Sujanaranjani
           
  కథా భారతి  
 

అంతర్ముఖం - 2వ భాగం

 

                                                                           రచన :  యండమూరి వీరేంద్రనాథ్

 

నేనొక్కణ్నే దూరంగా కూచుని వున్నాను.దూరంగా వైతరణి ప్రవహిస్తోంది.

నాలాంటి చాలామంది అక్కడ వున్నారు. ప్రపంచం నలుమూలల్నుంచీ వస్తునే వున్నారు. నాకుడి ప్రక్కన కూర్చున్నదెవరో నాకు తెలీదుగానీ కాస్త అతి తెలివిగా మాట్లాడుతున్నాడు. దూరంగా కూర్చున్న నన్ను దగ్గరకి రమ్మని పిలిచాడు. నేను నెమ్మదిగా వెళ్ళాను. నన్ను చూసి గుంపుకి పెద్దరికం వహిస్తున్నట్టు,ఏమిటి చాలా దిగులుగా వున్నావు అని అడిగాడు.

నేను సమాధానం చెప్పలేదు.

పదిరోజుల వరకూ అలాగే వుంటుంది.’కర్మఅయిపోగానే మనకి ఇక భూమ్మీద సంగతుకేమీగుర్తుండవు అన్నాడు.

నీకెలా తెలుసు? అని అడిగాను.

ఊహించాను.

నువ్వు మత ప్రవక్తవా?

అతడు ఆశ్చర్యపోయి నీకెలా తెలుసు అని అడిగాడు.

కేవలం మత ప్రవక్తలూ, రాజకీయాల్లో వున్నవాళ్ళూ మాత్రమే తమ భావాల్ని వాస్తవంగా కల్పించి చెపుతారు.

చుట్టూ వున్న ఆత్మలు నవ్వేయి.

నా అభిప్రాయం తప్పని అంత దృఢంగా ఎలా చెప్పగలవు? కోపంగా అడిగాడు.

మనవాళ్ళపట్ల ప్రేమని పోగొట్టే శక్తి కర్మకూ లేదు కాబట్టి... చుట్టూ వున్న ఆత్మలన్నీ నేను చెప్పింది నిజమన్నట్లు తలలూపాయి.

దేముడి ఉనికినే నువ్వు ప్రశ్నిస్తున్నావా?

దేముడి లోకంలో ఉంటూ దేముడి ఉనికినే ప్రశ్నిచేటంత మూర్ఖుడిని కాను. అన్ని దేశాల వారికి, అన్ని జాతుల వారికి దశదిన కర్మలేదు. ప్రేమ అన్నది పదిరోజుల్లో తెగే బంధం కాదు.కర్మకన్నా ప్రేమ గొప్పది...

నేనా మాట అంటూ వుండగా అక్కడో పెద్ద వెలుగు ఏర్పడింది.నన్ను లోపలికి రమ్మంటూ పిలుపు వచ్చిందని ఒక దేవదూత వచ్చి చెప్పాడు.

చుట్టూ వున్న ఆత్మలన్నీ నావైపు ఈర్ష్యగా చూశాయి.వచ్చిన వెంటనే పిలుపు రావటం సామాన్యం కాదు.

నేను దేవదూత వెంట నది దాటి లోపలికి వెళ్ళాను. లోకం దాటి నన్నా దేవదూత మరో లోకంలోకి తీసుకెళ్ళాడు.

రకరకాల రంగులీనుతున్న బంగారు కాంతుల ద్వారాన్ని దాటి,తెల్లటి మేఘాల మధ్య నుంచి తేలుతూ ఒక విశాలమైన పాల సముద్రం లాంటి ఆవరణలోకి ప్రవేశించాను. నన్ను అక్కడ వదలి దేవదూత తప్పుకున్నాడు.

తర్వాత కొంచెం సేపటికి నాకు అక్కడ విశ్వవ్యాప్తమైన వెలుగొకటి కనపడింది. తర్వాత ఒక కఠం తరంగాలుగా ధ్వనించింది....

నాయనా!

వెలుగువైపే అంతర్ముఖుడనై నాలోకి నేనే చూసుకుంటూ ప్రకంపనాలని వినసాగాను.

ప్రేమపట్ల నీ ఉద్దేశ్యాన్ని తెలుసుకున్నాను.భవబంధాలపైనా,ఆత్మీయులపట్లా నీకు అంతులేని విశ్వాసం వున్నట్టుంది.

స్వామీ! అన్నాను వినమ్రంగా. నేనవర్ని?నువ్వే నేను కదా! నేను నీ సృష్టినే కదా! నాలో ఈఅభిప్రాయం వుందంటే అది నీ భావమే! నీవు సర్వాంతర్యామివి. నీలో కొన్ని లక్షల కోట్ల భావాలుండవచ్చు! ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క భావాన్ని ప్రవేశపెట్టి, వాటి ఘర్షణని ఆనందించే సకల చరాచర చక్రవర్తివి నువ్వు.

ప్రేమ,బంధమూ,అనురాగమూ.... వాటి పట్ల ఇష్టాన్ని పెంచుకుని, భూలోకంలో వున్న నీ వాళ్ళపై మమకారాన్ని వదులుకోలేకపోతున్నావు. ప్రేమ ఒక స్వార్థం నాయనా!

నీ సృష్టి మాత్రం స్వార్థం కాదా స్వామీ?

ఈమాటలకి దేవుడు వెంటనే జవాబు చెప్పలేదు. ఆలోచిస్తున్నట్టున్నాడు. నాకు మాత్రం బాగా కసిగా వుంది. నా కొడుకులూ, కూతుళ్ళూ, ప్రేమగా చూసుకునే పెద్దకోడలూ, మనిషిగా నా జీవితం, నా అనుభవాలూ అన్నీ గుర్తువచ్చి నన్ను అమితంగా బాధపెడుతున్నాయి. ఫలితమే కసి!

అంతలో దేవుని స్వరం వినిపించింది. మనిషి పాత జ్ఞాపకాలతో బాధపడతాడనే,ఆత్మని ప్రక్షాళనం చేసి గతజన్మ గుర్తులు పోగొట్టడం జరుగుతుంది.

అది మరింత స్వార్థం! వంద సంవత్సరాల మానవ జీవితంలో తీపి గుర్తుల్ని రకంగా ప్రక్షాళన చేయటం ఘోరం. నేను దేవుడితో మాట్లాడుతు న్నానన్న విషయం మర్చిపోయి అన్నాను.

అదంతా నేను సృష్టించిన మాయ! ప్రేమ కూడా మాయే! అది మాయ కాదనుకుని భ్రమలో మనిషి ఆనందం పొందుతాడు.

ప్రేమ మాయ కాదు స్వామీ, మనిషికీ మనిషికీ మధ్య వుండే అపురూపమైన బంధం అది. నిస్వార్థమైన బంధం.

మనిషికీ మధ్య నిస్వార్థమైన బంధం ఉండటానికి వీల్లేదు నాయనా.ఒక మనిషి మరొక మనిషిని ప్రేమిస్తే, అది తిరిగి తను అవతలి వారి దృష్టిలో గుర్తింపబడటం కోసం! ఒక మనిషి మరొక మనిషి స్నేహం ఆశిస్తే.అది తన మానసికోల్లాసం కోసం....! లోకంమీద అభిమానం వదులు కోవటం కోసం నేనిదంతా చెపుతున్నాను.భూ ప్రపంచంలో భర్త భార్యని ప్రేమించినా, భార్య భర్త దుర్గుణాలని క్షమించినా, అది ప్రేమకాదు అవసరం.

ఒకబిడ్డకు దెబ్బ తగిలితే తల్లి విలవిలలాడినా, మరణించే ఒక తండ్రిశయ్య ప్రక్కన కొడుకు రోజుల తరబడి నిద్రాహారాలు మాని కూర్చున్నా - అందులోఅవసరంఏమీలేదు స్వామీ. అదే ప్రేమ!

దీనికి సమాధానం చెప్పటానికి దేవుడు కొంచెం సమయం తీసుకుని అన్నాడు నిజమైన తల్లి అంటే - ప్రపంచంలో ఏబిడ్దకు దెబ్బ తగిలినా విలవిల లాడాలి. అదీ ప్రేమంటే. అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు.

అర్థం చేసుకోవటానికి నేను దేవుణ్ని కాదు స్వామీ. మనిషిని.

ప్రేమ అంటే ఇవ్వటమే కాని తీసుకోవటం కాదు.ఎప్పుడయితే నీలో కేవలంతీసుకోవటంప్రారంభమవుతుందో అప్పుడు అవతలివారికి నీపట్ల ప్రేమ నశిస్తుంది. అప్పుడు కూడా బంధాలు ఉండవచ్చు. కానీ అది కృతజ్ఞత వల్ల అయి ఉండవచ్చు. లేదా కర్తవ్యంవల్ల అయి వుండవచ్చు. అవసరం వల్లో అమాయకత్వం వల్లో ప్రారంభమై, ఆతరువాత అది కర్తవ్యమై మరికొంతకాలానికి ఎలా దూరమవ్వాలా అనుకునేది ప్రేమ కాదు.

నేను అంత ఘాటుగానే జవాబు చెప్పదల్చుకున్నాను. కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలబట్టి మీరు ఇదే లోకంలో,ఇదే ప్రపంచంలో, ఇదే వాతావరణంలో, ఒకే దేవతతో జంటగా వుండబట్టి మీకు ప్రేమంటే ఒక చులకనభావం ఏర్పడి ఉండవచ్చు.

చిన్న నవ్వు విశ్వాన్ని సృష్టించిన నాకు ప్రేమ గురించి చెపుతున్నావా? అన్నాడు భగవంతుడు.

క్షమించు స్వామీ! ఇక్కడికి వచ్చేవరకూ దేవుడు ఒక్కడున్నాడని నేనెప్పుడూ మనస్పూర్తిగా నమ్మలేదు. దేవుడి అవసరం నా కెప్పుడూ పడలేదు కూడా. ఇదంతా కల అయినా నేను ఆశ్చర్యపోను. కానీ ఒక్కటి మాత్రం నిజం. నేను సామాన్యుణ్ని. అందరిలాగే విగ్రహాల మధ్యా మొక్కల మధ్యా బ్రతికిన వాణ్ని.అయినా చెపుతున్నాను. మనిషి మీద మీకు చాలా నీచమైన అభిప్రాయాన్ని నేను ఒప్పుకోను. ఒక బిచ్చగాడికి ధర్మం చేయటంలో కూడాపుణ్యంఅనే స్వార్థం వున్నదనే నేను అంగీకరించలేను.

అయితే భవబంధాలు గొప్పవంటావ్?

నిశ్చయంగా!

నేను నా స్వార్థం కోసమే బంధాన్ని అర్థం చేసుకోలేక మరణంద్వారా మనుష్యుల్ని విడదీస్తున్నానంటావ్!

అవును అన్నాను. కావలంటే ఒకసారి అక్కడకు వెళ్ళి చూడండి. మీకు ప్రేమ గురించి తెలుస్తుంది. పోయిన వ్యక్తి గురించి దగ్గిరవాళ్ళు పడే బాధ, రోధన తెలుస్తుంది.ప్రేమంటే ఏమిటో అర్థం అవుతుంది. వెళ్ళి చూడండి.

చాలా సేపు నిశ్శబ్ధంలోంచి దేవదేవుడి స్వరం నెమ్మదిగా వినిపించింది. నేను కాదు. నువ్వు తిరిగి భూమ్మీదకు వెళ్ళు.

అమితమైన ఆశ్చర్యంలో విభ్రాంతుడినయ్యాను.

అవును. నువ్వు మళ్ళీ తిరిగి రానవసరం లేదు. నీకిక చావు వుండదు.

నేనే మరింత అప్రతిభుడినయ్యాను. నా ఆత్మ విచలితమవుతోంది.

అంతలో నా ముందున్న కాంతిపుంజం మరింత దేదీప్యమానంగా ప్రదీప్తమైంది. దేవుడి స్వరం తరగం తరంగాలుగా ప్రకంపనలతో అక్కడ వ్యాపించింది. సృష్టిలో మొట్టమొదటి సారి నేను ఇది చేస్తున్నాను. ఒక మనిషి లలాటం పై పునర్ లిఖిస్తున్నాను.... ఆస్వరం నన్ను ఆశీర్వదిస్తున్నట్లు అన్నది.... నిప్పువలన గానీ,అలసత్వం వలనగానీ,అలసత్వం వలనగానీ,అనారోగ్యం వలనగానీ,భూమిపైనగానీ, గాలిలోనగానీ,అనారోగ్యం వలనగానీ, భూమిపైనగానీ,గాలిలోనగానీ నీకు మరణం సంభవించదు. మొత్తం జీవరాసులన్నీ నశించినాసరే-భూమి ఉన్నంత వరకూ నువ్వు బ్రతికి వుంటావు. యుగాంతం తరువాత నువ్వు నా దగ్గరికి వస్తావు. విధంగా కొన్ని వేల లక్షల సంవత్సరాలు నీవు మానవులతో సంబంధాలు పెట్టుకొని, ఆప్యాయత అన్నది కూడా స్వార్థమో కాదో తిరిగి వచ్చి నాకు చెపుతావు. అంతవరకు నువ్వు అజరామరుడివై వుంటావు. నీ వాళ్ళ మధ్యకు తిరిగి వెళ్ళు.

నేను ఆశ్చర్యం నుంచి తేరుకోవటానికి చాలాసేపు పట్టింది. నేనిదంతా నమ్మలేకుండా వున్నాను స్వామ" అన్నాను.

మళ్ళీ చిన్న నవ్వు. నువ్వు దేవుడిని నమ్మవు సరే, దేవుడు ఎప్పుడూ సత్యమే చెపుతాడని కూడా నమ్మవ"?

నేను నొచ్చుకుంటూ అలా అనకు దేవదేవ" అన్నాను.

నేను నీకు ఇంకో వరం కూడా ఇస్తున్నాను.

ఉత్సుకతతో తల పైకెత్తాను.

నువ్వు వెళ్ళి తిరిగి నీ శరీరంలో ప్రవేశించు.యధాతథంగా నీ జీవితం తిరిగి ప్రారంభం కాగానే, నీ అంతర్ చక్షువు శక్తి వందరెట్లు పెరుగుతుంది. నీ మెదడు మరింత సునిశితమవుతుంది. నిరంతరం ఆలోచించినా అది అలసిపోదు. ఇంకమైనా వరాలు కావాలా?

ఆనందంతో కదలిపోతూ, చాలూ స్వామీ ధన్యుణ్నీ! ఇంకేమీ అవసరం లేద" అన్నాను. నేనేమి అడగటం మర్చిపోయి తప్పు చేశానో ఆక్షణం, ఆనందంలో మర్చిపోయాను.

న ాకనుల ముందున్న వెలుగు క్రమంగా మాయమైంది.గాలిలో తేలుతున్నట్టు ఆనందంగా బయటకు వచ్చాను. బయటున్న మతప్రవక్త నేను వైతరణి దాటి ఇవతలికి వస్తుంటే ఈర్ష్యగా చూశాడు. మిగతా ఆత్మలు ఉత్సుకంగా వున్నాయి.

వారి నుంచీ వీడ్కోలు తీసుకొని, కాలంకన్నా వేగంగా నేను భూ ముఖం వైపు ప్రయాణం చేసాను.

నా శరీరంలోకి ప్రవేశించాను.

నెమ్మదిగా నా శరీరం జీవం పోసుకుంది. చుట్టూ వున్న కలకలం వినిపిస్తూంది. ఎవరో ఎవరితోనో గట్టిగా అరుస్తున్నారు....ఇంకా ఆలస్యం ఏమిటరా" అని.

వచ్చి వరుసగా దణ్ణాలు పెట్టండి అని మరెవరో నిర్థేశిస్తున్నారు.

అప్పుడు నేను నెమ్మదిగా కన్నులు విప్పాను.

నాకు మొట్టమొదటగా కనపడింది - నా రెండు కాళ్ళ బొటన వేళ్ళనీ కలిపి గట్టిగా కట్టిన పురికోసతాడు.

 
(సశేషం..)

 
 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech