గగనతలము – 3
 

సారాంశము

            ఈ భాగములో ప్రతిరోజు మనము చెప్పు సంకల్పము, దానియొక్క అర్థము, ప్రస్తుతము మనము వాడుతున్న గ్రిగేరియన్ కేలండరు మరియు దానికి ముందుదైన జూలియన్ కేలండరు గూర్చి అతి సంక్షేపముగా తెలుసుకొనడానికి ప్రయత్నిస్తాము. ఈ చర్చ ప్రపంచములో అతి పురాతనమైన భారతీయ పంచాంగము యొక్క పుట్టు పూర్వోత్తరములు మరియు ప్రయోజనములను తెలుసుకొనుటకు సహాయపడుతుంది.

 
   

ప్రతీరోజూ సంధ్యావందనము చేయునపుడు, ఇంటిలో పూజలు పునస్కారములు చేసుకొనేడప్పుడు మనము మొదట సంకల్పము చేస్తాము. మనము ఏ సమయమునందు ఎక్కడ ఏమి చేస్తున్నాము మరియు మనము ఎవరు అనే దానిని మనము అందులో వివరిస్తామన్నమాట. ఆ సంకల్పము వెనుక ఉన్న వైజ్ఞానికత మన ఊహలకు అందనిది. ఆ సంకల్పము యెక్క పూర్తి భావమును ఒక్కసారి  తెలుసుకొనడానికి ప్రయత్నిద్దాము.

మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రధమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శ్రీమత్ విరోధి నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీకమాసే కృష్ణపక్షే చతుర్దశ్యాం భానువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ .......................గోత్రః...................................నామధేయః శ్రీమతః..........................గోత్రోద్భవస్య..........................నామధేయస్య మమ ఉపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ............................................................కర్మ కరిష్యే.

నాకు సంక్రమించిన (సంప్రాప్తించిన) పాపములు క్షీణించుట ద్వారా శ్రీ పరమేశ్వరుని ప్రీతి కొరకు శుభము మరియు శోభనము (మంచిది) అయిన ముహూర్తమునందు శ్రీ మహావుష్ణువు ఆజ్ఞచే ప్రవర్తించబడిన ఈ రోజు బ్రహ్మయొక్క ద్వితీయపరార్థమునందు శ్వేతవరాహకల్పమునందు వైవస్వతమనువుయొక్క అంతరమునందు కలియుగముయొక్క ప్రధమపాదమునందు జంబూద్వీపమునందలి భారతవర్షమునందలి భరతఖండమునందు ప్రచలనములోనున్న చాంద్రమానమునందు ప్రస్తుతము నడచుచున్న విరోధినామసంవత్సరమునందు దక్షిణాయనమునందు శరదృతువునందు కార్తీకమాసముయొక్క కృష్ణపక్షము యొక్క చతుర్దశీ ఆదివారమునందు శుభ నక్షత్ర శుభ యోగ శుభ కరణములచే కూడి యున్న విశిష్టమైన శుభతిథియందు శ్రీమాన్ ................................గోత్రము....................నామధేయము శ్రీమతః..........................గోత్రమునందుద్భవించిన..............................పేరుగల నాకు సంక్రమించిన పాపములు క్షీణించుట ద్వారా శ్రీ పరమేశ్వరుని ప్రీతి కొరకు ................................................అను కర్మ చేయుదును.

అతి విశాలమైన ఈ భూమిపై నేను ఎక్కడ ఉన్నాను అన్నది చెప్పటానికి చేస్తున్న ప్రయత్నము ఈ భూమిపై నా యొక్క ఉనికిని, ఈ భూమి గురించి నాకు గల జ్ఞానము మరియు అవగాహనను సూచిస్తున్నది. కాలమునకు ఆది మరియు అంతము లేదు. దానిని మనము ఊహించగలమే కానీ లెక్క పెట్టలేము. అటువంటి కాలములో, మనకు తెలిసినంతమేర మనము ఏ కాలభాగములో నున్నాము అన్నది సూచించునదే రెండవ ప్రయత్నము. మనము ఉపయోగిస్తున్న కాలమానము చాంద్రమానము అన్నది సూచిస్తున్నది మూడవ ప్రయత్నము. నాలో ఉన్న జన్యు పరమైన లక్షణములేమిటన్నది సూచిస్తున్నది నా గోత్రము. ఇలా మనము పని ప్రారంభిస్తున్నప్పుడు ఇచ్చే వివరణే ఇంత లోతైనదయితే మనము చేయు పనులు లేక మనకు అప్పగించబడిన పనుల లోతు మనము వర్ణించజాలనిది.

కేలండరు గురించి కొద్దిగా.....

          క్రీస్తు పూర్వము 46 వ సంవత్సరమునకు పూర్వము రోమను కేలండరు వాడుకలో నుండెడిది. 46 వ సంవత్సరమునుండి జూలియస్ సీజరు గారు జూలియన్ కేలండరును ప్రవేశపెట్టినారు. క్రీస్తుశకము 1582 లో గ్రిగేరియన్ కేలండరు ప్రవేశపెట్టబడినది. జూలియన్ కేలండరులో గల లోపములను సరిదిద్దుతూ గ్రిగేరియన్ కేలండరు ప్రవేశపెట్టబడినది. ఈ మార్పు చేయుటకు గాను అక్టోబరు 4, 1582 తరువాత రోజున అక్టోబరు 15 గా ప్రకటింపబడినది. అనగ కేలండరు 10 రోజులు ముందుకు నడుపబడినది. ఆ రోజునుండే ప్రస్తుతము మనము వాడుతున్న కేలండరు వాడుకలోనికి వచ్చినది. సీజరు గారు మార్పులు చేయకముందు రోమను కేలండరునందు అనేకమారులు మార్పులు చేయబడినవి. (http://en.wikipedia.org/wiki/Roman_calendar నందు వివరముగా చూడగలరు.)

బ్రహ్మగారి ద్వీతీయభాగము...

మనము పైన చెప్పుకున్న సంకల్పములో బ్రహ్మగారి ఆయువు యొక్క రెండవ భాగము నందు అని చెప్పుకున్నాము. ఆ కాలమును తెలుసుకొనడానికి ముందు మనము భారతదేశములో అనాదిగా కాలగణన ఏ విధముగా జరుగుతున్నదో తెలుసుకోవాలి.

కలువపువ్వు రేకు పై ముల్లుతో చిల్లు చేయడానికి పట్టుకాలమును తృటి అంటారు. ఇది కాల ప్రమాణములలో అతి చిన్నదైన ప్రమాణము. 60 తృటులు ఒక రేణువు, 60 రేణువులు ఒక లవము, 60 లవములు ఒక లీక్షకము, 60 లీక్షకములు ఒక ప్రాణము అగును. ఇచట వివరించిన ఈ కాలప్రమాణములన్నియూ (ప్రాణము తప్ప) మనకు అనుభవములోనికి రానివి. అందువలననే వీనిని అమూర్తములు లేక స్వరూపములేనివి అని అందురు.

ఒక ఆరోగ్యవంతమైన పురుషుడు శ్వాసను ఒకసారి లోపలికి తీసుకుని విడచుటకు పట్టు కాలమును ప్రాణమందురు. మూర్తకాలమునకు ఇది ప్రారంభములోనున్న కాలప్రమాణము. ఆఱు ప్రాణములు ఒక వినాడి, 60 వినాడులు ఒక నాడి , 60 నాడులు ఒక నాక్షత్ర దినము అగును. 30 దినములు ఒక మాసము, 12 మాసములు ఒక సంవత్సరము అగును. ఈ సంవత్సరము దేవతలకు ఒక దినము, ఇటువంటివి 360 రోజులు వారికి ఒక సంవత్సరమని తెలియవలెను. అటువంటి సంవత్సరమునకు దివ్యవర్షమని పేరు.

12000 దివ్యవర్షములు ఒక మహాయుగము, 71 మహాయుగములు ఒక మన్వంతరము, 1000 మహాయుగములు ఒక కల్పము, 2 కల్పములు బ్రహ్మయొక్క ఒక దినముగా పేర్కొనబడినవి. అటువంటి బ్రాహ్మదినములు 360 చే బ్రహ్మగారికి ఒక సంవత్సరము అవుతుంది. ఆ బ్రహ్మగారి వయస్సు 100 సంవత్సరములు. అందులో ప్రస్తుతము పూర్వార్ధము అనగ మొదటి 50 సంవత్సరములు పూర్తి అయినవి. మిగిలిన 50 సంవత్సరములలో మొదటి సంవత్సరములో మొదటి కల్పము జరుగుతున్నది.

సశేషము......

 


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

   
పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech