గమనిక - ఈ శీర్షికలో పాఠకులందరూ పాల్గొనాలని మా ఆకాంక్ష . ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి ప్రభావం ఎంతో వుంటుంది . అలా ప్రభావితులమైన మనమందరం ఆ మధుర క్షణాలనూ , ఆ తీపి అనుభూతులనూ , ఆ మహనీయుడందించిన బోధనలనూ , విశ్లేషణా పరిజ్ఞానాన్నీ అందరితో పంచుకోవడం మీ తండ్రులకు మీరిచ్చే గౌరవ సూచకమేకాదు , అవి మిగితావారికి కూడా ఒక సందేశాన్నిచ్చి వారిని కూడా ప్రభావితం చేస్తాయి . ఆ నాడు నెహ్రూ తన కుమార్తెకు వ్రాసిన లేఖలు అమితభారతానికీ ఒక స్పూర్తినందిస్తోంది అంటే ఏమీ ఆశ్చర్యపడాలసిన విషయం కానేకాదు. మీరుకూడా మీ తండ్రిగారిదగ్గిర నేర్చుకున్న విషయాలను , పంచుకున్న ఆ ఆత్మీయతనూ అందరితో పంచుకోండి , సుజనరంజని ద్వారా వారికి నివాళులర్పించండి.

మీ రచనలను sujanaranjani@siliconandhra.org కు పంపండి . మీకు రచనలు చేయటం అంత అలవాటు లేకపోయినా భయపడకండి . ఈ శీర్షికలో వృత్తాంశం ముఖ్యము . మీరు వ్రాసి పంపితే మా సంపాదక వర్గము మీ రచనకు
సహకరిస్తుంది.   
        

                                                                                                        - సంపాదకవర్గం    

 
 

- రచన: నరేంద్ర కొత్తకోట

 
 

నా పేరు కొత్తకోట నరేంద్ర. నేను సాప్ట్‌వేర్ ఇంజీనీరుగా Macys లో శాన్‌ఫ్రాన్సిస్‌కొలో పనిచేస్తున్నాను. నివాసం వాల్‌నట్‌గ్రీక్ సిటి, కాలిఫోర్నియా రాష్ట్రం. మా తండ్రిగారైన శ్రీ కొత్తకోట తిమ్మారెడ్డి గారి గురించి ఈ శీర్షిక వ్రాయడానికి అవకాశమిచ్చిన "సుజనరంజని"కి ధన్యవాదములు తెలుపుకొంటున్నాను.

మా నాన్నగారి తల్లిదండ్రుల పేర్లు కొత్తకోట వెంకట రామిరెడ్డిగారు శంకరమ్మ గారు. తాతా నానమ్మలకు నాన్నగారు మూడవ వాడు. కర్నూల్ జిల్లాలోని కొత్తకోట అనే గ్రామంలో నాన్నగారు పుట్టి పెరిగారు. నాన్నగారు -SSLC తరగతి వరకు చదువుకొన్నారు.

మా తాతగారు వారి రోజుల్లో "పిల్లలు చదువుకొంటె ఏ గుమస్తాలుగానొ పనిచేస్తూ బ్రతుకుతారు. అలాకాకుండా పొలం దున్ని,పంటలు పండిస్తే, ఊరిలో పెద్ద రైతుగా, గొప్పగా గౌరవంగా బ్రతకగలరని" భావించేవారు. దాని ఫలితంగా నాన్నగారికి ఉన్నత విద్యలు చదివే అవకాశం లేక పోయింది. నిజానికి తాతగారి దృష్టిలో అవసరం లేకపోయిందని అని చెప్పవచ్చు. దాంతో నాన్నకి మా ఊరే ప్రపంచం, పంటలు,పొలాలు, పశువులే లోకము మరియు మా కుటుంబమే విశ్వవిద్యాలయమయ్యాయి. 1964లో మా అమ్మ సుమిత్రగారిని నాన్నగారు పెళ్ళిచేసుకొన్నారు. అమ్మ నాన్నలకు నాతో కలిపి ముగ్గురు పిల్లలం. నాకో చెల్లి, తమ్ముడు వున్నారు.

తాతగారిలాగ కాకుండా చదువుల పట్ల నాన్నగారి ధృక్ఫథంలో చాలా మార్పుండేది. తను చదువుకోక పోవడం వలన ఏమి కోల్పోయా
రో గుర్తించారు. అందువలన పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పెవారు. అదే కాకుండా టీచర్స్‌తోను మరియు ఎవరైనా ఆఫీసర్స్ ఊరికి వచ్చినపుడు వారితో," ఏఏ చదువులు చదివితే,ఏ విధమైన అవకాశాలుంటాయి,ఏఏ కాలేజీలలో లేదా ఏఏ స్కూల్సులో ఏ కోర్సులకు మంచివని తెలుసుకొని" ఆవిధంగా పిల్లలను చేర్చెవారు.

