మహానగరపు నీడలలో...

-- శైలజామిత్ర


మహానగరపు నీడలలో కక్షల కొండచిలువలు

పట్టపగలే పచ్చిమాంసంతో కడుపు నింపుకుంటున్నాయి

సమాజపు సమాధులపై మత్తుగా నిద్రించే

మానవ మృగాలు నెత్తుటితో స్నానించి

కూర్చున్న కొమ్మనే తెగనరుక్కుంటున్నాయి

ఎసిగదులు, పట్టుపరుపులకు అలవాటుపడి

ఆధునిక వేదికపై అత్యాశను తోడుగా తెచ్చుకుని

నడివీధిలో రాక్షసనృత్యం చేస్తున్నాయి

ఒకవైపు నిలువ నీడలేక ఒక వారగా

ఒదిగి కూర్చుంటున్న పేదరికం

మరోవైపు ఊపిరాడని బూరుగుదూదిపై

చలికాచుకుంటున్న డాంభీకం

అమానుషంగా అమాయకులపై పోరాడుతున్నాయి.

వర్తమాన శిరస్సులో భవిష్యత్తుతో పనిలేక

పాతకాన్ని మాత్రమే ఆశ్రయించాల్సిన

పాతకులు పరిపాలిస్తున్న

పాపభూయిష్ట నేల ఇది.

పుట్టిన ప్రతి బిడ్డకు రక్తపు రంగు, రుచి

పరిచయం చేయాల్సిన రోజులివి.

ఇపుడు బ్యాంకుల్లో దాచాల్సింది డబ్బుకాదు.

కాస్త మనశ్శాంతి...

మనిషికి కావల్సింది తిండి కాదు

మనసారా పలకరించే విశ్రాంతి...

చెదిరిన జీవితాల జాడలలోంచి అస్పష్టంగా

వినబడే ఆక్రందనలు

పైశాచిక వస్త్రాలను కప్పుకుని

దిష్టిబొమ్మను దగ్ధం చేయటమే పనిగా

బతుకు దారిలో పొందుతున్న స్వాంతనం

నేటి రాజకీయం.

ఒకే కాన్వాసుపై రెండు కుంచెలతో

పిచ్చిగీతలు గీస్తూ అదే ఆధునిక చిత్రంగా చూసి

ఆనందించడం నేటి యువతరం.

ఆశ, అత్యాశల మధ్య పోరాడుతూ

రెంటికీ చెడ్డ రేవడిలా

ఎండమావులనే పండగ చేసుకుంటూ

మధ్యతరగతి మందహాసం...

ఒకవైపు దేశ సరిహద్దులలో

శతృవులపై శతఘ్నులు పేలుస్తుంటే

మరోవైపు తనవారి రూపమేదో తెలియక

రక్తపు ముద్దల్ని వాటేసుకుంటూ

విధిచేస్తున్న వింతలు చరిత్ర పుటల్ని

నింపుతున్నాయి.

అందుకే అనిపిస్తుంది

ఏ మిట్ట మధ్యాహ్నం వేళో ఎండైనా నిలబడి

శాంతి పావురాల జాడ కోసం

వెదికీ వెదికీ

ఇక ప్రయోజనం లేదని గ్రహించుకున్నాక

ఏ రక్తపాతమూ జరగని చోటును గ్రహించి

నవ్వుతూ ఉరిపోసుకోవాలని...