- కాశీవఝ్ఝల శారద

 

 

(నేపథ్యంలో ౩౦ సెకండ్ల పాటు ఎడమవైపు నుండి వేంకటేశ్వర సుప్రభాతం- కుడి వైపునుండి పెద్దగా "శంకర్ దాదా ఎం.బి.బి.యస్. హు హా .. " అనే పాట వినవస్తోంటుంది.)

తాత: ఒరేయ్.. ఒరేయ్ ఏంటిరా ఆ కాకి గోల.. గుండెల్లో దడ పుడ్తోంది. హు .. హా అంటూ ఆ మూలుగుల పాటేంట్రా పొద్దున్నే?..

(మనవడు కుడివైపు నుండి రంగస్థల వేదికపైకి వస్తాడు)

మనుమడు: ఏంటీ?. కాకి గోలా?. నీకసలు మ్యూజిక్ సెన్స్ లేదు తాతా.. ఇది లేటెస్ట్ రాప్ సాంగ్ తెల్సా..

తాత: ఏమిటది.. పాటా?. జాతర్లో డప్పుల్లా ఆ గొడవేంటి?. పాడే వాడి ఆయాసం తప్పితే మాటెక్కడ వినపడి ఛస్తోంది? పాటంటే వినసొంపుగా, శ్రావ్యంగా ఉండి మనశ్శాంతి కలిగించాలి కానీ ఇలా పిచ్చెక్కించి బి.పి. పెంచకూడదురా.

మనుమడు: ఛాల్లే ఊర్కో తాతా.. మరి నీలా లాగుడు పాటలు వినమంటావా?. మీ పాత పాటల్లో హీరోయిన్ రోగిష్టిలాగా నీరసంగా ఒక్కో అడుగూ వేస్తూ హీరో దగ్గరకు నడిచి రావడానికి మొత్తం పాటంతా వేస్ట్. అదిగో వింటున్నావుగా.. సుప్రభాతం - ఎప్పటిదది? నీ చిన్నప్పటినుంచీ అదే విని విని విష్ణుమూర్తికి విసుగొచ్చి వైకుంఠంలో తల పట్టుకుని కూర్చొని ఉంటాడు. ఇప్పుడంతా స్పీడ్ మ్యూజిక్ లే.

తాత:  ఇది మ్యూజిక్ కాదురా .. mu"sick" . విన్నవాళ్ళంతా సిక్కే. మెదడూ, కణతలూ వేడెక్కి పేలిపోయేలా ఉన్నాయి.   మా కాలంలో అయితే...

మనుమడు: అబ్బా, పొద్దున్నే మీ తరం ప్లాష్‌బాక్ మొదలెట్టకు. పాతికేళ్ళుగా నీ ఆటోబయాగ్రఫీ విని వినీ నేను ముసలాడిని అయిపోయాను. తోలుబొమ్మలాటలు, బుర్ర కథలు, హరి కథలు వినమంటావా ఏంటి?. ఇదంతా రాకెట్లు, శాటిలైట్ల కాలం. మీ పాత సినిమాల్లో సోది తప్ప ఏం ఉంటుంది?.

తాత: ఆ కాలంలో అవే అద్భుతం రా. సాంఘిక మార్పులు, పురాణాల్లో నీతులు ఎంత చక్కగా ప్రేక్షకులకు బోధించేవారు. ఏంటిరా మీ తరంలో బోడి స్పీడ్?. కుదురుగా కూర్చునే టైం లేదు, మనశ్శాంతిగా పడుకోలేరు, పొద్దున్నుంచి రాత్రి దాకా పరుగులు తప్ప ఎందుకు బతుకుతున్నారో ఎలా ఉన్నారో తెలుస్తోందా?. నవ్వడం కూడా షెడ్యూల్ ప్రకారం చేస్తున్నారు.

మా తరంలో అయితే పెద్దలంటే గౌరవం, సంస్కృతీ సంప్రదాయాల పట్ల అభిమానం, ఉన్న కాస్తలో సర్దుకునే సంతోషం, శాంతి ఉన్నాయి. మీకు ఎంత ఉన్నా అసంతృప్తే. నిలకడ లేదు.

మనుమడు: అది అసంతృప్తి కాదు తాతా. ఏంబిషన్. ఎంత సాధించినా ఇంకా ఎదగాలనే తపన.

తాత: తపనా ? నీ బొందా?. మళ్ళీ వెధవ కవరింగులెందుకు?.

మనుమడు: ఆఁ !. మరి లేకపోతే మీలాగ లాంతరు పెట్టుకుని వత్తులు చేసుకుంటూ భగవద్గీత చదువుకుంటే మిగిలేది బొగ్గే. మేం చూడు. చంద్రమండలానికి మనిషిని పంపేలా ఎదిగాం.

తాత: ఒరేయ్! మీరు చంద్రుడి మీదకి వెళ్ళొచ్చి పొడిచింది ఏంటి?. మేం భూమ్మీదే ఉండి కోల్పోయింది ఏంటి?. ఎదుగుదలకి కొలమానం సంతోషం, తృప్తిరా.మా కాలంలో అందలాలు ఎక్కకపోయినా నైతిక విలువలు ఉంచుకున్నాం. ఇప్పుడెవి అవి?.

మనుమడు: తరంతో పాటు విలువల డెఫినిషన్ కూడా మారుతుంది తాతా. మనిషి మనుగడని సులభం చేసే పద్ధతిని అనుసరించే స్వేచ్చే విలువ అంటే. అంతే తప్ప ఎవడో గుప్తుల కాలం నాడు రాసిన వాక్యాన్ని అర్థం తెలుసుకోకుండా పొలోమంటూ మందలో గొర్రెల్లా అనుసరించడం కాదు. ఒక్క ముక్కలో మా తరం ప్రగతి అంతా తీసి పారేస్తావా?. తాతా (దణ్ణాం పెడ్తూ) నీలాంటి డి - మోటివేటర్ దేశానికి ఒక్కడుంటే చాలు NASA ఎప్పుడో మూసేసే వారు.

తాత: నీతికి మాటి మటికీ డెఫినేషన్ మారదు రా... ఒక మాట, ఒక భార్య, ఒక ప్రేమ, ఒక పెళ్ళి, పరువు ఇవన్నీ అంతే. ఇలా ఒకరోజు బైక్ మీద ఒకడితో, రేపు కార్లో మరొకడితో వెళ్ళకూడదు.

మనుమడు: నువ్వు చెప్పే నీతులు ఫాలో అయితే తెలుగు సినిమాలో హీరోలా షాలు కప్పుకుని సూర్యాస్తమయం వైపు నడవాల్సిందే. చచ్చే ముందెప్పుడో "ఈ అబ్బాయి చాలా మంచోడు" అని సొసైటీ ఇచ్చే తొక్కలో కాండక్ట్ సర్టిఫికేట్ కోసం జన్మంతా ఇష్టం లేని పనులు చెయ్యాలా? మనం ఎవరితో కలసి ఉంటామో, సరైన వాళ్ళని ఏరుకోవాలంటే డేటింగ్ చెయ్యాలి. అందులో ఏ అవినీతీ లేదు. మీ కాలంలో దేవదాసు పార్వతిలా ఒకళ్ళనే నమ్ముకుంటే చివరికి బతుకు బస్టాండ్ అవుతుంది. ప్రేమకి కూడా బేకప్ లవర్ ఉండాలి తాతా. (జేబులోంచి ఫొటో తీసి చూపిస్తూ) ఇదిగో నా ప్రెజెంట్ గర్ల్ ఫ్రెండ్, ఎలా ఉందో చెప్పు.

తాత:  (కళ్ళ జోడు సర్దుకుంటూ) ఇదేమిటిరా అబ్బాయి ఫొటోలా ఉంది.

మనుమడు: అబ్బ, తాతా అది అమ్మాయే. ఆ హెయిర్ స్టైల్, లేటెస్ట్ ఫాషన్. నీకు తెలీదులే (ఫొటో లాక్కుంటాడు)

తాత: ఆ బట్టలేమిటిరా, లోన వేస్కుని పైవి వేస్కోవడం మర్చిపోయి రోడ్ మీదకు వచ్చేసినట్లుంది. ఫోన్ చేసి చెప్పరాదూ?.

మనుమడు: చాల్లే ఊర్కో తాతా. ఆ డ్రెస్ ఎంతో తెల్సా 200 డాలర్స్. నేనే కొన్నాను.

తాత: అయ్యో. వాడెవడో నీకు బాగానే చెవిలో పువ్వు పెట్టాడు. బిల్లు చిల్లు నీకు, థ్రిల్లు వాడికి అన్నమాట. సాయంత్రం ఆ పిల్లని మనింటికి రమ్మను. నా పంచె కండువా 10 డాలర్లకే అమ్ముతాను, నిండుగా కప్పుకోమను. ఆ మాత్రం డిప్ప కూడా నేనే కొట్టగలను.

మనుమడు: ఆపు తాతా అన్నిటికీ నీ సణుగుడు. ట్రెండ్ ఫాలో అవకుండా, కన్నాంబ కాలంలో ఆవకాయ జాడీని పేక్ చేసినట్లు చీర కట్టుకోమంటావా? కాస్త గాలి ఆడాలా? ఒద్దా?

తాత: కాస్త ఏం ఖర్మ?. బాగానే గాలి ఆడుతుందిలే. ఇదేం ఫేషన్రా నాయనా? రోడ్ మీద పోయే వాళ్ళు నవ్విపోతారు. గట్టిగా చలేస్తే ఆ పీలికలు ఏమి ఆగి చస్తాయి. నడవలేక అవస్థలు పడుతూ ఆ హీల్స్ ఎందుకో, కాలు బెణికితే వెయ్యి డాలర్ల మెడికల్ బిల్ దండగ.. పిశాచంలా ఆ జుట్టూ విరగబోసుకోవడం ఏం అందమో ! నిండుగా చీర కట్టుకుంటేనే ఆందం, గౌరవం. అయినా నీ పిచ్చికీ ఆ పిల్ల వెర్రికీ బాగా కుదిరిందిలే. గంతకు తగ్గ బొంతలా.

మనుమడు: నీ చాదస్థం ఎప్పటికీ తగ్గదు తాతా. మా టెక్నాలజీ, మా సినిమాలు, మా మ్యూజిక్, మా ఫ్యాషన్, ఫుడ్ అన్నీ వేశ్ట్ అని తేల్చేస్తావా? పాత చింతకాయ పచ్చడి అలోచనలూ నువ్వూను.

తాత:  నేను చెప్పిండి నిజమే కదరా?. పచ్చడి ముక్కలు తిన్నా మేమంతా చూడు అరవై ఏళ్ళుగా ఆరోగ్యంగా పిడి రాళ్ళలా ఉన్నాం. మీరు?. రుచీ పచీ లేని ఆ బ్రెడ్ ముక్కలు తింటారు. ఏం కడుపు నిండుతుంది?. పచ్చి చెట్లు ప్లేట్ లో పెట్టినట్లు ఆ Broccoli తింటారు. మేకల్లా పచ్చి పాల కూర ఆకుల్ని తింటారు. ఏం గొప్ప ఆరోగ్యం వచ్చింది?. చీటికీ మాటికీ చిన్న విషయాలకు ఆసుపత్రికి పరుగెడతారు.

మనుమడు: పోనీ మీ ఊరి నాటు వైద్యుడి దగ్గరకు వెళ్తాంలే. మేం తినే వాటిల్లో విటమిన్స్ ఎక్కువ ఉన్నాయి. చద్దెన్నంలో ఆవకాయ తింటే ఏమొస్తుంది నా మొహం. పోనీ నువ్వో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఓపెన్ చెయ్యొ. పిజ్జాలో పప్పు, పేస్టాలో పోపూ వేసి అమ్ముదువు గాని.

తాత: అమ్మ పుట్టిల్లు మేనమామకి ఎరుక అని నీ బోడి కూతలు నా దగ్గర కాదురా. నీ గోలేదో నువ్వు చూస్కో. నా ఏడ్పేదో నేను ఏడుస్తాను. ఆ దిక్కుమాలిన మ్యూజిక్ ఆపి నా సుప్రభాతం పెట్టు. ఆ దిక్కుమాలిన సమర్ధింపులు చాల్లే ఇంక.

మనుమడు: సర్లే నీ సుప్రభాతమే స్పీకర్లో పెట్టుకో. ఊరూ వాడా వినపడి దేవుడెక్కడున్నా ప్రత్యక్షమయ్యేలాగా. నా సాంగ్స్ ipod లో వింటాలే. (హెడ్ ఫోన్స్ చెవులకి పెట్టుకుని నడుస్తుండగా కుర్చీకి కాలు తగిలి పడబోయి నిలదొక్కుకుంటాడు)

తాత: చెవులకి ఎలాగూ డిప్పలు పెట్టావు. కళ్ళకు కూడా మూతలు పెట్టుకున్నావా?. కన్నో కాలో విరిగితే నీ ప్రెజెంట్ గర్ల్ ఫ్రెండ్ నీకో బేకప్ లవర్ని తెచ్చుకోగలదు.

(మనుమడు తల కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు)

(తాత ఎడమ వైపు నుండి నిష్క్రమిస్తాడు)

 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech