రెండు కన్నీటి బొట్లు

 

గత రెండు మాసాలకు పైగా- దేశవ్యాప్తంగా,మీడియాలో,పత్రికల్లో అత్యధికంగా వినపడ్డ, కనపడ్డ పదం వైఎస్సార్. ఆ పేరు వినబడుతూనే వుంటుంది కానీ,ఇక ఆ రూపం కనబడే అవకాశమే లేదు.ఒక వ్యక్తి గుణగణాలను సమాజం సంపూర్తిగా అవగాహన చేసుకోవడం జరిగేది అతడి మరణం తర్వాతనే అన్నది రాజశేఖర రెడ్డి గారి విషయంలో నూటికి నూరుపాళ్ళు నిజమైంది.

'రాజశేఖరా!నీపై మోజు తీరలేదురా!' అని తెలుగు ప్రజానీకం రెండో పర్యాయం ఆయనకు అధికార పగ్గాలు అప్పగించి వంద రోజులు నిండీ నిండగానే-రాజశేఖరుడికి నూరేళ్ళు నిండిపోవడం అత్యంత విషాదకరం.

'రాజసాన ఏలరా!' అని మనసారా కోరుకున్న ప్రజలకు ఆయన ఆకస్మిక మరణం విధి విధించిన శాపం.
అర్థవంతమైన జీవితాలెప్పుడూ అర్ధంతరంగానే ముగిసిపోతుంటాయి.మాట తప్పని మనిషిగా, మడమ తిప్పని వీరుడిగా పేరు తెచ్చుకున్న వైఎస్సార్-అరవై యేళ్ళు రాగానే రిటైర్ అయిపోతానన్న మాటని నిలబెట్టుకుంటూ-జీవితం నుంచే రిటైర్ కావడం అన్నది-ఆయన పధకాల ద్వారా బతుకులు పండించుకుంటున్న బడుగు జీవుల దురదృష్టం.

1978 నుంచి ఇప్పటివరకూ ఒక జర్నలిష్టుగా ఆయన్ని కలుసుకున్న సందర్భాలు అనేకం వున్నాయి. విలేకరులను విందు సమావేశాలకు ఆహ్వానించినప్పుడు ఆయన తరహానే వేరుగా వుండేది. బిగుసుకుపోయినట్టు వుండడం, మర్యాద కోసం మొహాన నవ్వు పులుముకోవడం ఆయన స్వభావానికే విరుధ్ధం.నవ్వులో స్వచ్చత, పిలుపులో అత్మీయత వుట్టిపడేవి. నమ్మినవాళ్ళని నట్టేట ముంచకపోవడం, నమ్ముకున్నవాళ్ళకోసం యెంతకైనా తెగించడం జన్మతః అబ్బిన గుణాలు. వీటివల్ల-రాజకీయ జీవితంలో మేలు కన్న కీడే ఎక్కువ జరిగిన సందర్భాలు వున్నా, ఆయన లెక్కపెట్టింది లేదు. తీరు మార్చుకున్నదీ లేదు. ఈ విలక్షణ లక్షణమే వైఎస్సార్ కు రాష్త్రవ్యాపితంగా అభిమానులను తయారుచేసిపెట్టింది. ఎన్నికలు వచ్చినప్పుడు కేవలం తన నియోజకవర్గానికే పరిమితం కాకుండా- రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పార్టీ తరపున ప్రచారం చేయగల ఖలేజాను ఆయనకు కట్టబెట్టింది.

1975 లో నేను రేడియో విలేకరిగా హైదరాబాదులో అడుగుపెట్టిన మూడేళ్ళ తరవాత రాజశేఖరరెడ్డి గారు తొలిసారి శాసన సభకి ఎన్నిక కావడం-మంత్రి పదవి చేపట్టడం జరిగింది. వయస్సు మళ్ళినవాళ్ళే రాజకీయాల్లోకి వస్తారనే అభిప్రాయానికి భిన్నంగా యువరక్తం రాజకీయ రంగంలోకి రావడం అప్పుడే మొదలయింది.

కొంచెం అటు ఇటుగా రాష్త్ర రాజకీయాల్లో అడుగిడిన రాజశేఖరరెడ్డి గారు, చంద్రబాబు నాయుడుగారూ ప్రాణ స్నేహితులుగా మసలిన రోజులకు నేను కూడా సాక్షిని కావడం యాదృచ్చికం. మంత్రి పదవి తనను ముందు వరించినప్పటికీ- చంద్రబాబు నాయుడు గారు సైతం మంత్రి అయ్యేంత వరకూ ఆయన పడ్డ ఆరాటం- ఆనాటి జర్నలిష్టులందరికీ తెలుసు.

రాజశేఖర రెడ్డిగారిని నేను మొదటిసారి చూసింది- ఆ రోజుల్లొ సచివాలయానికి కూతవేటు దూరంలో వున్న సరోవర్ హోటల్ (ఇప్పుడు మెడిసిటి హాస్పిటల్) టెర్రేస్ మీద. సచివాలయంలో జరిగిన ఒక సంఘటన దరిమిలా వివరణ ఇచ్చేందుకు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భం అది.అప్పట్లో ఆయన ఒక తరహా మీసకట్టులో కనిపించే వారు. కానీ, కపటం లేని మందహాసానికి మాత్రం అప్పటికీ, ఇప్పటికీ ఆయనదే కాపీ రైట్. ఇటు హైదరాబాదులోనూ,అటు ఢిల్లీలోనూ వైఎస్సార్ నివాసాలు జర్నలిస్టులతో కళకళలాడుతూవుండేవి. వేళాపాళాతో నిమిత్తం లేకుండా ఆ ఇళ్ళకి వెళ్ళివచ్చే చనువు వుండేది. సుధీర్ఘకాలం రాజకీయ రంగంలో కొనసాగడం వల్ల,పేరుతో పిలిచి పలకరించగల జర్నలిష్టు స్నేహితులు ఆయనకు రాష్త్రంలోని అన్ని ప్రాంతాల్లో వుండడం సహజమే.

2004 లో ఆయన తొలిసారి ముఖ్యమంత్రి కాగానే-ఆయనతోవున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని, కేవీపీ గారి ద్వారా నా మనసులోని మాటని ఆయన చెవిన వేశాను.అప్పటికే కొన్ని ప్రైవేటు టీవీ చానళ్ళు రంగప్రవేశం చేసినందువల్ల-రేడియో కేంద్రానికి వచ్చి తొలి సందేశం రికార్డు చేయడం అన్నది కొద్దిగా ఇబ్బందే.అయినా, ఆయన నా మాట మన్నించి- నేరుగా ఆకాశవాణి కేంద్రానికి వచ్చారు.అలాగే,హైదరాబాదు దూరదర్శన్ లో నేను రిటైర్ కావడానికి ముందు కూడా ఆయన స్టుడియోకి వచ్చి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.

వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన రెండేళ్ళకే నా విలేకరిత్వానికి తెరపడింది. అయినా,ఆ తర్వాత కూడా, వార్షికంగా నిర్వహించే విందు సమావేశాలకు నాకు ఆహ్వానం అందుతూనే వుండేది. రిటైర్ అయిన తర్వాత చాలా రోజులకు జరిగిన-మా రెండో కుమారుడి వివాహానికి-ముఖ్యమంత్రిగా యెన్నో పని వొత్తిళ్ళు వున్నప్పటికీ హాజరై ఆశీర్వదించి వెళ్ళడం- నా పట్ల వారికున్న వాత్సల్యానికి మచ్చుతునకగా భావిస్తాను.

ఆయన ప్రతిపక్షనాయకుడిగా వున్నరోజుల్లో ఎప్పుడైనా కాలక్షేపంగా కలుసుకున్న సందర్భాల్లో రాజకీయాల ప్రస్తావన వచ్చినప్పటికీ- ఆయన నాతో సరదా కబుర్లనే ఇష్టపడేవారు.రేడియో విలేకరిగా నాకున్న పరిమితులను ఆకళింపు చేసుకోవడమే కాకుండా- 'శ్రీనివాసరావుని ఇబ్బంది పెట్టకండయ్యా!' అని తోటి జర్నలిష్టులకి సర్దిచెప్పేవారు.

ఒక విలేకరికి-ఒక రాజకీయ నాయకుడికి నడుమ సహజంగా వుండే సాధారణ సంబంధాన్ని మహోన్నతంగా పెంచి పెద్ద చేసిన పెద్దమనసు ఆయనది. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా పెనవేసుకున్న ఈ బంధం తెగిపోయిన విపత్కర సందర్భంలో- ఆ మహోన్నత వ్యక్తిత్వానినికి నివాళి అర్పిస్తూ-'రెండు కన్నీటి బొట్లు ' రాల్చడం మినహా ఏమీ చేయలేని చేతకానితనానికి చింతించడం తప్ప చేయగలిగింది ఏముంది?వార్త  వెనుక  వాస్తవాలు


 గత కొద్దినెలలుగా పత్రికల్లో వార్తలు, మీడియాలో కధనాలు చదివినప్పుడు మీకేమని అనిపించింది ? అన్న ప్రశ్నకు జవాబులు పలు రకాలుగా వచ్చాయి.

'కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అని అర్ధమయింది. ''అన్ని పార్టీలకీ అధికారం ఒక్కటే పరమావధి లాగుంది'
'వీధి కొళాయిల దగ్గర తగాదాలే నయమనిపిస్తున్నాయి'
'ఎన్నికలకు ముందు పొత్తులు- తరవాత పొత్తులు. ఇన్ని వేషాలు వేసే బదులు ఎలెక్షన్స్ ఎత్తేసి అందరూ కలిసి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటే పోలా! బోలెడు ఖర్చయినా తగ్గుతుంది.'
'ఇన్ని రకాల తిట్లున్నాయన్న సంగతి టీవీ చర్చల ద్వారానే తెలిసింది.'
'ఒక్క మనిషి ప్రపంచం నుంచి నిష్క్రమిస్తే ఇంత గందరగోళమా!'
'నాలుకకు నరం లేదంటే ఏమో అనుకున్నాము. ఇప్పుడు తెలుస్తోంది.సిగ్గు లేకుండా అది ఎన్ని ఒంకర్లు తిరగగలదన్న సంగతి.'
'మీడియా కూడా తక్కువ తినలేదు. వాళ్ళు సయితం రాజకీయాలు నడపగలరని అర్ధమయింది.'
'జనాలకు ఏ విషయం ఎక్కువ కాలం గుర్తుందదంటారు. కానీ, మీడియా పుణ్యమా అని పాత సంగతులన్నీ , తూచా తప్పకుండా ఎప్పటికప్పుడు సింహావలోకనం చేసుకునే వీలు చిక్కింది.'
'లోగడ పత్రికలంటే ఎంతో గౌరవం వుండేది. ఇప్పుడు వాళ్ళు కూడా మనలాంటి మామూలు మనుష్యులే! రాసేవన్నీ ఏదో మనసులో ఉంచుకుని రాస్తున్నారని అనిపిస్తోంది.'
'నాలుగు పత్రికలూ ముందేసుకుని చదివితే మతి పోతోంది. ఒకదానికి,మరో దానికి పోలికలేకుండా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాస్తున్నట్టుగా వుంటోంది.'
'పేపర్లు కొంటున్నామంటే ,టీవీలు చూస్తున్నామంటే - వాళ్ళు రాసేవన్నీ, చూపించేవన్నీ నమ్ముతున్నామని కాదు. వేరే గతి లేక!'

 
     

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

   
పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech