జీవనవాహిని

-- గంటి భానుమతి


మా ఊరి గోదావరికి శాంత గోదావరి అనిపేరు. చేతులు ఆకాశానికేసి చాపుతూ హృదయంలోకి చొచ్చుకుపోయి, మర్చిపోయిన చరిత్రని గుర్తుతెస్తున్నట్లుగా ఉండే చెట్లు, ఆకుల సంగీతాన్ని, కొమ్మల, కొబ్బరాకుల నృత్యాన్ని ప్రతి ఉదయం, ప్రతి నిశ్శబ్దరాత్రీ ఉత్సాహంగా కిందకి తొంగి చూసే నక్షత్రాలని చూస్తుంటే ఏదో ఓంకార మంత్రాన్ని, యింకా ఏదో ఉపదేశిస్తున్నట్లుగా అనిపించేది. అలాంటిది ఈ రోజున, హడావిడిగా, సుళ్ళు తిరిగిపోతూ, గడ్డిని, చెత్తని, కొబ్బరి డొలకల్ని, పశువుల మృతదేహాలని, చెట్ల కొమ్మల్ని, బట్టల్ని, దగ్గరకొచ్చిన ప్రతి వస్తువుని అక్కున చేర్చుకుంటూపల్లం వైపుగా సముద్రంలోకి కలసిపోవడానికి వడివడిగా వెళ్ళిపోతోంది మా ఊరి జీవ వాహిని.

భయంకరంగా ఉన్న నీటి ధ్వని, విలయతాండవం చేస్తున్న కొమ్మలు, కొబ్బరి ఆకులు, సగం సగం మునిగిన చెట్లు ఇళ్ళు అన్నీ కూడా జీవిత ప్రయాణాన్ని బోధిస్తోంది.

కుండపోత వర్షంలో తడుస్తుంటే ఇళ్ళన్నీ వెనకాల వదిలేసి ప్రాణాలు కాపాడుకోవడం కోసం హైస్కూళ్ళోకి వెళ్ళాం చిన్న చిన్న పడవల్లో.

జాగ్రత్తమ్మా! వట్టిమనిషివి కూడా కదు. మెల్లగా అడుగెయ్యి" అంటూ అమ్మ, సూరమ్మత్తయ్య నన్ను పట్టుకుని నడిపిస్తున్నారు.

ఓ క్లాసురూం లో బెంచి మీద కూర్చున్నాం అందరం.

ఏడుపులు, అరుపులు గట్టిగా వినిపిస్తున్నా, మాటలు , వర్షం శబ్డం అయినా ఏవీ నాచెవులకి వినపడడం లేదు. జనారణ్యంలో ఒంటరిని. ఆలోచనల ప్రవాహం, మునిగిపోతున్న జీవితం, భవిష్యత్తు మీద బెంగ, కడుపులో జీవి మీద బెంగ, --- అన్నింటికీ కారణం సురేంద్ర, అమెరికాలో ఉన్న నా భర్త సురేంద్ర.

"నీ పెళ్ళికి ఒక ఎకరం కొబ్బరి తోట ఇస్తామన్నారు మీవాళ్ళు. ఆ తోటని షికాగో తీసుకురావటానికి యూ.ఎస్. ప్రభుత్వం కస్టంస్ ఒప్పుకోవు కాబట్టి, దాన్ని అమ్మి డబ్బు తీసుకురా. ఏం, ఏమంటావ్?"

ఏమంటాను?

మూడో సంవత్సరం ఇంజనీరింగు చదువుతున్న పెద్ద తమ్ముడు, కోచింగ్ కోసం రాజమండ్రిలో ఉండి ఇంటర్ చదువుతున్న రెండో తమ్ముడు కళ్ళముందు కనిపిస్తుంటే ఎకరం పొలం మసకబారింది.

"ఒకవేళ నేను పొలం అమ్మి డబ్బులు తేలేకపోతే?...."

వికృతంగా నవ్వాడు సురేంద్ర.

