రాతివనం - 12వ భాగం

-- సలీం

జరిగిన కథ: అనూష ఒక సాధారణ మధ్య తరగతి టీనేజ్ పిల్ల. అనూష తల్లిదండ్రుల ప్రోద్బలంతో రెసిడెన్షియల్ కాలేజిలో చేరుతుంది. అందరికంటే భిన్నంగా ఓ జర్నలిస్టు కూతురు, మధుమిత హిస్టరీ గురించి మంచిగా చెప్పి మొదటి బహుమతి గెల్చుకుంటుంది, అనూషకు ఒంట్లో బాగోలేదని తెలిసి తండ్రి విజయవాడ వెళ్ళి ఇంటికి తీసుకువస్తాడు. ఇక అనూషను వెనక్కి పంపకూడదని నిర్ణయించుకుంటాడు తండ్రి.. హిమవర్ష, అనూష లానే తల్లిదండ్రుల ప్రోద్బలం మీద తనకు ఇష్టం లేని చదువుచదువుకుంటూంటుంది. ఇంటికొచ్చిన అనూషను స్నేహితురాళ్ళు హిమవర్ష, మధుమిత కలుస్తారు. మాటల్లో మధుమిత వాళ్ళిద్దరినీ సాంత్వన పరుస్తూ తమ కష్టాల్లోనే జీవితపు విలువలు నేర్చుకోవడమెలాగో చెబుతుంది.

మరో వైపు రామ్మూర్తి అనే ఒక ప్రతిభావంతుడైన శ్రీచరిత కాలేజ్ లెక్చరర్ సునందా కాలేజిలో జేరాడని శ్రీచరిత ఓనరు ఇంటికి పిలిచి బెదిరిస్తాడు. అయినా రామ్మూర్తి లొంగడు. ఇలా ఉండగా సుందరం అనే లెక్చరర్ ఇంటింటికీ తిరుగుతూ తాను పనిచేసే కాలేజికి ప్రచారం చేస్తుంటాడు. శ్రీచరిత, సునంద కాలేజీల మధ్య పేరు గొప్పల కోసం అంతర్యుద్ధం మొదలౌతుంది. హిమ వర్ష స్నేహితురాలు క్షితిజకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తూ ఆమెను కృంగదీస్తుంటాయి. ఆ పని చేయించింది ఆమె క్లాస్‌మేట్ తల్లి అయిన ఓ ఆడ కానిస్టేబుల్ అని తెలుస్తుంది.
కాలేజిలో వత్తిడి, ఇంట్లో వాళ్ళ పోరు భరించలేక అనూష రూమ్మేట్, కల్పన ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ పిల్ల మరణానికి తాము బాధ్యులు కాదంటు యాజమాన్యం తప్పించుకోజూస్తుంది. అనూష ఆ ఘోరాన్ని దిగమింగుకోలేక ఉంటుంది.

సృష్టించడంలో ఓ తృప్తి ఉంటుంది.లయాత్మకమైన సౌందర్యం ప్రోది చేసి, తపస్సులా శ్రమిస్తే తప్ప ఏదీ అందమైన రూపాన్ని సంతరించుకోలేదు.విధ్వంసంలో ఓ ఆనందం ఉంది. చక్కటి ఆకృతిలో కనులవిందు చేస్తున్న వస్తువుని క్షణాల్లో ముక్కలుముక్కలుగా పగులగొట్టడంలో దొరికే రాక్షసానందం....
అక్కడి గుంపులో కెరటాలుగా ఎగిసిపడుతున్న ఉద్రేకం...
రోడ్డు పక్కన కంపించిన ప్రతి రాయీ వాళ్ళ చేతుల్లో సుదర్శన చక్రమై రివ్వున దూసికెళ్ళింది.
కొన్ని నిముషాల్లోనే వాతావరణం భయానకంగా మారిపోయింది.

ఈశ్వరరావు పోలీసులకు ఫోన్ చేశాడు. వాళ్ళు రావడంతో సమస్య మరింత జటిలమైంది.లాఠీ చార్జి చేయాల్సిన పరిస్థితి...కొంతమంది విధ్యార్థులకు తలలు పగిలి రక్తం వరదలా పారింది.కొంతమంది మోచిప్పలు పగిలిపోయాయి.మొహాల మీద లాఠీ తగిలి పెదాలు చిట్లిపోయాయి.అప్పటికే కిరాయి రౌడీలు మెల్లగా జారుకున్నారు.అమాయక విద్యార్థులు బలిపశువులైనారు. శాంతియుతంగా నినాదాలు చేస్తున్న విద్యార్థుల మీద అమానుషంగా లాఠీ చార్జి చేసినందుకు నిరసనగా మరునాడు కాలేజీలు బంద్ చేయాలని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.పేపర్లలో కల్పన ఆత్మహత్య ప్రముఖమైన స్థానాన్ని ఆక్రమించుకొంది.శ్రీచరిత కాలేజీలో జరిగే అమానుషాల గురించి వార్తలు వెలువడ్డాయి.

టి.వి 9లో చర్చా కార్యక్రమం మొదలైంది.విద్యార్థుల మీద రోజురోజుకీ పెరుగుతున్న వత్తిడి..కారణాలు...దుష్పరిణామాలు...అనే విషయం మీద చర్చ. ఉస్మానియా యూనివర్శిటీ నుంచి ప్రొఫెసర్ ఒకరు, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, బి.వి.పట్టభిరాంలను ఆహ్వానించారు.తమ కాలేజీ మీద పడిన అపవాదుకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని నచ్చచెప్పి ఈశ్వరరావుని కూడా పిలిచారు.
"కాలేజీ విద్యాథుల్క్లో సంభవిస్తున్న ఆత్మహత్యల గణాంకాలను పరిశీలిస్తే ఎక్కువ మరణాలు విపరీతమైన వత్తిడి వల్ల చేసుకుంటున్నారని తెలుస్తూంది.ఈ వత్తిడి లేకుండా చదువు చెప్పడం సాధ్యం కాదా?" అని అడిగాడు యాంకర్.
"ఏదైనా సాధించాలంటే కొంత వత్తిడి తప్పదు.అది అదుపులో ఉన్నంతవరకు మంచి ఫలితాలు లభిస్తాయి.కొంత పరిమితి దాటాక అది మనల్ని తన విష పరిష్యంగం లోకి తీసుకుంటుంది.ప్రస్తుతం ఇంటర్ బోధిస్తున్న కార్పొరేట్ కాలేజీల్లో ఆ వయసు పిల్లలు తట్టుకోలేనంత వత్తిడి ఉంది. అటు తల్లిదండ్రుల నుంచి, ఇటు ఉపాధ్యాయుల నుంచి..ర్యాకుల కోసం వత్తిడి....వాళ్ళ ఆశలకి అనుగుణంగా విజయాలు వరిస్తాయో లేదో అన్న భయం...మార్కులు రాకపోతే ఎదుర్కునే అవమానాలు..టీనేక్ పిల్లల జీవితాల్లో సంక్షోభాన్ని సృస్టిస్తున్నాయి" అన్నాడు ప్రొఫెసర్.
"మీరేమంటారు" అని ప్రముఖ హిప్నాటిస్ట్ పట్టాభిరాం ని అడిగాడు.
"ఈ రోజుల్లో బహుముఖ వికాసం అనే కాన్సెప్ట్ పోయింది.చదువు, మార్కులు,ర్యాంకులు తప్ప మనసుకి ఉల్లాసాన్ని కలిగించే వ్యాపకాల జోలికి పోవటం లేదు.పోటీని తట్టుకోవాలంటే చదవాలి.నిరంతరం చదువుతూనే వుండాలి.ఇది విద్యార్థుల్ని మరయంత్రాలుగా మార్చేస్తోంది.నా ఉద్దేశ్యంలో ఇటువంటి పిల్లల తల్లితండ్రులకి కౌన్సిలింగ్ అవసరం.పిల్లలకు మొదట విలువల గురించి నేర్పాలి.జీవితంలో ఎదురయ్యే అనేకానేక సమస్యల్ని తట్టుకునే మానసిక స్థైర్యం తల్లిదండ్రులనుంచే పిల్లలకు చేరాలి.కానీ వేలంవెర్రిగా పిల్లల్ని పదో తరగతి కాగానే ఏదో ఒక హాస్టల్లో చేర్పిస్తున్నారు. కమ్యూనికేషన్ కొరవడుతోంది.వాళ్ళకవసరమైన ప్రేమ, మార్గనిర్దేశం, సలహాలు ఇవన్నీ దొరకడం లేదు" అన్నాడాయన.

ఈశ్వరరావుని కల్పన ఆత్మహత్యకు సంబంధించి రకరకాల ప్రశ్నలతో వేధించి చంపారు.తన కాలేజీలో అసలు వత్తిడికి తావేలేదని, ర్యాంకుల వెంట పరుగు లేదని ఎంత చెప్పటానికి ప్రయత్నించినా ఎవరూ కన్విన్స్ కాలేదు.అక్కడినుంచి తిరిగొచ్చిన ఈశ్వరరావు కోపంతో, కసితో రగిలి పోయాడు.అతను భయపడినదంతా జరిగిపోయింది.శ్రీచరిత కాలేజీకి కోలుకోలేనంత చావుదెబ్బ తగిలింది.దీనంతటికీ కారణం సునందా కాలేజీ రావు. ఈశ్వరరావు పగతో రగిలిపోయాడు. అవకాశం చూసుకుని విస్ఫోటనం చెందటానికి తయారుగా ఉన్న అగ్నిపర్వతం ఇపుడతను.

కల్పన ఆత్మహత్య శ్రీచరిత కాలేజీలో చదివే అందరు విద్యార్థుల్ని కుదిపేసింది.ముఖ్యంగా ఆమెతో పాటు రూంలో ఇన్నాళ్ళూ గడిపిన అనూషని, మిగతా పదిమందిని. వాళ్ళకు రాత్రిళ్ళు నిద్ర కరువైంది.అందరూ మంచాలు జరిపి ఒకదానితో ఒకటి కలుపుకొని ఒకర్లో మరొకరు ముడుచుకొని పడుకొన్నారు కొన్నాళ్ళు.రోజులు గడిచేకొద్దీ భయం తగ్గుముఖం పట్టింది.మిగతా అందరూ చదువు ధ్యాసలో పడిపోయారు...అనూష తప్ప.

కల్పన అనూషతో బాగా చనువుగా ఉండేది.తనలోని భావాల్ని, భయాల్ని, బధల్ని అనూషతోనే పంచుకొనేది.అటువంటి కల్పన చావుని ఆ అమ్మాయి మర్చిపోలేకుండా ఉంది.కల్పన ఏమైపోయింది? ఎక్కడికెళ్ళింది? చావంటే ఏమిటి? లాంటి ప్రశ్నలు ఆమెని బాధిస్తున్నాయి.మొన్నటి వరకూ మనతో తిరుగాడిన అమ్మాయి...నవ్వి ఏడ్చి కోప్పడీ అలిగి నడిచి పరుగెత్తి ఇన్ని చేసిన అమ్మాయి ఇప్పుడు అదృశ్యమైపోయినట్లు...అమెరికాలో ఉన్న మామయ్య తనకు కంపించడు.కానీ అమెరికాలో ఉన్నాడు.అక్కడ తిరుగాడుతూ,నవ్వుతూ,కోప్పడుతూ,సమస్త జీవ కార్యాలూ నిర్వహిస్తూ ఉన్నాడు.అలానే కల్పన కూడా ఏదో ఒక లోకంలో ఉంటుందా? అక్కడ తిరుగుతూ ఉంటుందా?ఇంకేం చేస్తో ఉంటుంది?చదువుతూ ఉంటుందా? చదివి ఏం చేయాలని..మరి చదవకుండా వ్యాపకం లేకుండా ఎలా వుండటం..

పరీక్షలు వారం రోజుల్లో ఉన్నాయి.వాతిలో వచ్చే మార్కుల ఆధారంగా మరలా సెక్షన్లు మారుస్తారు.తనిప్పుడు జె యల్ ఫోర్‌లో వుంది.జె యల్ వన్ కానీ, టూ గానీ అయితే కోచింగ్ బావుంటుంది.ఆ సెక్షన్ల నుంచే ఎక్కువ మందికి యంసెట్లో మంచి ర్యాంకులు వస్తాయి.ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని పాఠాలు చెప్తారు.బెస్ట్ లెక్చర్లు అందరూ ఆ సెక్షన్‌కే వెళ్తారు.చివరికి జె యల్ త్రీ అయినా పరవాలేదు.

నిన్నరాత్రి ఇంటికి ఫోన్ చేస్తే అమ్మ క్లాసు పీకింది.తనకి చదువు మీద శ్రద్ధ తగ్గిపోయిందట.ఆమె కోరిక తీర్చడంలో తను విఫలమైందట.నిజమేనా...కొంతవరకు నిజమే..కల్పన చనిపోయాక చదువుమీద మనసు లగ్నం కావటం లేదు.అలజడిగా ఉంటోంది.భయంగానూ ఉంటోంది.రాత్రుళ్ళు గదిలో పడుకుంటే కొండ చిలువ నోట్లో పడుకున్న ఫీలింగ్.ఈ గదేగా కల్పనని అమాంతం మింగేసింది...

ఆదివారం సాయంత్రం...హాస్టల్ ప్రాంగణం అంతా పిల్లల్ని కలుసుకోవటనికి వచ్చిన తల్లిదండ్రులతో కోలాహలంగా ఉంది.అనూష కిందకి దిగి, దూరంగా వెళ్ళి కూర్చుంది.కొన్ని వారాల క్రితం తనూ, కల్పన కూచున్న చోటదే.తన ఆలోచనల్లోకి చొచ్చుకొనుస్తున్న కల్పన జ్ఞాపకాల్ని పక్కకు నెట్టి రాబోతున్న పరీక్షలకోసం ఎలా చదవాలా అని ఆలోచించింది. ఇప్పటికే తను చదువులో వెనక పడింది.నష్టపోయిన కాలాన్ని కవర్ చేసుకోవాలంటే ఎక్కువ శ్రమ పడక తప్పదు.అర్థం కాని కొన్ని పాఠాల్ని లెక్చరర్ల దగ్గర మళ్ళీ చెప్పిచ్చుకోవాలి.

ఆలోచనల్లో మునిగి ఉన్న అనూషని ఎవరో పేరు పెట్టి పిలిచారు. మొదట వినిపించలేదు.మరలా పిలిచారు. అనూష పక్కకు తిరిగి పిలుపు వినవచ్చిన వైపు చూసింది. కల్పన...కల్పన పిలుస్తూంది.

**** **** ****

(సశేషం)

భావుకతను సృజనాత్మకతను రంగరించిన కథనశైలితో విశేష ప్రతిభ కలిగిన కథకుడు, నవలాకారుడు శ్రీ సలీం. కథా ప్రక్రియలో తెలుగు యూనివర్సిటీ ధర్మనిధి పురస్కారం,వెండి మేఘం నవలకు తెలుగు యూనివర్శిటీ సాహిత్య పురస్కారం (రాష్ట్ర సాహిత్య అకాడెమీ అవార్డు), వి. ఆర్. నార్ల పురస్కారం లభించాయి. 'రూపాయి చెట్టూ కథా సంపుటికి మాడభూషి రంగాచారి స్మారక అవార్డు, కాలుతున్న పూలతోట నవలకు బండారు ఈశ్వరమ్మ స్మారక పురస్కారం లభించాయి.