మహా భావం - మహా మంత్రం

-- ప్రఖ్య మధు బాబు

సాగరానికి అలలు లెక్కిస్తామా? హిమాలయాలమీద రాళ్ళు ఇన్నని వర్ణిస్తామా? ఎలా రాసేది ఏ భావం ఎలా కలిగితే ఆ శక్తి వరమిస్తుందని? ఏ మంత్రం ఏ భాషలో ఎలా మనోవల్మీకంలో రంగరిస్తే ఆ శక్తి కరుణిస్తుందని? అన్ని భావాలూ, అ భావాలకి మూలమైన అనుభూతులు, అనుభూతికి మూలమైన సంఘటనలు, సంఘటనలకి మూలమైన కాలం, వ్యోమం అన్నీ - ఇవన్నీ తానే అయినప్పుడు! ఆ శక్తిని తలిస్తే శబ్దమే నిశ్శబ్దమౌతుంది, స్తబ్దమౌతుంది.

నల్లని కన్నులు, నల్లని కేశములు, అఖండ మహాజ్యోతిలా అలరారే రూపం, జగత్ ప్రళయాలని కావించినా ఆగని సంద్రంలా, ఆ తల్లి కళ్ళలో ప్రేమాశ్రువులు. మానవాళిలో పాశవికతలా మళ్ళీ మళ్ళీ జన్మించే ప్రతి రక్తబీజున్ని సంహరించినా తరగని, ఆరని ఆవేశంలా ప్రజ్వరిల్లే ఆ తల్లికి, సృష్టి అమావాస్యలో - జీవన గాడాంధకారంలో కనిపించే కోట్లాది ఆశలుగా, ఆకాశమంతా తారలుగా, మళ్ళీ వచ్చే సూర్యోదయంలాగా ఆవిర్భవించే ఆ తల్లికి, ఆలోచనాతీత - మానవాతీత శక్తికి, సర్వంతర్యామి అయిన ఆ దివ్య వ్యక్తికి నమస్సులు.

ఇది చాలా కాలం నాటి వ్యధ. నిజంగా జరిగిన ఒక నిరుపేదరాలు కధ. సాక్షాత్తూ ఆది శంకరాచార్యులే 'భిక్షాం దేహి ' అని వాకిట నిలుచుంటే ఆ ఇల్లాలు ఏమి ఇవ్వగలదు? ఆ ఇంటిలో పంచభక్ష్య పరమాన్నాల మాట దేముడెరుగు, పూట పూట పస్తులున్న కటిక దారిద్ర్యపు దైన్యత తప్ప ఏమీలేదు. నీళ్ళూ, కన్నీళ్ళు తప్ప ఇవ్వడానికేమున్నాయి? తన నోట 'లేదు ' అనిచెప్పే సంస్కారమూ కాదు ఆ తల్లిది. అప్పుడప్పుడు అనిపిస్తుంది, ప్రకృతిలో అవేదన అనేది ఒక్కో సారి ఎంత నిశ్శబ్దంగా, నర్మగర్భితంగా వుంటుందీ అని. ఈ దృగ్యంత్రాలకి, మైకుల్లో మంత్రాలకి అతీతంగా మనోగీతంగా వుండే ఆ మౌనంలోంచి మునులు జన్మిస్తారుట. అబద్దంకన్నా మంచిది నిశ్శబ్దం, వేయి అర్ధాల సముదాయం నిశ్శబ్దం, చెపితే నువ్వొకమాటే చెప్పగలవు, మౌనంగా శతసహస్ర శరపరంపరలు పంపగలవు. ఆ ఇల్లాలు ఇల్లంతా వెతికితే చివరికి ఒక్క 'ఉసిరి ' కాయ దొరికింది. దాన్ని ఆ మహానుభావునికి భిక్షగా ఇచ్చింది. ఆ ఇల్లాలి దైన్యతకి, దారిద్ర్యమేగాని భావ దారిద్ర్యం లేని ఆ దాననిరతికి శంకరుల మనసు ఆవేదనా పూరితమైంది, ఆశువుగా 'కనకధారాస్తోత్రం 'గా ప్రవహించింది. బంగారు ఉసిరికాయల వర్షం కురిసింది ఆ మహాతల్లి ఇంట్లో. మంచి భావంతో ఆ అమ్మ శంకరులను మెప్పిస్తే, అందరికి మంచి జరగాలి అనే నిస్వార్ధ చింతనతో శంకరులు అమ్మవారిని మెప్పించారు. కవితాకనకధారనీ, కనకధారనీ కురిపించారు.

మహా మంత్రసిద్ధుడవడానికి కావలసిన అర్హత 'మానవత్వం '. సంస్కృతి, సంస్కారం మానవజన్మకి వరాలు వాటితో మంచి సంకల్పం తోడయితే దేవతలు సైతం కదలిరాగలరు. కుచేలుని కధలో ఆయన చేసిన సాధన ఏమిటి? ఏకలవ్యుని పూజ ఏమిటి? ప్రహ్లాదునికి నేర్పిన విద్య ఏది? చైతన్య మహా ప్రభువును భావ ప్రపంచంలో అగ్రగన్యుడైన భక్తునిగా కీర్తిస్తారు. కేవలం భావంతో, దేవతాతత్వంతో తాదాత్మ్యమైన దివ్యపురుషులకు మంత్రం వేరే అక్కర్లేదు. 'స్వయమేవ నాయికారూపం విధాయ సమారాధన తత్పరో భూత్ ' అన్నట్లు స్వయంగా కృష్ణుడే రాధాదేవి గా అవతరించాడట, ఆరాధించడానికి, ప్రేమించడానికి. ప్రేమ తత్వం ఒక పవిత్ర సాధనగా ఈనాటికి బృందావనంలో మనకి కనిపిస్తుంది. అందరూ ఒకరినొకరు అక్కడ "రాధే రాధే " అని సంబోధించుకుంటారు. నారదుడు, ధ్రువుడు, మొదలుకొని ఎందరో మహాత్ములు అక్కడ, బృందావనంలో భావ ధ్యానాన్ని చేశారు చేస్తున్నారు. మన తెలుగువారైన కీ|| శే|| శ్రీ నాన్న గారు (రాధికా ప్రసాద్ మహరాజ్) బృందావనంలో నూరు సంవత్సరాల పైదాకా వుండి సాధనా మార్గాన్ని బోధించారు. కారణ, స్థూల, సూక్ష్మ దేహాలే కాక భావ దేహం కూడా వుంటుందని దానితో సాధన చేసి దాని ఫలితాలని మామూలు దేహం పొందవచ్చని చూపించారు.

ఇక ఈ క్రింది వనదుర్గా మంత్రంలో వున్న చిత్రమైన భావాన్ని చూడండి. ఇది ఎందరో ఉపాసకులకు కల్పతరువు, శక్తినెలవు.

"హ్రీం దుం దుర్గాయై ఉత్తిష్ఠ పురుషి, కిం స్వపిషి, భయం మే సముపస్థితం యది శక్యమశక్యంవా తన్మే భగవతి శమయ శమయ స్వాహా"

దీని అర్ధం చిత్రంగానూ, అమ్మవారితో చనువు గానూ వుంటుంది. దీని అంతరార్ధం ఏంటో గమనిద్దాం.

"ఓ దుర్గా లేమ్మా, ఇంకా పడుకునే వున్నవా? కలలు కంటున్నావా? ఇక్కడ నేను భయంతో వున్నాను, అది సాధ్యమయ్యేదైనా, కాకున్నా నువ్వు వెంటనే దాన్ని ఉపశమింప చేసేసెయ్యి" అని అనడంలో వినయం కన్నా ఒక పిల్లవాడికి తల్లిదగ్గర వుండే చనువు కనిపిస్తుంది. ఇంతేకాక కొందరు సాధకులు కేవలం భావం ద్వారా, నామ జపాన్ని చేసి సిద్ధి ని సాధిస్తారు. వాల్మీకి కేవలం 'మరా మరా మరా ' అంటూ రామ నామాన్ని జపం చేసి సిద్ధిని పొందాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కొందరు సాధకులు మంత్రాలని వ్యతిరేకదిశలో సాధన చేసి సిద్ధిని పొందుతారు. వాటినే విలోమ మంత్రాలు అంటారు. వీటిలో విలోమ గాయత్రి మంత్రం ప్రఖ్యాతి గాంచింది. ఈ ఉపాసకులు గాయత్రి మంత్ర అక్షరాలను వ్యతిరేక దిశలో రాసి సాధన చేస్తారుట, దీనిమూలంగా ఆ మంత్రం వల్ల జనించే శక్తి, బయటకు పోకుండా ఆ సాధకునిలో ప్రవేశిస్తుంది అని వీరు నమ్ముతారు.

బౌద్ధ మతంలో గాయత్రి మంత్రం లానే ఒక మంచి మంత్రం ఉపాసిస్తారు. అది ఏమిటంటే...." ఓం మణిపద్మే హుం " అని. ఆ మార్గంలో సాధకులంతా దీన్ని తీవ్రంగా సాధన చేస్తారు. భగవద్రూపుడైన బుద్ధుడిని పద్మమందు వెలిగే మణిగా ధ్యానంచేయడం పైకి కనిపించే అర్ధమైతే, యోగి దేహంలో వున్న చక్రాలు లేక బహుదళ పద్మాలలో వున్న కుండలినిని ప్రచోదనం చేయగల దివ్య శక్తిగా బుద్ధుడిని ఉపాసించడం ఇంకో లక్ష్యం. దీనికి కౌళికమైన అర్ధాలను కూడా కొందరు యోగులు చెప్పారు. ఈ సందర్భంలో తప్పకుండా ప్రస్తావించ వలసిన దేవత 'తారా దేవి '. తారను బౌద్ధులు చాలా ఉపాసిస్తారు. ఈమె రామాయణంలో తార కానీ, బృహస్పతి భార్య తార కానీ కాదు. ఈమె నీలసరస్వతి గా, వ్యోమ సరస్వతి గా, అంతరిక్ష సరస్వతి గా కీర్తించబడిన అతీంద్రియ జ్ణాన శక్తి. 'తారిణి దుర్గ సంసార సాగరస్యాచలోద్భవే ' అని దుర్గని వేడుకున్నాం, అలాగే తారకూడా తరింప చేయునది కనుక తార అని పిలవ బడింది. రామకృష్ణ పరమహంస 'భవతారిణి ' అనే పేరున వున్న కాళిని ఉపాసించారని చెపుతారు. ఈమె ప్రసాదించే వాక్ శక్తి అపారం, అపురూపం. నాయనగా ప్రసిద్ధికెక్కిన శ్రీ కావ్యకంఠ వాసిష్థ గణపతి ముని ఒకసారి ఆశువుగా పద్యాలుచెపుతుంటే ఒకచోట కొంచెం సంశయించారుట. అపుడు వేదిక మీద వున్న కవులు (బెంగాల్లో) 'తారను ఉపాసించలేదా ?' అని ప్రశ్నించారుట. అంతవరకు తారను గురించి ఎరుగని నాయన ఆ మంత్రాన్ని ఉపాసించారని అనర్గళ ఆశుధారా కవితా పటిమని సాధించారని చరిత్ర చెపుతోంది, వారి కుటుంబ సభ్యులు కూడా అది నిజమేనని చెపుతున్నారు. ఆశ్చర్యమేమంటే జగత్ విఖ్యాతి గాంచిన అనేక గురువుల వెనుక మనకు తెలిసిన, మనకు తెలియని దివ్య శక్తులు, దేవతలు, ఉపాసనలు, వాటికి తోడైన అపారమైన నమ్మకం, ధ్యానం వున్నట్లు కనిపిస్తోంది. ఇంతకీ తారా మంత్రానికి సన్స్కృత భాషలోనూ, పాళిభాషలో మంత్రాలున్నాయి. అవి ఏవిటంటే

సంస్కృతం: "ఓం హ్రీం త్రీం హూం ఫట్ " (తారా పంచాక్షరి మంత్రం)
పాళి: "ఓం తారే తుతారే తోరే స్వాహా " (దీనికి వేరే రూపాంతరాలు కూడా వున్నాయి)

చాలమందికి ఒక అనుమానం రావచ్చు. ఇలా మంత్రాలు రాయ వచ్చునా అని, వీటిని చదివి సాధన చేయవచ్చునా అని. గతంలో ఈ ప్రక్రియల గురించి ప్రస్తావించడం జరిగింది. సద్గురువులు, కులగురువుల అనుమతి లేక మార్గదర్శకత్వంతో ఇవి చేయడం మంచిది, సర్వ శ్రేష్టం. ఇక నమ్మకం, ఆత్మ విశ్వాసం, ఆసక్తి వున్నవారు మేరు తంత్రం, మంత్ర మహో దధిలో ప్రస్తావించిన రీతులలో ఇష్ట దైవం ముందు ఈ మంత్రాలనుంచి, పూజించి, ఆ దేవతనే గురువుగా భావించి సాధన చేసి అనుగ్రహాన్ని పొందవచ్చు అని శాస్త్రాలు చెపుతున్నాయి.

అయితే అన్ని మంత్రాలలోనూ బీజాక్షరాలు వుండాలని కూడా నియమం లేదు. ఇందుకు ఉదాహరణ పాము మంత్రాలు, తేలు మంత్రాలు, దిష్టి మంత్రాలు. పురాతన గ్రంధాలలో దొరికిన ఒక పాము మంత్రం - " ...నరసయ్య ఆన, మహా వీర గరుడ సమస్త సర్ప నివారణా దుష్ట సర్ప బంధనం కురు కురు ... " ఇలా వుంది.

మన ఊళ్ళలో దిష్టి మంత్రాలు, పాము మంత్రాలు ఎన్నో అనుభవాలు విని చూసి వుంటాం. గ్రామాలలో మంత్రాలు వేసే పీరు సాయెబ్ మంత్రాలు, ఇంక కొన్ని మంత్రాలు సేకరించి చూస్తే వాటిలో వున్న పరమత సహనం వింతగానూ, చాల అనందంగా అనిపించింది. ఈ అసలుసిసలైన మంత్రాన్ని చూడండి. చేవ్రాతతో వున్న ఈ పురాతన గ్రంధంలోంచి వ్రాయటం చేత తప్పులుండవచ్చు. వీటిలో మంత్ర శక్తికన్న ఆసక్తికరమైన విషయాలున్నాయి. ఈ మంత్రం పేరు 'శాబర జడ బంధనం '. యధాతధంగా ఇక్కడ:

" బిసిమిల్లా రహిమాన్ రహీ అంజనీ పుత్రా ఆ పుత్రా ఆరం జ్యోతి దుక్ కట్టా వీరభద్రునీ కడుదును వురికే భూతాన్ని వురకకుండా కడుదును కూర్చున్న భూతాన్ని కూర్చోకుండా కడుదును నుంచున్న భూతాన్ని నించో కుండా కడుదును జడ బంధిస్తును జడలో వున్న భూతాన్ని కదలకుండా బంధిస్తును జడదిగకుండా బంధిస్తును కట్టురా వీరహనుమంతా కట్ట కుంటే నీ తండ్రి వాయదేవుని తోడు నీ తల్లి అంజనీ దేవి పాదముల తోడు కట్ట కుంటు వాయల కొండ సన్యాసి పాదముల తోడు ఇది తప్పితివా కాశీలో .....రా లంబాడీ వీరహనుమంతా హుం ఫటు స్వాహా "

చిత్రంగా లేదూ? అయితే ఈ మంత్రాలు ఎలా పనిచేస్తాయి? గ్రహాలకి మంత్రాలకి సంబంధం ఏమిటి? జపాలు చేయిస్తే దోషాలు పోతాయా? జాతకాన్ని బట్టి ఏ మంత్రాలు త్వరగా సిద్ధిస్తాయో చూడ వచ్చునా? స్వప్న మంత్రాలు అంటే ఏమిటి? కర్మ స్థిరమైతే మరి సాధన దాన్ని మారుస్తుందా? పునర్జన్మలున్నయా? ఇవన్నీ వచ్చే సంచికలలో చూద్దాం!

శ్రీ గురుభ్యో నమః