నటరంజని

వేదాంత విజ్ఞాన-బ్రహ్మ జ్ఞానాల సమ్మేళనం - కూచిపూడి భామాకలాపం : 3

-- శ్రీ భాగవతుల లక్ష్మీనరసింహ శాస్త్రి

పారిజాతాపహరణ ప్రబంధకర్త ముక్కు తిమ్మన చిత్రించిన సత్య రూపు రేఖా విలాసముల నధిగమించు సిద్ధేంద్రులు ఆహార్యాభరణములలో విరికుచ్చులు-విరిదండలు-నేవళము-చిత్కతాళ కేతకి- రాగిడి-చంద్రవంక-తమలపాకు-తిత్తురుపువ్వు-మొగలిరేకు-సూర్యచంద్రులు-పాపిడిబొట్టు-పాపిడి బిందినీలు-రత్నాల జడ-పచ్చల పతకం-ఒడ్డాణము-బులాకి-ముక్కుపుడక-ముంగెర మొదలయినవెన్నో సత్య పాత్రకు గూర్చి కూచిపూడి నాట్య రంగములో స్త్రీ పాత్రలకు స్త్రీ పాత్రలకు విశిష్టతను ప్రత్యేకతను విశదీకరించారు.

స్త్రీల ఆభరణములలో ముంగెర ప్రాముఖ్యం. అంగనలేని ఇల్లు, చతురంగ బలంబులులేని రాజు, నిస్సంగుడు కాని మౌని-కామినీ సంగతి లేని యవ్వనము, స్త్రీలకు ముంగెరలేని భూషణము మొదమటే భువనైక మొహినీ!

సత్యభామ జడలో సిద్దేంద్రులు విశ్వచక్రాన్ని నిక్షిప్తంజేసారు. ఈ జడ యోగ తత్వానికి ప్రతీక. జడ మూలాధారాన్ని స్పృశిస్తుంది. మూలాధారంలో కుండలిని జడ స్పర్శ ద్వారా నిద్ర లేపుతుంది. జడ షట్ చక్రాలు దాటగానే ఈ విశ్వం అంతా ఆత్మ స్వరూపంగా అనిపిస్తుంది.

ఆకాశవాణి వారు భరత కళా ప్రపూర్ణ కీ||శే చింతా కృష్ణమూర్తి గారి సూత్రధారణమున పద్మవిభూషణ్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణగారు, కీ||శే శ్రీరంగం గోపాలరత్నం గార్ల గాత్ర సౌరభములతో భామాకలాపమును సంప్రదాయ నృత్యసంగీత రూపకపుగా ప్రసార మొనర్చి కూచిపూడి ఖ్యతిని దేశ వ్యాప్త మొనర్చినారు.

కార్య సాధనకు దీక్షతో కార్యార్ధి ఆలోచన ఎలా ఉండాలో రాయబార ఘట్టములో సత్య భామ రతిరాజ రూపవంతుడగు ప్రాణనాధుని మాటలకు ఆదుగు దాటనని- కప్పురంపు విదెము మొగలి రేకులు పంపి తన్నెడబాయలేక విరుల పానుపు పై యునాట్లు వినయముగా తెల్పమని కోరును-చిటికెన వేలి ఉనగరము నడుము వడ్డాణమయ్యెనని తెల్పమనును. ప్రేమాభిమానములు గౌరవ ప్రపత్తులు సూచకమగునట్లు అక్క రుక్మిణిని మిక్కిలి మక్కువగా అడిగినట్లు కబురంపగా దూతిని రాయబారమంపు కధా మధ్యంలో, విజ్ఞాన దాయకములగు విషయములెన్నిటినో మానవాళి కందించారు సిద్దేంద్రులు. అందుకు

భుజయించి శతపదంబులు ద్రొక్కుచున్న
చెలగి తాంబూలంబు సేయుచున్న
చతురత నళిదంబు జళిపించుచున్న
హొయలుగ పురవీధి కరుగుచున్న
కమ్మ పూబంతులాఘ్రాణించుచున్న
సుముఖుడై అద్దంబు చూచుచున్న
గానంబు విని సొక్కి మానితంబుగనున్న
ముద్దు కొమరుండు తొడలపై మురియుచున్న
విభున కావేళ చెప్పంగ వచ్చు మనవి.

అంటే సమయాసమయముల గుర్తెరిగి దైనందిన జీవితము మానవులు ఎట్లు సక్రమమొనర్చు కొనవలయునో తెల్పారు సిద్దేంద్రులు

విప్రలంబ శ్రుంగారమును హావభావములలో అభినయ సర్వస్వన్ని చొప్పించి భామ పాత్రను భావ భార భాసురంగా తీర్చిదిద్దిన కళా స్రష్టలెందరో, వారిలో భావ పురుషుడు- అభినయ నిర్దేశకుడు నిన్నటి శ్రీ పసుమర్తి కౄష్ణమూర్తి గారు, తెలుగు విశ్వవిద్యాలయ నృత్యోత్సవములకు విచ్చేసినపుడు హైదరాబాదులో కలుసుకొన్నపుడు, ప్రసంగవశాన భామాకలాపంలో విప్రలంబ శృంగార ప్రసక్తి రాగా వారు అభినయించిన తీరులో వారి విద్యావిభవము విశేషములు వీక్షించినపుడు కలిగిన అనుభూతులు.

విరహోత్కఠితగా కృష్ణమూర్తిగారు, వారు చూపిన తడబాటులో పదపద్మములు - వీడిన కొప్పు-అదరిన పెదవిని-పిక్కిటిలిన రవికను-జారిన పైటను-చెదరిన నడుము-అదరిన గుబ్బలను కనదర్చే క్రమము-తాళని మోహముతో నిలువని దేహముతో పతి వియోగావస్థ అభినయించు తీరులో, స్త్రీలకు సహజమైన అంగజ స్వభావములను గాంచనగును. నాటి నుండి నేటి వరకు భామ పాత్రధారులు ఉద్భవించుట సిద్దేంద్ర వర ప్రసాదము. అట్టివారిలో డాక్టర్ పద్మశ్రీ వేదాంత సత్యనారాయణ శర్మగారు గణనీయులు. అష్టవిధనాయికా విరహ వేదనలను అతివలాశ్చర్యమొంద, ఆడి చూపించి ఒద్దికా ఒయ్యారములొలుక బోసి సరస నాయిక సత్యభామదే లీలా మానసు కృష్ణుని పగ్గాల బంధించిన దిట్తరాలై విభావ-అనుభావ-సాత్విక సంచారీల నొప్పించి సత్య రాగ ద్వేషానికి, బొమ్మ బొరుసులు చూపించి అహంకారానికి నాజూకు అలంకరణ జేయించి, పురాణాల ముక్కుమీద, పెద్దల మెదళ్ళ మీద గుద్దిన మేటి అనాటి వెంపటి వెంకట నారాయణ గారు - భాగవతుల విస్సయ్యగారు - భాగవతుల సుబ్రహ్మణ్యం గారు - భాగవతుల లక్ష్మీ నరసిం హం గారు -భాగవతుల రాజేశ్వర శర్మ గారు - వేదాంతం రాఘవయ్య గారు - వేదాంతం జగన్నాధ శర్మ గారు, నేటి పెద్దలలో భామ పాత్రధారి పద్మశ్రీ వేదాంతం సత్యనారయణ శర్మగారు.

పతి వియోగావస్థను పలురకాల అనుభవించిన సత్యపై దయగలవదై వెదవిల్తుడోయన రాజగోపాలుడరుదెంచును. వెంటనే సత్యభామ ఖండిత నాయికయై, నాయక వంశ దూషణ మొనర్చి "లేమలందరూ చూడ నిను జడతో కొట్టుకుంటే భామనా సత్యభామనా యంటుంది".

శృంగార రసమున వియోగ సం యోగములు పోషించుటలో సిద్దేంద్రులు అద్వితీయమయిన భావనా పటిమ చూపియున్నారు. స్వామి వద్దకు రాయబారమై వెళ్ళియున్న మాధవి రాకలో జాగుదోచగనే ఆమె అంగరేఖలు జూచి దూతిక నాయిక యైనదని భ్రమయించును, నాయిక విప్రలబ్ధగా మారును.

ఇటీవల కాలంలో కూచిపూడి క్షేత్రంలో సిద్దేంద్ర విగ్రహ స్థాపనతో తెలుగు విశ్వవిద్యాలయంవారి సిద్దేంద్ర పీఠం నెలకొల్ప బడియున్నది.

సిద్దేంద్ర విగ్రహాన్ని పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యంగారు, పద్మశ్రీ వేదాంతం సత్యనార్యణ శర్మగారలు సంకల్పించి యువతరం అంతా స్వామి అనుగ్రహమునకు పాత్రులగుటకు గురువులుగా దోహదం చేస్తున్నరు.

వెంపటి చినసత్యం కూచిపూడి ఆర్ట్ అకాడమి మరియు అఖిల భారత కూచిపూడి సంస్థ వారు సం యుక్తంగా అరువది సంవత్సరాలుగా జరుగు సిద్దేంద్ర యోగి వర్యుల ఉత్సవాలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో నిర్వహిస్తూ భావితారానికి మార్గదర్శకులై నిలచియున్నారు. యువ నర్తకీ నర్తకులంతా కూచిపూడి క్షేత్రానికి ఉత్సవ సమయములలో పాల్గొని సిద్దేంద్రుని ఆశీస్సులు పొందాలని ఆశిస్తున్నాం.

శ్రీ భాగవతుల లక్ష్మీ నరసిం హం గారు ప్రఖ్యాతి చెందిన కూచిపూడి నాట్యాచార్యుల వంశానికి చెందినవారు. వంశపారంపర్యంగా సంక్రమించిన నాట్యకళను ఉగ్గుపాలతోనే క్షుణ్ణంగా అభ్యసించారు. కూచిపూడి వేదాంతపర కలాపమయిన "గొల్లకలాపం" గ్రంధకర్తలు ప్రక్యాత "శ్రీ భాగవతుల రామయ్య శాస్త్రిగారి మునిమనమలు. కూచిపూడి సాంప్రదాయమయిన నాట్యకళా ప్రభావ, ప్రాభవాల గురించి శాస్త్ర రీత్యా వీరు వ్రాసిన అనేక వ్యాసాలు ప్రముఖుల ప్రశంసలనందుకున్నాయి. "నాట్యకళా""గానకళా" మొదలయిన వాటిలో సంగీతం మరియు నృత్యం మీద ఈయన రచించిన ఎన్నో వ్యాసాలు ప్రచిరించబడ్డాయి. హైదరాబాదు ఐ.డి.పి.ఎల్. లో డెప్యుటి మానేజెర్ గా పని చేసి రిటైర్ అయ్యారు. తెలుగు విశ్వవిద్యాలయము నాట్యశాఖలో ఎక్జామినర్ గా, గెస్ట్ ఫాకల్టి గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతము కార్నింగ్, న్యుయార్క్ లో ఉంటున్న వీరి అబ్బాయి శాస్త్రి గారిని చూడడానికి వచ్చినపుడు ఈ వ్యాసాన్ని నటరంజని శీర్షికకు వ్రాసి ఇచ్చారు.

వీరు ప్రఖ్యాత మార్ధంగికాగ్రేసర డాక్టర్ శ్రీలంక వేంకట రాజుగారి ప్రియతమ శిష్యులు. వీరు మృదంగము మరియు ఘటము వాయిద్యములలో ప్రవీణులు.

పద్మభూషణ్ శ్రీవెంపటి చినసత్యంగారి కూచిపూడి ఆర్ట్ అకాడమిలో లయ వాయిద్య సహకారాన్ని అందించి, వారితో ఉన్న 25 సంవత్సరాల కళా బంధుత్వమే కాక వారితో పాటు వివిధ దేశాలు పర్యటించి కళాసేవ జేసియున్నారు. అందులో భాగంగా 1986లో అమెరికాలో జరిగిన "ఫెస్టివల్ ఆఫ్ ఇండియా" ప్రదర్శనలలో, మలేసియా, సింగపూరులలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొన్నారు.

ఎంతో మంది సంగీత విద్వాంసులకు వాద్య సహకారం అందించారు. ప్రస్తుతము హైదరాబాదులో నివాసం ఉంటూ కళాసేవ చేస్తున్నారు.