పిల్లల భవిష్యత్తు చాలావరకు తల్లిదండ్రులు తీసుకోనె శ్రద్ధ,వారిచ్చే స్పూర్తి పైన ఆధారపడి
వుంటాయనేది అందరికి తెలిసిన విషయమే. పల్లెల్లో తల్లిదండ్రులు పిల్లల చదువులకు అంత ప్రాముఖ్యతనివ్వరు. ఇచ్చినా ఊరిలోవున్న దుంపల బడికి పంపడమో లేదా ఊరికి దగ్గరలో వున్న టవున్ కాలేజికి పంపడమో చేస్తారు. మా నాన్నగారు కూడా నన్ను ఊరి బడికి పంపి చేతులు దులుపుకొనివుండొచ్చు. కాని అలా చేయకుండా నన్ను అనంతపూర్‌లోని నిర్మల ఇంగ్లీషు మీడియం స్కూలుకు, ఇంటర్ చదవడానికి లయోల కాలేజికి మరియు M.B.A చదవడానికి పూణెకు పంపిచారు . సమయంలో బంధువులు, నాన్నగారి స్నేహితులు నాన్నతో చాలా విభేదించారు."బడాయి కాకపోతే అంత డబ్బులు తగలపెట్టి దూరంగా వుండి చదివితే చదువులోస్తాయా? ఊరు బడిలో చదివితే చదువులురావా?" అని మాట్లాడేవారు.

అందుకు నాన్నగారు "ఒక తండ్రిగా నా శక్తిమేరకు వారికి మంచి అవకాశాలు,చక్కని వాతవరణం కల్పించడం నా భాధ్యత. వారి కోసం నేను చదవలేను. కావున నా ప్రయత్నంలో ఏమాత్రం లోపం లేకుండా చూడడమే నా విధి. పిల్లలు కూడ భాధ్యత గుర్తించి చదువుకొంటారని ఆశిస్తాను. అలా కాకుండ ఇచ్చిన అవకాశాలు దుర్వినియోగం చేసుకొంటె వారె బాధలు పడతారని తెలియజేస్తాను.అంతకు మించి నేను చేయకలిగిందేమి లేదు" యని బదులిచ్చేవారు.

మాది ఉమ్మడి కుటుంబం మొత్తం బాబాయిలు, పిన్నీలు, పిల్లందరితో కలిపి ఇరవై ఐదు మంది. నాన్నగారు అందరిని సమానంగా చూస
వారు. స్వీట్స్, మామిడి పళ్ళు, ఏవికొన్న అందరికి సరిపోయేటట్లు కొనేవారు. ఇంటిలో అందరు సంతోషంగా వుంటే ఆ ఇల్లు నందనవనమనేవాడు. ఆలాంటి వాతరవరణంలో పిల్లలు చాలా ఆనందంగా,విశాల భావాలతో ఎదుగుతారని, పెద్దలు ఎంతో ఆరోగ్యంగా వుంటారని భావించెవారు. నాన్న భావాలకు చక్కగా ఒదిగినట్లు మా అమ్మ ప్రవర్తన వుండేది. ఇంట్లో అందరు భోంచేసిన తరువాతె అమ్మ భోంచేసేది. "అందరికి సేవచేయడం, అందరిని ప్రేమించడం" దైవకార్యంతో సమానమని చేప్పేది. ఇంట్లో ఎవరిపిల్లలైనా సరే సంతోషంగాని బాధలు గాని మొదట అమ్మ దగ్గరికెళ్ళి చెప్పేవారు.

పల్లెల్లో మనుషుల దగ్గర డబ్బులుండవేమో కాని,జాలి గుణానికి లోటు వుండదు. భోజన సమయంలో ఎవరొచ్చినా ఆదరంగా భోజనం పెడతారు. మా అమ్మ కూడ పనివారుగాని,
కూరలమ్మెవారుగాని భోజన సమయంలో ఇంటికోస్తే వారి భోజనము గురించి విచారించి భోజనం వడ్డించేది. ఒకసారి ఒక పనివాడు మధ్యహ్నం మూడు గంటలకొచ్చి ఆకలిగుందన్నాడు. నిజానికి ఆ సమయంలో వండిన అన్నమయిపోయింది. అదే విషయమతనికి చెప్పి,కొంచెం సేపు ఆగమని చెప్పి, అమ్మ దోసెలు చేసి అతడికి పెట్టింది. అతడు దోసెలు తిన్న తరువాత "అన్నంలేకపోతె వేరె ఎవరైన అన్నం లేదని చెప్పి పంపివేసివుండేవారు. మీరు మీ బంధువులొచ్చినట్లు ఏకంగా ఈ పనివాడికి దోసెలు చేసి పెట్టినారు. మీరు నిజంగా దేవతే తల్లీ "యని భోరుమని ఏడ్చాడు.

