ప్రధాన సంపాదకులు:
తల్లాప్రగడ రావు
సంపాదక బృందం:
తాటిపాముల మృత్యుంజయుడు
తమిరిశ జానకి
కస్తూరి ఫణిమాధవ్
పుల్లెల శ్యామ్ సుందర్
అక్కుల కృష్ణ
శీర్షిక నిర్వాహకులు:
మువ్వల సుబ్బరామయ్య
ప్రఖ్యా మధు
విద్వాన్ టి.పి.ఎన్.ఆచార్యులు
ఈరంకి కామేశ్వర్
రాగధేను స్వరూప కృష్ణమూర్తి
జి.బి.శంకర్ రావు
గరికిపాటి నరసింహారావు
డా||బి.వి.పట్టాభిరాం
చొక్కాపు వెంకటరమణ
ఎం.వి.ఆర్.శాస్త్రి
చీకోలు సుందరయ్య
భండారు శ్రీనివాసరావు
తల్లాప్రగడ రామచంద్రరావు
తాటిపాముల మృత్యుంజయుడు
కూచిభొట్ల శాంతి
కస్తూరి ఫణిమాధవ్
అక్కుల కృష్ణ
వనం జ్వాలానరసింహా రావు
సరోజా జనార్ధన్
యండమూరి వీరేంద్రనాథ్
సాంకేతిక సహకారం:
మద్దాలి కార్తీక్
తూములూరు శంకర్
వక్కలంక సుబ్రహ్మణ్యం
లొల్ల కృష్ణ కార్తీక్
పుల్లెల శ్యాంసుందర్
ముఖచిత్రం :
పేరి రామకృష్ణ
వెబ్ రూపకల్పన :
సి.కృష్ణ
 

 

 

 

.వె.|| భరత భూమి గన్న ప్రాచీనభాషని,

తూర్పిటాలియన్ను కూర్పనియును,

దేశభాషలందు తెలుగు లెస్సని కాదు!

మాతృభాషనెటుల మరువ గలవు?

 

ఈనాడువారి చిత్రం

 

టీవల తెలుగులో మాట్లాడటమే నేరమంటూ కడప జిల్లా మైదుకూరులోని సెయింట్ జోసెఫ్ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే. ఇంగ్లీషులో సరిగా మాట్లాడ లేదనే నెపంపై, ఇద్దరు చిన్నరుల మెడలలో " నేనెప్పుడూ తెలుగులో మాట్లాడను " అని బోర్డులు వేసి, ఒక కొత్త రకమైన శిక్షను విధించారు. ఈ సంఘటన పత్రికల లో వచ్చినా, మన ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి చూస్తే, మనసులోని ఆవేశం కట్టలు తెంచుకుని ఒక ప్రతీకారాన్ని కోరుకుంటోంది. ఒక సామాజిక చైతన్యాన్నీ, విప్లవాన్ని ఆహ్వానిస్తోంది.

 

ఆశ్చర్యమేమిటంటే ఇది జరిగింది ఏ అమెరికాలోనో, పోనీ ఇతర రాష్ట్రాలలోనూ కాదు. అలా అని కనీసం ఒక హైదరాబాద్ వంటి కాస్మొపాలిటన్ సిటీ ఐనా కాదు. మైదుకూరు వంటి చిన్నచిన్న ఊళ్ళలో కూడా తెలుగును నిర్మూలించే కార్యక్రమాలను చేపట్టారంటే అది మన తెలువాడికే చెల్లింది. ఈ తెలుగు నిర్మూలనా పధకాలకు త్వరలో ప్రభుత్వం గ్రాంటులు ఇచ్చినా ఆశ్చర్యపడనవసరంలేదు.

 

తెలుగు భాషా బోధనలో పద్యాలు అనవసరం అన్న వాదనలు విన్నాం. పాఠ్యపుస్తకాలలో పద్యభాగాన్ని పూర్తిగా నిర్మూలించేసాం. మన భాషలో ఇన్ని అక్షరాలు అనవసరం అనే వాదనలు విన్నాం, ఇప్పుడు మన పాఠ్యపుస్తకాలలో కొన్ని అక్షరాలను సమూలంగా నరికివేయడం చూసాం. ఫస్ట్ లాంగ్వేజుగా వున్న తెలుగుని తర్డ్ లాంగ్వేజు హోదాకు అతిత్వరగా మార్చేసాం. కొన్ని విద్యాలయాలలో ఐతే అసలు తెలుగునే నేర్పరట. అటువంటి విద్యాలయాలలో చదివామని సగర్వంగా చెప్పుకుని తిరిగే విద్యార్థులను చూస్తున్నాం. ఇప్పుడు తెలుగులో మాట్లాడటమే నేరం అని తెలిపే నిరంకుశ సంకుచిత మిషినరీ పాఠశాలలను చూసి తరిస్తున్నాం.

 

అసలు ఈ మిషనరీ పాఠశాలలకు తమపిల్లలను పంపే తలితండ్రులననాలి, మదరాసాలలా దినదినాభివృద్ధిచెందుతున్న ఈ కాన్వెంటు బడులను ప్రొత్సహించే ప్రభుత్వాన్ననాలి. ఈ సంఘటనే మనకు ఒక కనువిప్పును కలిగించి, ఇటువంటి పాఠశాలా విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిషేదించాలి. 

 

తెలుగు ప్రాచీన భాషగా గుర్తింపబడ్డది అన్న సమాచారం విని ఆనందించాలో, లేక తెలుగు ప్రాకృత పాళీ భాషలలా కాలగర్భంలో కలిసిపోనున్నదని బాధపడాలో తెలియకుండా వుంది. నేడు తెలుగులో ప్రభంద కావ్యాలు వ్రాసే వారులేరు సరే, పోనీ సరైన కథలు వ్రాసే వారి సంఖ్య కూడా తగ్గిపోతోంది. పద్యాలూ, ఛందస్సుల సంగతి మరిచేపోయాం సరే, సినిమా పాటలు వింటుంటే అసలు భావగీతాలు అన్న మాటకే అర్థం లేకుండా పోతోంది. ఇది మన భాష పరివ్యాప్తి, అభివృద్ధి.

 

ఇక్కడ అమెరికాలో మా పిల్లలు తెలుగులో మాట్లాడితే చాలు అనుకుంటున్నారు తల్లి తండ్రులు. వారివారి పిల్లలకు తెలుగు నేర్పించాలని తపన పడుతున్నారు. సిలికానాంధ్ర చేపట్టిన అనేక కార్యక్రమాలలో 'మనబడి' ని ఒక మహత్తర రూపకల్పనగా కొనియాడుతూ తమ తమ తాహతును బట్టి తమ సహాయసహకారాలందించడమే కాకుండా, ఉపాధ్యాయురాలూ, ఉపాధ్యాయుడూ కూడా పైసా వేతనం స్వీకరించకుండా నేర్పించాలని తపన పడుతున్నారు. మన సంస్కృతిని నిలుపుకోవాలని, తమ భాషను పరిరక్షించుకోవాలనీ, తమ అంధ్రభూమి గర్వపడేలా తమ చిన్నారులు తమ భాషా సంప్రదాయాలను నిలుపుకోవాలనీ తాపత్రయ పడుతున్నారు.

 

మరి అక్కడ మన ఆంధ్రభూమిపై పరిస్థితి ఇందుకు భిన్నంగా విరుద్ధంగా కనిపిస్తోంది. అందరూ తమ పిల్లలు ఆంగ్లం నేర్చుకోవాలనీ, కాన్వెంటు చదువులే తమను కాపాడతాయనీ, ఆంగ్ల సంభాషణే తమ అభివృద్ధికి చిహ్నమనీ భావిస్తున్నారు. మనల్ని మనం కించపరుచుకోవడమే మన ఔన్నత్యం అనీ, మనదంటూ ఒక సంస్కృతే లేదనీ గర్వంగా చెప్పుకునేవారు రోజురోజుకీ పెరిగిపోతున్నారు.

 

ఇదివరకు  తెలుగుగడ్డ వదలి ఇతర రాష్ట్రాలకు, దేశాలకూ వలస వెళ్ళవలసి వచ్చినవారిలో, ఇతరభాషల ప్రభావము కొంత కనపడటాన్నే వింతగా అనుకునేవాళ్ళము. కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో పుట్టి పెరిగిన వాళ్ళ పరిస్థితి అంతకు మించి అద్వాన్నంగావుంది. చాలామందికి తెలుగు వ్రాయడం, చదవడం రాదు. మరికొంత మందికి మాట్లాడటం కూడా రాదు. మాకు వచ్చు అని అనుకునే అనేక మందికి ఉచ్చారణ దోషాలు అనేకం. ఒక తెలుగు ఉపాధ్యయుడు మొన్న ఇలా అంటున్నాడు " మేము మా చుట్టాల వాల్ల ఇల్లో పెల్లికి వెల్లాము ".  అలా అని వాడికి ఇంగ్లీషు అయినా వచ్చి చచ్చిందా అంటే అదీ రాదు. వాడిలో ఏమి చూసి ఉపాధ్యాయ పదవి కట్టబెట్టారో, వాడి దగ్గిర నేర్చుకున్న విద్యార్థులు ఇంక ఏమి నేర్చుకుంటారో భగవంతునికే తెలియాలి.

 

భాషాభివృద్ధిపధంలో ఇతరభాషల ప్రభావం తప్పుకాదు. పరభాషా పదాల సంగమం తప్పుకాదు, పద రూపాంతరం తప్పుకాదు. కానీ మన భాషను మరువడం, నేర్వకపోవడం, అభివృద్ధి పధంలో ఒక ప్రణాళికా కాదు, ఫ్యాషను అంతకన్నా కాదు, కాకూడదు. అది నిజానికి ఒక నేరమే అవుతుంది సిలికానాంధ్ర పుట్టింది అమెరికా మీదనేనైనా, అవసరమైతే ఆంధ్రదేశంలోకూడా తెలుగు పరివ్యాప్తికీ, పరిరక్షణకూ అవసరమైనంత కృషిని చేయడాని సిద్ధంగా వుంది. యజ్ఞంలో, విప్లవంలో, సామాజిక చైతన్యంలో  మీరు కూడా సమిధలు కావాలని కోరుకుంటోంది. తెలుగు మన భాషని గర్వంగా చెప్పుకుందాం, తెలుగులో మాట్లాడుకుందాం, మాట్లడిద్దాం!!

 

మీ

రావు తల్లాప్రగడ

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech