దేముడున్నాడా

 

 

మీ సైకాలజిస్టులాంటి వాళ్ళు కూడా దేవుణ్ణి నమ్ముతారా ఆశ్చర్యంగా ఉందే అన్నాడొకాయన,  నేనూ దేవుణ్ణి నమ్ముతానని తెల్సిన తర్వాత.

"ఏం?. సైకాలజిస్టులు, సైక్రియాటిస్టులు, హిప్నోటిస్టులు, మెజీషియన్లు దేవుణ్ణి నమ్మరనుకున్నారా?. ఆ మాటకొస్తే భగవంతుణ్ణి త్రికరణ శుద్దిగా నమ్మేవారిలో వారి శాతమే ఎక్కువ"

" అయితే ఓకె. నేను భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మాను. నాకు ఊహ తెలిసినప్పటి నుండి రోజూ ఎంతో కొంతసేపు ప్రార్ధనో, పూజో చేస్తూనే ఉన్నా కానీ ఇంత కాలం నేను చేస్తున్న పూజలన్నీ వ్యర్ధమయ్యాయి..." బాధగా ఆగాడు.
"ఇంతకీ జరిగిందేమిటి?"

"అంతా జరిగిపోయింది. ఇప్పుడు చావొక్కటే మార్గంగా కనిపిస్తోంది. ఏం చెయ్యాలో పాలుపోవడంలేదు."

"ఏం ఫర్వాలేదు. ప్రతి సమస్యకీ ఒక పరిష్కారం ఉంటుందని మర్చిపోకండి. అది మీకు తట్టకపోవఛ్ఛు. నేను చెప్పగలనేమో ప్రయత్నిస్తాను" అన్నాను ధైర్యం చెబుతూ.

"నేను కష్టపడి చదువుకుని, దేవుడి దయవల్ల ఇంజినీరింగులో సీటొచ్చి ఆయన దయవల్ల డిస్టింక్షన్ లో పాసయ్యి ఓ పెద్ద కంపెనీలో చేరి మంచి పేరు తెచ్చుకున్నాను."

"ఇప్పటికి మూడు సార్లు ఆదేవుడు దయ చూపాడు"

"ఆగండి.. ఆ తరువాత దెబ్బ కొట్టాడు. ఉద్యోగంలో చేరాను. అనేక అద్భుతాలు చేసి కంపెనీకి లాభాలు ఆర్జించి పెట్టాను. సొంత కంపెనీ తెరిస్తే ఎలా ఉంటుదన్న ఆలోచించి మొదలెట్టాను. వేరే రాష్ట్రం వాణ్ణి కనక నేనిక్కడికి వచ్చి వ్యాపారం చేయడం ఇక్కడ వాళ్ళకు నచ్చక ఎన్నో సమస్యలు సృష్టించారు. అప్పుడు నన్ను దేముడు ఆదుకోలేదు. ఆ సమయంలోనే పెళ్ళయింది. మామగారు, నా పాత కంపెనీ సెక్రటరీ ఆ కంపెనీ అమ్మెయ్యమన్నారు. నేనొప్పుకోలేదు. ఓ ఫైనాన్శియర్ దగ్గరికెళ్ళాను. ఆయన విచిత్రంగా ప్రవర్తింఛి నన్ను పంపించివేశారు ఇప్పుడు మీ దగ్గరకొచ్చాను"

"అంటే?. ఆయనెలాంటి మనిషి?"

"చాలా వింత మనిషి. విచిత్ర మనస్తత్వం. విజయనగర్ కాలనీలో ఉంటారు. ఆయన ఆఫీసులో రిసెప్షనిస్ట్ బదులు రెండు తలుపులున్నాయి. ఒక దాని మీద 50 లక్షల పైన అని, రెండావదానిమీద 25 లక్షల పైన అని రాసి ఉంది. రెండో తలుపు తోసుకుని వెళ్ళాను. అక్కడ మళ్ళీ రెండు తలుపులు... పిఛ్ఛివాడేమోననిపించింది. వాటిమీద 25 వేలు ఆదా చేశారా అని, ఆదా చేసినదేమీ లేదు అనీ రాసున్నాయి. రెండో తలుపు తీసుకుని వెళ్తే అది రోడ్డు.. అంటే బయటికి పంపేసాడు. చిత్రమైన మనిషి. అలా మాటా మంతీ లేకుండా అలా చేయడం న్యాయమా?. "

"అంటే కనీసం వందో వంతు కూడా ఆదా చేయలేనివాడు వ్యాపారానికి అనర్హుడు అని అతడి ఉద్దేశ్యం. చాలా సరదాగా ఉందే!. తరువాతేం చేశారు?"

"ఏముంది?. దేవుణ్ణి తిట్టుకుంటూ మీదగ్గరకొచ్చాను. ఇప్పుడు నన్నేం చెయ్యమంటారు?. "
"దేవుడి గురుంచి నేనో కథ చెబుతా వింటారా"

"నేను కౌన్సిలింగ్ కి వస్తే కథ చెప్తానంటారేమిటి"

"కథల్లేకుండా కౌన్సిలింగుండదు. కథలోనే కౌన్సిలింగ్ దాగి ఉంటుంది. ఓ గ్రామంలో మీలాంటి మహా భక్తుడుండేవాడు. ఓ సారి ఆగ్రామానికి వరదలొచ్చాయి. ఇంటివాళ్ళంతా బయటకొచ్చేసి, మీరూ రండి అన్నారు. లేదు, లేదు, నా దేవుడు రక్షిస్తాడు అన్నాడా భక్తుడు. వరద తీవ్రత ఎక్కువయ్యింది. భక్తుడు ఇంటికప్పుమీదకెక్కి కూర్చున్నాడు. ఇంతలో ఓ పడవలో కొందరొచ్చి పడావలోకి దూకెయ్యమన్నారు. ఏం ఫర్వాలేదు, నా దేవుడున్నాడు మీరు పొండి అన్నాడతను. వరద ఉద్ఢృతమై, ఇల్లు మునిగి, పక్కనే ఉన్న పెద్ద చెట్టెక్కి చిటారు కొమ్మని పట్టుకుని వేళ్ళాడుతుండగా ఓ హెలికాప్టర్లో కొందరొచ్చి తాడు అందించారు. నా దేవుడున్నాడు నేను రాను అని వదిలేశాడు. వరద ముంచుకొచ్చి చెట్టు కూడా మునిగింది. ఆ భక్తుడు కూడా నీటిలో మునిగి మరణించాడు. స్వర్గానికెళ్ళాక దేవుడిని కలిసి, ఛీ, నువ్వసలు దేవుడివేనా ఇంత మహా భక్తుడిని నిర్లక్ష్యం చేసావు. భూలోకంలో నన్ను చంపి నీ పరువు నువ్వే తీసుకున్నావు. నిన్నిక ఎవరూ పూజించరు. అసలు నన్నెందుకు రక్షించలేదు చెప్పు అంటూ గదమయించాడు.

అప్పుడు దేముడన్నాడు " నిజమే నిన్ను రక్షించాలనే పడవనూ, హెలికాప్టరునూ పంపాను. నువ్వు వాళ్ళ మాట వినలేదు. నిన్ను ఆదుకునే యేర్పాట్లు చేస్తే తిరస్కరించావు. నన్ను నిందించినందుకు నిన్నిప్పుడే నరకానికి పంపుతున్నాను ఫో!.. " అన్నాడు. ఈ కథ వింటే ఏం తెలిసింది?. "

"అర్ధమైంది. నను కష్టాలనుండి కాపాడటానికి మా మామ గారిని, సెక్రటరీని దేవుడే పంపించారంటారు. అయితే ఇప్పుడెలా?. దేవుడు నాకింక సహాయం చెయ్యడంటారా?"

"మీలాంటి వారు వ్యాపారానికి పనికిరారు. మీరు వ్యక్తిగా కన్నా సంస్థలో భాగంగా బాగా పని చేస్తారు. మీ కంపెనీ లీజుకివ్వడమో, అమ్మెయ్యడమో చేయండి. అవసరమనుకుంటే ఆయా రంగాల్లో కన్సల్టెంటుల్ని కలవండి." అంటూ లేచాను.

 
 

Dr. బీ వీ పట్టాభిరాం:

బీ వీ పట్టాభి రాం, పరిచయం అక్కర్లేని పేరు...ఎన్నో ఏళ్ళుగా మేజిక్ రంగం లోనూ, ఇటు సైకాలజీ రంగంలోనూ తనదైన ముద్రతో ఎంతో మందికి స్ఫూర్తి కలిగించే అద్భుతమైన రచనలు అందిస్తూ, అనేక మంది యువతకి లక్ష్య సాధన వైపుకు నడిపించే ట్రైనింగ్ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్న డాక్టర్ బీ వీ పట్టాభిరాం రచనల సమాహారం ఈ "పట్టాభిరామాయణం".

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

   
పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech