Sujanaranjani
           
  కబుర్లు  
  అ'గణిత'మేధావి--శ్రీ శ్రీనివాసరామానుజన్ అయ్యంగారు
 

  

 
 

రచన :  టీవీయస్.శాస్త్రి

 
 

శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ (22-12-1887---26-04-1920) భారతదేశానికి చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త.20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరు.

రామానుజన్ 22 -12 -1887 న,తమిళనాడులోని లోని ఈరోడ్ అనే పట్టణమందు ఆయన అమ్మమ్మగారి ఇంటిలో జన్మించాడు. రామానుజన్  తండ్రి కె. శ్రీనివాస అయ్యంగార్ ఒక చీరల దుకాణంలో గుమస్తాగా పనిచేసేవారు. ఈయన తంజావూరు జిల్లాకి చెందిన వారు.తల్లి కోమలటమ్మాళ్ గృహిణి మరియు ఆ ఊరిలోని గుడిలో పాటలు పాడేది. వీరు కుంభకోణం అనే పట్టణంలో సారంగపాణి వీధిలో దక్షిణ భారతదేశ సాంప్రదాయ పద్దతిలో నిర్మించబడ్డ ఒక పెంకుటింట్లో నివాసం ఉండేవారు. దాన్ని ఇప్పుడు మ్యూజియంగా మార్చారు.రామానుజన్ ఒకటిన్నర సంవత్సరాల వయసులో ఉండగా ఆయన తల్లి సదగోపన్ అనే రెండో బిడ్డకు జన్మనిచ్చింది. కానీ మూడు నెలలు పూర్తవక మునుపే ఆ బిడ్డ కన్నుమూశాడు. డిసెంబరు 1889 లో రామానుజన్ కు మశూచి (అమ్మవారు) వ్యాధి సోకింది. కానీ తంజావూరు జిల్లాలోని ఈ వ్యాధి సోకి మరణించిన చాలామంది లాగా కాకుండా బ్రతికి బయట పడగలిగాడు..తరువాత రామానుజన్ తల్లితోపాటు చెన్నైకి దగ్గరలో ఉన్న కాంచీపురంలోని అమ్మమ్మ వాళ్ళింటికి చేరాడు. అటు తర్వాత, రామానుజన్ తల్లి ఇరువురి శిశువులకు జన్మనిచ్చినా, ఏడాది తిరగక మునుపే వారూ మరణించారు.ఇతడికి పది సంవత్సరాల వయసులోనే గణితశాస్త్రంతో అనుబంధం ఏర్పడింది.చిన్న వయసులోనే గణితం పట్ల ప్రకృతి సిద్ధమైన ప్రతిభ కనపరిచేవాడు. ఆ వయసులోనే ఎస్.ఎల్ లోనీ  త్రికోణమితి మీద రాసిన పుస్తకాలను వంటపట్టించుకున్నాడు. పదమూడు సంవత్సరాలు నిండే సరికల్లా,ఆ పుస్తకాన్ని ఔపోసన పట్టడమే కాకుండా తనే సొంతంగా సిద్ధాంతాలు కూడా రూపొందించడం ప్రారంభించాడు. అక్టోబరు1,1892లో రామానుజన్ అదే ఊళ్ళో ఉన్న చిన్న పాఠశాలలో విద్యాభ్యాసాన్ని ప్రారంభించాడు.మార్చి 1894లో ఇతడిని ఒక తెలుగు మాధ్యమ పాఠశాలకు మార్చడం జరిగింది.రామానుజన్ తాత కాంచీపురం న్యాయస్థానం లోని ఉద్యోగం కోల్పోవడంతో, రామానుజన్ తల్లితో సహా కుంభకోణం చేరుకుని అక్కడ కంగయాన్ ప్రాథమిక పాఠశాలలో చేరాడు.నాన్న తరుపు తాత చనిపోవడంతో రామానుజాన్ని మళ్ళీ మద్రాసులో నివాసం వుంటున్న తల్లి తరుపు తాత దగ్గరికి పంపించారు. కానీ అతనికి మద్రాసులో పాఠశాల నచ్చలేదు. తరచూ బడికి ఎగనామం పెట్టేవాడు. అతని తాత, అమ్మమ్మలు రామనుజన్ బడిలో ఉండేటట్లుగా చూసేందుకు వీలుగా ఒక మనిషిని కూడా నియమించారు. కానీ ఆరు నెలలు కూడా తిరగక మునుపే కుంభకోణంకు పంపించేసారు.రామానుజన్ తండ్రి రోజంతా పనిలో లీనమవడం మూలంగా చిన్నపుడు అతని భాద్యతలు తల్లే చూసుకునేది. కాబట్టి తల్లితో చాలా గాఢమైన అనురాగం కలిగి ఉండేవాడు. ఆమె నుంచి రామానుజన్ సాంప్రదాయాల గురించి, పురాణాల గురించి తెలుసుకున్నాడు. భక్తి గీతాలు ఆలపించడం నేర్చుకున్నాడు. ఆలయాలలో పూజలకు తప్పక హాజరయ్యేవాడు. మంచి ఆహారపు అలవాట్లు అలవరచుకున్నాడు.కంగయాన్  పాఠశాలలో రామానుజన్ మంచి ప్రతిభ కనపరిచాడు. నవంబరు 1897 లో పది సంవత్సరాల వయసులోపలే ఆంగ్లం, తమిళం, భూగోళ శాస్త్రం, గణితం నందు ప్రాథమిక విద్య పూర్తి చేసాడు. మంచి మార్కులతో జిల్లాలో అందరికన్నా ప్రథముడిగా నిలిచాడు.1898 లో అతని తల్లి ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనిచ్చింది. అతడికి లక్ష్మీనరసింహం అని నామకరణం చేసారు. అదే సంవత్సరంలో రామానుజన్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో చేరాడు. ఈ పాఠశాలలోనే మొట్ట మొదటి సారిగా గణితశాస్త్రంతో(formal mathematics) పరిచయం ఏర్పడింది.14 -07 -1909 న రామానుజన్ కు జానకీఅమ్మాళ్ అనే తొమ్మిదేళ్ళ బాలికతో వివాహమైంది.పెళ్ళైన తరువాత రామానుజన్ కు వరిబీజం వ్యాధి సోకింది.ఇది శస్త్ర చికిత్స చేయడం ద్వారా సులభంగా నయమయ్యేదే కానీ వారికి తగినంత ధనం లేక కొద్ది రోజుల పాటు అలానే ఉన్నాడు. చివరకు 1910, జనవరి నెలలో ఒక వైద్యుడు స్వఛ్ఛందంగా ముందుకు వచ్చి ఉచితంగా శస్త్రచికిత్స చేయడంతో ఆ గండంనుంచి బయటపడ్డాడు. తరువాత ఉద్యోగప్రయత్నాలు  ఆరంభించాడు.అప్పట్లో కొత్తగా ఒక గణిత శాస్త్ర సమాజాన్ని ఏర్పరిచిన డిప్యూటీ కలెక్టర్ రామస్వామిని రామానుజన్ కలుసుకున్నాడు. ఆయన పనిచేసే ఆఫీసులో ఒక చిన్న ఉద్యోగం కోరి ఆయనకు తాను గణితం మీద రాసుకున్న నోటు పుస్తకాలను చూపించాడు. వాటిని చూసిన అయ్యర్ తన రచనల్లో ఇలా గుర్తుచేసుకున్నాడు.  ఆ నోటుపుస్తకాలలోని విషయాలను చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అటువంటి మహామేధావికి, ఇంత చిన్నఉద్యోగం ఇచ్చి అవమానించలేను. తరువాత రామస్వామి రామానుజన్ ను కొన్ని పరిచయ లేఖలు రాసి మద్రాసులో తనకు తెలిసిన గణిత శాస్త్రవేత్తల దగ్గరకు పంపించాడు. అతని పుస్తకాలను చూసిన కొద్దిమంది అప్పట్లో నెల్లూరు జిల్లా కలెక్టరుగా పనిచేస్తున్న రామచంద్రరావుగారి దగ్గరకు పంపించారు. ఈయన భారతీయ గణితశాస్త్ర సమాజానికి కార్యదర్శి కూడా. రామచంద్రరావు కూడా రామానుజన్ పనితనం చూసి అబ్బురపడి, అవి అతని రచనలేనా, అని సందేహం కూడా వచ్చింది. అప్పుడు రామానుజన్ తాను కలిసిన ఒక బొంబాయి ప్రొఫెసర్ సల్ధానా గురించి, అతని రచనలు ఆ ప్రొఫెసర్ కు కూడా అర్థం కాలేదని చెప్పాడు.నారాయణ అయ్యర్, రామచంద్ర రావు, E.W. మిడిల్‌మాస్ట్ మొదలైన వారు రామానుజన్ పరిశోధనలను ఆంగ్ల గణిత శాస్త్రవేత్తలకు చూపించడానికి ప్రయత్నించారు. లండన్ యూనివర్సిటీ కాలేజీకి చెందిన ఎం.జే.ఎం. హిల్ అనే గణితజ్ఞుడు రామానుజన్ పరిశోధనల్లో కొన్ని లోపాలున్నాయని వ్యాఖ్యానించాడు. హిల్ రామానుజన్ ను విద్యార్థిగా స్వీకరించేందుకు అంగీకరించలేదుగానీ, రామానుజన్ పరిశోధనలపై మంచి సలహాలు మాత్రం ఇచ్చాడు.రామానుజన్ ఆ కాలంలో సుప్రసిద్దులైన లీనార్డ్ ఆయిలర్,గాస్,జాకోబీ---మొదలైన సహజసిద్ధమైన గణిత మేధావులతో పోల్చదగిన వాడు. రామానుజన్ లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన హార్డీ  అసలు తాను గణిత శాస్త్రానికి చేసిన అత్యుత్తమ సేవ రామానుజాన్ని కనుగొనడమే అని వ్యాఖ్యానించడం విశేషం.మార్చి 17, 1914న రామానుజన్ ఇంగ్లండుకు ప్రయాణమయ్యాడు. శాఖాహారపు అలవాట్లుగల రామానుజన్ ఇంగ్లండులో స్వయంపాకం చేసుకునేవాడు. సరిగ్గా తినకపోవడం మూలాన, నిరంతర పరిశోధనల వల్ల కలిగిన శ్రమవలన, ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావంవల్ల చాలా తీవ్రమైన పరిశ్రమ చేసి 32 పరిశోధనా పత్రాలు సమర్పించాడు. శరీరం క్రమంగా వ్యాధిగ్రస్తమైంది. తీవ్రమైన అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా హార్డీతో 1729 సంఖ్య యొక్క ప్రత్యేకతను తెలియజెప్పి ఆయన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేశాడు.రామానుజన్ అనారోగ్యంతో హాస్పిటల్లో వున్నపుడు, హార్డీ రామానుజాన్ని పలుకరించటానికి వెళ్లి,మాటల మధ్యలో,నేను వచ్చిన కారు నంబరు1729, దాని ప్రత్యేకత ఏమైనా ఉన్నదా ? అని రామానుజాన్నిఅడుగగా, రామానుజన్ తడుముకోకుండా"ఆ సంఖ్య ఎంతో చక్కని సంఖ్య .ఎందుకంటే,రెండు విధాలుగా రెండు ఘనముల మొత్తముగా వ్రాయబడే సంఖ్యాసమితిలో అతి చిన్నసంఖ్య అది.(1729 =  13  + 123 = 93 + 103).ఈ సంఘటన గణితంపై ఆయనుకున్న అవ్యాజమైన అనురాగాన్ని,అంకిత భావానికి నిదర్శనం.ఆరోగ్య పరిస్థితి విషమించడంతో 1919 మార్చిలో భారతదేశానికి తిరిగి వచ్చాడు. బొద్దుగా, కొంచెం నల్లగా కనిపించే రామానుజన్ ఇంగ్లండు నుంచి క్షీణించిన  అనారోగ్యంతో రావటం చూసి ఆయన అభిమానులు చలించి పోయారు.అనేక రకాల వైద్య వసతులు కల్పించినా ఆయన కోలుకోలేకపోయారు. దాంతో ఆయన 1926, ఏప్రిల్ 26న పరమపదించారు.శుద్ధ(Pure) గణితంలో నంబర్ థియరీలోని ఇతని  పరిశోధనలు, స్ట్రింగ్ థియరీ, క్యాన్సర్ పరిశోధనల వంటి ఆధునిక విషయాలలో ఉపయోగ పడుతున్నాయి.రామానుజన్ చివరిదశలో మ్యాక్-తీటా ఫంక్షన్స్ పై చేసిన పరిశోధనలు చాలా ప్రసిద్ధమైనవి. ఆయన ప్రతిపాదించిన కొన్ని అంశాలు ఇప్పటికీ  అపరిష్కృతంగానే ఉండటం విశేషం.హార్డీ ఒకసారి,గణిత శాస్త్రజ్ఞులకు వారి మేధస్సును బట్టి మార్కులు వేస్తే ---నాకు నూటికి 25,లిటిల్ వుడ్ కు 30,డేవిడ్ హిల్ బర్ట్స్ కు 80,రామానుజానికి 100 మార్కులు వస్తాయి, అని అన్నారు.రామానుజన్ చాలా సున్నితమైన భావాలు, మంచి పద్ధతులు కలిగిన బిడియస్తుడిగా ఉండేవాడు. ఆయన కేంబ్రిడ్జిలో ఎన్నోకష్టాలను ఎదుర్కొంటూ క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని గడిపాడు. ఆయన జీవిత చరిత్రను రాసిన మొట్టమొదటి రచయిత ఆయన్ను శుద్ధ సాంప్రదాయవాదిగా పేర్కొనడం జరిగింది. తనకు సంక్రమించిన సామర్థ్యం అంతా తమ ఇలవేల్పు దేవత అయిన నామగిరి ప్రసాదించినదేనని రామానుజన్ బలంగా విశ్వసించేవాడు. తనకు ఏ కష్టం కలిగినా ఆమె సహాయం కోసం ఎదురు చూసేవాడు.ఆమె కలలో కన్పించి ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపించగలదని భావించేవాడు. భగవంతునిచే ప్రాతినిథ్యం వహించబడని ఏ ఆలోచనా సూత్రం కానేరదు అని అప్పుడప్పుడూ అనేవాడు. రామానుజన్ అన్నిమతాలు ఒకటిగా నమ్మేవాడని హార్డీ ఒకసారి పేర్కొన్నాడు. ఆయన ఆధ్యాత్మికతను భారతీయ రచయితలు అతిగా అర్థం చేసుకున్నారని వివరించాడు. అంతేకాదు, రామానుజన్ యొక్క శుద్ధ శాఖాహారపు అలవాట్లను గురించి కూడా ప్రస్థావించాడు.రామానుజన్ స్వరాష్ట్రమైన తమిళనాడు, ఆ రాష్ట్ర వాసిగా ఆయన సాధించిన విజయాలకు గుర్తుగా ఆయన జన్మదినమైన డిసెంబరు 22 ను రాష్ట్ర సాంకేతిక దినోత్సవంగా ప్రకటించింది. భారత ప్రభుత్వం 1962 వ సంవత్సరంలో ఆయన 75వ జన్మదినం నాడు, సంఖ్యాశాస్త్రంలో ఆయన చేసిన విశేష కృషిని కొనియాడుతూ స్మారక తపాలా బిళ్ళను  విడుదల చేసింది. మద్రాసు విశ్వవిద్యాలయం'Ramanujan Institute' ని నెలకొల్పింది.ఆయన మరణించిన 60 సంవత్సరాల తదుపరి, J.H.Whittaker రామానుజన్ గారి పరిశోధన వ్యాసాలు భద్ర పరచటానికి సరైన ప్రదేశం ట్రినిటీ కాలేజీయే--రామానుజానికి ఏమీ చేయలేని ఇండియా మాత్రం కాదు' అని చెప్పటం --ఆ మహనీయునికి మనం  సరైన గౌరవం ఇవ్వలేదనటానికి తిరుగులేని సాక్ష్యం. గత సహస్రాబ్దిలో,భారతదేశం ప్రపంచానికి అందించిన అత్యుత్తమ అ'గణిత' మేధావి శ్రీనివాస రామానుజన్ 1918 లో రాయల్ సొసైటీ సభ్యుుడిగా కూడా ఎన్నికయ్యారు. ఆ మహనీయునికి ఘనమైన నివాళి సమర్పించుకుంటూ.......

 

 
 
 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech