me.jpg

జ్యోతిష్యులు - డా. పిడపర్తి సుబ్రహ్మణ్యం.

బెనారస్ హిందు విశ్వవిద్యాలయంలో ఆచార్య(MA) మరియు చక్రవర్తి(Ph.D) పట్టాలను పొంది రాష్ట్రీయ సంస్కృత సంస్థానంలో జ్యోతిష్య శాస్త్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పని చేస్తున్నారు.               జ్యొతిష్య శాస్త్ర సంబంధిత అధ్యయనంలో విశేషమైన కృషిని, సేవలను అందిస్తున్న డా. పిడపర్తి సుబ్రహ్మణ్యంగారి ని సుజనరంజని పాఠకులకు పరిచయం చేయడానికి గర్విస్తున్నాము..

  

http://www.jagjituppal.com/images/2aries.gif

            మేషరాశి

అశ్విని (అన్ని  పాదాలు), భరణి (అన్ని  పాదాలు), కృత్తిక (మొదటి పాదం) 

 

జాతకులపై అధిక ప్రభావమును చూపు గ్రహములు శని గురులు. కానీ అల్పకాలమునందు ప్రభావమును చూపు మిగిలిన గ్రహములు కూడా తాత్కాలికముగా శని గురులకన్నా అధిక ప్రభావమును అప్పుడప్పుడు చూపుతాయి. ప్రస్తుతము ఈ డిశంబరు మాసమునందు ఈ రాశివారల పరిస్థితి అదే. మాసము ప్రారంభమునుండీ శని వీరికి అనుకూలముగా నున్నాడు. మొదటి వారము తరువాత గురుడు కూడా అనుకూల పరిస్థితికి చేరుతున్నాడు. అందువలన వీరికి ఈ నెల అంతయూ అనుకూలముగా నుండును.  ఆ కారణముగా వీరికి సమాజము నందు పలుకుబడి పెరుగు అవకాశమున్నది. కార్యములయందు సాఫల్యము, విరోధులపై విజయమును పొందుదురు. నూతన గృహనిర్మాణము చేయు అవకాశమున్నది. ధన, ధాన్యలాభములు ప్రస్ఫుటముగా కనిపించుచున్నవి.

ప్రతికూల ప్రభావము చూపుచున్న కుజ రవి శుక్రుల కారణముగా అనవసరపు ప్రయాణములు, అనవసరపు ఖర్చులు, రోగములు, చివరి నిమిషములో పనులు నిలిచిపోవుట, దుర్వార్త శ్రవణము మొదలుగునవి సంభవించు అవకాశమున్నది. కావున వీరు ప్రయత్నములను ఆపకుండ సహనముతో పని జేయుట ద్వారా ఈ మాసము నందు అనుకూల ప్రభావమును పొందగలరు. 

http://www.jagjituppal.com/images/2taurus.gif

వృషభరాశి

కృత్తిక (2,3,4 పాదములు), రోహిణి (అన్ని పాదాలు), మృగశిర (1,2 పాదాలు

 

ఇది ఈ రాశివారికి తటస్థమైన మాసము. చేయు పరిశ్రమకు సమానముగా లేక తక్కువగా వీరికి ఫలములు లభించును. అనగ భాగ్యపరముగా లభించవలసిన అంశము వీరికి లభించుటలేదు. ఆ కారణముగా విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగస్థులు ఎవరయినా ఈ మాసము నందు అధిక ఫలితములకై అధికముగా పరిశ్రమించవలసి యుండును. ప్రయత్నమునకు అనుకూలముగా ఫలము ఉండకుండిననూ ప్రయత్నమును ఆపరాదు. ఈ మాసమునందు ఏ పనినైనా సాహసముతో చేయవలెను. ఆ విధముగా చేయు పనులు ఎక్కువ ఆనుకూల ఫలములను చూపు అవకాశమున్నది.