నాన్నగారు విలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్‌
గా  పనిచేశారు. అ సమయంలో తనొక అధికారియని భావించక ఇది ఊరికి సేవ చేయడానికి వచ్చిన అవకాశంగా భావించారు. కులమత ప్రసక్తిలేకుండా నవ్వుతూ అందరితో మర్యాదగా పలకరించేవారు.

పిల్లలందరు బాగా చదవాలని నాన్నగారు మరిమరి చేప్పేవారు. నేను విజయవాడ లయోల కాలేజిలో ఇంటరులో క్లాసు ఫస్ట్ వచ్చినందులకు చాలా సంతోషించారు. కాని
ఎంసెట్లో మంచి ర్యాంక్ రానందులకు చాలా కలత చెందారు. అది తలచుకొంటే నాకిప్పటికి చాల బాధేస్తుంది.

నాన్నగారికి ధూమపానంగాని,
మధ్యపానంగాని అలవాట్లుండేవి కావు. నేను ఏం.బి.ఏ చదివే రోజుల్లో ఒకసారి మందు త్రాగిన విషయం తెలుసుకొని బాధగా "నేను జీవితం లో ఇంతవరకు త్రాగలేదు కారణం... నాకు జలసాలు చేయడం చేతకాక కాదు. మీముందు నేనేరోజు దోషిగా నిలబడకూడదనే ఒకేఒక్క  కారణం వల్ల అటువంటి అలవాట్ల వైపు కన్నెతికూడ చూడలేదు. నేను తప్పు చేసిన రోజున మీకు చెప్పే అర్హత కోల్పోతాను. అందువలన నేను చెడు అభ్యాసాలకు దూరంగా వున్నాను. మీనుండి కూడ అటువంటి సంస్కారాన్నె నేను ఆశిస్తానని" చెప్పారు.

ఒకసారి ఒక ఫంక్షనుకెళ్ళడానికి,ఒక ఫ్యామిలీ వ్యాను బుక్క్ చేశాను. అయితే వ్యానులో అందరు వెళ్ళడానికి వీలుకానందున కొందరు బస్సులో రావలని చెప్పినాను. అదివిని నాన్నగారు అందరు బస్సులోనె వెళ్దాము. వ్యానును క్యాన్సిల్ చేయమని చెప్పారు. నాన్నగారి దృష్టిలో ఇంట్లో అందరు సమానమే. ఏ చిన్న విషయానికూడ ఎవరు కలత చెందకూడదని భావించేవారు.


నాన్నగారు నాతో "జీవితంలో నెపుడు సోమరితనం పనికిరాదు. మనిషి ఎదుగుదల కోసం కష్టపడాలి. కాని జీవితంలో ప్రశాంతతను కోల్పోయెటట్లు లేదా అత్యాశతో కష్ట పడకూడదు. ఆనందిస్తూ పనులు సాధించడానికి ప్రయత్నించాలి. కన్నవూరినెపుడు మరిచిపోవద్దు. నీకు వీలైనంత ఊరికి సహాయం చేయి. లగ్జరీస్ కోసం బ్రతుకును బలి చేసుకోకు. సింప్లిసిటిని అలవరచుకోమని" మరిమరి చెప్పేవారు.

నాకు అన్ని సంపదలకన్నా మా తల్లిదండ్రులే గొప్ప సంపదని భావిస్తాను. అందుకే దేవుడికి మరిమరి ధన్యవా
దాలు తెలుపుతాను. అయితే మా మంచి అమ్మ,మాకన్నకూడ దేవుడికి అవసరమనిపించిదేమో 1995లో అమ్మను తీసుకెళ్ళిపోయాడు. అటు తరువాత మాకన్నీ నాన్నగారె చూసుకొనెవారు. 2007లో నాన్నతో కూడ పనివుందని చెప్పి భగవంతుడు నాన్నగారిని కూడ పిలిపించుకొన్నారు.

వారు లేని లోటు ఏవిధంగాను పూరింప శక్యం
కానిది. అయితే తల్లిదండ్రులు చేసిన సత్కర్మలు పిల్లలకు ఆశీర్వాదములవుతాయని అంటారు. వారి ఆశీస్సులవల్ల లోటు లేకుండా మా జీవితాలు సాగుతున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ.. చదివిన మీ అందరికి నమస్కరిస్తున్నాను.
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech