కవిత్వంలో వ్యకిత్వ వికాసం

వ్యక్తిత్వవికాసంలో 'ఒకడు వేమన '

-- ద్వా. నా. శాస్త్రి

"జీవితమనేది ఒక ఫిడేలు లాంటిది. దానిలో బహిరంగంగా ఒక పాటకచేరీ చేస్తాడు మానవుడు" అంటాడు శామ్యూల్ బట్లర్. 'లోకో భిన్న రుచిః' అన్నది సంస్కృత భాషితం. మనిషికి గల ఈ వైవిధ్యమే జీవన కుసుమానికి సుగంధమేమో! వ్యక్తిత్వ వికాసానికి విజ్ఞత ముఖ్యం. తాత్కాలిక విలువలు, శాశ్వత విలువలు అనేవి తప్పవు. శతక ప్రక్రియ 12వ శతాబ్దంలో పాల్కురికి సోమన 'వృషాధిపశతకం'తో ప్రారంభమై నేటివరకు దినదినాభివృద్ధి కాదు - క్షణక్షణాబివృద్ధి చెందుతొంది. అన్ని భావజాలాలకు అనువైనది శతకం. తెలుగు కవిత్వంలో మానవవికాసానికి ఆటపట్టు శతకవాఙ్మయమే. 'హృదయమే ఉత్తమ బోధకుడు ' అని వేమన శతక సారాంశం. నీతి శతకాలలో వేమన శతకానికే అగ్రతాంబూలం. అటువంటి వేమన హేతువాద భావాలనూ, అభ్యుదయ భావాలనూ, మనస్తత్వ చిత్రీకరణనూ అపూర్వంగా వెల్లడించాడు. వేమనతో మనం అన్నీ ఏకీభవించాలని లేదు. మన విశ్వాసాలకు వ్యతిరేకంగా చెప్పిన కొన్ని మాటలు వాస్తవమే. కానీ, 'విపులాచపృథ్వీ' అన్నట్టు అతని భావజాలాన్ని నమ్మేవారూ, సమర్థించేవారూ ఉన్నారు. వేమనశతకంలో నుండి ఎవరికి ఏం కావాలో దాన్ని గ్రహించవచ్చు. "గాయపు మందు కత్తికే పూసి కొట్టినట్టు తిట్టుచునే నవ్వించు హాస్యాకుశలత" ఉన్నదని వేమన గురించి రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ వ్యాఖ్యానించారు.'మనసు తెలియువాడు మర్మజ్ఞుడు ' - మన మనసు లేదా అంతఃకరణం ఎప్పుడూ సవ్యంగానే ఉంటూంది. మనకి మంచినే బోధిస్తుంది. మనమే దాని మాట వినం. 'ఊరుకో, నోర్మూసుకో' అంటాం. అప్పుడే చిక్కులు మొదలవుతాయి. అందుకే "మనసులోని మర్మము తెలుసుకో" అన్నాడు త్యాగయ్య.

"చంపదగినయటి శత్రువు తనచేత
జిక్కెనేని కీడు సేయరాదు
పొసగు మేలు చేసి పొమ్మనుటే చాలు"

- ఇదీ మానవత్వం అంటే. భారతీయత అంటే ఇదే. శత్రువు కూడా హాని చెయ్యకూడదన్నది వేమన నీతి. అందరూ ఇలావుంటే సమాజంలో శాంతిసౌభాగ్యాలుండవూ? తిక్కన కూడా "పగవల్ల పగ ఎక్కువ అవుతుంది" అంటూ పగ ఉన్నవాడు 'పాముల ఇంటిలోనున్నట్లు ' అని చెప్పాడు. కాబట్టి మనం పగను విడనాడి వీలైనంత వరకు శాంతి, సహనాలను అలవర్చుకోవాలన్నదే వేమన్న అభిప్రాయం.

మార్క్సిజం లేదా కమ్యూనిజం చెప్పిన దానిని వేమన ఎప్పుడో చెప్పాడు - 'భూమి నాదియన్న భూమి ఫక్కున నవ్వు ' అని పరిహసించాడు. మానవుడి కంటే ముందే భూమి పుట్టింది. మానవుడు తర్వాత పుట్టాడు. అయినా 'ఇది నాది ' అంటున్నాడు. చిత్రం ఏమిటంటే మానవుడు శాశ్వతం కాదుకానీ భూమి శాశ్వతం! 'ధనములేమి జూడ దలపనే పాపంబు?' అని ప్రశ్నించిన ఏకైక కవి వేమన. ధనవంతుడు గొప్పవాడూ, పేదవాడు గొప్పవాడు కాదు - అనే భావనను వేమన వ్యతిరేకించాడు. ఎంతటి మానవతా దృక్పథం ఇది! మనం డబ్బున్న వాడికి సలాము చేస్తాం. 'ఆహా, ఓహో' అంటాం. ఇది సమంజసమా? డబ్బుకంటే గుణం మిన్న అని భావం. పేదవాడైన గుణం బాగుంటే ఆదరించాలి, గౌరవించాలి.

"పరుల మోసపుచ్చి పరధనమార్జించుట" మానవత్వం కాదన్నాడు వేమన. కాని చాలామంది చేసేది ఇదేమరి! ముఖ్యంగా రాజకీయ నాయకులు, కార్పోరేట్ విద్యాసంస్థలు, చిట్ ఫండ్ సంస్థలూ... ఎంత మోసం!!! వేమనను మనం ఎందుకు మెచ్చుకోవాలంటే, 'మాట తిరుగువాడు మాలగాక!' అన్నందుకు.

కులభేదాలు మానవ సృస్టి. మాట మీద నిలబడలేనప్పుడు వాడు అగ్రకులపువాడైనా మాలతో సమానమే. 'మాట ' మీద నిలబడిన వాడు మాలకులస్థుడైనా అగ్రవర్ణం వాడికంటే ఉత్తముడే! ఈ సత్యాన్ని వేమన ముందు చెప్పినవారు అరుదు. మనిషికి మాటే ప్రాణం. మాటలకి ఎంతో విలువ ఉంది. మాటలు నైతిక స్థాయికి ప్రతీకలు. సొల్లు మాటలు, అబద్ధపు మాటలు మనిషి వ్యక్తిత్వానికి మాయని మచ్చలు. మాట లేని విలువ తూటాకి వుందని సి. నారాయణరెడ్డి వ్యంగ్యంగా తెలిపారు. మనిషితనానికి 'మాట ' ప్రామాణిక చిహ్నమని సారాంశం.

"మేడిపండు చూడ మేలిమై యుండు
పొట్ట విప్పి చూడ పురుగులుండు"

అనటం వేమన లోకవిజ్ఞతకి నిదర్శనం. పైపై మెరుగులు చూసి మోసపోవద్దని అన్నాడు. లోకంలో డాంబికాలే ఎక్కువ. 'పైన పటారం, లోన లొటారం ' అన్నదే నిజం. వేషభాషల్ని చూసి నమ్మవద్దు, మోసపోవద్దు అంటున్నాడు వేమన్న. నిజం కాదంటారా?

"పురుషులందు పుణ్య పురుషులు వేరయా"
"ఉర్వి జనులకెల్ల నుండు తప్పు"
"నీతిగాని మాట రాతి వేటు"

- ఇవన్నీ వేమన వేదసూక్తులే. ఇంతకంటే వ్యక్తిత్వాన్ని ఎవరు బాగా చెప్పగలరు? 'తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు ' అన్న సత్యం కంటే మరొకటి ఉందా?

గృహచ్చిద్రం భరింపరానిది. ఎంత డబ్బున్నా, ఎంత హోదా ఉన్నా మనశ్శాంతి ఉండదు. ఇంటిలో అందరూ సర్దుకు పోవాలి. ఒకరి భావాలు మరొకరు గౌరవించాలి. కుటుంబంలో జరిగే గొడవల్ని భరించనూలేం, ఇతరులకి చెప్పుకోనూలేం. ఆ క్షోభ అంతా ఇంతా కాదు. 'ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత ' అన్నది తెలిసిందే! ఈ సత్యాన్ని వేమన ఎంత సులభంగా, ఎంత బలంగా చెప్పాడో చూడండి -

"చెప్పులోని రాయి, చెవిలోని జోరీగ
కంటిలోని నలుసు, కాలి ముల్లు
ఇంటిలోని పోరు ఇంతింత కాదయా"

వేమన ప్రజాజీవితాన్నే కాదు సాంఘిక పరిస్థితుల్ని, పరిపాలనా పద్ధతుల్ని నిశితంగా పరిశీలించి తార్కికంగా వెల్లడించాడు. 'ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి ' అంటూ ఉంటాం. ఇది పరిపాలనలో మరీ ముఖ్యం. మనదేశ రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టటానికి కారణం వేమన ఎప్పుడో చెప్పాడు -

"అల్ప బుద్ధి వానికధికార మిచ్చిన
దొడ్డవారినెల్ల తొలగగొట్టు
చెప్పు తినెడి కుక్క చెఱకు తీపెరుగునా"

ప్రతి మనిషి తనకుతాను తెలుసుకొని ప్రవర్తించాలి. 'నేనే నెంబర్ వన్ ' అనే భావన పతనానికి దారి తీస్తుంది. విద్య, సంపద, అంతస్తుల వల్ల వినయగుణం అలవడాలి తప్ప 'అహం' పనికిరాదు. అందుకే, వేమన 'అనువుగాని చోట అధికులమనరాదు ' అన్నాడు. 'స్థాన బలిమి కాని తన బలిమి కాదయా' అన్నాడు. 'కొండ అద్దమందు కొంచమై యుండదా' అని సాక్ష్యం చెప్పాడు.

ఎవరు ఎంత ఉండాలో అంతలోనే ఉండాలి. ఉచితానుచితాలు, సమయోచితాలు వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దుతాయి. మన వ్యక్తిత్వాలు మన స్నేహితుల్ని బట్టి వెల్లడవుతాయి. సజ్జన సాంగత్యమే మనల్ని ఉత్తముడిగా తీర్చి దిద్దుతుంది. 'కుత్సితుండు చేరి గుణవంతు చెరచురా' అంటూ వేమన ఎవరిని దగ్గరకు రానివ్వాలో, ఎవరితో సంబంధబాధవ్యాలు పెట్టుకోవాలో సందేశమిచ్చాడు.

మనిషికి కృషి ఉండాలి. 'కర్మణ్యేవ్యాధికారస్తు..." అన్నది గీతకారుడే మరి! కృషి ఉంటే సాధించలేనిది ఏమీ ఉండదు. అపజయాలు, ఆటంకాలు 'కృషి ' లో, కర్తవ్య సాధనలో భాగాలే! వాటిని లెక్క సేయరాదు. అధిగమిస్తూ అడుగు ముందుకెయ్యాలి. లక్ష్యం ఉంతే చాలదు. దానిని సాధించడానికి కృషి ఉండాలి. ఇది చెప్పినవాడు వేమన. ఆ సుభాషితం - 'సాధనమున పనులు సమకూరు ధరలోన '. వేమన మానవునికి ఎలా జీవించాలో ద్రాక్షపాకంలా ఒకసారి, గిల్లి మరొకసారి 'క్లాసులు ' తీసుకొన్నాడు. 'బుద్ధి చెప్పువాడు గుద్దితే నేమయా?' అన్నదీ వేమనే!