Sujanaranjani
           
  కబుర్లు  
  జ్వాలా గారి శీర్షిక
 

    రావణుడు దేవుడెలా అవుతాడు?

 
 

రచన : వనం జ్వాలా నరసింహారావు

 
 

రావణాసురుడు దేవుడని, ఇటీవల కొందరు ప్రబుద్ధులు, పని కట్టుకుని మరీ ప్రచారం చేస్తున్నారు. ఆ మాటకొస్తే, ఒక్క రావణుడే కాదు..... మహిషాసురుడు, నరకాసురుడు, హిరణ్య కశిపుడు, శిశుపాలుడు...ఇలా మన పురాణాలలో, ఇతిహాసాలలో రాక్షసులుగా ముద్రపడిన ప్రతి వారినీ వారు దేవతలంటున్నారు. అంతటితో ఆగకుండా, రావణుడిని అగ్రవర్ణాల వారు అణగదొక్కారని, అతనెంతో నీతిమంతుడని కూడా వాదిస్తున్నారు. వాల్మీకి రామాయణంలో అతడి గురించి తప్పుడు ప్రచారం జరిగిందన్న వాదననూ లేవదీశారు. దసరా-దీపావళి పండుగల సందర్భంగా రావణ దహనం అగ్రవర్ణాల వారి దురహంకారంగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేశారు. వారి వాదన తప్పని చెప్పే ప్రయత్నమే ఇది.

రావణాసురుడి పుట్టుకే అతి జుగుప్సాకరమైంది. అగ్రవర్ణాల వారు వాడిని అణగ తొక్కారనే వాదన సరైంది కాదు. కారణం రామాయణం రాసిన వాల్మీకి అగ్రవర్ణానికి చెందిన వాడు కాకపోవడమే! అది కాకుండా రావణుడు పుట్టింది కూడా బ్రాహ్మణ-క్షత్రియ జంటకు. అలాంటప్పుడు వెనుకబడిన వర్గానికి చెందిన వాడెలా అవుతాడు? వాడు బుద్ధి తెల్సినప్పటి నుంచే ఘోరాలు-నేరాలు చేసిన వాడే!. బ్రహ్మ గురించి తపస్సు చేసి, మనుష్యులను, అంతకన్నా తక్కువ జీవులను తాను లక్ష్య పెట్టనని, మిగిలిన వారితో చావు లేకుండా వరమివ్వమని అడిగి, అలాగే వరం పొందాడు. సవతి సోదరుడు కుబేరుడిని ఆ వర బలంతో లంక నుంచి వెళ్ల గొట్టాడు. ముల్లోకాలను బాధ పెట్టడం వాడికొక దిన చర్య. అడ్డూ-అదుపూ లేకుండా క్రూరుడై, దేవతలను, ఋషులను, యక్షులను చంపసాగాడు. తప్పని చెప్పిన అన్న కుబేరుడి మీద యుద్ధానికి పోయి పుష్పక విమానాన్ని లాక్కుంటాడు. శౌర్యవంతులైన రాజులను ఇబ్బందులకు గురి చేస్తూ, యుద్ధంలో ఎదిరించిన వారిని చంపుకుంటూ, ఓడిన వారిని బెదిరిస్తూ రోజులు గడిపేవాడు. నందీశ్వరుడిని అవమానించి శాపానికి గురయ్యాడు. కామంతో వేదవతిని అవమానించాడు. ఆమె పార్వతి శాపం నిజం చేస్తానని మళ్లీ శపిస్తుంది. అయోధ్య రాజు అనరణ్యుడిని అవమానించి ఆయన శాపానికీ గురవుతాడు. యముడి మీదకు, ఇంద్రుడి మీదకు దండెత్తుతాడు. బల గర్వంతో, రాజ స్త్రీలను, ముని కన్యలను, దానవ కుటుంబినులను, దేవతా స్త్రీలను, కంటకనబడిన స్త్రీలందరినీ బలాత్కారం చేస్తాడు. రావణుడు పర స్త్రీ కారణంగానే చంపబడతాడని శపించారు వారందరు. అలా మరో శాపం తగిలింది. రంభను చెరిచి నలకూబరుడి శాపానికి గురవుతాడు. కార్తవీర్యార్జునుడితో, వాలితో కయ్యానికి దిగి గర్వభంగమవుతాడు. సీతాదేవిని అపహరిస్తాడు. ఇలా చెప్పుకుంటూ పోతే వాడు చేసినవన్నీ అరాచకాలే! వాడెలా దేవుడవుతాడు. మరిన్ని వివరాలకు పోతే.....

బ్రహ్మ మానస పుత్రుడైన పులస్త్యుడి కొడుకు విశ్రవసుడికి భరద్వాజుడి కూతురైన దేవవర్ణి ద్వారా పుట్టిన వాడు కుబేరుడు. ఆతడి నివాస స్థానం లంక. దానిని రాక్షసులు కాపురం చేయడానికి విశ్వకర్మ నిర్మించాడు. బ్రహ్మ తనకిచ్చిన పుష్పక విమానంలో తిరుగుతూ కుబేరుడు అక్కడ కాపురముంటాడు. సుమాలి అనే రాక్షస రాజు సూచన మేరకు ఆయన కూతురు కైకసిని విశ్రవసువును వివాహం చేసుకోదలచి, ఆయనను చేరబోతుంది. ఆమె మనసులోని భావాన్ని గ్రహించి, వచ్చిన సమయం మంచిది కానందున, క్రూరులైన రాక్షసులు ఆమెకు కొడుకులుగా పుట్తారని విశ్రవసువు అంటాడు. కొంతకాలానికి ఆమెకు నిడుపాటి కోరలు, పది తలలు, ఎర్రని వెంట్రుకలు, ఇరవై చేతులతో భయంకరమైన ఆకారం కలవాడిని కంటుంది. వాడికి దశకంఠుడు అని పేరు పెట్టాడు తండ్రి విశ్రవసుడు. ఆ తరువాత వాడికి రావణుడనే పేరు మిగిలింది. రావణుడి తండ్రి బ్రాహ్మణుడైనప్పటికీ, తల్లి రాక్షస రాజకన్యక ఐనందున, బ్రాహ్మణుడికి క్షత్రియ స్త్రీయందు కలిగిన వాడు క్షత్రియుడే. బ్రాహ్మణుడైనా, క్షత్రియుడైనా, అగ్ర కులాలకు చెందిన వాడే! మరి కొంతకాలానికి కైకసికి కుంభకర్ణుడు, శూర్పణఖ జన్మించారు. వీరూ క్రూరులే. చివరకు విభీషణుడనే ధర్మాత్ముడైన కొడుకు పుట్టాడు.  బ్రహ్మ గురించి తపస్సు చేశాడు దశకంఠుడు. మనుష్యులను, అంతకన్నా తక్కువ జీవులను తాను లక్ష్య పెట్టనని, మిగిలిన వారితో చావు లేకుండా తనకు వరమివ్వమని అడిగి, బ్రహ్మనుంచి అలాగే వరం పొందాడు. సుమాలి సలహా మేరకు, రావణుడు కుబేరుడి దగ్గర నుంచి లంకను వశం చేసుకుంటాడు. మయుడనేవాడు, తన కూతురు మండోదరిని, రావణుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. మండోదరి-రావణాసురుడికి ఒక కొడుకు పుట్టాడు. వాడు భూమిమీద పడగానే మేఘాలు గర్జించడం వల్ల అతడి పేరు మేఘనాథుడని పెట్టాడు రావణుడు. రావణుడు ముల్లోకాలను భాదించడం మొదలెట్టాడు. అడ్డూ-అదుపూ లేకుండా క్రూరుడై, దేవతలను, ఋషులను, యక్షులను చంపసాగాడు. సోదరుడు కుబేరుడిని జయించి పుష్పక విమానాన్ని లాక్కుంటాడు. కైలాస గిరి ప్రాంతంలో, నందీశ్వరుడిని కోతితో పోల్చి హేళన చేశాడు. కోతులతో ఓడిపోతాడని నందీశ్వరుడు శపించాడు.

కామంతో కళ్లు మూసుకున్న రావణుడు ఒకనాడు తల వెంట్రుకలు పట్టుకుని వేదవతిని లాగుతాడు. గతంలో పార్వతి లాగే వేదవతి కూడా రావణుడిని స్త్రీ నిమిత్తంగా నాశనమవుతావని శపిస్తుంది. అగ్నిప్రవేశం చేస్తుంది. ఆ వేదవతే, జనక మహారాజు కూతురై, భూమిలో పుట్టి, సీత పేరుతో శ్రీరాముడిని వివాహమాడింది. మరుత్తు అనే రాజు యజ్ఞం చేస్తుంటే అక్కడకు పోయి, మునులందరినీ చంపి, వారి నెత్తురు తాగి, తృప్తి చెంది అక్కడ నుండి వెళ్లిపోతాడు. అయోధ్యకు వెళ్లి, అనరణ్యుడిని యుద్ధంలో ఓడించి, అతడి శాపానికీ గురవుతాడు. తన వంశంలోనే దశరథ మహారాజు కుమారుడైన రాముడు, యుద్ధంలో రావణుడిని చంపుతాడని శపించాడు అనరణ్యుడు. ఇది రావణుడికి నాలుగో శాపం. నరులను చంపటం ఆతడికి ధర్మం కాదని బోధించాడు నారదుడు రావణుడికి. దేవతలు, గంధర్వులు, యక్షులు, దీర్ఘకాలం బతికేవారని వారిని జయించడం గొప్ప అని అంటాడు. యముడిని యుద్ధంలో జయించమని రావణుడికి దుర్భోధ చేశాడు. యముడిని చంపడానికి పోతాడు. యమ-రావణ యుద్ధం జరుగుతుంది. ఇరువురు సరిసమానంగా పోరు సల్పారు. రావణుడిపై యమ దండం వేయడానికి సిద్ధ పడతాడు యముడు. ఆ పని చేయవద్దని బ్రహ్మ దేవుడు యముడిని వారించాడు. యముడు అదృశ్యమైపోయాడు. యముడిని గెలిచినట్లు ప్రకటించుకున్న రావణుడు యమ పురిని విడిచి పోయాడు.

రావణుడు "నివాత-కవచు" లనే రాక్షసులతో సంది చేసుకుంటాడు. కాలకేయులను జయించి, వరుణ నగరంపై యుద్ధానికి పోతాడు. వరుణ తనయులు రావణుడితో యుద్ధం చేసి ఓడిపోతారు. గెలుపు తనదే కదా అనుకుంటూ, లంకా నగరానికి బయల్దేరాడు రావణుడు. పోతూ-పోతూ, దారిలో, బల గర్వంతో, రాజ స్త్రీలను, ముని కన్యలను, దానవ కుటుంబినులను, దేవతా స్త్రీలను, కంటకనబడిన స్త్రీలందరినీ బలాత్కారం చేస్తాడు. వారందరినీ పుష్పక విమానంలో పడేస్తాడు. వారిలో నాగ కన్యలు, మనుష్య స్త్రీలు, అసుర కాంతలు, రాక్షస వనితలు, యక్ష సతులు, దానవాంగనలున్నారు. వారిలో పెళ్లి ఐన వారు, కాని వారు కూడా వున్నారు. చెరబడిన స్త్రీలందరూ విలపించినా రావణుడు పట్టించుకోడు. చెరబడిన స్త్రీలు రావణుడిని శపించారు. పర స్త్రీలను తన భార్యలుగా చేసుకోవాలన కోవడం కంటే పాప కార్యం లేదని, తమను కామంతో వశ పర్చుకో చూస్తున్నాడని, తామే పతివ్రతలమైతే, రావణుడు పర స్త్రీ కారణంగానే చంపబడతాడని శపించారు వారందరు. అలా మరో శాపం తగిలింది.

దేవతల మీదకు దండయాత్రకు పోతాడు. దేవతా సౌందర్యవతి రంభను చూసి ఆమె చేయి పట్టుకుంటాడు. రావణుడు తనకు తండ్రి లాంటి వాడని, తాను ఆయనకు వరుసకు కోడలని, తన మీద దయ చూపాలని, ఇతరులు తనను అవమానిస్తే రక్షించాల్సిన వాడు ఇలా చేయడం తగదని, తనను నగుబాట్లపాలు చేయవద్దని వేడుకుంటుంది రంభ. రావణుడా మాటలు పట్టించుకోకుండా రంభను చెరిచి విడిచి పెట్తాడు. రావణుడు చేసిన పనిని భర్త నలకూబరుడి(కుబేరుడి కొడుకు) తో చెప్తుంది రంభ. పర స్త్రీని చెరిచినట్లయితే రావణుడు మరణించుతాడని నలకూబరుడు శపించుతాడు. ఆ దినం మొదలుకుని, పర స్త్రీ సంగమం విషయంలో మనస్సు పోనిచ్చినవాడు కాదు రావణుడు. దేవ-దానవ యుద్ధం జరుగుతుంది. రావణుడి కొడుకు మేఘనాధుడు ఇంద్రుడిని బంధించుతాడు. నాటి నుంచి వాడు ఇంద్రజిత్తుగా పిలవబడతాడు. అప్పటినుంచి, తనకెలాగూ కుమారుడు ఇంద్రజిత్తు తోడున్నాడు కదా అని, మరింత లోక కంటకుడై విర్రవీగుతుండేవాడు రావణుడు. కార్తవీర్యార్జునుడి మీదకు యుద్ధానికి పోతాడు. కార్తవీర్యార్జునుడు వాడిని బంధించి చెరసాలలో పడేశాడు. ఇది తెలుసుకున్న రావణుడి తాత పులస్త్యుడు అక్కడకు చేరుకుని, రావణుడిని చెరసాలనుంచి విడవమని కోరాడు. ఆయన కోరికను మన్నించాడు కార్తవీర్యార్జునుడు. రావణుడు కార్తవీర్యార్జునుడితో స్నేహం చేస్తూ, తరువాత, మళ్లా రాజులను ఓడించాలన్న కోరికతో, పొగరు పడుతూ, భూమి మీద తిరుగుతుండేవాడు. రావణుడు లోకాలలో సంచరిస్తూ, ఒకనాడు కిష్కింధకు వచ్చి, వాలిని యుద్ధానికి పిలిచాడు. వాలి, రావణుడిని తన చంకలో ఇరికించి, ఆకాశ మార్గంలో పోయి, పడమటి సముద్రంలో, ఉత్తర సముద్రంలో, తూర్పు సముద్రంలో సంధ్య వారుస్తాడు. ఆ తరువాత వారిరువురు స్నేహితులౌతారు.

అరణ్యవాసం చేస్తున్న శ్రీరామ లక్ష్మణ సీతాదేవిలు పంచవటికి చేరుకుంటారు. రావణుడి సోదరి శూర్పణఖ శ్రీరాముడిని చూస్తుంది. తానతిడిని మోహిస్తున్నట్లు చెప్తుంది. తమ్ముడు లక్ష్మణుడు వద్దకు పొమ్మని సలహా ఇచ్చాడు రాముడు. శూర్పణఖ ముక్కు-చెవ్వులు కోస్తాడు లక్ష్మణుడు. కురూపిని చేస్తాడు. శూర్పణఖకు తోడుగా వున్న ఖరుడు ఆమె వికృత రూపాన్ని చూసి కోప్పడతాడు. రాముడిమీద యుద్ధానికి పద్నాలుగు వేల మంది రాక్షసులను పంపుతాడు. వారందరినీ చంపుతాడు రాముడు. ఖర-దూషణులిద్దరూ రాముడి చేతిలో ఓడి చనిపోతారు. ఇది గమనించిన అకంపనుడనే వేగులవాడు, లంకా నగరానికి పోయి, రావణాసురుడితో సీతాపహరణం చేయమని, శ్రీరామ వధోపాయం అదేనని సలహా ఇస్తాడు. సీతాదేవి సౌందర్యాన్ని రావణుడికి వివరంగా చెప్తాడు. శూర్పణఖ కూడా సీతాపహరణం చేయమని బోధిస్తుంది.

రాముడు శూర్పణఖను కురూపిని చేయడం, ఖర-దూషణాదులను సంహరించడం, ఇతర రాక్షసులను మట్టుబెట్టడం రావణుడి మదిలో మెలిగాయి. పగ తీర్చుకోవాలను కుంటాడు. రహస్యంగా మారీచుడి వద్దకు బయల్దేరాడు. సాయం చేయమని మారీచుడిని వేడుకుంటాడు. సీతాపహరణానికి తనకు తోడుగా రమ్మంటాడు. జవాబుగా మారీచుడు శ్రీరాముడి బల పరాక్రమాలను రావణుడికి తెలియ పరుస్తాడు. శ్రీరాముడితో తాను స్వయంగా పడిన పాట్లను వివరించాడు. ఎలా తాను రావణుడి బారి నుంచి తప్పించుకున్నాడో తెలియచేశాడు. రావణుడు నిష్టూరాలాడి, పరుషంగా మాట్లాడి, తనకు తోడుగా రావడానికి మారీచుడిని అంగీకరింప చేశాడు. రావణ-మారీచులు పంచవటికి కలిసి పోతారు. మారీచుడు మాయ మృగం వేషం వేస్తాడు.

రావణుడు సన్న్యాసి వేషంలో సీతను అపహరించదల్చి ఆమె దగ్గరకు పోయాడు. రాక్షస నాయకుడు రావణాసురుడిని తానే అంటాడు. తన భార్యవు కమ్మని అంటాడు. తన నిజ స్వరూపం చూపించి రావణుడు ఆమెను భయపెడ్తాడు. చివరకు సీతను రావణుడు బలాత్కారంగా ఎత్తుకుని పోతాడు. దారిలో కనిపించిన జటాయువు రావణుడిని అడ్డుకుంటాడు. జటాయు-రావణుల మధ్య యుద్ధం జరుగుతుంది. రావణుడు జటాయువు రెక్కలు నరికేసి, సీతను ఎత్తుకుని పరుగెత్తుతాడు. సీత ఎంతగా రావణుడిని నిందించినా ఫలితం లేకపోతుంది. చివరకు సీతతో రావణుడు లంక చేరుకుంటాడు. సీత మీద రాక్షస స్త్రీలను కాపలాగా వుంచుతాడు. సీత తనను కామించడానికి పన్నెండు నెలల గడువిస్తాడు. ఆ మర్నాడు మాట వినని సీతను తన భోజనం కొరకు వంటవారు ముక్కలుగా కోసి వండుతారని బెదిరిస్తాడు.

హనుమంతుడు చేసిన అసాధ్య కార్యం, రాక్షస వధ, రావణుడిని భయపెట్టింది. ఒక కోతే అంత పని చేస్తే, వానర సేనంతా వస్తే ఇంకెంత ఘోరం జరగబోతుందో అని ఆలోచనలో పడ్డాడు. మంత్రులను సలహా కోరతాడు. అప్పుడు విభీషణుడు రాజనీతిని తెలియచేస్తాడు. సామ, దాన, భేద ఉపాయాలను వివరించి, ఈ మూడింటి వల్ల కార్యం సాధ్యపడదేని అప్పుడే దండోపాయం అవలింభించాలని బోధించాడు. యుద్ధానికి దిగడం శాస్త్ర విరుద్ధం అంటాడు. సీతను వదిలిపెట్టమని సలహా ఇస్తాడు. శ్రీరాముడి దేహబలంతో పాటు దైవ బలం, ధర్మ బలం వుందని, ధర్మం వున్న చోట జయం తప్పక వుంటుందని స్పష్టం చేశాడు. కుంభకర్ణుడు కూడా రావణుడిపై కోప్పడతాడు. ఎవరినడిగి సీతను అపహరించావని అడుగుతాడు.

రావణుడి తల్లి కైకసి, మరో వృద్ధ మంత్రి విద్ధుడు, శ్రీరాముడికి సీతను ఇవ్వమని రావణుడికి బోధించారు. రావణుడి తల్లికి పెదనాన్న ఐన మాల్య వంతుడు కూడా సీతను ఇవ్వమని అంటాడు. రాముడికి వానర బలమే కాకుండా దైవ బలం కూడా వుందంటాడు. " బ్రహ్మ దేవుడు లోకంలో ధర్మం, అధర్మం అని రెండు పక్షాలను సృష్టించాడు. గొప్ప బుద్ధికల దేవతలు ధర్మాన్ని ఆశ్రయించారు. అసురులు అధర్మాన్ని ఆశ్రయించారు. తనను ఆశ్రయించిన వారిని ఉద్దరించుట ధర్మం లక్షణం. అణగదొక్కడం, అధోగతి పాలు చేయడం అధర్మం లక్షణం" అని అంటూ మాల్య వంతుడు, రావణుడు పరాక్రమంతో ధర్మాన్ని నాశనం చేసి, అధర్మాన్ని సంపాదించాడని, అధర్మం ఆయనకు కీడు చేయక మానదని, జాగ్రత్తగా వుండమని చెప్తాడు. రావణుడు మాల్య వంతుడిని కూడా ధిక్కరించాడు. ఇక యుద్ధం తప్పదనుకున్న రావణుడు పుర ద్వారాలను రక్షించడానికి నాలుగు దిక్కులా నలుగురు ప్రముఖులను నియమించాడు.

ఈ నేపధ్యంలో యుద్ధం ఆరంభమవుతుంది. శ్రీరాముడు రాక్షసులను వధించుతాడు. ధూమ్రాక్షుడు, వజ్రదంష్ట్రుడు, అకంపనుడు, ప్రహస్తుడు, ఒకరి వెంట ఒకరు యుద్ధానికి పోయి చని పోతారు. అప్పుడు రావణుడు తొలిసారిగా యుద్ధానికి బయల్దేరతాడు. ఇంతవరకు, ప్రభువైన రావణుడు ప్రత్యక్షంగా యుద్ధానికి పోకుండా, ఇతరులతో వానరులను జయించుదామనుకుంటాడు. ఎంతటి వారిని పంపినా వారు చనిపోవడంతో, తానింట కూర్చుండి ఇతరులను పంపిస్తున్నాడన్న నింద పడుతుందని ఆయనే బయలుదేరతాడు. రామ-రావణుల ప్రధమ యుద్ధం ఆరంభమవుతుంది. రామ బాణాల ధాటికి తట్టుకోలేక పోతాడు రావణుడు. చేతులో విల్లును బుద్ధిపూర్వకంగా వదిలి పెట్తాడు రావణుడు. విల్లు లేనివాడిని రాముడు చంపడని వాడికి తెలుసు. యుద్ధ ధర్మ పద్ధతిని అనుసరించి రాముడు, రావణుడి తలకు గురి పెట్టిన బాణంతో, కిరీటాన్ని మాత్రమే పడగొట్టాడు. ఐనా వాడికి జ్ఞానోదయం కాలేదు. కిరీటం పోయిందంటే వాడి ప్రభుత్వం కూలిపోయినట్లే కదా! ఇక కొట్టనని చెప్తూ, నిర్భయంగా లంకకు పారిపొమ్మంటాడు రావణుడిని రాముడు. పోయి బడలిక తీర్చుకుని, అస్త్రాలన్నీ తీసుకుని మళ్లీ యుద్ధానికి రమ్మంటాడు. అప్పుడు వాడిని విరథుని-నిరాయుధిడిని చేయకుండా చంపుతానని పరోక్షంగా హెచ్చరిస్తాడు. రావణుడు పరాజితుడై లంకకు పోతాడు. పోయి, తన పరాభవాన్ని తలచుకుంటూ దుఃఖిస్తాడు. ఒక మనుష్యుడిని గెలవలేక పోయానే అని చింతించాడు. దురహంకారంతో, తనను మనుష్యులేమీ చేయలేరని భావించి, వారితో చావు లేకుండా వరం పొందలేదే అని విచారించాడు. అనరణ్యుడిచ్చిన శాపాన్ని గుర్తు చేసుకుంటాడు. వేదవతి శాపం కూడా గుర్తుకొచ్చింది. సీతే వేదవతి అని నిర్ధారించుకుంటాడు. సీతారాములిరువురు మనుష్య జాతి వారే అనుకుంటాడు. పార్వతి శాపం, రంభ నిమిత్తం నలకూబరుడిచ్చిన శాపం, బ్రహ్మ శాపం గుర్తుకొచ్చాయి.

ఐన వారందరూ చచ్చిపోయారని దిగులు పట్టుకుంటుంది రావణుడికి. పౌరుషోక్తులు పలుకుతూ రావణుడు యుద్ధానికి వెళ్తాడు. రామరావణుల కడపటి యుద్ధం ప్రారంభమవుతుంది. రావణుడి శూలాన్ని విరగగొట్టాడు రాముడు. రావణుడిని కాపాడాలన్న ఉద్దేశంతో, రథాన్ని, సారథి మరలించుతాడు. ఆ పని చేసినందుకు సారధిని దూషించుతాడు రావణుడు. రావణుడి మేలు కోరి తానలా చేసానని అంటాడు సారథి. ఆ తరువాత మళ్లీ రాముడి మీదకు యుద్ధానికి పోతాడు. రావణుడి ధ్వజాన్ని నరుకుతాడు రాముడు. రావణుడి శిరస్సును ఖండించాడు. తల నరకగానే తల మొలిచింది కాని వాడు చనిపోవడం లేదు. చివరకు బ్రహ్మాస్త్రంతో రావణుడిని వధించాడు రాముడు. రావణుడి మరణానికి లోకాలన్నీ సంతోషించాయి.

రావణుడి రూపం, తేజం, బలం, ధైర్యం అనుపమానవైనవే. సౌందర్యం, సంపద, ఆకర్షణ రాముడిలో ఎంత వున్నాయో, రావణుడి దగ్గర కూడా అంతే మోతాదులో వున్నాయనవచ్చు. ఐతే, "రూప దాక్షిణ్య సంపన్నత", ఇతరుల పట్ల కరుణ, రక్షించాలనే బుద్ధి రాముడిలో వున్నాయి కాని రావణుడిలో లేవు. రావణుడు ధర్మ విరుద్ధమైన పనులే చేసి వుండకపోతే, ఇంద్రుడున్న స్వర్గాన్ని కూడా తన శక్తి-యుక్తులతో పాలించేవాడేమో. వాడిది కఠినమైన మనస్సు. భూతదయ వాడికి లేనందునే జనులు దూషించారు. దేవదానవులు వణికారు. రావణుడు, విధానాన్నసురించి ధర్మ శాస్త్రాలను చక్కగా అధ్యయనం చేశాడు. ప్రపంచం మెచ్చే రీతిలో తపస్సు చేశాడు. పర పురుషుల స్త్రీలను బాధ పెట్టడం వాడికి భావ్యం కాదు. రాక్షస వంశాన్ని ఈ అధర్మ కార్యం, కూకటి వేళ్లతో నాశనం చేసే విపత్తుకు దారితీసింది. రావణుడిలాంటి బుద్ధిమంతుడు ఇలాంటి పనులు చేయకుండా వుండాల్సింది. ఎంతో కష్టపడి తపస్సు చేసినా, అది మర్చిపోయి, తపో ధర్మం వల్ల కలిగే సత్ఫలితాలను పాడుచేసే పనులెన్నో చేశాడు. అతడి తపస్సు వ్యర్థమైపోయింది. తన తపస్సుతో దేవదానవులెవరూ జయించకుండా వరం పొంది, ఇంక తనకేం భయమని గర్వపడ్డాడు. వాస్తవానికి, ఆ వరాలేవే అతన్ని ఎల్లప్పుడూ రక్షించ లేవనే సంగతి అతడి ఆలోచనకే రాలేదు.  

రావణుడు దేవతలతో - దానవులతో - రాక్షసులతో - గంధర్వులతో -నాగులతో చావకుండా వరం పొందాడు. అంతే సమానంగా శాపాలూ పొందాడు. ఆ వరాలు ఆయన నెట్లా రక్షిస్తాయి? ఆ వరాల బలంతో రావణుడెట్లా బ్రతుకుతాడు? కాబట్టి తపోబలం వుందన్న గర్వం వదులుకోవాల్సింది. చీకటి-వెలుతురు ఒకేసారి రానట్లే, పాప-పుణ్య ఫలాలు రెండూ ఒకేసారి అనుభవించలేం. పుణ్యం అనుభవించుతున్నంత వరకూ, పాప ఫలం దరికి రాదు. ధర్మ ఫలం అధర్మ ఫలాన్ని చెరిపేస్తుంది. చీకటి ఎలాగైతే వెలుతురును చెరచ లేదో, అలానే అధర్మ ఫలం రావణుడికి అనుభవం లోకి రాలేదు. తపఃఫలం వల్ల రావణుడు తనకు పాప ఫలం రాదనుకుంటున్నాడు! అష్టైర్యాలను అనుభవించే వాడికి రోగాలు రావా? రావణుడి తపస్సు అతడికి దీర్ఘాయువు ఇవ్వాలి. కాని, వాడు చేసిన పర స్త్రీ అపహరణనే పాపపు పని వల్ల త్వరగా చావాలి. రావణుడి పూర్వ పుణ్యం పూర్వ పాపాన్నే హరిస్తుంది. కాని చేసిన పాప కార్యాలనుండి అతడిని రక్షించదు. నేడు చేస్తున్న భోజనం, నిన్నటి ఆకలి బాధ తీరుస్తుంది కాని, రేపటి బాధను కాదు కదా! పశ్చాత్తాపం చెందితే, ప్రాయశ్చిత్తముంటుంది. రావణుడు బలవంతంగా ఎత్తు కొచ్చిన సీతాదేవిని, ఇతర స్త్రీలను ఎవరి వారికి వారిని అప్పగించి నట్లయితే, అతడి దోషం పోయుండేది. తపఃఫలం సదా రక్షిస్తుందనేమాట భ్రాంతే! తపఃఫలం పుణ్యమనుభవించిన కొద్దీ క్షీణిస్తుంది. శాశ్వతంగా మిగిలిపోదు.

రావణుడు తపఃఫలం ఎంత వరకు అనుభవించాలో, అంతా అనుభవించాడు. అది పూర్తయింది. ఆ తరువాత, చేసిన పాప ఫలం అనుభవించాలి. దాని ఫలితం త్వరలోనే రావణుడికి అర్థమై వుంటుంది. జన స్థానంలో వున్న రావణుడి తమ్ములందరూ చావటంతో మొదలయింది అతడి పాప ఫలం అనుభవించే రోజు. తర్వాత స్నేహితుడు వాలి చచ్చాడు. అతడి విరోధి సుగ్రీవుడు రాముడికి మిత్రుడయ్యాడు. ఇవన్నీ రావణుడికి అరిష్ట సూచనలే! రావణుడి వశమందున్న జానకి ఉత్తమ స్త్రీ అని, ఆమె లంకనంతా పాడుచేసేందుకు వచ్చిన కాళ రాత్రని, ప్రళయ కాలంలో కాళ రాత్రి ఏ విధంగా లోకాన్నంతా నాశనం చేస్తుందో, అట్లాగే, ఈమె లంకంతా నాశనం చేయబోతున్నదని, రావణుడి మెడలో తగులుకున్న యమపాశం ఈమె అని, బ్రతకాలనుకుంటే, లంకను కాపాడు కోవాలంటే, ఆమెను వదిలి పెట్టటమొక్కటే మార్గమని హనుమంతుడు చేసిన బోధ వాడి తలకెక్కలేదు.

కావ్యాలలోకెల్లా ప్రధమంగా ఉత్పన్నమైంది రామాయణం కావడంతో అది ఆదికావ్యమైంది. రామాయణాన్ని చక్కగా తెలిసినవారు, అర్థం చేసుకో గలిగిన వారు మాత్రమే లోకానికి అందలి విషయాలను వివరించ సమర్థులు. అందరికీ అది సాధ్యమయ్యేది కాదు. లౌకిక విషయాలను తెలుసుకోవాలనుకునే వారికి శ్రీ రామాయణాన్ని మించి తెలిపే గ్రంథం ఎక్కడా లేదు. కాలక్షేపానికి చదవడానికైనా శ్రీ రామాయణం లాంటి పుస్తకం ఇంకోటి లేదు. శ్రీ సీతారాముల పేరు విన్న ప్రతి ఆర్యుడు మనస్సులోనైనా భక్తితో నమస్కారం చేసుకోవాల్సిందే. సీతారాములలో విశేషమేమిటంటే, వారు అవతార మూర్తులు కావడమే ! వాల్మీకి మహర్షి ఆ అవతార రహస్యాన్ని, తాను గ్రంథస్థం చేసిన శ్రీ రామాయణంలో, తన శక్తికొలది వివరించాడు. రామాయణ గాథలో, శ్రీరామచంద్రుడు మనుష్యుడివలె నటిస్తుంటే, వాల్మీకే మో ఆయన సాక్షాత్తు భగవంతుడే అంటాడు. రాముడి చర్యల ద్వారా, రాముడి వాక్కుల ద్వారా తాను చెప్పదల్చుకున్న దాన్ని సిద్ధాంతీకరించాడు వాల్మీకి. శ్రీమద్రామాయణంలో ఉత్తమోత్తమ మహాకావ్య లక్షణాలెన్నో వున్నాయి. వర్ణనలెన్నో వున్నాయి. రామాయణం గానం చేసినా, పఠించినా మనోహరంగా వుంటుంది.

శ్రీమద్రామాయణం గొప్ప ధర్మ శాస్త్రం. ఇందులో సర్వ విధాలైన, అన్ని రకాల ధర్మాల గురించి వివరంగా చెప్పబడింది. రాజ ధర్మం, ప్రజా ధర్మం, పతి ధర్మం, సతీ ధర్మం, భాతృ ధర్మం, పుత్ర ధర్మం, భృత్యు ధర్మం, మిత్ర ధర్మం లాంటి అన్ని ధర్మాలను గురించి చక్కగా తెలుపబడి వుంది. లాభ-లోభ-పక్షపాత బుద్ధి లేకుండా, న్యాయం మీదే దృష్టి నిలిపి వాదించే న్యాయవాది ధర్మం కూడా చెప్పబడింది. వీటితో పాటు కథా సందర్భానుసారంగా, అంతరాంతరాలలో ఎన్నో నీతులు చెప్పబడ్డాయి. రావణుడి పాత్ర కూడా అందులో భాగమే! 

 
 
 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech