శభాష్ భాజపా

 

తమది ‘తేడాగల పార్టి" అని బిజెపి చాటుకుంటుంటే ఇన్నాళ్ళూ ఏమిటో అనుకున్నాం. మొత్తానికి దానిది గొప్ప తేడానే! కమలం మార్కు తేడాలు తడవకొకటి బయటపడుతున్న కొద్దీ ఆలిండియా దానిని పోలిన పార్టీ, దానికి సాటిరాగల పార్టీ ఇంకొకటి లేదని ఎవరైనా చచ్చినట్టు ఒప్పుకోవలసిందే. పట్టుమని పాతికేళ్ళు దాటని ఈ అతిలోక అత్యధ్భుత పార్టీ పదార్ధపు తేడా పాడాలను చూసి నూట పాతికేళ్ళు నిండొస్తున్న కాంగ్రెస్ లాంటి కొమ్ములు తిరిగిన పార్టీ కూడా కుళ్ళుకుని ఏడవవలసిందే.

పాళ్ళ తేడాయే తప్ప అసమ్మతి అనేది దేశంలోని అన్ని పార్టీల్లోనూ ఉన్నదే. కాని దానిని డీల్ చేసే పద్ధతిలో మిగతా పార్టీలకూ భాజపాకూ మధ్య చాలా పెద్ద తేడా ఉంది. సాధారణంగా ఇతర పార్టీలు అసమ్మతిని వంచుతాయి. బిజెపి అధినాయకత్వం మాత్రం అసమ్మతికి వొంగుతుంది. ఎంచక్కా లొంగుతుంది. ఉదాహరణకు దక్షిణాదిన రెండు ఇరుగు పొరుగు రాష్ట్రాల సంగతే చూడండి. ఆంధ్రప్రదేశ్ లో ఒంటి చేత్తో పార్టీని గెలిపించిన ముఖ్యమంత్రి మరణించాడు. నలుగురైదుగురు మినహా పార్టీ ఎమ్మెల్యేలందరూ ఆయన కుమారుడికే పట్టం గట్టాలని పట్టుబట్టారు. సంఖ్యాబలం వారికే ఉన్నదని తెలిసినా, వారు ఎదురు తిరిగితే మొత్తం రాష్ట్రమే చేయిజారి పోవచ్చని ఎగిరినా కాంగ్రెస్ అధిష్టానం బెదరలేదు. ఒత్తిళ్ళకు, బ్లాక్ మెయిలింగ్ లకు లొంగకుండా కరాఖండీగా వ్యవహరించి, తన మాట జవదాటడానికి వీల్లేదని శాసించి, మోరసాచిన అసమ్మతిని కర్కశంగా కాలరాచి, చివరికి అందరినీ తనదారికి తెచ్చుకుంది. అదే పక్కనున్న కర్ణాటకలో..? ఇద్దరు మంత్రులు అడ్డం తిరిగి యాభై మంది ఎమ్మెల్నేలను కూడగట్టి క్యాంపు నడపగానే దక్షిణాదిన తమకున్న ఒకే ఒక ఓటి సర్కారు ఎక్కడ కూలుతుందోనని బిజెపి హైకమాండ్ గడగడలాడింది. ముఖ్యమంత్రిని మార్చాలని అసమ్మతి ఘనులు తమ మెడమీద కత్తిపెట్టగానే ’ఆ ఒక్కటీ అడక్కు’ అది తప్ప ఏమైనా ఇస్తాం. దేనికైనా దిగజారుతాం’ అని దయనీయంగా దేబిరించింది. మంత్రులుగా ఉంటూనే, ముఖ్యమంత్రి మీద కత్తిగట్టి, డబ్బు సంచులతో ఎమ్మెల్నేలని కొనుక్కుని, ఏమిటీ పాడుపనులు అని తలవాచేలా చివాట్లుపెట్టి బుద్ధిచెప్పాలని అనుకోకుండా.. తిరుగుబాటు దార్లను పల్లెత్తు మాట అనకుండా వాళ్ళు పెట్టిన ప్రతి అడ్డమైన డిమాండ్ కూ సిగ్గు వదిలి తల ఊపింది. మీకు గిట్టని మంత్రులని పీకించుకోండి. ముఖ్యమంత్రి సెక్రటరీగా ఎవరుండాలో, ఎవరుండద్దో మీరే చెప్పండి; చేసిన ట్రాన్శ్ ఫర్లు ఎత్తేయించి, మీ జిల్లాను మీ ఇష్టం వచ్చిన అధికారులతో మీ ఇష్టం వచ్చినట్టు ఏలుకోండి. మీ అక్రమ వ్యాపారాలను నిక్షేపంగా చేసుకోండి. ముఖ్యమంత్రి మాట్లాడడు; మీకేసి తొంగి కూడా చూడడు. అంటూ కట్టడిచేసి ముఖ్యమంత్రి పెడరెక్కలు విరిచికట్టి అసమ్మతిగాళ్ళ కాళ్ళ దగ్గర పడేసింది. స్వతంత్రం వచ్చాక ఇప్పటికి ఎన్నో రాష్ట్రాల్లో ఎన్నో
పార్టీల ప్రభుత్వాల్లో తిరుగుబాట్లు లేచాయి. వాటి తాకిడికి ప్రభుత్వాలూ కూలాయి. కాని - దిక్కుమాలిన అధికారం ఉందనిపించుకోవడం కోసం పార్టీ హైకమాండే ఒక రాష్ట్రంలోని ఒక్క ముష్కరమూక దౌర్జన్యానికి హడలి కాళ్ళ బేరానికి రావటం బహుశా మున్నెన్నడూ లేదు. నోరు తెరిస్తే నీతులు వల్లించే భాజపాకే ఇప్పుడా అరుదైన గౌరవం దక్కింది. ఏ రకంగా చూసినా ఇది మహా గొప్ప తేడా కాదూ?

