కొని హాలులోకి వెళ్ళాడు ఉలగనాధం.అతనికి చిరాగ్గా ఉంది...తాను పిలిస్తే వెంటనే పరిగెత్తుకు రాకపోవటమా..?తనకు స్మాధానం చెప్పకపోవటమా...? నో...షేం..అవమానం...పది నిముషాల తరువాత కాఫీ కప్పు తీసుకువచ్చి టీ్‌పాయి మీద ప్పెట్టింది.

"టిఫిన్ ఏం చేశావ్?" స్నానం చేసి వచ్చి భార్యను అడిగాడు ఉలగనాధం.సమాధానం చెప్పకుండా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది సహన.

"అడుగుతూంది నిన్నే ..ముంగిలా సమాధానం చెప్పవే..మొహానికి చెవిటి 'ముసుగూ వేసుకున్నావ్? చాలా యిరిటేటింగా ఉంది అన్నాడు ఉలగనాధం.

సహన తాపీగా ఓ డిష్ మూత తీసి అందులో ఓ ఇడ్లీని మొగుడి కళ్ళ ముందు ఆడించింది.

తిక్క తలకెక్కింది ఉలగనాధానికి..."ఏంటిది...ఏం చేశావని డైలాగ్ పార్ట్‌లో అడుగుతుంటే .....ఇడ్లీని నా కళ్ళముందు ఆడించి యాక్షన్ పార్ట్‌లో చూపిస్తావు...వాటీజ్ యువర్ ఉద్దేశ్యము..." కోపంగా అడిగాడు ఉలగనాధం.

ఆఫీసుకు బయలుదేరుతూ...షూ...అని అరిచాడు. సోఫాలో కూర్చుని.

డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని ఇడ్లీని చట్నీతో లాగించేస్తున్న సహన సహన తన బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రాంని తాపీగా కంటిన్యూ చేస్తోంది.

ఉలగనాధానికి ఇడ్లీ గొంతులోకి వచ్చిన ఫీలింగ్, సాంబారు ముక్కులోంచి కారుతున్న ఫీలింగ్ వచ్చింది.

"నిన్నే..షూ.." అని అరిచాడు...డాల్బీ సౌండ్ సిస్టంలో.

అయినా విన్నట్టు కానీ, పట్టించుకున్నట్టు కానీ కనిపించలేదు.భార్య మీద పడి రక్కి,గిల్లి, గిచ్చి నానా రభస చేయాలన్నంత కోపం వచ్చింది...ఆఫీసుకి టైం అయిపోతుందని గుర్తొచ్చి, కోపాన్ని నిభాయించుకున్నాడు.

షూ..ఎక్కడుందో వెతుక్కునేసరికి పావుగంట పైనే పట్టింది.కానీ షూ మీద పేరుకున్న దుమ్ము-ధూళిని తుడిచేయటానికి అరగంటపైనే పట్టింది.కామన్‌గా అయితే తెల్లవారేసరికి షూ..రిన్ సోప్‌తో ఉతికినట్టు తళతళలాడుతూ ఉంటాయి. సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి వచ్చి, ప్యాంటులోనుంచి లుంగీలోకి మారి, బాత్రూంలోకి దూరి ఫ్రెషప్ అయి వచ్చి..." భార్య మూడ్స్‌ని గమనించాడు.ఉత్సవిగ్రహంలా, లిబర్టీ స్టాచ్యూలా....టాంక్బండ్‌లో బుద్ధ విగ్రహంలా..నిగ్రహంగా కూచొని వుంది.

"డిన్నర్‌లోకి ఏం కొర చేశావ్" అన్నాడు పక్కన కూర్చుంటూ.

సహన మొగుడి క్వశ్చంకు ఆన్సర్ ఇవ్వకుండా టీవీ చూస్తోంది.

"అరె..నేనేమడిగాను...ఇక్కడ మనిషొకడ్ని దున్నపోతులా మాట్లాడుతున్నను కదా" కోపం ఉగ్గబట్టలేక అన్నాడు.

మొగుడి వంక చూసింది సహన "మీరు దున్నపోతా.." అన్న ఎక్స్‌ప్రెషన్ కనిపించింది ఆమె మొహంలో.

"అడిగితే సమాధానం చెప్పక పోతే నాకు చెడ్డ చిరాగ్గా ఉంటుంది..నీ కంటికి నేనేమన్నా ఐయస్ఐ ఏజంట్‌లా కనిపిస్తున్నానా" కోపంగా రెట్టించి అడిగాడు ఉలగనాధం.సహన సమాధానం చెప్పకుండా లేచింది.

"నిన్నే డిన్నర్‌లోకి కూరేం చేశావంటే..పప్పే చేశాను...తప్పే చేశాను అనంట్టు ఏవో ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ డబ్బింగ్ చెప్పకుండా వెళ్తావేంటి..." భార్య భుజాలు కదిపేస్తూ అడిగాడు.

సహన ఫ్రిజ్ దగ్గరికి వెళ్ళి, ఓపెన్ చేసి, అందులో నుంచి ఓ వంకాయ తీసుకు వచ్చి మొగుడి కళ్ళ ముందు ఆడించింది.

"మరోసారి మొగుడి కళ్ళముందు అటు, ఇటి డిస్ప్లే చేసింది...ఒరే వెర్రివెంగళప్పా..దీని మీనింగది కాదన్నట్టు...."

"వంకాయకూరా" ఆడిగాడు ఉలగనాధం, బుర్రగోక్కుని. అవుననంట్టు తలూపి వెళ్ళింది సహన.

ఒ.సే..సే..సే..సే..సే..సే..సే..సే..సే..సే..సే..

గట్టిగా రీ సౌండ్ వచ్చేలా అరిచాడు జుట్టు పీక్కుంటూ ఉలగనాధం.పరాత్పరరావు కెవ్వున కేక వేసి చెవులు మూసుకున్నాడు, ఉలగనాధం వేసిన "ఒసే" అన్న కేకకు సౌండ్ పొల్యూషన్ భరించలేక వెంటనే తేరుకుని నాలుక్కరుచుకుని.....

"అదిరా నా ఫ్లాష్‌బ్యాకు..కారణం ఏమిటో తెలీదు...మౌనవ్రతమా..అంటే కాదని తింగరి బుచ్చిలా నాలికను బయటకు అని...లోపలికి పాములా కోరలు లాక్కున్నట్లు లాక్కుంటుంది.ఏ ఉలుకూ పలుకూ లేదు" బావురు మన్నాడి ఉలగనాధం.

నేనేం మాట్లాడినా పట్టించుకోనట్లు ఉంటిఉంది. నేను భరించలేకపోతున్నానురా..అరె..నా పక్కనె పెళ్ళాం ఉనంట్టు లేదు...ఓ స్టాచ్యూ ఉనంట్టు ఉంది" అన్నాడు ఏడుపు గొంతుతో ఉలగనాధం.

సీలింగ్ ఫ్యాను ఆగిపోయింది...కరెంటు పోయింది.

"ఒరే ఉలగా...నీ బుర్రను ఓసారి షేక్ చేసి చూడు" అన్నాడు పరాత్పరరావు ఆఫీసు వదిలేశక, ప్యారడైఅజ్ హోటల్లో కొర్చోబెట్టి 'టీ' కి ఆర్డరిచ్చేసి.

వెంటనే ఉలగనాధం తన మోకాలిని ఓసారి షేక్ చేసి 'చేశానురా' అన్నాడు.

"ఇప్పుడు షేక్ వెల్ బిఫోర్ యూజ్లా థింక్ వెల్ ...బిప్ఫోర్ సహెక్ ...నీకేమ్నన్నా ముష్టి ముదనష్టపు ఫ్లాష్‌బ్యాక్‌లు ఉన్నాయా"

"ఛా..ఛా..నేను అలాంటి టైప్ కాదురా ..."

"పోనీ నువ్వేమైన సిస్టరమ్మను..అదే చెల్లెమ్మను ఎప్పుడన్నా ఏడిపించావా. ఐ మీన్ నీ బిహేవియర్ ఎలా ఉంటుంది"

అప్పుడు స్ట్రయికైంది. అంటే నేను కాస్త తిక్క మేళాన్ని..తను ఏమన్నా మాట్లాడితే పట్టించుకోను...ఇంటి కెళ్ళాక పేపర్ చూడ్డం, టీవీ చూడ్డం..అటు తిరిగి పొడుకోవటం..."

"అదీ.అదిరా సంగతి..నీ వెధవ బుర్రకు లాజిక్ తట్టిందా? ఉలగనాధం థింక్ చేస్తూ, సిగ్గుతో సింక్ అవుతూ ఇంటికెళ్ళాడు.

అప్పుడు మౌనాన్ని వీడి, గొంతు విప్పింది సహన.

"ఇంట్లో మనమిద్దరమే ఉంటాం...భార్యతో పట్టీ పట్టనట్టు ..నాతో ఏమీ మాట్లాడక పోతే, నాకెంత బాధగా ఉంటుంది.మీలాగే చాలా మంది మగవాళ్ళకు టీవీ చూస్తూనో, పేపర్ చదువుతూనో ఉంటారు. భార్య మాట్లాడుతున్నా పట్టించుకోరు...మా పరిస్థితి ఎలా ఉంటుంది.ఓ మనిషి పక్కనే ఉన్నా, వాళ్ళ ఉనికే పట్టించుకోనట్లు ప్రవర్తిస్తే మా కెంత బాధగా ఉంటుంది..పొద్దుట్నుంచీ వంటరిగా వుంటూ, కనీసం మొగుదొచ్చాక అయినా సరదాగా మట్లాడకపోతే మాకెలా ఉంటుంది?"

"నా బాధ మీకు అర్థం కావాలనే, ఈ రెండ్రోజులూ నా సహనం కోల్పోయాక, మౌనవ్రతం పాటించాను. మీ ప్రశ్నకు సమాధానం ఇవ్వకపోవటం, పక్కన ఓ మనిషే ఉన్నాడన్న స్పృహ లేకుండ ఉండట ఎంత బాధో మీకు తెలియాలనే ఈ సహనవ్రతం చేసింది సహన".

ఆరోజు రాత్రి ఉలగనాధం భార్య కాళ్ళ దగ్గర సెటిలై..ఈ సహనవ్రతం భరించలేను..నీ జడ్జిమెంట్ ఏమిటో చేప్పేయ్..ఓ నవ్వు నవ్వేసేయ్...నాకు జ్ఞానం ప్రసాదించేయ్..అని మొరపెట్టుకున్నాక..తన తప్పేమిటో తెలిసివచ్చింది ఉలగనాధానికి.

ఇంటికొచ్చాక భార్యతో సమయాన్ని గడపకపోవడం, అసలు భార్యను పట్టించుకోకపోవటం, ఆమెతో మాట్లడక పోవటం, ఆమె మాట్లడింది వినకపోవతం ఎంత తప్పో తెలిసివచ్చింది.

మీ ఇంట్లోనూ ...సహనవ్రతం ...మొదలవ్వక ముందే మీరూ జాగ్రత్త పడండి.

"సహనవ్రతం" కథకు విశ్లేషణ

చాలామంది మగవారు ఆఫీసు నుండి రాగానే ఇంట్లో టీవీకి కళ్ళూ చెవులూ అప్పగించిగానీ, దినపత్రికలో తల దూర్చుకొనిగానీ, పక్కన పిడుగు పడ్డా చలించరు.టీవీ చూడవద్దని కానీ, దినపత్రిక చదవ వద్దని కానీ అడిగే హక్కు భార్యకు లేదు.అది నిజమే. భర్త ఆఫీసుకి వెళ్ళాక ఆమె మాత్రం టీవీ చూడదా?పత్రికలు చదువుకోవాలని పిస్తే చదవదా? కానీ భర్త ఆఫీసు నుంచి వచ్చాక అతడేం మాట్లాడుతున్నా, ఏం చెప్తున్నా, ఏమడుగుతున్నా తనకేమీ పట్టనట్టు వినిపించుకోకుండా వాటిల్లో లీనమై కూచుంటే ఆ భర్తకి ఎల వుంటుందో అదే పరిస్థితి భార్యకూ కలుగుతుంది.తాను మాట్లాడుతున్నా ఆ ధ్యాసే భర్తకి లేనప్పుడు...వినిపించుకోనప్పుడు అటువంటి పరిస్థితి నెదుర్కొనే భార్య భర్తతో వాదించినా, గొడవ పడినా ప్రయోజనం ఉండదు సరికదా ...గయ్యాళి అనో రాక్షసి అనో బిరుదొస్తుంది.అందుకని సహనంతో మూగనోము పాటించి అతని పొరపాటు అతనే గ్రహించుకునేలా సున్నితంగా ప్రవర్తిస్తూ విజయాన్ని సాధించే మార్గం చూపించారు రచయిత్రి కథలో. బావుంది. అలాగని అన్ని విషయాల్లోనూ సహనవ్రతం చేసే రోజులు కావివి.ఎందుకంటే ఒక్కొక్కప్పుడు 'స్త్రీ' చూపించే సహనాన్ని పురుషుడు అలుసుగా తీసుకుని ఆమెనొక మరబొమ్మలా చూడటం జరిగేందుకు అవకాశమున్న సమాజం ఇది..

- తమిరిశ జానకి