"నువ్వు ఎలాగూ తెస్తావు. నాకు మీవాళ్ళ మీద చాలా నమ్మకం ఉంది. వాళ్ళకి కూడా నీకిస్తానన్న విషయం గుర్తుండే ఉంటుంది. ఒకవేళ... అది జరగలేదనుకో... నువ్వు డబ్బు తేలేదనుకో.. నువ్వు రానక్కరలేదు... అందుకే నీకు ఇండియా వెళ్ళడానికి మాత్రమే టిక్కెట్టు కొనిస్తాను.... నువ్వేం చిన్న పిల్లవు కాదు. మీ అమ్మావాళ్ళు అనుభవజ్ఞులు... "

ఓ ఆదివారం డాలర్ మార్కెట్టులో గీత కనపడింది. గీత నాకు మా ఊళ్ళో స్కూల్ రోజులనుంచి తెలుసు. దూరం చుట్టం. కానీ దేశం కాని దేశంలో ఎంతో దగ్గరగా అనిపించింది. ఆమెకి నా ఫోన్ నంబరిచ్చి, ఆమె ఫోన్ నంబరు తీసుకుంటూ అన్నాను... "జీవితం కూలిపోయేలా ఉంది. నీ సహాయం కావాలి. ఓ రెండు రోజులు ఫోనులో మాట్లాడుకుంటే నా బాధ కొంచెం తగ్గుతుంది"

నా తల నిమిరి, నా భుజం మీద చేయివేసింది. "తప్పకుండా. ఓ విధంగా బానిస బతుకులు బతుకుతున్న మనకి ఓ చిన్న ఓదార్పు మాట, రెండు కన్నీటి బొట్లు చాలు మామూలు రొటీనులో రావాటానికి. మళ్ళీ రోబోట్‌లాగా మారిపోవడానికి... మనం తప్పకుండా మాట్లాడుకుందాం...."

మర్నాడు సురేంద్ర వెళ్ళిపోయాక గీతకి ఫోన్ చేసి విషయం చెప్పాను.

"డబ్బు మూలంగా అయితే పెల్లిని పెటాకులు చేయద్దు.నీకింకా ఉద్యోగం చేసే అర్హత రాలేదు కాబట్టి, డబ్బు ఇబ్బంది వల్ల నీకలా అనిపిస్తోంది. నీకు ఉద్యోగం వచ్చాక ఇక్కడ మన డాలర్లకి ఆ రూపాయలు ఓ లెక్క కాదు. ముందు తెచ్చి ఇచ్చెయి. మళ్ళా రెండేళ్ళల్లో నువ్వు ఎలాగైనా సర్దేసెయచ్చు. అయినా అది తర్వాత సంగతి. ముందు డబ్బు తెచ్చెయ్యి... మన జీవితాలు డబ్బుతో పటిష్టం అయ్యే సన్నటి నాజూకైన పెళ్ళితో ముడిపడ్డవి..."

"అంతే అంటావా? అందరిదీ అంతేనా?"

"మనం ఊహించుకున్నట్లుగా జీవితం ఉండదు. సర్దుకుపోవడం నేర్చుకో... ఓ విధంగా పురుషాధిక్యతని అంగీకరిస్తూ బ్రతికేస్తున్నాం. ప్రస్తుతం నువ్వు ఇదే చెయ్యి... రోజులు గడుస్తున్న కొద్దీ పరిష్కారాలు వాటంతట అవే దొరుకుతాయి. స్కూలుకెళ్ళాలి. పిల్లలిద్దరినీ తీసుకురావాలి. సరేనా? బెంగ పడకు... ధైర్యం చెప్పడానికి నేనున్నాను. ఏం పర్వాలేదు. అన్నీ మెల్లగా సర్దుకుంటాయి. తర్వాత మాట్లాడుకుందాం. ఉట్టి మనిషివి కూడా కాదు. పెద్దగా అలోచించకు. మరి నేనుంటాను. తర్వాత మాట్లాడుకుందాం.

నా జీవితాన్ని ఇప్పుడు శాసిస్తున్నది, సురేంద్ర పెట్టిన ఆర్ధిక బిల్లు. మా బంధం నైతిక సూత్రాల మీద లేదు.

"మనవన్నీ కన్వీనియెన్స్ కోసం జరిగే పెళ్ళిళ్ళు. ఏవిధంగా అని అడగకు. ఇక్కడా చాలామంది జీవితాలు ఇలాగే కన్వీనియెన్స్ మీదనే నడుస్తున్నాయి. ఇలాటి పెళ్ళిళ్ళకి భాషా భేదం లేదు. దేశా భేదం లేదు.... ఓ పెళ్ళి అయ్యాక భార్యా భర్తలు అన్నివిధాలుగా అంటే ఇంటలెక్చువల్‌గా, ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా ఫ్రీక్వెన్సీ కలిస్తేనే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనచ్చు. కానీ దురదృష్టం ఇక్కడే ఉంది. అందుకే ఏదో ఎక్కడో అసంతృప్తి, సన్నటి విషాద రేఖలు.

భార్యాభర్తలు రెండు వేర్వేరు గ్రహాల నుంచి వచ్చినవారు. ఒకళ్ళనొకళ్ళు అర్ధం చేసుకుని కాపరం చేయడానికి కొద్ది టైం పడుతుంది. కొంతమందికి రోజులు పట్టవచ్చు, నెలలు పట్టవచ్చు, సంవత్సరాలు పట్టవచ్చు. అసలు అర్ధం కాకుండా జీవితాలే గడిచిపోవచ్చు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడ్తున్నారు కాబట్టి సర్దుకుంటూ గడిపేస్తున్నారు. "

వింతగా చూశాను.

"గమనించు శ్రావ్యా! నీ చుట్టూ ఉన్న అందరినీ గమనించు.. స్స్ధారం.."

"ఇది నిజం.. గీత చెప్పింది అక్షరాలా నిజం...: అని అనుకున్నాను. సురేంద్ర నన్ను మనసికంగా, భౌతికంగా హింసించడానికి కారణం నేను అతని మీద ఆధారపడి ఉండడమేనా?

ఎమ్మెస్సీ చదివాను. సాహిత్యం అంటే ఇష్టం. టగోర్ని ఊపిరిలో ఉంచాను. చీకట్లో వాలు కుర్చీలో కూర్చుని తలత్ మొహమ్మద్ పాటలు వినడం ఇష్టం. జీవితాన్ని గురించిన నిర్దిష్టమైన అభిప్రాయం ఉంది. అలాంటిది నేను గాలివాటంగా ఎలా బ్రతకను? ఈ జీవవాహినిలో కొట్టుకుపోతూ ఏ తీరానికి వెళ్ళిపోతున్నాను? ఆ తీరాన --- షెల్లీ లాగా జీవితానికి అవతల ఏమున్నదో చూడ్డానికి ప్రయత్నించాలా?

ఈ నీలం పసిఫిక్ మహాసముద్రం ముందు కూర్చుని, నాలోని నేనుని ఎలా తీసేయను? ఆ భావాన్ని ఎలా తీసేయాలి? నేను అనే పదం లేకపోతే ఈ సముద్రపు నురగల్లో మునూతూ తేలుతూ ఉండిపోతాను. జడత్వం... ఓ రాయిలాగా...

ఓ నెల తరువాత గీత అత్తగారినీ మామగారినీ శాన్‌ఫ్రాన్సిస్కోలో ప్లేను ఎక్కించి నా దగ్గరకొచ్చింది. "వెళ్తున్నావా?" ఎక్కడికో దానికి తెలుసు, నాకు తెలుసు.

"వెళ్ళలి. డబ్బు తేవాలి. లేకపోతే.. రావద్దన్నాడు.. ఏం చేయాలి?" అంటూ ఏడిచేశాను.

"డబ్బు తెచ్చెయ్యి. డబ్బు నువ్వు సంపాదించగలవు. జీవితాన్ని కాదు. జీవితాన్ని కూలదోసి, ఆ కూలిన గోడల్ను చూసే ప్రేక్షకురాలివి కాకు. వైవహిక జీవితం అంటే అన్నీ సర్దుకుపోవడమే. గుడిసెల్లో ఉండేదయినా, మేడల్లో ఉండేదయినా చదువు ఉన్నా లేకపోయినా పల్లె అయినా పట్నం అయినా సరే.. అందరిదీ ఎక్కడో ఒకచోట నిశ్శబ్ద పోరాటమే! ఎ మాటర్ ఆఫ్ క్వయెట్ ఆక్సెప్టన్స్.

"ఇందులో ఫెమినిజం లేదు, లింగ వివక్షత. అరణ్య న్యాయం. శతాబ్దం ఏదైనా, దేశం ఏదైనా, ఖండం ఏదైనా స్థితి ఒక్కటే. మొగుడూ పెళ్ళాలు విడిపోతే ఆ ప్రభావం మనసు మీద, సమాజం మీద పెద్దగా ఉండదు. కానీ తల్లితండ్రులు విడిపోతే పిల్లలు అమూల్యమైన జీవితాన్ని పోగొట్టుకుంటారు. అందుకే సమాజం, కుటుంబం, సోషల్ వర్కర్లు, మానసిక నిపుణులు కొంచెం సర్దుకుపోవాలి అంటున్నారు."

" ఈ ఆడవాళ్ళంతా సర్వైవర్స్. విక్టింస్ కాదు. అదే పాజిటివ్‌గా ఆలోచించడం వల్ల వచ్చే శక్తి. ఎన్ని ఎదుర్కోవాలి? ఎన్ని భరించాలి? పాజిటివ్ సర్వైవర్స్..."

నేను కూడా అంతే. కడుపులోని బాబు కోసం. నామీదా రోజూ ఏదో ఒకరకమైన హింస. అదో పిచ్చి. సైకిక్ సురేంద్ర, సైకిక్"

ఉద్యోగం పోయిందన్నాడు ఓ రోజున. ఏదో బార్‌లో పనిచేస్తున్నానన్నాడు. తను ఏ పిజ్జానో తిని వచ్చేవాడు. నేను తిన్నానో లేదో కూడా అడిగేవాడు కాదు. శాడిస్ట్. నన్ను ఏడిపించడంలో ఉన్న తృప్తి మరెందులోనూ లేదు. నాకళ్ళల్లో కన్నీళ్ళుంటే సురేంద్ర కళ్ళలో చిరునవ్వు. నాకళ్ళల్లోని, గుండెల్లోని దిగులుతో చెలగాటం. పాశవిక ప్రవర్తన, పైశాచిక చర్య.

ఇండియా వెళ్ళడానికి మాత్రమే టిక్కెట్ చేతిలో పెట్టిన రోజున ఎంతో రిలీఫ్ గా అనిపించింది. ఓ ఏడాది అమెరికా జీవితంలో స్వేఛ్ఛగా ఊపిరి పీల్చాను. ఓ రెండు వారాలు ఈ జైలు. ఆ తర్వాత కొన్ని రోజులు ఇండియా. పొలం అమ్మాక ఇంక మామూలు జీవితం నార్మల్ గా అయిపోతుంది. డబ్బు తెచ్చి ఇచ్చేస్తాను. షికాగోలో మామూలు జీవితం కొనసగిస్తాను. జస్ట్ ఇవన్నీ పాసింగ్ క్లేడ్స్. తాత్కాలికం అనుకుంటూనే ఇండియా వచ్చాను.

పీడకలలాంటి ఏడాది అమెరికా జీవితాన్ని పసిఫిక్ మహాసముద్రంలో నిమజ్జనం చేసి, అందమైన సప్తవర్ణాల కల కనడానికి వచ్చాను. నిశ్శబ్దంగా తన మానాన తాను వెళ్ళిపోయే గోదావరి నది ఒడ్డునున్న మాఊరికి వచ్చాను.

నాలుగురోజులకి సురేంద్ర ఫోన్ చేశాడు.

"షికాగో వచ్చాను. ఎందుకని అడక్కు. శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉద్యోగం పోయిందని షికాగోలో ప్రయత్నిస్తున్నానని చెప్పాను. ఇంతకీ పొలం బేరం పెట్టావా?" నా గురించి ఒక్కమాటైనా అడగలేదు. దుఃఖం గుండెల్లో తన్నుకుంటొంది.

"ఇక్కడ పరిస్థితి బాగోలేదు..."

"సరే, డబ్బు తేకుండా రాకు..." బ్లాక్మెయిల్.

అమ్మకి పరిస్థితి చెప్పే ధైర్యం చాలలేదు. నాన్నతో చర్చించే చనువు లేదు.

రోజులు గడచిపోతున్నాయి. మళ్ళా అమెరికా వెళ్తానన్న ఆశపోతోంది.

సూరమ్మత్తయ్య నా పక్కన వచ్చి కూర్చుంది.

"ఏమ్మా ఎలా ఉంది? అక్కడ పులిహోర పాకెట్లిస్తున్నారంటే మీ అమ్మ అక్కడికెళ్ళింది. ఎంతలో ఎంత మార్పు? నువ్వు కలలో కూడా అనుకుని ఉండవు. ఇలా వరదల్లో చిక్కుకుని ఓస్కూల్లో తలదాచుకుంటావని... ఎలా అయిపోయావో! ఆపిల్ పండులా ఈ ఊరొచ్చినట్లున్నావు. వడలిపోయావు. వేదాంతం మరచిపోకూడదని దేవుడు మధ్యమధ్యలో ఇలా మొట్టికాయలు వేస్తుంటాడు."

నవ్వాను.. అందులో వెలితి ఆమెకు కనపడలేదు.

"మళ్ళా మీ అమెరికా వెళ్ళాక మామూలుగా అవుతావులే..."

"ఆకలేస్తోందా?"

లేదన్నట్లు తలూపాను.

"మంచినీళ్ళు ఎవరైనా తెచ్చారేమో, నీకోసం ఓ సీసా తెస్తాను." నా బుగ్గలు పుణికి, తల నిమిరి వెళ్ళిపోయింది. కుర్చీ లాక్కుని కిటికీ దగ్గర కూర్చున్నాను. బయటకి చూశాను. కనుచూపు మేరవరకూ నీళ్ళు, సగం మునిగిన ఇళ్ళు, చెట్లు...

"శ్రావ్యా! పులిహోర పొట్లం దొరికింది. ఇంద నువు తిను.." సూరమ్మత్త.

"ఎక్కడిదీ?" ఆశ్చర్యంగా అడిగాను తీసుకున్నాను.

"యిందాక హెలికాప్టరులోంచి పడేశారుట. మా పళ్ళాళ్ళయకి రెండు దొరికితే నాకిచ్చాడు. నీకోసం తెచ్చాను... కొంత తిను. కడుపు చల్లగా ఉంటుంది. చూసుకుని తిను. మిరపకాయలు అవీ చూసుకో. నీళ్ళు లేవు. అయినా ఏదోఒకటి చూస్తాను. మీ అమ్మ అక్కడే నీళ్ళ కోసం నుంచుంది..." అంటూ వెళ్ళిపోయింది.

చుట్టూ చూశాను. ఎవరిచేతుల్లోనూ యే పకెట్టూ లేదు. ముసలాళ్ళున్నారు. చేతకానివాళ్ళున్నారు. ఇబ్బందిగా చూశాను. వాళ్ళు తినకుండా నేనెట్లా తింటాను?

"మావైపు చూడకమ్మా.. నువ్వు నీ కడుపులో ఉన్న పిల్లాడికోసం తిను. మాదేముందమ్మా పెద్దవాళ్ళం... నువ్వు తిను.." అన్నారు. సిగ్గుపడుతూనే తిన్నాను. లోపల ఉన్న పిల్లవాణ్ణి బతికించుకోవాలని.

"నీళ్ళు దొరకలేదు... ఓ మిళ్ళీగిన్నెడు ఈ సీసాలో ఉంది. గొంతు తడుపుకో. బ్రతిమాలి, బామాలి తెచ్చానమ్మా.. తాగు..."

ఆగదిలో ఉన్న అందరికీ దాహం. అందరికి మంచినీళ్ళు కావాలి.

బయటంతా నీళ్ళే. జలమయం. మధ్యలో ఉన్నాం. కానీ తాగడానికే నీళ్ళు లేవు. నాకు కోల్‌రిడ్జ్ "ద రైం ఆఫ్ ఏన్షియంట్ మరైనర్" గుర్తొచ్చింది. ఆ కథని ఇంటరులో జేంసు సార్ చెప్పారు. ఓ మెరైనర్ శుభశకునాలకి గుర్తు అయిన ఆల్‌బెట్రాస్‌ని చంపడం వల్ల, ఆ పాప పరిహారం ఆ పడవలో ఉన్నవాళ్ళందరూ చెల్లించాల్సి వస్తుంది. వాళ్ళ ప్రయాణంలో త్రగే మంచినీళ్ళు అయిపోవడం, చుట్టూ సముద్రం; అది పారడాక్సికల్ పరిస్థితని, "వాటర్ వాటర్ ఎవిరివేర్, నాట్ ఎనీ డ్రాప్ టు డ్రింక్" ఆ పదాల ద్వార కవి చిత్రీకరించాడని, చెప్పారు. ఆ నీళ్ళు, ఆ ఓడా, చిత్రాల్లాగా అయిపోవడానికి కారణం ఆ ఆల్‌బెట్రాస్ అనే తెల్ల పక్షిని చంపడం వల్ల, ఆ పాపం వల్ల... మరి యిప్పుడు ఈ రోజున ఏ పాపం వల్ల... ఇలా నీళ్ళ మధ్య నీళ్ళు తాగేందుకు లేని పరిస్థితి ఏర్పడింది?.....

నేనున్న పరిస్థితి వివరిస్తే సురేంద్ర అర్థం చేసుకుంటాడేమో అని అనిపించి ఫోన్ చేసాను.

"ఫోన్ నువ్వు చెయ్యాల్సిన పనిలేదు. నా పరిస్థితి ఏం బాగా లేదు." అంటూ కట్ చేసాడు.

చెప్పాలనుకున్నది చెప్పనే లేదు. పూర్తి కాకుండానే లైన్ కట్ చేస్తే ఎలా? ఏదో ఆవేశం... దెబ్బ తిన్న అహం...

మళ్ళీ చేశాను.

"ఏం కావాలి?" ఇందాకటి కరుకుదనం లేదు ఆ గొంతులో

కళ్ళవెంట నీళ్ళూ... గొంతులోంచి మాట రావడం కష్టమే అయింది.

'యిద్దరం భవిష్యత్తు గురించి మాట్లాడుకుందాం. నీ భవిష్యత్తు ఏవిటి?"

"నాది నేను నిర్ణయించుకున్నాను..." సౌమ్యంగా అన్నాడు.

పిడుగు పడ్డట్టుగా అనిపించింది.

"అదేంటీ, నా భవిష్యత్తు, మీ భవిష్యత్తు అంటున్నారు. ఇక్కడ పరిస్థితి ఏం బాగులేదు. నా టికట్టు పంపిస్తే నేను షికాగో వచ్చేస్తాను"

"శ్రావ్యా! అక్కడితో ఆగిపో. నాకు ఉద్యోగం లేదు. నేను నిన్ను పోషించే స్థితిలో లేను. షికాగో ఉద్యోగం వచ్చిందని అబద్ధం చెప్పాను. నా సర్వైవల్ కోసం ఒక ఆఫ్రికన్-అమెరికన్ స్త్రీతో ఉంటున్నాను. నాకు శాన్ ఫ్రాన్సిస్కోలో పరిచయం అయ్యింది. ఆవిడకు షికాగోలో ఉద్యోగం వచ్చింది. ఆమెకు ఇల్లుంది. నాకు డబ్బు కావాలి. ఉండటానికి నీడ కావాలి. అవన్నీ నాకు ఇస్తోంది. మా ఇద్దరి కన్వినియన్స్ ప్రకారం బతుకుతున్నాము. ఇంకా వివరంగా చెప్పలేను. ఈ సరికి నీకు అర్థం అయ్యిందనుకుంటాను. ఇకనుండి నా జీవితం వేరే దారిలో వెళ్ళుతుంది. దానిలో నువ్వు కాని, నీ ఛాయలు కానీ రాకూడదు. గొదవ చెయ్యకుండా అక్కడే ఉండిపో..."

"మరి నా కడుపులోని పిల్లాడి సంగతి....?"

"వాడి గురించి నీకు భయం, బెంగ అక్కర్లేదు. నేను ఆ బాధ్యత తీసుకొంటాను."

"నేనివ్వనని అంటే..." మొండిగా అన్నాను.

"ఓ! చాలా దూరం ఆలోచించావే. నాకు బాబును ఎలా తీసుకోవాలో తెలుసు."

"నేను కోర్టుకు వెళతాను."

"నేను నీకు ఇంకా విడాకులే ఇవ్వలేదు. నువ్వేం చెయ్యగలవు? కోర్టుకెళ్ళు... ఏమైనా చేసుకో... విడాకులివ్వను... పిల్లాణ్ణివ్వను... గుర్తుంచుకో..." లైన్ కట్ అయ్యింది.

ఒక్కసారిగా కళ్ళు తిరిగాయి. కళ్ళు మూసుకుంటూ అలాగే కూర్చున్నాను.

లోపల ప్రాణి తంతున్నట్టున్నాడు. కడుపులో నుండి బాధ కూడ బయటకి తన్నుకొస్తున్నది. భరించలేని నొప్పి... నొప్పి తగ్గేవరకు అలాగే కళ్ళు మూసుకున్నాను.

"శ్రావ్యా!" అమ్మ కుదిపింది. కళ్ళు తెరిచి చూస్తే చాలామంది ఉన్నారు.

"ఓసారి డాక్టరుకి చూపిస్తే నయం."

ఎవరో ఇద్దరు వాలంటీర్లు వచ్చారు. మళ్ళీ బయటికి వెళ్ళిపోయారు.

"ఎన్నో నెల?"

"ఆరు నిండింది. నీళ్ళు, తిండి లేకపోవడం, ఆ బెంచి మీద నిన్నటినుంది పడుకోవటం, పువ్వులాంటి పిల్ల... ఎలా వాడిపోయిందో... ఏం చెయ్యను దేవుడా! ఆయన ఇల్లును చూసుకుంటూ మావెంట రాలేదు. నేనొక్కదాన్నే... ఆడదాన్ని... ఎన్నని చెయ్యగలను..." అమ్మ రాగాలు పెట్టడం మొదలెట్టింది.

"వదినా! ఊర్కో... పిల్ల బెంబేలు పడిపోతుంది. పైన దేవుడున్నాడు. ఏం జరిగినా మన మంచికే అనుకో" అంటూ సూరమ్మత్త అమ్మ పక్కన కూర్చుంది.

"అమ్మా! ఓ ట్రాక్టరులో నలుగురు పార్టీ కార్యకర్తలొచ్చారు. మిమ్మల్ని రాజమండ్రి తీసుకెళ్తామంటున్నారు..."

సహాయ సిబ్బందిలో ఒకావిడ ఆరో నెల అని తెలిసుకొని 'అయితే ఇవి పురిటి నొప్పులు కావు ' అని అంది.

"నాకు బ్లీడింగ్ అవుతోంది" అమెకు మాత్రమే వినపడేటట్టు చెవిలో చెప్పాను.

"ఏం వర్షాలో... ఏం వరదలో..." అంటూ టార్పాలిన్ పరిచారు. దానిపైన ఓ దుప్పటి వేసింది అమ్మ.

ఆ వర్షంలో తడుస్తూనే రాజమండ్రి చేరుకొని మొదట అగుపడిన నర్సింగ్ హోం వెళ్ళాం.

డాక్టరు నా పరిస్థితి చూసి "రెస్ట్ తీసుకోవాలి" అన్నాడు.

"శ్రావ్యా! అల్లుడుగారికి ఫోను చేస్తావా?" అంటూ సెల్ ఫోను ఇచ్చింది.

ఫోన్ చేస్తే, "ఇక్కడ ఇంకా రాత్రి. నిద్ర పోతున్నాను. ఏందుకు డిస్టర్బ్ చేస్తున్నావు?" విసుక్కున్నాడు.

అమ్మ పక్కనే ఉంది కాబట్టి, కొంచెం తమాయించుకొని, "నాకు నొప్పులొస్తే రాజమండ్రి తీసుకొచ్చారని చెబుదామని..."

మధ్యలో కట్ చేసి, "వెరీగుడ్! చెప్పావు కదా శుభవార్త. నేనేదో డబ్బు పంపిస్తానని ఆశ పెట్టుకోకు. నాకింకా ఉద్యోగం రాలేదు. ఇంక ఫోను చెయ్యకు. మనిద్దరం విడిపోయినట్లే." లైన్ కట్ చేసాడు.

ఒక్కసారి అమ్మను పట్టుకొని ఏడ్చాను. జరుగున్న పరిస్థితిని కొద్దిగా వివరించాను. అమ్మ కూడా ఏడ్చింది.

"ఏదో అమెరికా సంబంధం కావాలనుకున్నాం గాని, ఇలాంటి అబ్బాయి కావాలనుకోలేదు... నీకింకా పాతికేళ్ళు నిండ లేదు... జీవితం నాశనమవుతుందే..." శొకాలు మొదలెట్టింది.

నిద్రకి మందివ్వడంతో మగతగా నిద్రలోకి జారాను.

మర్నాటికి నొప్పులు ఎక్కువయ్యాయి. కడుపోలోనున్న జీవి అన్ని బంధాలొదులుకొని బయటికి రావాలని తాపత్రయ పడుతున్నాడు. ఈ బాహ్యప్రపంచం స్వేచ్చా ప్రపంచమేనా?

పేగును కోస్తే బయటకొచ్చాడు అరచేయంత చిన్న జీవి. రాజమండ్రి రాకపోతే... కడుపులోనే సమాధి కావలిసినవాడు... ఏం ఆశతో వచ్చాడో... ఈ మాయ ప్రపంచంలోకి?

వరద ఉధృతం తగ్గడంతో నాన్న ఫోను చేసాడు. అమ్మ మాట్లాడింది. నాన్నగారు జగన్నాథం బాబాయిని వెంటబెట్టుకొని రాజమడ్రి వచ్చారు.

పుట్టిన అరచేతంత జీవిని బ్రతికించటానికి డాక్టర్లు శత ప్రయత్నాలు చేస్తున్నారు ఆపరేషన్ థియేటర్లో.

సిస్టర్ వచ్చి కొద్దిగా సమాచారం చెప్పింది. "సారీ! హోప్ లేదు. ఆక్సిజన్ పెట్టాం."

"సిస్టర్. ఒక్కసారి నా బాబును చూడొచ్చా. పక్కన పడుకోబెట్టుకొని ముద్దు పెట్టుకుంటాను. నాకెందుకు పుట్టావని ఓ చిన్న ప్రశ్న వేస్తాను. ప్లీజ్ సిస్టర్" అభ్యర్థించాను.

బాబును తీసుకొచ్చారు. ఒంటిని తడిమాను. గులాబి రంగు ఒళ్ళు. ఇక ఎన్ని కష్టాలు పడాలో...

ప్రాణం కోసం పోరాడుతున్న ఈ జీవి న్యూట్రం జెండర్ లోకి ఏ క్షణంలోనైనా మారవచ్చు. అప్పుడు నాకు, సురేంద్రకి వున్న బయోలెజికల్ లింక్ తెగిపోతుంది. అప్పుడూ బాబుకి స్వేచ్చ. మా ఇద్దరికి స్వేచ్చ.

దెబ్బాలాటలనుండి స్వేచ్చ. కోర్టు గొడవల నుండి స్వేచ్చ. చేదు గతం నుండి, మానసిక వ్యథల నుండి స్వేచ్చ. సురేంద్ర మరో పెళ్ళి చేసుకోడానికి స్వేచ్చ. ఒక్క మరణం ఇన్ని స్వేచ్చలకి కారణమా?! ఏమిటీ పెరడాక్స్.

సురేంద్రకి మళ్ళీ ఫోను చేసాను.

"నీకు ఫోను చెయ్యొద్దని ఎన్నిసార్లు చెప్పాలి. మళ్ళీ ఏం ముచుకొచ్చింది?"

"నీకు గుడ్ న్యూస్ చెబుదామని. భారతదేశం అంతటా అరవయ్యో స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకొంటున్నారు. మనక్కూడా... నీకు, నాకు, పుట్టిన బాబుకి కూడా స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పాటనికి ఫోన్ చేస్తున్నాను. యూ ఆర్ ఫ్రీ నౌ...అబ్సొల్యూట్లీ ఫ్రీ..."

"షటప్! అసలేం జరుగుతున్నది అక్కడ?"

"మన మధ్య ఉన్న లింక్... అదే బాబువల్ల వచ్చినది ఇప్పుదే తెగిపోయింది. నీలాంటి రాక్షసుడి నించి నాకు స్వేచ్చ. ఇక జన్మలో మనం ఒకళ్ళనొకళ్ళం చూసుకోవలసిన పని లేదు. మొగుడు, మొగాడు అన్న పదాలకి కాలాన్ని బట్టి అర్థం మారుతుందనుకొన్నాను. కాని ఏ యుగంలోనైనా అర్థం ఒకటే అని తెలుసుకున్నాను." జారుతున్నా కన్నీటిని తుడుచుకోటానికి ప్రయత్నం చెయ్యలేదు.

ఎం ఎస్సీ కంప్యూటర్స్ చదువుకొన్న దాన్ని. నా కాళ్ళ మీద నేను నిలబడగలను...అయితే సురేంద్రలా అనైతికంగా కాదు... చాలా గ్రేస్ గా.

నిర్జీవంగా ఉన్న బాబుని ముద్దు పెట్టుకున్నాను. పాపం...అలసిపోయాడు, జీవితంతో పోరాడలేక.

కాని నేను...నా జీవన శక్తి ఆగిపోలేదు. ఆ శక్తితో అమెరికాలో నున్న సురేంద్రని నిర్వీర్యుడిగా చెయ్యగలను. ఆ శక్తి నాకు చచ్చిపోయిన బాబు అందించి వెళ్ళాడు. ఆ శక్తి పేరు చట్టం. చట్టాన్ని ఆశ్రయిస్తాను. నా జీవితం ఆగిపోలేదు. అది ప్రవహిస్తూనే ఉంటుంది - అది జీవనవాహిని.