          ఈ మాసము నందు పనులయందు శ్రద్ధ తగ్గును. పనిచేయవలెనన్న ఉత్సాహము తగ్గును. కావున బలవంతముగా పని చేయవలసిన అవసరమున్నది. తరచు భయాందోళనలకు గరయ్యే అవకాశమున్నది. వ్యతిరేకించువారు పెరుగుదురు. బంధువులనుండి సహాయమును ఆశించవలసిన అవసరములేదు.  రాశివారలకు ఈ మాసమునందు మానసిక ఉత్సాహము అత్యంత ఆవశ్యకము. దాని లోపము కారణముగా పనులు మందకొడిగా సాగు అవకాశములెక్కువ. నలుపు మరియు పసుపు పూలతో శివుని పూజించిన కొంత ఊరట లభించగలదు.

http://www.jagjituppal.com/images/2gemini.gif

మిథునరాశి

మృగశిర (3,4 పాదాలు), ఆరుద్ర (అన్ని పాదాలు), పునర్వసు (1,2,3 పాదాలు)

 

పడుతున్న కష్టములు మరియు నష్టములకు అంతు కనిపించని పరిస్థితి వీరిది. అంతా అయోమయము మరియు అగమ్యగోచరముగా కనిపించును.  ఏ కార్యములు పూర్తి అగుచున్నట్లు కనిపించవు. తారాసపడేవారు చాలామంది దుర్జనులు మరియు సరియైన మార్గమును చూపలేరు. తెలియని భయము వెంటాడే అవకాశమున్నది. ఈ మాసమునందు పై అధికారులు అనుకూలముగా నుండు అవకాశములేదు కావున అధికారుల దగ్గర కొంచము అకువను ప్రదర్శించవలసియున్నది. మానసిక, శారీరిక పీడ చాలా వరకు జాతకులను ఇబ్బందిపరచు అవకాశమున్నది.

          ఈ రాశివారలకు రెండు గ్రహములు ముఖ్యముగ అనుకూల ఫలితములనిచ్చుచున్నవి. అవి గురుడు మరియు శుకృడు. తత్ఫలితముగా భార్య మరియు క్రింద పనిచేయు ఉద్యోగులు అనుకూలముగా వ్యవహరింతురు. అభీష్టములు నెఱవేరు అవకాశమున్నది. స్త్రీ జనులవలన లాభములు, అర్థప్రాప్తి, వంశాచారమునకు అనుకూలమైన పనులు జేయుట, మంచి భోజనము మరియు గృహమును నిర్మించుట మొదలగు పనులను జేయు అవకాశమున్నది. కానీ పాపగ్రహముల ప్రాబల్యము ఎక్కువగా నుండుటచే ఈ శుభఫలితములు తక్కువస్థాయిలో నుండునన్న విషయమును మనసు నందుంచుకొనవలెను. శుభగ్రహముల ప్రాబల్యమును పెంచుటకు శనివారములయందు శివునికి తైలాభిషేకము మరియు గురువారములయందు పసుపుపూలతో శివునికి పూజలు జరిపించగలరు.

 

http://www.jagjituppal.com/images/2canc.gif

కర్కరాశి

పునర్వసు (4 పాదం, పుష్యమి (అన్ని పాదాలు),ఆశ్లేష (అన్ని పాదాలు)

 

కుజుని కారణముగా ఈ రాశివారు ఈ నెలయందు తీవ్రమైన ఒత్తిడికి గరి అయ్యే అవకాశమున్నది. గురుని స్థితికూడా వీరికి వ్యతిరేకముగా నుండుటచే పరిస్థితులను అనుకూలముగా మార్చుకోవడం ఒక అగ్ని పరీక్షతో సమానము. ఈ సమయములో వీరికి సంయమనము ఎంతైనా అవసరము. పై అధికారులు మరియు ప్రభుత్వోద్యోగుల నుండి సమస్యలు ఎదురయ్యే అవకాశములెక్కువ. కార్యాలయములందు పాత కేసులను తిరుగదోడు అవకాశమున్నది. దురుసగా ఈ సమయమునందు ప్రవర్తించరాదు.

          ఈ రాశివారలకు పూర్తిగా అనుకూలముగానున్న గ్రహములు శుకృడు మరియు శని. మిగిలిన గ్రహముల వలన కలుగు ఇబ్బందుల కన్నా ఈ గ్రహములు ఇచ్చు సుఖము ఎక్కువ. ఈ గ్రహముల కారణముగా స్వజనులయందు పరపతి పెరుగును. మితృలను కలియుట, భార్యాపిల్లలతో సమయమును గడపుట, సభలయందు, సమావేశములయందు పాల్గొనుట, మానసికసుఖము, అనుకొన్న పనులు నెరవేర్చుకొనుట, స్వస్థానమునకు చేరుకొనుట మరియు మంచి ఆరోగ్యమును కలిగియుందురు.  ఫలములు మరింత అనుకూలముగా నుండుటకు ఎఱుపు పూలతో కార్తికేయుని లేక సుబ్రహ్మణ్యేశ్వరుని మరియు పసుపు పూలతో శివుని పూజించవలెను.

 

http://www.jagjituppal.com/images/2eo.gif

సింహరాశి

మఖ(అన్ని పాదాలు), పూర్వ ఫాల్గుణి(అన్ని పాదాలు), ఉత్తర ఫాల్గుణి (1 పాదం)

అన్ని రంగములయందూ ప్రస్తుతము నత్త నడక నడచుచున్నది. పరిస్థితులయందు ఏ మాత్రమూ ఆనుకూల్యత కనబడుట లేదు. ఏ గ్రహమూ అనుగ్రహముద్రలోనున్న భావము కనిపించుట లేదు. ఈ రాశివారలకు ఇది పూర్తిగా పరీక్షా సమయము. సుఖహాని, సమయములేని బోజనము, ప్రయాణమునందు విఘ్నములు, మానసికక్లేశములు రవివలన, బంధువైరము, ధనక్షయము, దేహపీడ కుజునివలన, అకస్మాత్తుగా కలహములు బుధునివలన, శతృవృద్ధి మరియు ధననాశనము శుకృనివలన, కార్యహాని, సంచారము, స్వజనద్వేషము శనివలన సంభవించుచున్నవి.

          మొదటివారములో రాశి మారుచున్న గురుడు మాత్రము ఈ రాశివారలకు తగు రీతిలో సహాయపడడానికి ప్రయత్నిస్తున్న ఏకైక గ్రహము. ఆ గురుని ప్రభావమువలన అధికారులను కలియు అవకాశమున్నది. ఆరోగ్యము అనుకూలముగా నుండును. అనుకున్న పనులు సాధించు అవకాశములెక్కువగా నున్నవి. పై రెండు మార్పులూ ఏకకాలములో జరుగుచున్నవి. ఇందులో ప్రతికూల గ్రహముల బలము ఎక్కువగానున్న, పైన పేర్కొన్న ఇబ్బందులు, గురుడు బలముగానున్న ఇప్పుడు వివరించిన అనుకూలఫలితములు కలుగును. కావున ఈ రాశివారు ఈ నెలయందు గురుని మరింత బలీయుని చేయ ప్రయత్నించగలరు. రుద్రాభిషేకములు, శివాలయమునకు తరచు వెళ్లుట ద్వారా గురుని బలోపేతుని కావించుకొనగలరు.

 

http://www.jagjituppal.com/images/2virgo.gif

కన్యా రాశి

ఉత్తర ఫాల్గుణి (2,3,4 పాదాలు), హస్త (అన్ని పాదాలు), చిత్ర (1,2 పాదాలు)

శనితప్ప మిగిలిన గ్రహములన్నయూ ఆనుకూల్యములు. మాసముయొక్క ఉత్తరార్థమునందు గురుడు ప్రతికూలుడుగా మారును. గురుశనుల వ్యతిరేకత వలన భార్యాపుతృలనుండి విరోధము, బంధువులతో కలహములు, శరీరమునందలి తేజస్సు తగ్గుట, మానసిక స్థిరత్వము తగ్గుట, మానసిక పీడ, తెలియని భయములు, వ్యసనములు సంభవించు అవకాశమున్నది. గోచరములో అధికముగా ప్రభావమును చూపు గ్రహములు ఈ రెండు మాత్రమే. కావున వాని బుజ్జగించు ప్రయత్నము అవసరము. నీలము పువ్వులతో శివారాధన శనికొరకు, పసుపుపూలతో శివారాధన గురుని కొరకు చేయవలెను.

          రవి ఆరోగ్యమును, సంతోషమును, ధనలాభము మరియు పుత్రసౌఖ్యమును కలిగించ ప్రయత్నము చేయుచున్నాడు. ఆ రవి యొక్క ఆనుకూల్యత కారణముగా అనుకున్న పనులు జరుగుట, బంధువులను మరియు మిత్రులను కలియుట జరుగు అవకాశములున్నవి. ఈ పైన పేర్కొన్న ఫలములకు తోడు ధైర్యమును కూడ కుజుడు కలుగజేయుచున్నాడు. మాతృసుఖము మరియు సంతోషమును బుధుడు, కుటుంబసౌఖ్యము మరియు దేహసౌఖ్యమును శుకృడు కలుగచేయుచున్నారు. పై ఫలితములను పరిశీలించిన ఆనుకూలప్రభావము ఎక్కువగా కనిపించుచున్ననూ ప్రతికూలగ్రహములు పరిస్థితులను బట్టి బలీయముగానుండును కావున దైవారాధన ఆవశ్యకమని గుర్తించవలెను.

 

http://www.jagjituppal.com/images/2libra.gif

తులారాశి

చిత్ర (3,4 పాదాలు), స్వాతి (అన్ని పాదాలు), విశాఖ (1,2,3 పాదాలు)

 

ఈ రాశివారికి ప్రస్తుత మాసము  ఒక మోస్తరుగా నుండును. కొత్తగా ఏర్పడిన కొత్త సమస్యలు నిద్ర లేకుండా చేయు అవకాశములు కనబడుచున్నవి. శరీరమునందు పీడ, సమయము మించిన తరువాత భోజనము, సహాయపడని బంధుమితృలు వీరి బాధలను పెంచు అవకాశమున్నది.  ప్రతిరోజు ఏదో ఒక కొత్త సమస్య ఎదురుగా నిలబడగలదు.

          ఆరోగ్యము జాగ్రత్తగా చూచుకోవలెను. ఎక్కువగా తిరగవలసి రావచ్చును. బదిలీలు జరిగే అవకాశములెక్కువ. ఉద్యోగములు కూడా మారగలరు. ఏ గ్రహముకారణముగా కూడా అనుకూలప్రభావము కనిపించకుండుటచే ఈ రాశివారు సంయమనముతో వ్యవహరించవలెను. భగవదారాధన చాలా అవసరము. ముఖ్యముగా ఈ మాసమునందు సూర్యుని ఆరాధించవలెను. ఉదయమున స్నానముచేసి రాగిపాత్రతో సూర్యునికి అర్ఘ్యప్రదానము చేయగలరు.

http://www.jagjituppal.com/images/2scorp.gif

వృశ్చికరాశి

విశాఖ (4 పాదం), అనూరాధ (అన్ని పాదాలు), జ్యేష్ట (అన్ని పాదాలు)

జన్మమునందున్న రవి శరీరమునందు కష్టమును, సంతాపమును, కాలముకాని కాలమునందు భోజనమును, బంధువులయందు మరియు మితృలయందు ద్వేషమును కలిగించును. భోజనము మరియు వస్త్రములకు లోటు ఏర్పడడము, స్థాననాశనము, అప్పు బాధలు మరియు కాసరోగమును ప్రతికూలుడైన కుజుడు కలిగించు అవకాశమున్నది. రత్నాదులవలన ధనలాభము, నిత్యమారోగ్యము మరియు సదా సుఖమును బుధుని వలన ప్రాప్తించుచున్నది.

          లాభమునందున్న శని వీరికి ఆరోగ్యము, ధనలాభము, భార్య మరియు పుతృల వలన సుఖము, కోరుకున్న పనులు నెరవేరుట మొదలగు ఫలములనిచ్చుచున్నాడు. అదే సమయమునందు  ఈ నెల వరకూ తటస్థముగానున్న గురుడు ఈ నెలలో జరుగబోవు రాశి మార్పుతో యాచనము, బుద్ధిచాంచల్యము, వ్యయము, దేశత్యాగము, మరియు కలహములను కలుగజేయు అవకాశమున్నది. పై వివరములను పరికించిన అనుకూలప్రభావమే ఎక్కువగా నున్నదన్న విషయము స్పష్టమగుచున్నది. కానీ గురుని ప్రభావము మరియు కుజుని వైపరీత్యము బాధించు అవకాశము కూడా ఉన్నది కావున వారి శాంతికి ప్రయత్నించి తద్వారా  అధిక సుఖమును పొందగలరు. 

http://www.jagjituppal.com/images/2saggi.gif

ధనూరాశి

మూల (అన్ని పాదాలు), పూర్వాషాడ (అన్ని పాదాలు), ఉత్తరాషాడ (1 పాదం)

               

బదిలీలు జరుగు అవకాశమున్నది. ఆరోగ్యము జాగ్రత్తగా చూచుకోవలెను. అవమానములు ఈ సమయమునందు సర్వసాధారణములు. పనులు కుంటు పడును. మతిమరుపు, కాలముకాని కాలమునందు భోజనము లభించగలదు. వివాదములు నెత్తికెక్కును. మీరు కలియు వ్యక్తులను  నమ్మగలిగే పరిస్థితులు చాలా తక్కువ. నెల ఉత్తరార్థమునందు దొంగలభయము మరియు గాయపడు అవకాశములున్నవి కావున తగు జాగ్రత్త అవసరము. కలతలు, సంతాపము మరియు అనుకున్న పనులయందు అనుకోని విఘ్నములు మానసికఅశాంతికి గురి చేయగలవు.
          ఇక ఈనెలలో ఉన్న అనుకూలవిషయములను పరిశీలిద్దాము. ఈ నెల మొదటి భాగములో గురు శుకృలు అనుకూలముగానున్నారు. ఆ కారణముగా ఈ రాశివారు సౌఖ్యసౌభాగ్యాదులను, ఇష్టకార్యార్థసిద్ధిని, క్షీరాన్నభోజనమును పొందెదరు. కానీ ఈ ముచ్చట చాలా కొద్దిరోజులు మాత్రమే. ఆ తరువాత ఈ గ్రహములు కూడా గాడి తప్పుతున్నాయి. కావున ఈ రాశివారు గ్రహానుకూలతకై ప్రతినిత్యము కొంతసమయమును దైవారాధనకు తప్పక కేటాయించవలెను. తద్వారా ఉపశమనమును పొందగలరు.

 

http://www.jagjituppal.com/images/2capricon.gif

మకరరాశి

ఉత్తరాషాడ (2,3,4 పాదాలు), శ్రావణ (అన్ని పాదాలు), ధనిష్ట (1,2 పాదాలు)

ఇప్పటికే చాలా గ్రహములు ఈ రాశికి అనుకూలముగా మారినవి. ఈ నెలలో అతి ముఖ్యమైన గురుడు కూడా ఈ రాశికి అనుకూలముగా మారుతున్నాడు. కావున ఈ రాశివారు ఈ నెలయందు ఆశించినమేర పనులను నెరవేర్చుకోగలరు. అన్ని రంగములయందూ ఉన్నతిని సాధించడానికి ప్రయత్నించవలసిన సమయము. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు మరియు అన్ని రంగములయందువారూ ఈ నెలలో జరుగబోవు మార్పులను తమకు అనుకూలముగా మార్చుకోవడానికి ప్రయత్నించవలెను.

ఈ నెలలో ముఖ్యమైన ఒకే ఒక్క గ్రహము కుజుడు. ఉన్న అన్ని గ్రహముల ఆనుకూల్యతను ఈ ఒక్క గ్రహమే మాయముచేయడానికి పూర్తిగా ప్రయత్నిస్తున్నది. కావున ఏ పనిని తేలికగా తీసుకోరాదు. ఆ కుజుని కారణముగా సమయమునకు భోజనము లేకపోవడము, బంధువులవలన కష్టములు, దుర్వార్తా శ్రవణము, సోదరులు మరియు పుతృలనుండి కష్టములు ఎదుర్కొను అవకాశముకూడా ఉన్నది. మిగిలిన గ్రహముల కారణముగా ఈ బాధలు మరీ ఇబ్బందికరముగా నుండనప్పటికీ ఎటువంటి సమస్యా బాధాకరముగా మారకుండుటకు సుబ్రహ్మణ్యారాధన మందారపువ్వులతో చేయగలరు.

 

http://www.jagjituppal.com/images/2aqua.gif

కుంభరాశి

ధనిష్ట (3,4 పాదాలు), శతభిష (అన్ని పాదాలు) , పూర్వాభాద్ర (1,2,3 పాదాలు)

కావలసినన్ని సమస్యలతో సతమతమవుతున్న ఈ రాశివారికి గురుని రాశిమార్పు మూలుగుతున్న నక్క మీద తాటికాయపడ్డట్టే. కానీ ఈ నెలకు కొన్ని గ్రహములకారణముగా ప్రత్యేకత ఉన్నది. ఈ నెలయందు ముఖ్యముగా కుజ బుధులు అనుకూలముగానున్నారు. వారి కారణముగా ఈ రాశివారు వస్త్రలాభము, ధనలాభము, ధాన్యలాభము, కీర్తి, మానసిక ఉల్లాసము, ఆరోగ్యము, సుఖము, బంధుసుఖమును పొందెదరు.

          అనగ కష్టములను ఎదుర్కుంటూ ఈ రాశివారు అన్ని రకములైన సాహసకార్యములు మరియు వివిధరకములైన పెట్టుబడులను పెట్టవచ్చును. పెట్టుబడులు మరియు షేర్లు వంటివాటియందు ఇరువది నుండి ముప్పదిరోజుల వ్యవధికొరకు మాత్రమే పెట్టుబడి పెట్టగలరు. ఉల్లాసముగా పనిచేయు అవకాశములెక్కువగానున్నందున సాధ్యమైనంత వరకూ పనులను చక్క పెట్టుకోగలరు. ఈ పనులయొక్క ఫలము భవిష్యత్తులో ఈ రాశివారికి చాలావరకూ ఉపయోగపడగలదు.

http://www.jagjituppal.com/images/2psices.gif

మీనరాశి

పూర్వాభాద్ర (4 పాదం), ఉత్తరాభాద్ర (అన్ని పాదాలు), రేవతి (అన్ని పాదాలు)

గత కొద్దికాలముగా రాజయోగముననుభవించుచున్న ఈ రాశివారికి ఇప్పుడిప్పుడే ప్రతికూలపరిస్థితులు ప్రారంభమవుతున్నాయి. శని ఇప్పటికే అశుభస్థానమును చేరితే గురుడు ఈ నెల రెండో వారములో అశుభస్థానమును చేరుతున్నాడు. ఇకపై కొన్ని నెలలు తక్కువ వ్యవధిలో రాశులు  మారే గ్రహములదే రాజ్యము. అవి అనుకూలిస్తే ఈ గురు శనుల ప్రభావమును పక్కకు పెట్టి మంచిని చేస్తాయి. లేకుంటే కొంతకాలము కష్టములు తప్పవు.

          శారీరక అలసత్వము మరియు కాలాతిక్రమభోజనమును కుజుడు, అపవాదములు, దూషణములు మరియు బద్ధకమును బుధుడు, నింద, కలహము మరియు ధనక్షయమును రవి ఇస్తున్నారు. గురు శనుల విషయములో ప్రత్యేకముగా వ్రాయనవసరములేదు. వారినుండి కొంతకాలము ఆశించుటకు ఏమీ లేదు. కేవలము కటాక్షించుచున్న గ్రహము శుకృడు. తద్వారా దుఃఖనాశనము, మహాసౌఖ్యము, బంధమిత్రులతో కలయిక, అధికారులను కలయుట మరియు ధనలాభము కలుగును. కానీ ఇక్కడ ఒక విషయమును గుర్తుంచుకొనవలెను. కేవలము శుకృడు మిగిలిన అన్ని గ్రహములను కాదని శుభము చేయలేడు. కానీ అదే శుకృడు మిగిలిన వానికంటే బలవంతుడైతే తప్పక శుభము చేయగలడు. కావున ఆ బల ప్రాప్తికి ఈ రాశివారు ఈ నెలయందు తెల్లని పువ్వులతో లక్ష్మిని పూజించగలరు.

 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం