భారత రాష్ట్రపతి, భారత రత్న - డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్

 

తమ తమ రంగాలలో నిష్ణాతులై, విశిష్టత నాపదించుకుని, పేరు ప్రఖ్యాతులనార్జించి "గొప్పతనం" సాధించిన తెలుగువారెందరో ఉన్నారు. వాళ్ళు యెదుర్కున్న ప్రతిబంధకాలు, సంక్లిస్ట పరిస్థితులు, అనుభవించిన నిర్భందాలు, పడిన ఆవేదన, చేపట్టిన దీక్ష, చేసిన కృషి, సాధన, కనపరచిన పరకాష్ట, సాధించిన విజయాలు, ఆ విజయ రహస్యాలు, ఇలాటి విషయాలని పరిశీలించి, సమీకరించి, పొందు పరచి ఈ కధనలలో మీ ముందు ప్రస్తుతీకరిస్తున్నాం.భారత దేశ రెండవ రాష్ట్రపతిగా, ఉప రాష్ట్రపతిగా, ఆచార్యుడిగా, బనారస్ హిందూ విశ్వవియాలయ కులపతిగా, కోల్కటా విశ్వవిద్యాలయ రూపకర్తగా, ఆంధ్ర విశ్వవిద్యాలయ కులపతిగా, ఆక్స్ ఫొర్డ్ విశ్వవిద్యాలయంలో స్పాల్డింగ్ ఆచార్యుడిగా పనిచేశారు ‘భారత రత్న’ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్.

ఈయన తాత్వికుడు, రాజనీతిజ్ఞుడు; తత్వం లో మహా పండితుడు. 1931 లో సర్వేపల్లి గారికి " నైట్ హూడ్" ఇచ్చి గౌరవించారు. సర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అయ్యారు.

సెప్టంబర్ 5, 1888 లో, నేటి తమిల్ నాడు లోని తిరుత్తణిలో సర్వేపల్లి వీరాస్వామి, సీతమ్మ దంపతులకు జన్మించారు. సర్వేపల్లి వారిది అతి సాధారణ బ్రాహ్మణ కుటుంబం. తండ్రి జమిందారు వద్ధ చిన్న ఉద్యోగం చేశేవారు. తిరుత్తణి లో జన్మించిన శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి మాతృ భాష తెలుగు. తన చిన్నతనం తిరుత్తణి, తిరువల్లూర్, తిరుపతి లో గడచింది. మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి ఎం ఏ ఆర్ట్స్ పట్టా అందుకున్నారు. సర్వేపల్లి గారికి, శివకామమ్మ గారితో 1904 లో వివాహం జరిగింది. వీరికి ఐదుగురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి.

చిన్నతనంలోనే భారతీయ తత్త్వం, ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మ సూత్రాలలో మంచి అవగాహన సాధించారు. ఇవి వారి భవితవ్యానికి చక్కటి పునాదివేశాయి. భారతీయ తత్వ వాణిని, మర్మాన్ని లోకాని పరిచయం చేశిన మహత్తర వ్యక్తి.

1918 లో మైసూర్ విశ్వవిద్యాలయంలో తత్వ ఆచార్యుడిగా తన సుదీర్ఘ యాత్ర ప్రారంభించారు. అప్పటికే చాలా రచనలు చేశారు. అవి ది క్వెస్ట్, జర్నల్ ఆఫ్ ఫిలాసఫీ, ఇంటర్నేషల్ జర్నల్ ఆఫ్ ఎతిక్స్ వంటి ప్రముఖ పత్రికలలో ప్రకటించారు.

" ది ఫిలాసఫీ ఆఫ్ రబీంద్రనాథ్ ఠాగూర్ " వీరి తొలి రచన. " ది రీన్ ఆఫ్ రిలిజన్ ఇన్ కాంటెమోరరీ ఫిలాసఫీ " వీరి రెండవ రచన. ఇది 1920 లో వెలువడింది. సర్వేపల్లి గారు రాసిన వ్యాసాలు, పుస్తకాలు, కోల్కటా విశ్వవిద్యాలయం కులపతి, ఆషుతోష్ ముఖర్జీ దృష్టి చూరగొన్నాయి. అక్కడ ఆచార్యపదవి చేపట్టి, చాలా కాలం పనిచేశారు. ఈ తరుణంలో కోల్కటా విశ్వవిద్యాలయం అభ్యున్నతికీ, విశిష్ఠతకి, జన బాహుల్యం మన్ననలు అందుకునే విశ్వవిద్యాలయం గా మార్చడానికి కీలక పాత్ర వహించారు.

1931 లో సర్వేపల్లి గారు ఆంధ్ర విశ్వవిద్యాలయం కులపతిగా చేరారు. 1938 లో బ్రిటీష్ అకాడమి ఫెల్లో గా ఎంపికైయారు. 1939 లో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, కులపతిగా పనిచేశారు. సుప్రసిద్ధ పండిత్ మదన్మోహన్ మాలవ్యా స్థానంలో వచ్చి క్రియాశీలక పాత్ర పోషించారు.

భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన దరిమిళా, విశ్వవిద్యాలయాల సంఘం (యూనివెర్సిటి ఎడ్యుకేషన్ కమీషన్) అధ్యక్షుడిగా ఉన్నారు. 1949 లో సోవియట్ యూనియన్ (రష్యా) కి భారత రాయబారిగా వ్యవహరించారు.

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కొల్కటా విశ్వవిద్యాలయంలో కింగ్ జార్జ్ చైర్ అలంకరించి, చిత్త, నైతిక శాస్త్ర (మెంటల్ అండ్ మోరల్ సైన్సెస్) విభాగ అధ్యక్షుడిగా వ్యవహరించారు. మరికొంత కాలం (1936 - 1952) ఆక్స్ ఫొర్డ్ విశ్వవిద్యాలయంలో స్పాల్డింగ్ ఆచార్యుడిగా పనిచేశారు.

రష్యా అధినేత స్టాలిన్ తో:

1950 లో రష్యా అధినాయకుడు, స్టాలిన్ ని క్రెంలిన్ లో కలసినప్పుడు, భారత దేశం లో ఓ చక్రవర్తి (అశోకుడు), రక్తపూరిత విజయం తరువాత యుద్ధాన్ని విడనాడి, సన్యాసి అయినాడు అని ఉదాహరించారు. అప్పుడు స్టాలిన్ నవ్వుతూ " అవును, కొన్ని మహిమలు జరుగుతూ ఉంటాయి. నేను థియొలాజికల్ సెమినరి (తత్వ శాస్త్ర పాఠశాల - ఇందులో మత బోధకులను రూపొందిస్తారు;) లో ఐదేళ్ళున్నాను అని చెప్పారు.

భారతీయ తత్వాన్ని మళ్ళీ పరిచయం చేశారు. రాధాకృష్ణన్ వెళ్ళిపోతున్న సందర్భంలో స్టాలిన్ ఇలా అన్నారట " నన్ను ఒక రాక్షసుడిలా కాక, మానవ మాత్రుడిననీ, అలా చూడటంలో మీరే ప్రధములు. మీరు వెళ్ళిపోవటం నాకు విచారకరం. మీరు దీర్ఘాయుష్మంతులై ఉండాలి. నాకు ఆ అద్రుష్టం లేదు." అని అన్నారు. అన్న బహు కొద్ది కాలానికే స్టాలిన్ గతించారు.

1953 నుండి 1962 వరకు ఆయన ఢిల్లీ విశ్వవిద్యాలయం కులపతిగా ఉన్నారు. 1954 లో, భారత దేశం అత్యున్నత గౌరవం - " భారత రత్న " అందుకున్నారు. భారత ఉప రాష్ట్రపతిగా వ్యవహరించి, 1962 నుండి 1967 వరకు భారత దేశ రెండవ రాష్ట్రపతిగా ఉన్నారు.

ఆచార్య ఆర్తర్ స్క్లిప్ " ది ఫిలాసఫీ ఆఫ్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ " సంకలనానికి సంపాదకుడిగా ఉండి విలువడించారు. ఈ తరుణం లో స్క్లిప్ప్ ఉత్తరానికి (వినతికి) సమాధానం రాసిన ప్రత్యుత్తర సారం - " మీరు ఇప్పుడు రాసిన దాని కన్నా మరింత యెక్కువ రాసి పంపించమన్నారు. మరి కొన్ని విషయాలు రాసాను. మీరు సంతృప్తి పడతారో లేదో నాకు తెలీదు. మన్నించండి.

నా జీవితంలో జరిగిన ఘట్టాలు చదువరులకి ఉపయోగిస్తాయి అని అనుకోను. మన నుంచి పుట్టుకొచ్చిన విషయాలు అంత ప్రాముఖ్యం సంతరించుకోవు. కోరికలు, భావాలు జన్మని ఘాడం గా, ఆశక్తిదాయకం గా చేస్తాయి. కాని యెందరు తమ ఆత్మలోకి చూసుకుంటారు ". డాక్టర్ సర్వేపల్లి గారి మనసు ఎంత గొప్పదో, వారి ఆలోచనా సరళి ఎంతటి మహోత్కృష్ట స్థానాన్ని ఆపాదించుకుందో చెప్పటానికి ఈ ఉదాహరణ చాలు.

పాశ్చాత్త తాత్వికులు - " వాస్తవికత " సారిస్తున్నాం అని ఒక పక్క అంటున్నా వారి పక్షపాత వైఖరి వారు పెరిగిన సంస్కృతి లోని మత తత్వ ఆలోచనలతో ముడి పడి ఉన్నాయని కుండ బద్దలుకొట్టినట్టు, సూక్ష్మాన్ని, ఆంతర్యాన్ని సూటిగా చెప్పరు.

డాక్టర్ సర్వేపల్లి గారి రచనలు:

డాక్టర్ సర్వేపల్లి గారి రచనలలో కొన్ని ముఖ్య మైనవి:

 • " ది హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ " (1926);

 • " ఇండియన్ ఫిలాసఫీ " (సంపుటి 1, 2);

 • " ది రెలిజియన్ వీ నీడ్ ";

 •  "ది ఫ్యూచర్ ఆఫ్ సివిలైజేషన్ ";

 • " ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్ " (1932);

 • "ది హార్ట్ ఆఫ్ హిందుస్తాన్ " (1936);

 • "ఈస్టన్ రిలిజన్స్ అండ్ వెస్టర్న్ థాట్స్ " (1939);

 • " గ్రేట్ ఇండియన్స్ " (1949);

 • " ఫెల్లోషిప్ ఆఫ్ ఫైత్స్ ",

 • హార్వర్డ్ ఉపన్యాశాలు (1961);

 •  " ది క్రియేటివ్ లైఫ్ " (1975);

 • " లివింగ్ విత్ ఏ పర్పస్ ";

 • " ట్రూ నాలెడ్జ్ " ఉన్నాయి.

1967 లో మరొక కాల పరిమితి రాష్ట్రపతిగా ఉండటానికి సుముఖం చూపించక, మద్రాసు తిరిగి వెళ్ళిపోయారు. 1961 లో జర్మనీ లో " శాంతి " బహుమతి అందుకున్నారు. 1975 లో " టెంపెల్ టన్ " బహుమతి అందుకున్నారు. వచ్చిన మూల్యాన్ని ఆక్స్ ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి విరాళంగా ఇచ్చేశారు. 1989 నుండి వీరి స్మృత్యర్ధం " రాధాకృష్ణ చెవినింగ్ " స్కాలర్షిప్స్ అందజేస్తున్నారు. ఆయన ఏప్రిల్ 17, 1975 లో మరణించారు.

ఓ సందర్భంలో మిత్రులు ఆయన పుట్టినరోజు సంభరం జరుపుతామని ప్రస్తావించినప్పుడు డాక్టర్ సర్వేపల్లి ఇలా స్పందించారు - " నా పుట్టిన రోజు జరిపే బదులు, సెప్టంబర్ 5 (ఆయన పుట్టిన రోజు) " టీచర్స్ డే " (అధ్యాపకుల దినోత్సవం గా) జరపండి అన్నారు. అదే నిజమైంది.

నేటికి ఆయన పుట్టినరోజున అధయాపకులను స్మరిస్తూ, సెప్టంబర్ 5, అధ్యాపకుల దినోత్సవంగా పాటిస్తున్నారు. ప్రతీ యేటా, భారత దేశంలోని విశిష్ఠ అధ్యాపకులను గుర్తించి గౌరవిస్తున్నారు. ఇలా గౌరవించినన్నాళ్లు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన హృదయాలలో ఆదర్శవంతుడిగా నిలచిపోతారు.

 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech