కృష్ణ శాస్త్రి కావ్యరస శివా(శివానీ) ఆనందలహరి

శంకరాచార్య సౌందర్య లహరుల నునుజల్లులు.

పరిశోధనాత్మక వ్యాసం: మూడవ భాగం

-- సుమతి

కాళిదాసు శ్యామలాదేవిని వర్ణిస్తూ

"మాణిక్య వీణాముపలాలయంతీం
మదాలసాం మంజుల వాగ్విలాసాం
మాహెంద్ర నీలద్యుతి కోమలాంగీం
మాతంగ కన్యాం మనసాస్మరామి."అని ప్రార్థిస్తాడు. శ్యామలాదేవి మానిక్యవీణను ఉపలాలన చేసే(బుజ్జగించే, లాలించే) పరవశం కలిగించు వాగ్వైఖరి కలదిగా వర్ణించాడు. మనం చెప్పుకొన్న శ్లోకాలలో ఈ విషయాన్నే మరో విధంగా చెప్పబడిందనుకుంటాను. ఐనా ఆ మాణిక్య వీణ వైనం ఏమిటో కూడా చూద్దాం. సౌందర్యలహరి 64 వ శ్లోకంలో

"ఆవిశాత్రం ప్రత్యుర్గుణ కధా ......
...........................
సర్స్వత్యా మూర్తి: పరిణమతి మాణిక్యవపుషా."
అమ్మా సాధ్వీమణి నీ ప్రియాతి ప్రియ వల్లభుని కథనం తనివితీరక ఆవిరామంగా సంస్మరిస్తూ సంకీర్తనాగాన జపం భక్తితో చేస్తుంటావు. అందువల్ల నాదోచ్యారణారాపిడికి గులాబి వర్ణం కలిగిన నీ సుతిమెత్తని నాలుక ఎర్రనై దాసాని పువ్వులాగా వుందమ్మా! నీ రసనాగ్రాన సరస్వతి వసిస్తుందంటారు. ఆమె స్పటికంలా స్వచ్చమైన శ్వేతవర్ణంతో, శ్వేతామరాలతో, శ్వేత పుష్పంతో, శ్వేతవాహానంతో విరాజిల్లుతుంది. కాని నీ సాంగత్యం వల్ల ఆమె హృద్యం రాగ రంజితమై దేహం అరుణ వర్ణంతో మాణిక్య మూర్తిగా పరిణమిచిందేమో తల్లి!

ఇక్కడ శంకరాచార్యుడు సరస్వతి శివాని నాలుక అగ్రమున వసించడం వల్ల ఆ నాలుక రక్తిమ వల్ల ఆమె శుక్లవర్ణశరీరము మాణిక్యరూపమోనందినది దని ఈ శ్లోకంలో వర్ణించాడు. దీనిని తరిచి చూస్తే దేవి రసనగ్రమున నర్తనమాడేది సరస్వతి యోక్క మోగన మంజుల వాగ్విలాసవే కాని సరస్వతి కాదు. ఆది వాణి కరస్థవీణ మాణిక్యవిణ. అందువల్ల ఈ శ్లోకం కాళిదాసు సూక్తిని - (మాణిక్యవీణాముపలాలయంటీం)ని వివరిస్తుంది. శంకరాచార్యుని పైన పేర్కోనిన 64 మరియు 66వ శ్లోకాల ద్వారా ఆ వర్ణని సరస్వతీదేవి మాతృకా వర్ణరూపాన్ని, ప్రణవరూపాన్ని ఈ విధంగా స్మరించుకున్నాం.

దేవి గళస్థవాణియే మాణిక్యవీణ అని అది నినదించడం ఆమే చేతిలోనే ఉంది అని మనకు తేలింది. ఆ మాణిక్యవీణ ఒక్క వాణీ వద్దనే ఉందనుకోవడం పోరపాటు. ఆ మాణిక్య వీణ ఆ మాత శిశువులమైన మన అందరిలోను వుంది. వివిధ నామాలు కలిగిన వీణా తంత్రుల వంటి నాడులతో కూడిన నాడీ మండలమున్న మన వెన్నెముక భాగాన్ని వీణాదండమని పిలుస్తారు. కాబట్టి మన దేహమే వీణ, చైతన్యమే నాదం. అందుకే కబీర్ మన శరీరం ఒక తంబూరగా చెప్పాడు. అయితే యీ దేహవీణ పలికించేది ఆ తల్లియే! అందుకే కృష్ణశాస్త్రి అమృతవీణగేయ కావ్యంలో 58వ గేయంలో

"నా నోట నీ మాట గానమయ్యే వేళ
నాగుండె నీ వుండి మ్రోగింపవా వీణ?
రాగ మెరుగని వీణ, రక్తివెరుగని వీణ
తీగపై నీ చేయి తీయకే గడియేని!

అంతరరాంతరము నీ అమృత వీణేయైన
మాట కీర్తన మౌను, మనికి నర్తన మౌను!
ఈ అనంత పథాన ఏ చోటికా చోటు
నీ ఆలయమ్మౌను, నీ ఓలగ మ్మౌను!"

అని చెప్పడు, మన హృదయాలను భగవతీ లేదా భగవంతుని చేతిలోని అమృతవీణలని లేదా మాణిక్యవీణలనే పవిత్రభావనతో మనం కార్యాచరణచేస్తే మన వాక్కు దైవకీర్తనే అవుతుంది. మన జీవితం ఆనంద నర్తనమౌతుంది. ఈ విశాల విశ్వంలో కాలిడిన ప్రతిచోటు ఒక దేవ సభయే, దేవాలయమే అవుతుందంటాడూ.

అంతేకాదు మన జీవన మహాయాత్ర హాయిగా చల్లగా సాగి పోతుందంటాడు. మనలో ఈ సద్భావనా సువాసనలు కలుగాలంటే మనం ధ్యానం చేస్తేనే సంభవమవుతుంది. ధ్యానం ద్వార మన జ్ఞాన చక్షువు తెరువబడి మన ఆత్మ తత్వం, పరమాత్మ తత్వం విశ్వతత్వం బోధ పడ్తుంది. అందువల్లనే ధ్యానం ద్వారా అంతర్ముఖుడైన కృష్ణశాస్త్రిగారు అమృతవీణ 45వ గేయం "మహతి"

"ఎటులనే చీ లీల కీర్తింతు! ...............
.........................................
కోటి సూర్యుల కాంతిలొ, ఆ
రాట మెరుగని శాంతిలో
మాటి మాటికి మసలి మను ఆ
మహతినా! భారతీ సతినా!

ఈ గేయంలో కవి తన హృదయ రాణియే వాణి అనగలిగారు. తన హృదయంలో ఉన్నది గొప్పదైన మహతీ పేరుగల విశ్వవీణ. అది నారద వీణయో, శారద వీణయో లేదా విశ్వమయుని వీణయో కావచ్చును. ఏ వీణయైతేనేమి అది అమృత హృదయుని వీణ,

అమృత వీణ మహతిలో 59 వ గేయం పేజీ 72, 73, 74

"నా కేల (నాచేతిలో) ఒక జోలే,
నాలో అమృత వీణ
ఉంచీ నను లెమ్మందునా!
దేవ
ఊరకే పొమ్మందువా!
నాలుగూ దిక్కులా
నడిమి స్వర్గమ్ములో
ప్రతి యింటి మోసాల
(మోగసాల ప్రాంగణం) ఆగనా!
దేవ
ప్రతిగుండె మోసాల మ్రోగనా!
. . . . . . . . . . . .
నాలుగూ దిక్కులా
నడిమి స్వర్గమ్మంత
గంధర్వ సీమగా చేయనా!
దేవ
గాన సౌధమ్ముగా చేయనా!
....................
ప్రతిగుండె
నొరసి యొరసి తరలనా!
నాలుగు దిక్కులా
నడిమి స్వర్గమ్మత

పూల పందిరి చేయనా! దేవ
బృందావనం చేయనా!
.....................
నాలుగు దిక్కులా
నడిమి స్వర్గమ్మత
పాలకడలిగ చేయనా! దేవ
పండు పున్నమి చేయనా!

తలపు తలపూ జ్యోతి,
పలుకు పలుకూ గీతి,
పనులన్ని ప్రణయముగా (ప్రణనము, ప్రేమ) చేయనా!
దేవా
ప్రతి గుండె నీ గాధ పోయనా! "


అంటూ విశ్వప్రేమ కురిపించాడు, తన హృదయ వీశ్వవీణ మధుర నిక్వాణ నాదంతో.

పల్లకిలోని, స్నేహ క్షీరము

"చిన నాటి భవవల్లిని పూచినది, వాడ
నిది, వాసనల వీడనిది ............
.....................................
....నాలోని స్నేహ క్షీర
మొక్కింత ఒక్కింత ఒలకబోసి,
..........................
విధురప్రియశ్రవోవీధుల మంగళ
స్వాదు వాక్యమ్ము నూదగలను
నిలుపగాగలను మాణిక్యదీపావళి
అంధ మనో మందిరాంతరముల!
కర్కశ హృదయజౌగలముల శితల
స్నేహదుగ్ధమ్ము వర్షింపగలను;
విరచింపగలను విద్వేషవైతరణికి
అడ్డుగా గాఢ సౌహార్ద సేతు;
విటనేనిలిచి, సమస్త దిక్తటుల పిలిచి,
సారె సారె జీవత్సరస్వతిని మలచి,
కవిని నేనై పురాణ వైణవికునట్లు
ఊహలున్న, జగమ్మంత స్నేహమున్న!"

కవి తాను "ఇటనేనిలిచి, సమస్త దిక్తటుల పిలచి, సారె సారె జీవత్సరస్వతిని మలచి" అంటాడు. ప్రతిభావంతుడై ఆ కవి జీవసరస్వతి క్రొత్త క్రొత్త రూపుతో నిత్య నూతనురాలుగా రూపోదించాడు. ఆ పురాణ వైణనికుడు ఆశించినట్లుగా మన హృదయాన్ని విశ్వవీణగా మలుద్దాం.

శంకరాచార్యుడు సౌందర్యలహరిలో తన కవిత్వ పటిమకు ఆదికారణం 'ఏమిటొ వివరిస్తూ ఆ సారస్వత మూర్తి, శబ్ద బ్రహ్మమయీ, చరాచరమయి, జ్యొతిర్మయీ, వాఙ్మయి, నిత్యానందమయీ, నిరంజనమయీ, తత్వమయి, చిన్మయీని "తన స్తన్యం మన్యే ధరణిధరకన్యే...కమనీయ: కవయతా" 75వ శ్లోకంలో నుతించాడు. హృదయం నుండి పాల సముద్రం వలె భాషను పొంగిపొరలజేసే ఆ హిమగిరిసుత చనుబాలను త్రాగిన బాలుడగుటచే తాను ఇంపగు కవిత్వాన్ని చెప్పానన్నాడు. బ్రహజ్ఞానాన్ని, వేదాంతాన్ని ఎరిగిన పండితులే శంకర సాహిత్య అర్థం చేసుకోగల్గుతారు. కృష్నశాస్త్రి ముఖతః చెప్పలేదు. కాని ద్రవిడ బాలుడైన శంకరుడు తాగిన దుగ్ధాన్నే, ఈ ప్రౌఢ తెలుగు బాలుడు త్రాగాడని వెల్లడౌతుంది. బ్రహ్మ వేత్తలను, పండితులను ఉద్దేశించే శంకరుని కవిత్వం. కాని హృదయవాదియైన మనకవి సాహిత్య రచనలు పామరులను సామాన్యుల నుద్దేశించేవి. చిరతనుడైన మానవుని చిరంజీవిగా మలిచేవి. దేశకాలాదులతో నిమిత్తంలేని సార్యజనీన, నిరంతర సత్యాలు.

మఘవ మస్తక మకుట మాణిక్యరాజ్ఞి మొ||గా "దూర దూర నీహారతుంగ శృంగ మకుట మాణీక్యాలనుచేరువ చేసేవి. ధ్యానం ద్వారా, ఆత్మవలోకనం ద్వారా దైవసాన్నిధ్యాన్ని పొందగలిగే తరుణోపాయాన్ని బోధించేవి.

కృష్ణశాస్త్రి అమృత వీణ, పల్లకీ గేయాల ద్వారా మన హృదయాలను కరుణ, ప్రేమ, ఆర్ద్రతలనే గుణమాణిక్యాలు తాప బడిన, మాణిక్య వీణగా మలచుకొమ్మని ఉద్భోధిస్తాడు.

కవి ప్రబోధించినట్లుగా ఈ విశ్వాన్ని ప్రేమానురాగాలతో, శాంతి సౌహార్దాలతో , ఆనందంతో నింపి స్వర్గతుల్యం చేద్దాం. (సమాప్తం)

సుమతి గారు తెలుగు ఉపన్యాసకులుగా పనిచేసి పదవీ విరమణ చేసి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. రచనా వ్యాసంగం పట్ల ఆసక్తి ఉన్న ఈవిడ అనేక వ్యాసాలు వ్రాస్తూ సరికొత్త దృక్కోణాలను ఆవిష్కరిస్తున్నారు. భారతీయ సాహిత్యంలో పారమార్ధిక సంపద పైన విశేష రచనలు చేస్తున్నారు. కృష్ణశాస్త్రి గారి రచనలకు అభిమానిగా ఆయన రచనలోని శివాని ఆనందలహరులను మనకు పంచి ఇవ్వడం ఎంతో ముదావహం.