"సమస్యాపూరణం:

క్రింది "సమస్యని" అంటే వ్యాక్యన్ని యదాతధంగా ఒక పద్యంలోకి ఇమిడ్చి వాడుకుంటూ రాయాలి. ఒకవేళ పద్యం కాకపోయినా ఒక కవిత రాసినా కూడా వాటిని మేము సగౌరవంగా స్వీకరిస్తాము. మీ జవాబులు -మెయిల్ (విద్యుల్లేఖ) ద్వారాకాని (rao@infoyogi.com)  ఫాక్స్ ద్వారాకానీ (fax: 408-516-8945) మాకు డిసెంబర్ 20 తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము

 

ఇక్కడ రెండు సమస్యలను ఇస్తున్నాం. ఈ రెండికీగానీ, లేక ఏ వొక్క దానికైనాగానీ మీరు మీ పూరణలను పంపవచ్చు

 

ఈ  మాసం సమస్యలు

కం.|| పేకాటాడుతు వివాహ పేరంటమెలా?

 

తే.గీ.|| దేవుడే దిగి వచ్చును దేహముంటె!

 

క్రితమాసం సమస్యలు(కృష్ణ అక్కులుగారు ఇచ్చిన సమస్యలు)

 

కం.|| పలువురు తండ్రుల తనయడు భక్తితొ మ్రొక్కెన్!

ఆ.వె|| కంది పప్పు లేక కందిపోయె ముఖము!

 

ఈ సమస్య లకు వచ్చిన ఉత్తమ పూరణలు ఇలా వున్నాయి.

మొదటి పూరణ -  వేదుల బాలకృష్ణమూర్తి, శ్రీకాకుళం

ఆ.వె.|| అమిత పుష్టినిచ్చు ఆకుకూరలు లేక

బలము నిచ్చు కందిపప్పు లేక

కందిపోయె ముఖము, గనుక భుజింపుడీ

పప్పు, ఆకుకూర,పాలు పండ్లు

 

కం.||     ఇల కన్న తండ్రియు, ధన

విలసితుండగు పోషకుండు విద్యను నేర్పే

కులపతి తండ్రులె అనుచును

పలువురు తండ్రుల తనయుడు భక్తిని మ్రొక్కెన్

 

రెండవ పూరణ - యం.వి.సి.రావు, బెంగుళూరు,

కం||     గెలువంగ పద్మవ్యూహము

                   పిలిపించగ దారినెరుగు పిన్నవయస్కున్

                   విలపించు మాత్రుమూర్తికి 

                   పలువుర తండ్రుల తనయుడు భక్తితొ  మ్రొక్కెన్.

   

ఆ.వె||    కందిపప్పులేక కందిపోయె ముఖము

                   ఉన్నడబ్బుకేమొ ఉప్పు రాదు

                   అత్తగారు వస్తె అసలేమి శరణంచు

                   అబల అడిగె ధవుని ఆర్తితోడ. 

 

మూడవ పూరణ -   యం.వి. సుమలత

ఆ.వె.|| వరద లాయె పంట వాగులెల్ల మునిగి

వంద లిచ్చి కొనగ వ్యదలు ఆయె

కంది పప్పు లేక కంది పోయె ముఖము

కొదవ గాదె కంది కొనెద మన్న

 

నాల్గవ పూరణ -   జగన్నాథ రావ్  కె.ఎల్

ఆ.వె.||   క్రికెటు గెలుపు గూర్చి బకెటు నిండుగ కంది

                   పందెమేసుకొనిరి పందెగాళ్ళు

                   కందిపప్పు లేక కందిపోయె ముఖము

                   పప్పు పోలిసొచ్చి పట్టుకెళ్ళె

 

ఐదవ పూరణ- అక్కుల కృష్ణ, శాన్ హోసే, కాలిఫోర్నియా

కం||     కిలకిల నవ్వుచు గలగల

                   పలుకుచు పెద చిన్ననాన్న బాహువులందున్ 

                   చెలువములు మీర పెరిగిన

                   పలువురి తండ్రుల తనయుడు భక్తితో మ్రొక్కెన్ 

 

ఆ.వె||    పందికొక్కులవలె బ్లాకులో పప్పును

                   దాచి వర్తకులు అధనపు ధరలు

                   పలుక తెలుగు నాట పండుగ దినమున

                   కంది పప్పు లేక కంది పోయె

 

కం||     బలరాముని సోదరి వల

                   పుల తనయుడు వలచి నిలచి వుత్తర మదిలో

                   కల పెళ్ళికళగ మారగ

                   పలువురి తండ్రుల తనయుడు భక్తితో మ్రొక్కెన్ 

 

ఆరవ పూరణ - పుల్లెల శ్యామసుందర్, శాన్ హోసే, కాలిఫోర్నియా

కం//    ఇలలో ఇంపగునొక స్త్రీ

వలువలు తా మార్చినటుల పతులను మార్చెన్

నలుగురు 'నాన్న'లు కలయా

పలువురి తండ్రుల తనయుడు భక్తితొ మ్రొక్కెన్

 

ఏడవ పూరణ తల్లాప్రగడ రావు, శాన్ హోసే, కాలిఫోర్నియా

 

కం||     తలచుతు దేవునె తండ్రని

కొలిచెను దేవుల సకలము, కూరిమి తోడన్!

వెలసిన భక్తుడె అతడై,

పలువురి తండ్రుల తనయుడు భక్తితొ మ్రొక్కెన్!

 

ఆ.వె.|| కందిపప్పు లేదు కొందాము అంటేను

కంది పప్పు లేక కంది పోయె ముఖము

అంధ్రులేల సిలికనాంధ్రులన్ మరచేరొ

పప్పులేదనెట్ల చెప్పవలెను?

 

 
     

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు

ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech