Sujanaranjani
           
  కబుర్లు  
  వీక్ పాయింట్
      కళ్లున్న కబోది  
 

- రచన : ఎం.వి.ఆర్. శాస్త్రి

 
 


కళ్లుంటాయి... చూడలేదు. చెవులుంటాయి... వినలేదు. కాళ్లుంటాయి... కదలలేదు మెదడుంటుంది... వాడలేదు ఏమిటది? తెలుగు సినిమా సెన్సార్ బోర్డు సమాజం మీద, జనం మీద మంచికైనా, చెడుకైనా పెద్ద ప్రభావం చూపే సినిమాల్లో ఏ వంకరా లేకుండా చూసేందుకు పేరు గొప్ప సినిమాటోగ్రాఫ్ చట్టం ఉంది. దాన్ని తిన్నగా నడిపేందుకు బండెడు ‘సినిమాటోగ్రాఫ్ రూల్సు’న్నాయి. కాని ఆ పప్పులేవీ తెలివిమీరిన టాలీవుడ్‌లో ఉడకవు. రూల్సూగీల్సూ, చట్టబద్ధ విధివిధానాలు నిక్కచ్చిగా అమలయ్యే పక్షంలో ఎంత క్లీన్ సినిమాకైనా సర్ట్ఫికెటు చేతికందడానికి దరఖాస్తు పెట్టాక ఎంత లేదన్నా ఒకటి రెండు వారాలు పడుతుంది. తోలు మందం టాలీవుడ్‌లో తయారయేవి ఎక్కువ భాగం అన్ క్లీన్ సినిమాలే. పచ్చి బూతులను, పిచ్చి కూతలను, ఏకార్థపు డైలాగుల్ని, చెత్తసీన్లని, రోత పాత్రలనీ తీసేస్తే ఏమీ మిగలని బాపతే చాలావరకూ. సెన్సార్ కత్తెర సరిగా ఆడితే తిరుక్షవరం తప్పదని తీసేవాళ్లకి తెలుసు. అయినా సర్ట్ఫికెటు రాదేమోనన్న భయం తెరవేల్పులకు నాస్తి! రాకచస్తుందా అని వాళ్ల ధీమా. ఆ బేఫర్వాతోనే రిలీజ్ ముహూర్తం ముందే ప్రకటించి, ప్రచారార్భాటంతో దిక్కులదరగొట్టి, అడ్వాన్సు బుకింగులూ మొదలెట్టించి, సరిగ్గా విడుదల తేదీకి రెండు రోజుల ముందో, మూడురోజుల ముందో డబ్బాలను సెన్సారు వాళ్ల మొగాన పడెయ్యటం తెలుగు సినిమా రంగంలో చాలా మాములు. లెక్క ఎక్కడైనా తప్పి, సర్దుబాట్లలో తేడా వచ్చి కింది కమిటీ సర్ట్ఫికెటు ఇవ్వము పొమ్మంటే...? ఏమీ ఫర్వాలేదు. దానినెత్తిమీద పై కమిటీ ఉంటుంది. ఆగమేఘాల మీద అక్కడికివెళ్లి, వాయువేగంతో ఓవర్ టైమ్ పనిచేయించి, అనుకున్న డేటులోపే చెవులు పిండి సర్ట్ఫికెటు పుచ్చేసుకోవటం ఎలాగో పెద్ద నోరు పెదరాయుళ్లకు తెలుసు. అదెలా సాధ్యమని విస్తుపోకండి. కట్టులేని బ్రాహ్మణ సమాజాన్ని ఒక్క తాటిమీదికి తెచ్చిన మంచువారి మాస్టర్ పీస్ తబిసీలునే ఒకమారు గమనించండి. ‘దేనికైనా రెడీ’ అన్న అద్భుత కళాఖండానికి సర్ట్ఫికెటు కోసం అప్లై చేసింది అక్టోబరు 16న. ఎగ్జామినింగ్ కమిటీ (ఇ.సి.) 19న ఏర్పాటై ఆ సినిమాను చూసింది. ఇ.సి. చూడటమనే తతంగం కాగానే సర్ట్ఫికెటు ఆటోమెటిగ్గా ఎలాగూ వచ్చేస్తుందికదా అన్న ధీమాతో 24న రిలీజ్ అంటూ 21 తేదీ పత్రికల్లో భారీ ఎత్తున ప్రకటించారు. అనుకోని రీతిలో కథ అడ్డం తిరిగింది. ఇస్తారనుకున్న సర్ట్ఫికెటు ఇచ్చేందుకు సెన్సారమ్మ మొరాయించింది. దానిమీద మంచువారు గుగ్గిలమయ్యారు. ఆ గొడవంతా చూసి - అనుకున్న తేదీకి సినిమా విడుదల కాదనే చాలామంది అనుకున్నారు. కాని - కాగల కార్యం ఆర్.సి. గంధర్వులు తీర్చారు. అక్టోబర్ 22న మంచు మో.బా. కోరినదే తడవుగా రివిజన్ కమిటీ రివ్వున పుట్టింది. సెంట్రల్ బోర్డులో మెంబరు అయిన ఒకానొక తెలుగు సినిమా ఆసామీ ఆర్.సి.కి అధ్యక్ష స్థానంలో కూచున్నాడు. తొమ్మిది మందిని ఏరుకుని ఆర్.సి.లో వేశాడు. అంతా కలిసి వెంఠనే అర్జంటుగా (23న) సినిమా చూశారు. ఆలస్యం లేకుండా అదేరోజు సర్ట్ఫికెటునూ ఇచ్చేశారు. అనుకున్న ప్రకారం 24న సినిమా రిలీజైంది. బాగానే ఉంది. డౌటల్లా ఒక్కటే. ఈ రకంగా ఆర్.సి.ని వేయొచ్చని, అది ఈ రీతిన నిర్ణయం ప్రకటించవచ్చునని, సినిమాటోగ్రాఫ్ చట్టంలో ఏ క్లాజు చెబుతుంది? సినిమావాళ్లూ సినిమా వాళ్లూ కలిసి సర్ట్ఫికెట్లను లాగించుకోవడానికి నిబంధనలు అంగీకరించే పక్షంలో ఆ రకమైన రూలు సి.బి.ఎఫ్.సి. ఆధికారిక వెబ్‌సైటులో ఎక్కడా కనపడదేమి? సి.బి.ఎఫ్.సి. అధిపతి ప్రమేయంతోనే, అతడి ద్వారానే నిర్ణయాలు జరగాలన్న దిక్కుమాలిన నియమాలు రూలు బుక్కులో ఇంకా తగులడ్డాయేమి? సరే! ఇ.సి.లో ఐదుగురు, ఆర్.సి.లో పదిమంది... వెరసి పదిహేనుమంది మహామహులు కళ్లు ఆర్పకుండా చూశాక, సెన్సార్ సూత్రాల ప్రకారం అంతా భేషుగ్గా ఉందని సర్ట్ఫికెటు ఇచ్చాక గదా మంచు ముత్యం రిలిజైంది? సినిమాల్లో మహిళలను ఏవిధంగానైనా కించపరిచే దృశ్యాలు ఉండరాదని, మతపరమైన, ఇతర వర్గాలకు సంబంధించిన వారిని చులకన చేయరాదని... ఏ వ్యక్తినీ, ఏ సముదాయాన్నీ అప్రతిష్ఠపాలు చేయకూడదని మార్గదర్శక సూత్రాలు ఘోషిస్తున్నాయి కదా? మరి - వేదమూర్తులైన ఘనపాఠిలను... లగడపాటి, దగ్గుబాటిలకంటే తక్కువ వారిగా చూపించటం... ‘‘సంభావన పేరు చెబితే తోక ఊపుకుంటూ వస్తార’’ని పురోహితులను దూషించటం... బ్రాహ్మణ పాత్రలన్నిటినీ మంత్రాలు రాని, నిష్ఠలేని, మాంసాన్ని జుర్రే నికృష్టులుగా చిత్రించటం ఒక మతాన్ని, ఒక సామాజిక వర్గాన్ని దారుణంగా అవమానించటం కాదా? డబ్బులిస్తే ఎవరినైనా ఇంట్లోకి రానిస్తూ, ప్రతి అడ్డమైన వాడిలోనూ తన మగడిని చూసుకుంటూ... డబ్బు వస్తే చాలు నాన్‌వెజ్ అయినా ఫరవాలేదని బరితెగించే ఆడదిగా ఒక వేదపండితుడి ఇల్లాలిని చిత్రించటం మహిళా జాతికి అపచారం కాదా? పరమ పవిత్ర చండీయాగాన్ని ఒక మహమ్మదీయుడి ఆధ్వర్యంలో జరిపించి, చెత్త సినిమా పాటలను మంత్రాలుగా చదివించటం కామెడీయా? మతాచారాన్ని మంటగలిపే కావరమా? రెండు మతాలకు చెందిన రెండు కుటుంబాలను కలిపే ఉదాత్త ధ్యేయంతో ఒక బ్రాహ్మడికి ముస్లిం వేషంవేసి, సినిమా చరణాలతో నమాజ్ చేయంచే ధైర్యం సినిమా వాళ్లకు ఉందా? అంతా కామెడీయేనని, సినిమాను సినిమాలాగే చూడాలని మహమ్మదీయ సోదరులకు వారు క్లాసులు పీకగలరా? పని గట్టుకుని ఒక కులాన్ని, ఒక మతాన్ని, మొత్తంగా నారీలోకాన్ని గేలిచేసే దృశ్యాలను చూసీ... డైలాగులను వినీ... బుర్రలో బ్రెయిను ఉంచుకుని కూడా రెండు కమిటీలూ కలిసి, ఒక రోత సినిమాను జనం మీదికి ముద్రకొట్టి వదిలారు! సెన్సార్ బోర్డు కళ్లులేని కబోది, సినిమావారి తైనాతీ అనడానికి ఇంతకంటే రుజువు కావాలా?


 
     
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech