సునీల్ గవాస్కర్ బొటనవేలి పైకెత్తి తన ఆటగాళ్ళ వైపు చూసి, టాస్ గెల్చినట్టు సైగచేశాడు. నేలమీద నాణాన్ని వంగి తీస్తున్న క్లైవ్ లాయిడ్ తో ‘బ్యాటింగ్’ అన్నాడు. వెస్ట్ ఇండీస్ కీ, భారతజట్టికీ మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ పోటీ అది. మొదటి రెండు టెస్టులు డ్రా అవటంతో మంచి ఉత్సాహంగా ప్రారంభం కాబోతూంది.

గవాస్కర్ బ్యాటింగ్ అని చెప్పగానే ప్రకాష్ లేచి డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళాడు. రెండు నిముషాల్లో ప్యాడ్స్, గార్డూ కట్టుకున్నాడు. వెస్ట్ ఇండీస్ ఆటగాళ్ళు ఫీల్ద్ లోకి ప్రవేశిస్తున్నారు. అంపైర్లు ముందే వెళ్ళిపోయారు. ప్రేక్షకులతో గాలరీలు అప్పటికే క్రిక్కిరిసిపోయాయి. వాళ్ళ అల్లరితో అంతా రణగొణ ధ్వనిగా ఉంది.

“బాగా ఆడు. బెస్ట్ ఆఫ్ లక్’ అన్నాడు విశ్వనాథ్. క్రితం రాత్రి బీరుకొడుతూ తన మొదటి టెస్ట్ విషేషాలు, ఎంత టెన్షన్ తో ఆట ప్రారంభించిందీ చెపుతూంటే ప్రకాష్ శ్రధ్దగా విన్నాడు.

ముందు ఫీల్డింగ్ అయి ఉంటే ఆ వాతావరణం కొంచెం అలవాటు అయి ఉండేది. కానీ అలా కాలేదు. అదీ గాక తను వోపెనింగ్ రన్నర్. అతడికి కొద్దిగా భయంగా ఉంది.

గవాస్కర్ తో పాటు డ్రెస్సింగ్ రూమ్ లోంచి బయటికి వచ్చేడు ప్రకాష్. ఇద్దరు ముగ్గురు ఆటగాళ్ళు అభినందనలు తెలిపారు. ఆటగాళ్ళలో అతడికి అత్యంత సన్నిహితుడు కిర్మానీ నవ్వుతూ ‘వెళ్ళిరా’ అన్నట్టు బొటనవేలు పైకెత్తాడు.

మెట్టుదిగి, అతడు ఆటస్థలం లోకి ప్రవేశించాడు. అతడూ, గవాస్కర్ కలసి బౌండరీ లైనుదాటి లోపలికి వెళ్తూంటే ఆకాశాన్నంటేలా చప్పట్లు! ఆ చప్పట్లూ - తమపట్ల వారికున్న అభిమానం అంతా చూస్తుంటె అతడి ఒళ్ళు జలదరించింది. ఆ అవ్యక్తానందం జీవితంలో ఒక స్థాయికి చేరుకున్న కళాకారులకే తెలుస్తుంది. క్రికెట్ గానీ, రచనగానీ, అంతకాలం వరకూ పడిన కష్టపు ఫలితాన్ని అనుభవించటంలో వుండే ఆనందం అది! ఏ ఫీల్డయినా ఒకటే!

దాదాపు వరుసగా ఆరు రంజీట్రోఫీల్లో సెంచరీ కొట్టాడు ప్రకాష్. ఆంధ్ర జట్టుకు ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించి పెట్టాడు. అతడు మంచి ఆఫ్ స్పిన్నర్ కూడా. ఎన్నికచేసే అధికారుల దృష్టి అతడి మీద పడి, సౌత్ జోన్ కు ఎన్నుకున్నారు. అక్కడ కూడా అతడు తన బౌలింగ్ తో వెస్ట్ ఇండీస్ ని తికమక పెట్టడంతో టెస్టుకి సెలక్ట్ చేశారు.

మెట్లు దిగుతూ అతడు వోరగా డ్రెస్ సర్కిల్ పక్కకి చూశాడు. తనవైపే చూస్తున్న శైలజ పెదవుల్ని గుండ్రంగా చేసి గాలిలోనే అందించింది. చాలా జాగ్రత్తగా దాన్ని అందుకొన్నట్లు నవ్వి తల పంకించాడు. ఆమె కళ్ళలో అభినందన కనిపిస్తూంది. ఆమె పక్కనే స్నేహితురాళ్ళు కూర్చున్నారు. తనకన్నా ఆమె ఎక్కువ ఎగ్జెయిట్ మెంట్ తో ఉన్నట్టు ఆమె కూర్చున్న విధానం తెలుపుతుంది. ప్రపంచ ప్రఖ్యాత ఆటగాడు గవాస్కర్ తో కలిసి స్థలం మధ్యకు నడవడం అతడు తన జీవితంలో మరిచిపోలేని అనుభవం. రెండు నిమిషాల్లో వాళ్ళు వికెట్ వద్దకు చేరుకున్నారు. గవాస్క్లర్ ముందు బ్యాటింగ్.

భారతదేశపు బెస్ట్ అంపైర్ స్వరూప్ కిషన్ కి రెండడుగుల దూరంగా నిలబడ్డాడు ప్రకాష్. గవాస్కర్ గార్డ్ తీసుకున్నాడు. ఆండీ రాబర్ట్స్ బౌలింగ్ మొదటి బంతిని గవాస్కర్ ముందుకొచ్చి ఆడేడు. రెండు, మూడు, నాలుగు బంతుల్ని వదిలేశాడు. అయిదో బంతిలో రెండు పరుగులు తీసుకున్నాడు. ఆరో బంతి వదిలేశాడు.

వోవర్ పూర్తి అయ్యింది.
గవాస్కర్ మధ్యకొచ్చి అన్నాడు... "జాగ్రత్తగా ఆడు.. మొదటి మూడు నాలుగు బంతులు ఆడగల్గితే అలవాటయిపోతుంది. మొట్టమొదట మ్యాచ్ కదూ. బెస్ట్ ఆఫ్ లక్" ప్రకాష్ తలూపి తన స్థానంలోకి వచ్చాడు. అందరూ సర్దుకున్నారు.

ఉన్నట్టుండీ, ఆ ప్రదేశం, ఆటగాళ్ళూ, ప్రేక్షకులు అంతా నిశ్శబ్దంగా అవటాన్ని అతడు గమనించాడు. కొన్ని వేలమంది జనం ఈ కొత్త ఆటగాడు ఎలా ఆడబోతున్నాడో అని గమనించటానికి ఉత్సుకతో చూస్తున్నారు. ఆ నిశ్శబ్దంలో అతడి శరీరం వణికింది. చేతిలో బ్యాట్ కూడా! ఎవరికైనా అది తప్పదేమో. మొట్టమొదటి సారి టెస్ట్ బ్యాట్ పట్టుకున్నాడు.

బౌలింగ్ ఎవరు చెయ్యబోతున్నాడు అని చూశాడు ప్రకాష్. ఎవరూ కనబడలేదు. అతడు కొద్దిగా కంగారుపడి మరింత పరీక్షగా చూశేడు. దూరంగా బౌండరీ లైన్ దగ్గర కబబడ్డాడు.

మైకేల్ హోల్డింగ్!

ప్రపంచంలో కెల్లా అతివేగంగా బంతులి విసిరేవాళ్ళలో ఒకడు. బంతిని కుడిచేత్తో పట్టుకుని వస్తున్నాడు. అంతదూరం నుంచి అతడు వస్తూంటే.. అదే ఒక పరుగుపందెంలా ఉంది. హోల్డింగ్ ఫాస్ట్ బౌలర్ అని ప్రతీతి. అతడు బంతి విసరటంలో, పరుగెత్తడంలో రిథమ్ ఉంది. అతడు వికెట్ దగ్గరగా వచ్చాడు. చెయ్యి తిప్పుతూ అంపైర్ని దాటేడు. ఆ తరువాత అది మాయమైంది. ఏదో చిన్న నలకలాంటిది, గాలికన్నా వేగంగా దూసుకురావటం తెలుస్తూంది. క్షణంలో వెయ్యవ వంతు తన ప్రక్క నుంచి ‘స్’ మన్న శబ్దం చేసుకుంటూ ఏదో వెళ్ళిపోయింది. అతడు బ్యాట్ కొద్దిగా ఆఫ్ సైడ్ జరిపేడు.

ఒక్కసారిగా ఆ నిశ్శబ్దంలోంచి సముద్రపు హోరులాంటి తరంగా ధ్వని. విపరీతంగా జనం గోల.
ఏమైంది? బంతి స్లిప్స్ లోంచి బౌండరీ లైన్ దాటిందా! అతడు స్లిప్ వైపు చూసేడు. అక్కడున్న ముగ్గురు ఫీల్డర్లూ బౌలర్ ని అభినందించడానికి వెళ్ళటం చూసి అప్పుడు చూసుకున్నాడు తన వికెట్ వైపు.

ఆఫ్ స్టంప్ ఎగిరి దాదాపు నాలుగు అడుగుల దూరంలో పడి ఉంది.
* * *

ఇంత బేవర్స్ గా ఆడతావని కల్లో కూడా అనుకోలేదు. ‘ఛీ’ అంది శైలజ. ప్రకాష్ మాట్లాడలేదు.
మా ఫ్రెండ్సందరూ ఎంతగా నవ్వుకున్నారో. కొంత మంది అడిగేసారు కూడా! ఏవోయ్! మీవాడు అక్కడ భరతనాట్యం చేసేడేమిటీ అని..

ప్రకాష్ మొహం రోషంతో ఎర్రబడింది. అయినా అతడు ఆవేశాన్ని కంట్రోల్ లో పెట్టుకున్నాడు. “నేనేం చెయ్యను? అక్కడ సరిగా సర్దుకోలేకపోయాను. చాల మంచి బంతి అది. ఎంత మంచి బంతి అంటే దానికి గవాస్కర్, విశ్వనాథ్ అయినా కంగారు పడేవాళ్ళే! అదే ఫస్ట్ బాల్ అవటంతో మరింత కంగారుపడ్డాను. నన్నర్ధం చేసుకోమన్నట్టు అతడు అభ్యర్ధించేడు. కాని శైలజ పరిస్థితి వేరుగా ఉంది. ఆమె, ప్రకాష్ ప్రేమించుకున్నారని చాలామందికి తెలుసు. చాలా మంది ఈర్ష్య పడ్డారు కూడా. ప్రకాష్ అందమైనవాడు. దానికితోడు ఇండియన్ ఓపెనింగ్ బాట్స్ మన్. అందుకే అతడు ఇలా ఓటమి చెందడం వారికి బాగా సంతృప్తినిచ్చింది. ముఖ్యంగా శైలజ స్నేహితురాళ్ళమని చెప్పుకుంటున్న వారికి. ఆమెని ప్రొద్దున్నుంచీ సాయంత్రం వరకు ఏడిపిస్తూనే ఉన్నారు.

సాయంత్రానికి ఇండియా బ్యాటింగ్ పూర్తయింది. నూట అరవై పరుగులకు అందరు అవుట్ అయ్యారు.

మరుసటి రోజు వెస్ట్ ఇండీస్ బ్యాటింగ్ ప్రారంభం అయ్యింది. గ్రీనిడ్జ్, హెయిన్స్ కలిసి డబ్బై పరుగులు తీసేరు. లాయిడ్ నలభై పరుగులతో ఆడుతున్నాడు. ఇండియా ఇన్నింగ్ డిఫిషిట్ తో ఓడగొట్టాలన్న తపన అవతలి టీమ్ లో ప్రతి ఒక్కరిలోనూ కలబడుతూంది.

వాళ్ళస్కోర్ 175-3 ఉండగా, చంద్రశేఖర్ నుంచు బంతి తీసుకొని ప్రాకాష్ కిచ్చాడు కెప్టేన్. అప్పుడు బ్యాట్స్ మన్ విప్ రిచర్డ్స్. రైట్ హాండర్. ప్రపంచంలోకెల్లా రెండవ బ్యాట్స్ మన్ గా ప్రసిధ్దికెక్కినవాడు. ఆటస్థలంలో కొద్దిగా నవ్వించేది అతడే. మిగతా వెస్ట్ ఇండియన్స్ అందరూ చాలా సీరియస్ గా ఉంటారెప్పుడూ.

వికెట్ కి ఆరుగజాల దూరంలో నిలబడ్డాడు ప్రకాష్ బంతి పట్టుకుని..
జనం బాగా గోల చేస్తున్నారు. రిచర్డ్స్ ‘విసురు’ అన్నట్టు సైగ చేశాడు. అప్పటికే అతడు డబ్భై పరుగులతో ఉన్నాడు. ఆ రోజు ఆట పూర్తయ్యే లోపులో సెంచరీ సాధించాలని రిచర్డ్స్ పట్టుదలతో ఉన్నాడు.

ప్రకాష్ గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు బంతిని తిప్పటానికి వీలుగా చూపుడువేలూ, మధ్యవేలూ మధ్య పట్టుకున్నాడు. అంపైర్ పక్కకి తొలగగానే పరుగెత్తుకుంటు వచ్చి గుడ్ లెంగ్త్ లోవేసాడు. బంతి పడి స్పిన్ అయ్యి, వికెట్ మిదకి వెళ్ళింది. అయితే ఒక్క క్షణం ముందే బ్యాట్స్ మెన్ పొజిషన్ లోకి వచ్చి కవర్స్ లోంచి డ్రైవ్ చేసేడు. ఒక్కక్షణం బంతి కనబడలేదు. ఆ తరువాత ప్రేక్షకుల గోల మధ్యలో అది ఆకాశంలో కాకిలా ఎగురుతూ కనిపించి గాలరీలలోకి వెళ్ళి పడింది.

సిక్స్!

‘ఛీ అనుకొన్నాడు ప్రకాష్’. తనకే అసహ్యం వేసింది. జీవితపు మొట్టమొదటి టెస్టు బంతి! ఆరు పరుగులు!
ఇంతలో అతడి చేతికి తిరిగి బంతి వచ్చింది. ఈసారు ‘గుగ్లీ’ వేయదల్చుకున్నాడు. అదే అతడు అతను చేసిన తప్పు! ఇంకా పూర్తిగా బంతి అలవాటు కాకుండానే గుగ్లీ వేయవోవటం! ఫలితం...అది ఫుల్ టాస్ అయింది. మళ్ళి ఇంకో సిక్సర్.

ఓవర్ పూర్తయ్యేసరికి ఆరు బంతుల్లోనూ మూడు సిక్సర్లతో, ముడు బౌండరీలతో రిచర్డ్స్ వంద పరుగులు పూర్తి చేశాడు. జనం పోలీసుల్ని దాటుకుని వచ్చి అతడిని అభినందిస్తున్నారు.

కొంతదూరంలో ఒంటరిగా-దాదాపు ఏడుపు తక్కువగా నిలబడి ఉన్నాడు ప్రకాష్. ఒక కుర్రాడెవడో అతడి మిద తినేసిన అరటి పండు తొక్క విసిరేడు. జనం అతడిని చూసి నవ్వుతున్నారు.

* * *

రాత్రి ఒంటిగంట అయింది. నిద్రపట్టలేదు. లేచి గదిలోంచి బయటకొచ్చాదు. చుట్టూ వెన్నెల, మధ్యలో అతడు వంటరిగా ..నిశ్శబ్దంగా...
అతడికి తన గతం గుర్తొచ్చింది. తన తండ్రి బ్యాట్ పట్టుకోవడం నేర్పటం..చదువు కూడా లక్ష్య పెట్టకుండా క్రికెట్ ఆడటం. కృషీ, పట్టుదలా సాధనాలుగా ఎండలో చెమటతో నిర్విరామంగా చేసిన ప్రాక్టీస్.

చేసినదంతా ఒక్క రోజులో పోయింది! ఆ దు:ఖం కేవలం అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. నిజమైన స్పోర్ట్స్ మెన్ కే తెలుస్తుంది.

ఆ రోజు సాయంత్రం తిరిగి శైలజకీ, అతడికీ గొడవయ్యింది. ఆ అమ్మాయిని స్నేహితురాళ్ళు ఎంతగా అల్లరి పట్టిస్తున్నారంటే ఆమె వూరు తిరిగి వెళ్ళిపోతానంటోంది. బలవంతం మిద ఆపుచేశాడు. దాదాపు ఏడుస్తూ ‘బ్యాటింగ్ అంటే భయం అనుకొవచ్చు. బౌలింగ్ కేమయిందీ? హాయిగా వెయ్యచ్చుగా అంది. నిజమే! కానీ ఏదో అవుతూంది. ఏదో బెరుకు.

గవాస్కర్ లాంగ్ ఆన్ లో నిల్చోమన్నప్పుడు ఆ బెరుకుతోనే నిలబడ్డాడు. తనకి కొద్ది గజాల దూరంలో శైలజా కూర్చుని ఉందని తెల్సు. ముర్రే బంతిని గాలిలోకి లేపాదు. విపరీతమైన గొడవ వెనుక శైలజ ‘కాచిట్’ అని అరుస్తూంది. పట్టుకొబోయే సమయానికి సూర్యకాంతి కళ్ళలోపడి వదిలేశాడు. ఎప్పుడూ కామ్ గా ఉండే విశ్వనాథ్ కూడా సీరియస్ గా చూడటం తనకి బాధ కలిగించింది. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? అప్పటికే వెస్టిండీస్ 350-5 లో ఉన్నారు. ఓటమి తప్పనిసరి అవుతూంది. ఆ సాయంత్రం మళ్ళి ఆమె అతడిని కలిసింది. ఆమె తిడుతూంటే మౌనంగా భరించాడు. ఎంతోమంది తన దేశీయుల తకపున ఆమె ప్రతినిధి అని అతడికి తెలుసు. దేశం మొత్తం తనని తిడుతున్నట్టు ఉంది. ‘నీ కసలు ఏం చేతకాదు’ అంది శైలజ. కేవలం రికమెండేషన్ మీద టెస్టులోకి తీసుకున్నారు నిన్ను అంటున్నారు మావాళ్ళు’.

అప్పుడు మాత్రం ప్రకాష్ విలవిలలాడిపొయాడు. చాలా సున్నితమైనచోట తగిలిన దెబ్బ అది. గుండెనిండా వ్యధ, కళ్ళనిండా నీళ్ళు.

* * *

ఆట నాలుగోరోజులోకి ప్రవేశించింది. లాయిడ్ 574-7 దగ్గిర డిక్లేర్ చేశాడు. ఒకటిన్నర రోజు పాటూ ఇండియా ఆడాలి. అప్పుడు ఇన్నింగ్స్ డిఫీట్ నుంచి తప్పించుకుంటుంది. అంతే! గెలిచే ప్రసక్తే లేదుయ్. 416 పరుగులు తీసి ఇంకా ఆపైన ఎక్కువ చేయటం అసంభవం కాబట్టి.

లంచ్ పూర్తవ్వగానే ఇండియా బ్యాటింగ్ ప్రారంభించాల్సి వచ్చింది. గవాస్కర్ సున్నితమ్గా అతడి భుజం తడుతూ ‘పర్లేదు జాగ్రత్తగా ఆడు’ అన్నాదు. ఆ సమయంలో ఆ రెండు మాటలూ అతడికి ఎంతో ఓదార్పు నిచ్చాయి. ఆ మాత్రం స్నేహపూరితమైన స్పర్శ కోసం అతడు ఆ పరిస్థితుల్లో చాలా తపిస్తున్నాడు.

మొదటి ఓవర్ పూర్తయ్యింది. గవాస్కర్ పరుగులు చేయలేదు ఆ ఓవర్లో. ఇక్కడ పరుగులు కాదు ముఖ్యం. మరుసటి రోజు సాయంత్రం వరకూ నిలబడగలిగితే చాలు. ఓవర్ పూర్తవ్వగానే ప్రకాష్ బ్యాటింగ్ వచ్చింది. ఈసారి ఆండీ రాబర్ట్స్ బౌలింగ్. చాలా పొడవుగా, సీరియస్ గా ఉండే రాబర్ట్స్ ప్రకాష్ వైపు క్రూరంగా చూశాడు. అతడు విసిరిన బంతి తుపాకీ గుండె కన్నా వేగంగా వచ్చింది. ప్రకాష్ ఎడమ కాలు ముందుకు జరిపి నెమ్మదిగా గ్లాన్స్ చేశాడు. ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య లెగ్ స్లిప్ లోంచి బంతి బౌండరీ దాటింది. గవాస్కర్ అభినందిస్తున్నట్టు చెయ్యి ఊపాడు. జనం చాలా సేపటి వరకూ చప్పట్లు కొడుతూనే ఉన్నారు. శైలజ అయితే కుర్చీ లోంచి లేచి నిలబడి చెయ్యి ఊపుతోంది.

ఇంతలో రాబర్ట్స్ బంతి వేసేడు. అతడెంత కర్కశంగా ఆ బంతి విశిరేడో, అంత సజావుగా దాని లేట్ కట్ చేశేడు.
మళ్ళీ హర్షధ్వానాలు, పళ్ళు బిగించి రాబర్ట్స్ వెనక్కు వెళ్ళేడు. అతడి ఫేవరిట్ బాల్! బౌన్సర్! పడీపడటంతోటే తారాజువ్వలా ఆరడుగుల ఎత్తు లేచింది. ఆ బంతిగానీ తగిలితే ప్రకాష్ చిన్న మెదడు బయటకు వచ్చేసేదే. కానీ ప్రకాష్ చలాగ్గా తప్పుకొని గాలిలోనే బంతిని బ్యాట్ తో హుక్ చేసేడు. ఒక్కక్షణం అంతా నిశ్శబ్దం. బంతి వెళ్ళి స్టేడియంలో పడగానే జనం వేసే విజిల్స్, చప్పట్లతో స్టేడియం నిండిపోయింది. అతడికిప్పుడు బంతి మామూలుగా కనిపించసాగింది. అసలే మంచి స్ట్రోక్ ప్లేయర్. దానికి తోడు ఇదివరకు లేని ఆత్మవిశ్వాసం వచ్చి చేరింది. చాలా జాగ్రత్తగా ఆడసాగేడు. టీ టైమ్ కి స్కోరు అరవై పరుగులకు చేరింది.

ఆ మరుసటి రోజు నూరు పరుగుల వద్ద గవాస్కర్ అవుటయ్యాడు. వరుసగా అమరనాథ్ కూడా అవుటవ్వటంతో మళ్ళి టెన్షన్ మొదలయింది. అప్పటికి స్కోర్ 110-3.
టీ టైమ్ కి పరిస్థితి మరింత విషమించింది. 175-7. కిర్మానీ చాలాసేపు నిలబడగలిగేడు. కానీ హుక్ చేయబోయి స్లిప్ లోక్యాచ్ ఇచ్చేసాడు.

టైమ్ నాలుగయ్యేసరికి ప్రేక్షకులు కుర్చీ చివర్లకి చేరుకుని ఉద్వేగంత్గో చూడసాగేరు. తొమ్మిదో వికెట్ పార్ట్నర్ షిప్ లో చంద్రశేఖర్, ప్రకాష్ ఆడుతున్నారు. వోవర్ పుర్తయ్యేసరికి అంతవరకూ ఆడగలిగినందుకు జనం చప్పట్లు కొడుతున్నారు. మళ్ళి కొత్తది మొదలయ్యేసరికి ఉద్వేగం. వెస్ట్ కెప్టెన్ లాయిడ్ మొహం సాయంత్రపు కాంతిలో కసితో మరింత నల్లగా మెరుస్తూంది. తన జట్టు బౌలర్లనందర్నీ ఒకరి తరువాత ఒకర్ని మారుస్తున్నాడు. అయిదు బంతులాడటం, ఆరో బంతిలో ఒక పరుగు తీసి అటువైపు వెళ్ళడం చేస్తున్నాడు ప్రకాష్. చంద్రశేఖర్ ని సాధ్యమయినంతవరకూ బ్యాటింగ్ వైపు రాకుండా చేస్తున్నాడు. పరుగు తీసినప్పుడల్లా జనం ఉత్సాహపరుస్తున్నారు. ఏ క్షణం అయినా ఆతస్థలంలోకి దూసుకువచ్చేలా ఉన్నారు. పోలీసులు కాపలా కాస్తున్నారు.
నాలుగు..నాలుగుం పావు
ఆఖరి మూడు ఓవర్లు.. రెండు జనం టెన్షన్...తో నిలబడి పొయారు. అరవటం కూడా లేదు.

గార్నర్ ది ఆఖరి ఓవర్. రాక్షసుడిలా బంతి పట్టుకుని వస్తున్నాడు. అప్పటికి దాదాపు అయిదు గంటలు నుంచీ ఆడుతున్నాడు ప్రకాష్. చాలా నిస్సత్తువుగా ఉన్నాడు. వరుసగా నాలుగు బౌన్సర్లు. ఒక ఫుల్ టాస్ వేసేడు గార్నర్.

ఆఖరి బంతి.
బౌండరీ లైన్ దగ్గర నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి విసిరేడు. ప్రకాష్ చాలా కామ్ గా దాన్ని డ్రైవ్ చేసేడు. బంతి దొర్లుకుంటూ వెళ్ళిపోయింది.

అంతే. ప్రవాహం కట్టలు తెమ్చుకొన్నట్ట్లు జనం..అభినందనలు...పోలీసులు... ప్రకాష్ వాళ్ళ సాయంతో డ్రెస్సింగ్ రూమ్ వైపు పరుగెత్తాడు. గవాస్కర్, విశ్వనాథ్ కంగ్రాచ్యులేషన్స్ చెబుతున్నారు.

పోటీ డ్రా అయింది.
‘మార్వలెస్! అసలు అప్పుడే నిన్ను ముద్దు పెట్టేసుకుందామనుకున్నాను. కానీ అమ్మో జనం. నిజంగా హీరోవే అయిపొయావ్’ అంటూంది. శైలజ.

అతడి మొహం భావరహితంగా ఉంది. గెలుపు అతడిలో స్తబ్ధతని కలుగజేసింది. సక్సెస్ గంభీరతని ఆపాదించింది.
ఆమే మాట్లాడుతూంది. ప్రవాహం లాంటి మాటలు. పొగడ్తలు. ఫ్రెండ్స్ ఆమెని ఎలా కంగ్రాట్స్ చేసింది. వగైరా..వగైరా..
అంతా విన్నాడు. చివరకు ఇలా అన్నాడు.

నేను నిన్ను ప్రేమించింది నువ్వు నా దుఃఖంలో పాలు పంచుకుంటావని! అంతేకానీ నా గెలుపులో కాదు. ఐయామ్ సారీ శైలజా. నేను నిన్ను ప్రేమించలేను. ఏ వ్యక్తికైనా గెలుపూ, ఓటమీ రెండూ తప్పవు. అందులొనూ స్పోర్ట్స్ మెన్ అంటే చిన్నపిల్లలాంటివాడు. తల్లి తరువాత తల్లిలాంటి ప్రేయసి ఒడిలో సేద తీర్చుకుందామనుకుంటాడు. ముఖ్యంగా ఓడిపోయినప్పుడు.

ఆమె ముఖం వాడిపోయింది. లేచి నిలబడింది. ప్రకాష్ ఒక మాట అన్నాడు అంటే అది ఆవేశంలో అన్నది కాదనీ, ఎన్నో నిర్ణయించుకునే అలా అంటాడనీ ఆమెకి తెలుసు. అతడు తలుపు తెరిచి పట్టుకున్నాడు. ఆమె వెళ్ళిపోయింది.

అతడూ బయటకొచ్చి రెండు చేతులూ ప్యాంటు జేబుల్లో పెట్టుకుని శూన్యంలోకి చూస్తూ నిలబడ్డాడు.

అతడికి తెలుసు - తన గెలుపుకిది ప్రారంభం మాత్రమే అని! ఇక అంతా విజయపరంపరే కావచ్చు. తన చుట్టూ జనం చేరతారు. అభినందిస్తారు. ఐలవ్యూ అంటారు. తను కనుక్కోలేడు. ఎవరు తనని తనుగా ప్రేమిస్తున్నారో, ఎవరు తన కళని ప్రేమిస్తున్నారో, ఎవరు తన గెలుపును ప్రేమిస్తున్నారో?

ఎంత బాధామయస్థితి ఇది!

(ఆంధ్రప్రభ - 1987)

 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech