పర"దేశి" కతలు: వెన్ ఇండియా స్నీజెస్ అమెరికా క్యాచెస్ కోల్డ్

-- తాటిపాముల మృత్యుంజయుడు

ఈ రోజు కూడా ఎప్పటిలాగే తెల్లవారింది. సూర్యుడు తూర్పునే ఉదయించాడు. హైవే మీద ఎడతెరిపి లేకుండా వాహనాలు రొదచేస్తూ పరిగెడుతూనే ఉన్నాయ్. అవి బాటిల్ నెక్ ఉన్నచోట ఠంచనుగా ఆగిపోతూనే ఉన్నాయ్. ఆగినప్పుడు, కార్లలో ఉన్న ఆడవాళ్ళు మరచిపోకుండా మేకప్పులు చేసుకొంటూనే ఉన్నారు. ఇది గత పదేళ్ళుగా అంటే నేను సిలికాన్ వేలీలో అడుగుపెట్టినప్పటినుండి జరుగుతున్న భాగోతమే.

ఇక ఆఫీసులో తతంగం - ఆఫీసులో కొలీగ్ లు అందరూ కాఫీలు గుక్కలు వేస్తూ ఫోన్లలో మీటింగులలో 'నేనంటే నేనని ' పోటీపడుతూ మాట్లాడుతూనే ఉన్నారు. ఇండియాలోనున్న డెవలపర్లు జావా ప్రోగ్రామ్మింగులో తెలిసో తెలియకో బగ్గులు పెడుతూనే ఉన్నారు. టెస్టర్లు యథాశక్తిగా ఆయా క్రిమికీటకాలని దొరికించుకుంటూనే ఉన్నారు. దొరికించుకొని గర్వంగా కాలర్లు ఎగిరేస్తూనే ఉన్నారు. అలా తప్పులు దొరకబడ్డ డెవలపర్లు టెస్టర్లమీద కినుకుతో తమ ప్రోగ్రాం లను తిరిగి ప్రక్షాళన గావిస్తూనే ఉన్నారు.

గత కొన్ని నెలలుగా ఈ తతంగం చర్వితచరణంలా నడుస్తూనే ఉన్నది. ఇంకా కొన్ని నెలలు సాగిపోతూనే ఉంటుంది. అది చిన్నా చితకా ప్రాజెక్ట్ కాదాయే. ప్రతిష్ఠాత్మకమైన టెక్నాలజీ ప్రాజెక్టాయే. గ్లోబలైజేషన్ పుణ్యామా అని 'అటు అమెరికా, ఇటు ఇండియా' వాళ్ళం అందరం అహర్నిశలు నిద్రాహారాలు మాని పనిచేస్తూనే ఉన్నాం. జోడుగుర్రాల స్వారీలా సాగుతున్నది పని.

ఈ ప్రాజెక్ట్ కు పీటర్ ప్రోగ్రాం మేనేజర్. అతని తయారుచేసిన ప్రాజెక్ట్ ప్లాన్ చాంతాడంత పెద్దది. రోజురోజుకు ఆంజనేయుని తోకలా పెరుగుతున్నదే కాని తరగటమో, పెరగకుండా నిలవటమో జరగటం లేదు. ఆ ప్లాన్ ను అతడు మాటిమాటికి 'దిస్ ఈస్ ఏ లివింగ్ డాక్యుమెంట్ యూ నో' అంటూ సంబోధిస్తాడు.

ప్రతి వారంలో ఒకరోజు అతడు తయారుజేసిన...జేస్తూనే ఉన్న... జేయబోతూన్న... ప్లాన్ ని డిస్కస్ చెయ్యటానికి మీట్ అవుతాము.

ఈ రోజుకూడా ఫోన్లలో అష్టదిక్కులనుండి (ఐ మీన్, అమెరికాలో ఐదు నగరాలనుండి, ఇండియాలో మూడు నగరాలనుండి) 'ఊహాజనిత మీటింగ్ హాల్లో' కలుసుకున్నాం. ప్రాజెక్ట్ ప్లానులోనున్న ఒక్కొక్క లైన్ ఐటెం ని దుర్భిణి వేసి ఏమైనా లోతుపాతులున్నాయా అని పరిశోధించటం మొదలెట్టాం.

మాట్లాడుతుంటే మధ్యలో 'భౌ, భౌ' మన్న అరుపులు వినిపించాయి.

'ఇట్ లుక్స్ లైక్ సంబడీ'స్ పెట్ ఈజ్ బార్కింగ్. కెన్ యూ పుట్ యువర్ సెల్ఫ్ ఆన్ మ్యూట్ ప్లీజ్?' అభ్యర్థించాడు పీటర్.

'ఇట్ ఈజ్ మీ, శ్రీని. బట్ ఇట్ ఈజ్ నాట్ మై పెట్. ఇట్ ఈజ్ ఏ స్ట్రీట్ డాగ్.' అన్నాడు శ్రీనివాసన్ ఉరఫ్ శ్రీని. వెనువెంటనే 'ఏయ్, ఆయ్, లే, లే' అన్న మాటలు కూడా వినిపించాయి.

శ్రీనివాసన్ ఇండియా టీం లీడ్. అతను రాత్రి ఇంటికి బైకు మీద వెడుతూ సెల్ ఫోనులో మీటింగ్ అటెండ్ అవుతున్నాట్టున్నాడు. తను మాట్లాడవలసిన సమయం వచ్చిందేమో, బైకును రోడ్డు పక్కగా ఆపితే వీధికుక్క అరుపందుకుంటే దాన్ని విదిలిస్తున్నట్టున్నాడు.

'యస్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్ట్రే డాగ్స్ అండ్ వాటర్ బఫెల్లోస్ ఆన్ చెన్నై రోడ్స్ ' అన్నాడు ఈ మధ్యనే ఇండియా వెళ్ళొచ్చిన మాథ్యూ. ఇండియాలో పాలిచ్చే గేదెలని 'వాటర్ బఫెల్లో' అంటున్నాడని అతను గేదే పక్కన నిలుచొని తీసుకొన్న ఫోటో చూపిస్తే తెలిసింది. జలకాలాడటానికి నీళ్ళు ఉండని ఉష్ణమండలమైన దక్షిణ భారతదేశంలో, సంవత్సరంలో ఒక్కసారైనా స్నానమెరుగని గేదెలని ఇంగ్లీషులో 'వాటర్ బఫెల్లో' అని ఎందుకంటారో సమయం దొరికినప్పుడు పరిశోధన చెయ్యాలని నిశ్చయించుకొన్నాను. మాథ్యూ ఓ వింత మనిషైతే అతనికి ఇండియాలో అన్నీ వింతగానే అగుపడ్డాయి. ఒకే స్కూటర్పై నలుగు వెడుతున్న వైనాన్ని, రోడ్డుపై స్వేచ్ఛా విహారం చేస్తున్న ఆవుని... ఇలా ఎన్నో ఫోటోలను మరెన్నో కోణాల్లో తీసుకొన్నాడు. తీసుకొన్నది చాలక ఫోటో ఎగ్జిబిషన్ లా ఆ ఫోటోలను అందరితో పంచుకొన్నాడు.

మీటింగ్ లో కొంత సమయం గడిచాక 'నౌ వియ్ ఆర్ ఆన్ లైన్ ఐటెం టూ ఎయిటీ ఫైవ్. వెరీ క్రిటికల్ ఆక్టివిటీ. ఇట్ ఈజ్ ఆన్ టూ డేస్, నవంబర్ ఎయిత్ అండ్ నైంత్ డేట్స్. వియ్ నీడ్ టు పుల్ అప్ స్లీవ్స్ అండ్ వర్క్ హార్డ్...' అంటూ ఇంకేమేమో చెప్పుకు పోతుంటే 'ఎక్స్యూజ్ మీ పీటర్ ' అన్నాది ఓ గొంటు. అది శ్రీనివాసన్ దని ఆ వెనుకే వినిపిస్తున్న కుక్క అరుపువల్ల ఇట్టే గుర్తు పట్టాము.

'యస్, శ్రీని ' అన్నాడు పీటర్.

గొంతు సరి చేసుకొని నెమ్మదిగా (ఇంగ్లీషులో) చెప్పటం మొదలెట్టాడు. 'నవంబర్ ఎనిమిదో తారీఖు ఇక్కడ అతి ముఖ్యమైన పండగ. ఆ పండగ పేరు దీపావళి. ఆ రోజు సెలవు దినం. కాబట్టి ఆ క్రిటికల్ ఆక్టివిటీని వెనక్కు జరపాలి ' అన్నాడు.

అందుకు ఆశ్చర్యపోతూ పీటర్ 'అరె! ఆ హాలీడేను నేనెలా మిస్సయ్యాను. ఎక్కాడ ఆ హాలీడే అంటూ...' ఇంట్రానెట్లో ఇండియా హాలిడేస్ వెదకటం మొదలెట్టాడు.

పాతిక పైగా సెలవులున్న ఆ లిస్టులో దీపావలి పండగ అతనికి అగుపడలేదు. అక్కడున్న నేను, సుందర్రావు, వెంకటరమణ గైడ్ చేయగా ఆ సెలవును కనుక్కోన్నాడు.

'కానీ ఇక్కడ దీపావళి కాకుండా ఇంకేదో పేరు ఉంది ' అన్నాడు. 'ఓ అదా! దీపావలీని నార్త్ ఇండియాలో దీవాలీ అంటారు కూడా' సందేహ నివృత్తి చేసాడు వెంకటరమణ.

'నౌ ఐ నో, నేను ఈ పండగను ఎందుకు మిస్సయ్యానో. ఇరవైదు పండగలు రెండు పేజీల్లొ ఉంటే పేజీ తిప్పటం మరిచాను ' అంటూ తన తప్పిదాన్ని జోకులా మార్చేశాదు పీటర్. 'బై ది వే, దీపావళి అంటే ఏమిటీ?' అడిగాడు పీటర్.

'దీపావళి అనగా దీపముల వరుస ' అని చిన్నప్పూడు చదువుకొన్నది ఠక్కున గుర్తొచ్చి చెప్పబోయి ఆగిపోయాను.

నేను ఆగిపోవటం చూసి సుందర్రావు అందుకొన్నాడు. 'దీపావళి అంటే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. అమెరికాలో క్రిస్ట్ మస్ పండగంత పెద్దది ఇండియాలో దీపావళి పండగ. ఈ మధ్యనే అమెరికా ఫెడెరల్ గవర్నమెంట్ కూడా దీపావళి పండగను గుర్తించింది...' అంటూ చెప్పుకొచ్చాడు.

'ఓకే, వియ్ ఆర్ లూజింగ్ ఎ డే హియర్. ప్లాన్ ఎలా అడ్జస్ట్ చెయ్యాలో ఆలోచించాలి. అది సరే, కాని ఈ పండగ సిగ్నిఫికన్స్ ఏంటీ?' అడిగాడు పీటర్ మళ్ళీ.

భారతీయత అంటే చెవికోసుకునే సుందర్రావు వచ్చిన అవకాశాన్ని వీరావేశంతో అందుకున్నాడు. 'దీపావళికి చాలా అర్థాలున్నాయి. ఇండియాలో కొన్ని చోట్ల ఇది సంవత్సరంలో ఆఖరి పంట కోత కాలం కాబట్టి పండగ చేసుకొంటారు. ఇంకొన్ని చోట్ల రామయణంలో రాముడు రావణునిపై అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా చేసుకునే పండగ ఇది. అలాగే సౌత్ ఇండియాలో ద్వాపరయుగంలో నరకాసురునిపై శ్రీకృష్ణ సత్యల విజయానికి గుర్తుగా చేసుకునే పండగ కూడా దీపావళి...' నిరాఘాటంగా చెప్పుకు పోతున్నాడు సుందర్రావు.

ఇంతలో 'ఎక్స్యూజ్ మీ పిటర్ ' అంటూ మల్లీ ఓ కంఠం వినిపించింది. 'యస్, హూ ఈజ్ దిస్? కెన్ యూ ప్లీజ్ స్టాప్ విజిలింగ్?' అన్నాడు.

'దిస్ ఈజ్ చంద్ర హియర్ ఫ్రం హైద్రాబాద్. బట్ ఐ యాం నాట్ విజిలింగ్. ఇట్ ఈజ్ ఏ కాప్ ఆస్కింగ్ మీ టు టేక్ మాఇ బాఇక్ ఫ్రం రోడ్ సైడ్' అంటూ ఆయాసపడుటూ చెప్పాడు. పోలీసు వెనకాల పడితే బైక్ తోస్తూ మాట్లాదుతున్నడేమో. 'ఐ హావ్ ఏ పాయింట్. ఇక్కడ హైద్రాబాదులో దీపావళీ చెన్నైలో లాగా ఎనిమిదో తారీఖు కాదు. మాకు నైంత్ ' అన్నాడు.

'వ్వాట్? డు యూ సెలెబ్రేట్ దీవాళీ ఆన్ డిఫరెంట్ డేస్?' ఆశ్చర్యపోతూ చీకాకును బయటకు కనపడనీయకుండా అడిగాదు పీటర్.

అటుపక్కనుండి చంద్ర ఆఖరి క్షణంలో తిథులు లెక్క కట్టడంలో ఎలా అభిప్రాయ భేదాలు వచ్చాయో, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రెండురోజుల క్రితం పండగ సెలవును ఒక రోజు వెనక్కు జరిపిన వైనాన్ని చెప్పాడు. 'అవన్నీ సరే! ఇలా లాస్ట్ మినెట్లో మారిస్తే ఎలా? మనం ఆ రోజు పని చెయ్యవలసిందే?' తన నిర్ణయాన్ని గాట్టిగా చెప్పటానికి ప్రయత్నించాడు పీటర్.

అయితే కొత్తగా పెళ్ళయిన చంద్ర కొత్త అల్లుళ్ళకు, దీపావళి పందగకు ఉన్న విడదీయరాని, అవినాభావ సంబంధాన్ని వివరించటానికి ప్రయత్నించాడు. ఈ పండగకు ఎలా అయినా అత్తారింటికి వెళ్ళాలన్నాడు. అత్తారింట్లో ఎన్నో హంగులు, ఆర్భాటలు జరుగుతున్నాయన్నాడు. ఈ పద్ధతులన్నీ అర్థం కాని పీటర్ నుదురు రుద్దుకుంటూ విన్నాడు.

'ఇట్ ఈజ్ కంఫ్యూజింగ్. ఐ థింక్ ఇట్ విల్ టేక్ సం టైం టు గెట్ హంగ్ ఆన్ ఇండియన్ ఫెస్టివల్స్ అండ్ హాలిడేస్. యువర్స్ ఈజ్ ఏ కాంప్లెక్స్ సొసైటీ' అంటూ ఓ కామెంట్ కూడా చేసాడు.

అదే అదనుగా సుందర్రావు మళ్ళీ విజృంభించాడు. భారతదేశంలో ఎన్ని భాషలున్నాయో, ఒక్కొక్క భాషకు ఎంత చరిత్ర వుందో తెలుపుతూ, ఓ తెలుగు వానికి పక్క రాష్ట్రంలోని తమిళంవాడు తెగ తిట్టేస్తున్నా ఒక్క ముక్క కూడా ఏవిధంగా అర్థం కాదో, నార్త్ ఇండియన్ సౌత్ ఇండియా వస్తే ఏదో విదేశానికి వచ్చినట్టు ఎలా ఫీలవుతాడో, అలాగే వేషధారణుల్లో, కట్టుబట్టల్లో ఎన్ని తేడాలున్నాయో అరటిపండు వలచినట్టు చెబుతూ, అసలు భారతదేశం వివిధ దేశాల సమ్మేళనం అని అందుకే 'భారత ఉపఖండం' అని పిలుస్తారని రీజనింగ్ కూడా చెప్పి ఓ క్లాసు పీకాడు.

ఇవన్ని వింటున్న పీటర్ కి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టయ్యింది. తల బరబరా (అంటే రెండుసార్లు) గొక్కున్నాడు.

అతనికి ఇంకా బాగా గుర్తు. మూణెళ్ళ క్రితం 'శివాజీ' సినిమా విడుదలైనప్పుడు ఎంత హడావుడి జరిగిందో. ప్రపంచం అంతా ఎలా తలకిందులైందో. ఇండియా ఆఫీసు జనరల్ మేనేజర్ ఎన్ని పనులున్నా మానేస్తూ, చెన్నై ఆఫీసులో నున్న ఇంజనీర్లందరిని కుటూంబ సమేతంగా ఎలా మొదటిరోజు మొదటి ఆటకు ఎంత ఖర్చైనా భరించి తీసుకెళ్ళాడో కళ్ళకు కట్టినట్టు గుర్తుంది. చాలా కంపెనీలు అలా చేస్తున్నాయని, మనం చెయ్యక్పోతే కొందరు ఉద్యోగాలు వదలి వెళ్ళుతారని, అంతటి పవర్ ఆ సినిమా హీరోకి ఉండని అమెరికా బాసులకి చెప్పి వప్పించాడు.

మీటీంగ్ మరికొంత ముందుకెళ్ళింది. 'నౌ, వియ్ ఆర్ ఇన్ లైన్ ఐటెం త్రీ సిక్సిటీ టూ. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టంట్ మైల్ స్టొన్. మనం ఇది మిస్సయ్యామో ప్రాజెక్ట్ మీద పెద్ద ఇంపాక్ట్ వుంటుంది.' అంటూ చెప్పుతున్నాడు. ఇంతలో 'ఎక్స్యూజ్ మీ పీటఋ అన్న గొంతు మళ్ళీ వినపడింది. మళ్ళీ ఏ వార్త వింటానో అని పీటర్ సంకోచిస్తూ 'యస్ ' అని తడబడుతూ అన్నాడు.

అవతల కఠం మళ్ళీ చంద్రది,ఎందుకంటే వెనక పోలిసు విజిల్ వినబడుతోంది. 'దట్ దే వియ్ మే నాట్ బి వర్కింగ్' అన్నాడు.

'బికాజ్ ఇట్ ఈజ్ ఆ స్టేట్ బంద్ ఆన్ దట్ డే' అన్నాడు చంద్ర. అర్థంగాక మళ్ళీ బుర్ర బరబరబరా (అంటే మూడుసార్లు) గోక్కున్నాడు పీటర్.

అప్పుడు చంద్ర ఈ విధంగా వివరించాడు. బంద్ అంటే స్ట్రయిక్ అనీ, స్టేట్ బంద్ అంతే రాష్ట్రవ్యాప్తంగా స్ట్రయిక్ అనీ, జనజీవనం స్తంభించిపోతుందనీ, రోడ్ల మీద గూండాలు తిరుగుతారని, ఎవరైనా బయటికి వచ్చారో, ఆఫీసులకెళ్ళారో, పనులు చేసుకొన్నారో వాళ్ళకు హాని కలుగుతుందని, ఎందుకొచ్చిన గొడవ అని అందరూ ఇంట్లోనే ఉంటారని చెప్పాడు. పైగా ఈ బంద్ కు ఇంకో ప్రత్యేకత ఉందంటూ, అదేమిటంటే, ఈ బంద్ కి పిలిపిచ్చింది రాష్ట్ర ప్రభుత్వమేనని సెలవిచ్చాడు.

'రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవేముంటుందని ' కాబట్టి ఎవ్వరూ పనికి రావటానికి వీసమెత్తు ధైర్యం కూడా చెయ్యరని మరీ నొక్కి చెప్పాడు.

'కంచే చేను మేస్తే' ఇక ఆపేదెవ్వరు. అదే ఇరకాటంలో పడ్డాడు పీటర్. ఇంతలో మీటీంగ్ టైం అయిపోయింది. పీటర్ మళ్ళీ వచ్చేవారం కలుద్దామంటూంటే అతని భారమైన నిట్టూర్పులు మాకు ఫొనులో స్వచ్చంగా వినపడ్డాయి.