* * *

మామూలుగా మన రాజకీయ పర్టీల్లో పవరంతా పై నాయకత్వం గుప్పిట్లో ఉంటుంది. హైకమాండ్ ఏమి చేసినా అడిగేవాడుండడు. ఇక్కడా బిజెపిది పెద్ద తేడా. మాయల ఫకీరు ప్రాణాలు చిలకలో ఉన్నట్ట్లు భాజపా ప్రాణాలు ఆరెస్సెస్ చేతుల్లో ఉంటాయి. కాలధర్మం చెందిన కమ్యూనిస్టు రాజ్యాల్లో ప్రభుత్వాల మీద పార్టీ పెత్తనం ఎలాగో బిజెపి మీద ఆరెస్సెస్ పెత్తనం అలాగ. కనీసం కమ్యూనిస్టు రాజ్యాల్లో పార్టీ కంట్రోలు బాహాటంగా ఉండేది. ఎవరు ఎలా నడవాలో, ఎక్కడ ఏ పాలసీ ఉండాలో, ఏ పదవిలో ఎవరు కూచోవాలో పార్టీ లీడర్లు నిర్ణయించేవారు. నిరంకుశంగా అమలు చేయించేవారు. ఆపాటి స్పష్టతకూ భాజపా నోచుకోలేదు. దానికి స్వేఛ్ఛ ఉన్నదో లేదో దానికే తెలియదు. ఆరెస్సెస్ వాచ్యంగా ఏదీ చెప్పదు. తెరచాటున తొడపాశాలే తప్ప తనకు ఇది కావాలి, ఇలా జరగాలి అని ఎక్కడా పైకి తేలదు. పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోమంటూనే అడుగడుగునా కలగ జేసుకోవడం దాని పద్ధతి. ఆరెస్సెస్ పక్కా సాంస్కృతిక సంస్థ. రాజకీయాలతో దానికి పనిలేదు. పార్టీని ఎలా నడుపుకోవాలో, ఎవరి నాయకత్వంలో నడవాలో పూర్తిగా బిజెపి వారి ఇష్టం. అడిగితే సలహా ఇస్తామే తప్ప వారి పనిలో మేము వేలు పెట్టమని ఆరెస్సెస్ పెద్దలు పొద్దస్తమానం నొక్కి చెబుతూనే ఉంటారు. అద్వానీ దిగిపోతాడు. రాజ్ నాథ్ సింగ్ కొనసాగడు. ఫలానా ఫలానా ఢిల్లీ వాళ్ళెవరూ ఆయన స్థానంలో పార్టీ ప్రెసిడెంటుగా రారు. అంటూ మళ్ళీ ఆరెస్సెస్ పెద్దాయనే మీడియా ఇంటర్వ్యులిస్తూ పార్టీ నేతలకు చెమటలు పట్టింస్తుంటాడు. భాజపాను బహుకష్టపడి భారతీయ జిన్నా పార్టీగా మార్చిన అద్వానీని కొన్నేళ్ళ కింద పనికిరాడని తేల్చి రాజీనామా చేయించిందీ వీళ్ళే. కిందటి పార్లమెంటరీ ఎన్నికల్లో మళ్ళీ ఆయననే ఏరికోరి ప్రధాని అభర్ధిగా ప్రకటించి నెత్తిన పెట్టుకుని ఊరేగిందీ వాళ్ళె. సెర్ వాంటెజ్ నవలలో డాన్ క్విక్సోట్ వలె ముసలి అద్వానీ చేతకాక ఎన్నికల్లో చతికిలపడగానే ఆయన పనికిరాడు. పోవలసిందేనని మళ్ళీ ఆయన కాళ్ళకింద పొగపెడుతున్నదీ వాళ్ళే. ’తాతపోతే బొంత నాది’ అన్నట్టు అద్వానీ పోతే ఆయన కుర్చీలో కూచోవాలని కాచుకూచున్న నలుగురు కోటరీ వాళ్ళనీ ఆరెస్సెస్ సర్ సంఘ్ చాలక్ గారు టీవి ఇంటర్వ్యూ ద్వారా ఇట్టే డిస్ క్వాలిఫై చేశారు. వీళ్ళుగాక మురళీ మనోహర్ జోషీ లాంటి కురువృధ్దులు ఉన్నా కొత్త అధ్యక్షుడికి 55-60 ఏళ్ళ లోపు ఉండాలని ఇంకో రూలు పైనుంచి ఊడిపడ్డది కాబట్టి ఆయనకీ చాన్స్ లేదు. ఏతావాతా..అవతల రాహుల్ చేతుల్లో పరవళ్ళు తొక్కుతున్న కాంగ్రెస్ ధాటిని సమర్ధంగా ఎదుర్కోవటానికి ప్రధాన జాతీయ ప్రతిపక్షమైన భాజపాలో ఇవాళ ఒక్క నాయకుడూ లేడు. పెద్ద వాళ్ళ కుర్చీ ల కిందకి నీళ్ళొచ్చాయి. వాళ్ళ స్థానంలో రాబోయేవాడెవరో ’మాతృసంస్థ’ మూర్దాభిషేకం చేయించదలచింది ఎవరికో పార్టీ వారికి నికరంగా తెలియదు. నాయకుల ఎంపికలో పార్టీ వారికి ప్రమేయం లేదు. కదిలే స్వేచ్చ లేకుండా పెడరెక్కలు విరిచి కట్టి పడవేశారని ఎడ్యూరప్ప పబ్లిక్ గా ఏడుస్తున్నాడు. అద్వానీ అండ్ కో అలా పైకి ఏడవటం లేదు. అదీ అంతే తేడా.
 

 
     

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech