ఇన్ ఫ్లూ ఎన్సా
 
                  

 


అప్పుడెప్పుడో చాలా యుగాల క్రితం హిరణ్యాక్షుడు భూమిని చాపలా చుట్టి సముద్రం లో పడేస్తుంటే విష్ణు మూర్తుల వారు వరాహావతారం ఎత్తి భూమిని కోరల మీద నిలబెట్టి కాపాడి, ఆ రాక్షసుణ్ణి చంపేసాట్ట. ఇది కధగా చిన్నప్పుడు విన్నా. ఐతే ఇప్పుడు ఆ వరాహాల వల్ల స్వైన్ ఫ్లూ అనే జబ్బు భూమిని గడ గడ లాడిస్తోంది. ఆ జబ్బు చాపలా చుట్టేసి అప్పుడే అంతటా వ్యాపిస్తోందట.

మూతులకి చిక్కాల లాంటి తొడుగులు..మాస్కులతో అందరూ ఆ వరాహ మూర్తుల లానే కనిపిస్తున్నారు. అప్పుల అప్పారావులకి...మాటిచ్చి నిలబెట్టుకోలేని రాజకీయ నాయకులకి ఇది ఒక రకంగా ఉపయోగ పడుతోందనే చెప్పాలి. ఎందుకంటే ఏ కర్చీఫో..మాస్కో కప్పుకుంటే జనం బారిన పడకుండా పారిపొవచ్చు.

అసలు ఇదివరకూ ఇన్ని మందులు జబ్బులు ఉన్నాయా ఐనా అందరూ హాయిగా వందకి దగ్గరదాకా బతికేసే వాళ్ళు. ఏమిటో సైన్ సు..టెక్నాలజీ పెరిగిన కొద్దీ ప్రాబ్లెం స్ ఎక్కువౌవుతున్నాయి. రోజుకో కొత్త పేరుతో జబ్బులు మందులు...విచ్చలవిడి తనం వల్ల పెరిగిపోతున్న ఈ వ్యవహారం చూస్తుంటే ఇప్పటికైనా మన సంప్రదాయం మన పద్ధతులే కరెక్ట్ అనిపించక మానదు.


'తుమ్మెద' అంటే .....అదేదో పూల మీద వాలే 'తుమ్మెద' అనుకునేరు. ఇది జలుబు వల్ల వచ్చిన వైరస్ తో కూడిన తుమ్ము...'తుమ్మెద' అంటే...నాలుగు మైళ్లు పరిగెడుతున్నారు..ప్రజలు.

భారత దేశం లో అస్సలు పారిశుద్ధత ఉండదు...అంతా చెత్త...ఇక్కడ జనాలకు ఆరోగ్య సూత్రాలు తెలీదు అనే విదేశీయుల్ని...కొందరు స్వదేశీయులనీ చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. ఎందుకంటే...ఈ మధ్య వచ్చిన జబ్బులు ఐడ్స్(AIDS), బర్డ్ ఫ్లూ, ఆంత్రాక్స్, స్వైన్ ఫ్లూ ఇంకా కొన్ని రకాల జబ్బులు..అన్నీ విదేశియులు మనకిచ్చిన కానుకలే..అవి అక్కడ నుంచీ దిగుమతి ఐన మహమ్మారులే.......మనవి కావు అని 'మనవి' చేస్తున్నా.

సుబ్బరంగా వయసు వచ్చాక పెళ్ళి...ఒకరే పెళ్ళాం,,,,హాయిగా సంసారం...పిల్లలు..ఇదీ మన సంప్రదాయం...కొన్ని రోజులు కలిసుండీ...ఒక్కోసారి ఏళ్ళతరబడి కూడా..నచ్చితే పెళ్ళి...నచ్చకపోతే...చెల్లు.. అంటూ వదిలేసే డేటింగు వాళ్ళ విధానం..దేనివల్ల నష్టం....ఐడ్స్(AIDS) కష్టం..అన్నది జనాలే నిర్ణయించుకోవాలి.

చిన్నప్పటి నుంచీ తుమ్మొస్తే..చెయ్యి అడ్డం పెట్టుకోమని మనం పిల్లలకి నేర్పుతాం,..ఇప్పుడూ అదే చెబుతున్నారు...కాకపోతే..చెయ్యి స్థాయి నుంచీ...మాస్కు స్థాయి వరకు వచ్చింది..ఇంకా ఇప్పుడు అవతల వాడు తుమ్ముతుంటే.. మనం అడ్డు పెట్టుకోవాల్సి వస్తోంది..దీనికి మందు...మన హోమియోలోనే ఉందిట..ఎప్పుడూ పాశ్చాత్యుల్ని చూసి ఇన్ ఫ్లు యెన్స్ అవుతామనో ఏంటో దాని పేరు కూడా ఇంఫ్లుయెంజా...ట..అంతే కాదు..తులాసాకు, వేపాకు వేడి నీళ్లలో వేసి వాసన చూసినా తగ్గుతుందట...మరి.

ఈ మధ్య వస్తున్న చాలా జబ్బులు..పేర్లు కూడా కొన్ని తెలీవు..కిడ్నీ లో రాళ్ళు, గాలిబ్లాడర్ లో రాళ్ళు,,.ఊబకాయం వొళ్ళు....ఇంకా చాలా..... కేవలం ఆహార పద్ధతుల వల్లే పెరుగుతున్నాయట. క్యాబేజీ...టమాటా....లాంటివి ఎక్కువేసి చేసిన...సాండు విచ్(ఇసుక దెయ్యం అనొచ్చేమో), చీజ్ వేసిన బర్గర్లు..పిజ్జాలు...లాంటి ఫుడ్డు ఎక్కువయ్యాకనే ...ఇలాంటి జబ్బులూ పెరిగాయి అని చెప్పడానికి సర్వేలు అక్కర్లేదేమో..


లావు తగ్గడానికి ఏమి చెయ్యాలి డాక్టర్ అని పేరొందిన..కార్పొరేట్ హాస్పిటల్ లో ఫారిన్ లో ట్రైన్ అయి ఫ్లైట్ లో వచ్చిన డైటీషన్ ని అడిగితే...ఎల్ డీ ఎల్...వీ డీ ఎల్, హెచ్ డీ ఎల్...లిపిడ్ ప్రొఫైల్ లాంటి వంద టెస్టులు చేసి..ఫాట్ ఫూడ్డు తగ్గించండి..ఆయిల్స్ తినకండి...పచ్చి కూర ముక్కలు..కీరా..కారట్ తినండి...మొలకెత్తిన ధాన్యాలు తినండి..రాగి/ఓట్స్, లేక పోతే ఆకుకూరల గంజి తాగండి (ఇంగ్లీసులో సూప్ అంటారు)...రోజూ నడవండి...అంటూ కారులో వచ్చిన వాణ్ణి ఫీజు గుంజి...స్వంత కాళ్ళ మీద నడిపిస్తారు...

సో నే చెప్పొచ్చేదేంటంటే..మన పద్ధతుల్లో మనం ఉంటే.....ఏ ప్రాబ్లెంసూ రావు.


కష్టం లో ఉన్న భూమిని (పంది) వరాహ రూపం లో ఆదుకున్న వేద భూమి మనది...పందుల వల్ల స్వయన్ ఫ్లూ...వ్యాపింపచేసే..విదేశీ అనుకరణలొద్దు మనకి పక్క దేశాలను చూసి ఇన్ ఫ్లూ ఎన్స్ అవడం మన బలహీనత..వాళ్ళని అనుకరించి తెచ్చుకున్న ప్రేమికుల దినాలు..ఇతర దినాల లాగనే ఈ జబ్బులూ రోగాలూను.


వాళ్ళ జీవన శైలికి వాళ్ళు చేసే పనులు సూటౌతాయేమో కాని మనకి కాదు. అక్కడి పిల్లలు ఎంత షార్పో పుట్టిన దగ్గర నుంచీ ఇంగ్లీషులో మాట్లాడతారు...ఎంత గొప్పో అనుకుంటాం కానీ అది వాళ్ళ మదర్ టంగ్ అని కూడా ఆలోచన రాదు...ఎందుకంటే మనమూ సాధారణ పౌరులమే కదా..మాస్కు కట్టుకోండి ముసుగు అన్నమాట అది మనసు మీద నుంచీ తీసేయండి భారతీయులెంతో గొప్పవారని చాటండి..మేరా భారత్ మహాన్..
 

 
  ఫణి మాధవ్ కస్తూరి :

స్వతాహాగా హాస్య స్ఫోరకత్వం కలిగిన ఫణి మాధవ్ కస్తూరి మిమిక్రీ కళాకారుడు కావటం వల్ల మరింత హాస్యం అలవడింది. నిత్యం చుట్టూ జరిగే సంఘటనలని చూసి స్పందించి అందులోని విషయాలు జనాలు విన్నప్పుడు నవ్వుకున్నా తరువాత ఆలోచించి కొంతైనా మారతారని ఆశతో వీరు వ్రాసే వ్యంగ్య రచనల సమాహారమే ' ఫన్ కౌంటర్ '. కవితలు, వ్యంగ్యరచనలు ప్రవృత్తయితే సినిమాలకు, టీవీలకు స్క్రిప్టులు వ్రాయటం వీరి వృత్తి. వ్యంగ్యమనేది కించపరిచేదిగా ఉండకూడదు. చురుక్కుమని తగిలి జాగర్తపడేలా ఉండాలి అని జాగ్రత్తలు తీసుకునే ఫణిమాధవ్ ఒక్కోసారి శ్రుతిమించితే అదుపు చేయమని కోరుతున్నారు. "ఫన్ కౌంటర్" నచ్చితే నలుగురికీ చెప్పండి. నచ్చకపోతే నాకు చెప్పండంటారు ఫణిమాథవ్.
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech