పద్యం-హృద్యం

-- తల్లాప్రగడ

ముందుమాట: ఈ శీర్షికతో తెలుగు పద్యంలో ఉన్న అందాన్ని, గొప్పతనాన్ని పదిమందికీ అందించి, వారిని ఈ ప్రక్రియకు దగ్గిర చేసి, పద్యానికుండవల్సిన మర్యాదని గుర్తుచేయడమే మా సంకల్పం. మరుగు పడిన పద్యాన్ని మళ్ళీ మెరుగు పరచి, భాషను సరళీకృతం చేస్తే, పద్యాలంటే ఉన్న భయం తొలుగుతుంది. వాడుక భాషలో పద్యాలు వ్రాస్తే, అటు పద్యమూ నిలబడుతుంది, ఇటు ప్రజలకూ అర్థమవుతుంది. అందుచేత వాడుకభాషా ప్రయోగాలకు మేము ప్రాముఖ్యత ఇవ్వదలిచాము. ముందు ముందు ఈ శీర్షికను పాఠకులందరూ పాల్గునే విధంగా రూపొందిస్తాము. అలాగే మంచి పద్యాలకు భాష్యం, తాత్పర్యాలు, కూడా ప్రచురిస్తాము. అందరూ ఆనందించాలి, ఆస్వాదించాలి, ఆదరించాలి, అదే మాకు పదివేలు (డాలర్లు)!!!!

సమస్యాపూరణం:

ఈ క్రింది "సమస్యని" అంటే ఆ వ్యాక్యన్ని యదాతధంగా ఒక పద్యంలోకి ఇమిడ్చి వాడుకుంటూ రాయాలి. ఒకవేళ పద్యం కాకపోయినా ఒక కవిత రాసినా కూడా వాటిని మేము సగౌరవంగా స్వీకరిస్తాము.

మీ జవాబులు ఈ మెయిల్(rao@infoyogi.com) ద్వారా కాని ఫాక్స్ ద్వారా కానీ : 408-516-8945 మాకు డిసెంబర్ 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. పాఠకుల సౌకర్యార్థం ఈ లంకెని నొక్కండి.

ఈ మాసం సమస్య

"కం://పుట్టినరోజది తనదని పుట్టెడు ఏడ్చా! "

క్రితమాసం సమస్య : "కం.// కోతితొ పెండ్లి కుదిరెనని కోమలి మురిసెన్"

ఈ సమస్యకి వచ్చిన పూరణలు ఇలా ఉన్నాయి.

మొదటి పూరణ - మహిమ


కవిత:// కోవూరు తిమ్మారావు కొంటెచూపుల బాణాలతో
కుసుమ కోమలి మనసు రెపెరెపలాడగ
సదరు పెద్దలు కల్యాణమునకు అంగీకరింప
కోతితో పెళ్ళికుదిరెనని కోమలి మురిసెన్

రెండవ పూరణ - డా. ఐ. యస్. ప్రసాద్, సికిందరాబాద్


కం://'మాతలు లావని ' పలికెడు
నాతికి రాంకోటిబావ నచ్చెను బాగా.
నాతిగ తలచెను "నాలాం
కోతితొ పెండ్లికుదిరెనని" కోమలి మురిసెన్


మూడవ పూరణ - ఊకదంపుడు, సికిందరాబాద్,


కం.// నాతలరాతయె మారెర
వాతాత్మజుడు మదిగొల్చు వాని దయా సం
ప్రీతినెటులనిన పెంపుడు
కోతితొ "పెండ్లి కుదిరె"నని కోమలి మురిసెన్

నాల్గవ పూరణ - సత్య మూర్తి, సింగపూర్


కం:// రాతిని నాతిగ చేసిన
సీతాపతి మెప్పుపొంది సేతువు కట్టెన్
ఖ్యాతిగ, జాతిరతనమౌ
కోతితో పెండ్లి కుదిరెనని కోమలి మురిసెన్


ఐదవ పూరణ - ఓరుగంటి వేణుగోపాలకృష్ణ, న్యూ జర్సీ


కం://నాతితొ సరసముగ సఖుడు
కోతిని నేనవ్వ లేత కొబ్బరి నీవౌ
ప్రీతితొ పెండ్లాడమనిన
కోతితొ పెండ్లికుదిరెనని కోమలి మురిసెన్


ఆరవ పూరణ -తల్లాప్రగడ- శాన్ జోసే, కాలిఫోర్నియాకం: // మూతిని మూసుకు యతడే
చేతుల మూయును కనులను చెవులను అన్నీ !
నీతిపరుడైన యట్టీ
కోతితొ పెండ్లి కుదిరెనని కోమలి మురిసెన్!!


ఏడవ పూరణ - సుబ్రహ్మన్యం బాతల, రాచెస్టర్ హిల్ల్స్, మిచిగన్

కవిత:// మూతి మీదను మీసమ్ము మచ్చుకైనను లేక
ప్రేత కళలను గలిగి పేడి రూపము తోడై
మతి హీను డనిపించి మగువ రీతిన నటియించు
కోతితో పెండ్లి కుదిరెనని కోమలి మురిసిన,
ఆతని మల్టి మిలియను డాలర్ల మహిమ గాదె.


మరొక పూరణ

కవిత:// స్థితిగతులు మేలుగ గల మగ
కోతితో పెండ్లి కుదిరెనంచు కోమలి మురిసెన్
అతివకు అర్థమె విలువై తోచిన
మతి మంతుడు యైన మగడు మానినికేలా


ఎనిమిదవ పూరణ- ఎం.వి.సి. రావు, బెంగళూరు


కం:// కైతల చిగిరిన స్నేహము
చేతలతో పెరిగి మిగుల చేరువ కాగా
ఆతడె, చిలిపిరి బావగు
కోతితొ పెండ్లి కుదిరెనని కోమలి మురిసెన్


తొమ్మిదవ పూరణ- మాజేటి సుమలత, బెంగళూరు


కం://రాతితొ బొమ్మలు చెక్కుచు
నాతితొ సరసముల దిగుచు, నవ్వుల పాలై
నేతతొ నెగ్గిన బావా
కోతితొ పెండ్లి కుదిరెనని కోమలి మురిసెన్


పదవ పూరణ - పుల్లెల శ్యామసుందర్, సాన్ హోసే, కాలిఫోర్నియా


కం://జీతము దండిగ వచ్చెడి
కోతితొ పెండ్లి కుదిరెనని కోమలి మురిసెన్
చేతిలొ డబ్బులు కలిగిన
రోతగ మొహమున్నను సరిలెమ్మని తలచెన్


పదకొండవ పూరణ - చదువరి (తుమ్మల శిరీష్ కుమార్), హైదరాబాద్


కం:// కూతురు మెచ్చకయున్నను
జాతకుడని తలచి మనువు జరపగ నెంచెన్
ఆతనికీలోపున ఇం
కోతితొ పెండ్లికుదిరెనని కోమలి మురిసెన్


భక్త హనుమ -- తల్లాప్రగడ

అశోకవనంలో సీతనుచూచి బయటకువస్తున్న హనుమంతుడు లంకాధీశునికలువగోరి ఒక కల్లోలం సృష్టించి పట్టుబడి రావణుని కలువగోరుతాదు. అందుకని చెట్ట్లను పీకి ఒక భీభత్సం చేస్తాడు. అది ఇలా ఉంది.


సీ:// అంత వినత హనుమంత కలతన వినిర్గతంబునచేసె నిశ్చితాత్ము
డై నితాంత నిచిత డాచేత విస్త్రుత సతతహరిత వన సంచలితము!
రోషిత రేచిత రోహిత జ్వలిత వికలిత విక్రీడిత కలితుండు
విటతాట వాశిత విద్రుత వాసిత కలుషిత భూషిత కరతలాడె

తే.గీ.// అవిరతాకాశ చుంబిత అస్ఖలిత య
డవి కపి అవిలంబిత ఆహతి వితవాత
పోత లంబిత కాగిత విహిత మాయె,
ఖామముగ తాంతవనమాయె రామచంద్ర!

ప్రతిపదార్థం:

అంత = అంతట
వినత= వినయుడైన
హనుమంత = హనుమంతుడు
కలతన = కలత (తల్లిని వదలుతూ బాధతో) చెందినవాడై
వినిర్గతంబునచేసె = బయటకు వెడుతూ చేసెను
నిశ్చితాత్ముడై = ఒక స్థిరమైన ఆలోచనతో
నితాంత = చాలా అధికమైన
నిచిత = వ్యాపింపబడిన, పెద్దదైన
డాచేత = ఎడమ చేత
విస్త్రుత = విస్త్రుతంగా పెరిగిన
సతతహరిత వన = ఎల్లప్పుడు పచ్చగా ఉండేటటువంటి వనాన్ని
సంచలితము!= బాగా కుదపబడుట (కదిలించివేసాడు, అలాంటి కార్యాన్ని చేసినాడు)
రోషిత = రోషంతో కూడుకున్నటువంటి
రేచిత =తిన్నగా దూసుకుపోతున్నటువంటి
రోహిత = ఎర్రగా
జ్వలిత = వెలుగుతున్న ఆవేశంతో
వికలిత = మనస్సుకి కష్టం కలిగినవాడై
విక్రీడిత = వ్యూహాత్మకంగా
కలితుండు= ఉన్నవాడై
విటతాట = తారుమారైన
వాశిత = మృగపక్షుల ధ్వనుల మధ్య
విద్రుత = కరిగిన
వాసిత = వాసనలు వస్తుండగా(చెట్లు విరుగగా వాటి పాలుకారగా వచ్చిన వాసనలు), లేక చెట్లు విరుగగా కరిగిన పక్షుల
నివాసాలు అని కూడా అనవచ్చు
కలుషిత = ఇటువంటి తప్పులే
భూషిత = ఆభరణాలవగా
కరతలాడె= చిలిపి ఆటలు (కోతి చేష్టలు) ఆడెను

అవిరత= అనంత
ఆకాశ = ఆకాశాన్ని
చుంబిత = ముద్దాడే (తాకే)
అస్ఖలిత= అచరమైన
యడవి = అడవి
కపి = వానరుని
అవిలంబిత = వేగముచేత
ఆహత = దబ్బతిన్నదై
విత= అల్పమైన
వాతపోత = పిల్లగాలికి
లంబిత = ఎగిరిన
కాగిత = కాగితపు
విహిత మాయె= యుక్త మయ్యెను!
ఖామముగ = ఖచ్చితంగా
తాంతవనమాయె= బాగా అలిసిపోయిన వనము అయ్యింది (ఆ దెబ్బకి)
రామచంద్ర!= రామచంద్ర!