సుజననీయం  
 

అంబేద్కర్ వర్దంతి

 

                                                            రచన: రావు తల్లాప్రగడ

 
 

ఇటీవల విడుదలైన "దేనికైనా రెడీ" అన్న సినిమాతో కులాల పైన చర్చ మళ్ళీ మొదలయ్యింది. మోహన్ బాబు ఒక పైశాచికానందానికి  ఒడిగట్టాడని అందరూ అన్నదే. ప్రశ్నించిన బ్రాహ్మణులను అకృత్యంగా కొట్టితరిమించాడు. ఏదో ఒక కాంట్రవర్సీ వస్తే చాలు కదా, సినిమా విజయవంతమవడానికి. అసలు ఒక కులాన్ని కించపరచడంలో ఉన్న హాస్యమేమిటో తెలియదు కాని, అదే దరిద్రపు హాస్యాన్ని తన కులము పైనే ఎందుకు ప్రయోగించుకోలేదు అన్నవిషయాన్ని మోహన్ బాబు చెప్పడు, చెప్పలేడు.  ఎందుకంటే ఇక్కడ వస్తుంది స్వకులాభిమానము అనే మాట.

అసలు ఈ కులమన్న మాటనే మనం మర్చిపోగలిగితే, కనీసం ప్రయత్నించగలిగితే ఇటువంటి అశ్లీలతే లేకుండా పోతుంది. ఏనాటికైనా మనము ఈ కులాన్ని లేక కనీసం కులప్రస్తావనలనైనా నిర్మూలించగలమా?

కులరహిత సమాజాన్ని నిర్మించుకుందామని అందరూ అనే మాటే. కానీ నిజానికి అది వేదికలకే పరిమితమైపోయింది. నేడు కులము సంగతి అడగని అప్లికేషను ఫారము లేదు, వాటిలో కనీసం "కులం తెలియదు" అనడనికి కూడా వీలు కల్పించరు. "అసలు నాకు కులమన్నదే వద్దు", అనుకుని వేరే మతం స్వీకరించినా సరే, వాటిల్లోకి కూడా కులాలు రావాలని, ఆయా మతాల వారు పట్టుబడుతున్నారు. ఇటివల కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి కూడా, భారత క్రైస్తవుల సమాఖ్య ధర్నాలో మాట్లాడుతూ, "మతం మారినంత మాత్రాన కులం మర్చిపోకూడదు, వారికి రిజర్వేషనులు కల్పించాలి" అంటూ వ్యాఖ్యలు చేసారు. పోనీ అది రిజర్వేషనుల కోసమేదో గొడవలే అని కొట్టేసినా కూడా, క్రైస్తవుల పేర్లలో కూడా రెడ్డి, నాయుడు వంటి అగ్రకులనామాలను గర్వంగా తగిలిస్తూనేవున్నారు. మహమ్మదీయులలో కూడా దూదేకుల సాయబుల వంటి కులనామాలు ఇంకా సజీవంగానే ఉన్నాయట. క్రైస్తవ మహమ్మదీయ మతాలలో సైతం, కులాల రూపురేఖలు ఇంకా మిగిలుండటమే కాదు, రోజురోజుకీ అవి స్థిరపడాలని అందరూ కోరుకున్నట్టే కనపడుతోంది.  

ఇంతకీ కులాలు మనకు అంత అవసరమా అన్నది మౌలికమైన ప్రశ్న. వీటిని మనం ఎన్నటికీ మరిచిపోలేమా? అగ్రకులాలపై ప్రతీకారము కోరుకోవడమే తప్ప, కులవ్యవస్థనే నిర్మూలిద్దామన్న కోరికే మనకు లేదా? ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కులసంస్థాపన విషయంలో, అగ్రకులాల వారికన్నా మిగితా కులాలలోనే ఎక్కువ ఉత్సాహం కనిపిస్తోంది. కారణం రిజర్వేషన్లు కావచ్చు, దానితో వచ్చే ఉద్యోగావకాశలు కావచ్చు, లేక వేరే సాంఘీకపరమైన గుర్తింపులు కావచ్చు. వెరసి కులసహిత సమాజాన్నే అందరూ కోరుకున్నట్లు కనిపిస్తోంది. ఇలా అందరూ కులాలు కావాలనే ఒకపక్క కోరుకుంటూ, ఎవ్వరూ తమతమ కులాలను వదులుకోవడానికి ఇష్టపడకుండా ఉంటే,... ... ...  మరి హిందూమతంలో కులబేధాలున్నాయంటూ  విమర్శలెందుకు  చేస్తారో అర్థం కాదు!

అన్నిటినీ మించి, ఇటీవల నరకాసురుడు, హిరణ్యకశిపుడు, రావణుడు వంటి రాక్షసులంతా మా దళితులే నంటూ కొత్త వాదనలు వినిపించడం మొదలు పెట్టాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మొన్న దీపావళి నాడు నరకాసుర వర్థంతిని (నరకాసుర వధ కాదు అని గమనించగలరు) వైభవంగా జరుపుకున్నారు. రాక్షసులను ఆర్యులు మోసంతో జయించారని, ఆర్యులు దేవతలుగా గుర్తింపు పొందడానికని ఈ పురాణాలను వ్రాసుకున్నారనీ,  నోటొకొచ్చినట్లు మాట్లాడటం మొదలు పెట్టారు. వాదనలు చేసే వారెవరికీ పురాణజ్ఞానము అస్సలు కొంచెము కూడా లేదని ఎవరైనా చేలికగా చెప్పేయ్యగలరు. నిజానికి రామాయణం వ్రాసిన వాల్మీకే, ఆదికవి. ఆయన అగ్రకులానికి చెందినవాడు కాడు సరికదా, ఆయన చేసిన ఇతిహాస రచనకు కులాల కంపును తగిలించడంలో అస్సలు అర్థం లేదు. హిందూమతాన్ని కించపరచి బలహీనపరచడానికి చేసే ప్రయత్నం తప్ప, రాక్షసదళితవాదనలో కొద్దిపాటి విషయము కూడా కనపడదు. కానీ గతయుగాల  పాత్రలకు  సైతం కులాలను ఆపాదించే ప్రయాసప్రయత్నాలను మనం ఇక్కడ గమనించాల్సిన విషయం.

వీరు కులాన్ని విమర్శిస్తున్నారా, లేక కులపు గుర్తింపునీడలోనే బతకాలని కోరుకుంటున్నారా అన్నది ప్రశ్న! ఈనాడు ఎవరూ తమతమ కులవృత్తులనే చేయడం లేదు. ఆ కులవృత్తులే చేయని వారికి అసలు కులాలెందుకు? అటువంటి కులానికి ఏమైనా అర్థం మిగిలి వుందా? దేని కోసమని మనం కులాలలను వదులుకోలేకపోతున్నాము? ఏమి చూసుకొని కులాల పేర్లు చెప్పుకుని గర్విస్తున్నాము? కులాలుగా విడిపోయి కొట్లాడుకుంటున్నాము?

భారతరాజ్యాంగ నిర్మాత ఐన అంబేడ్కర్ కూడా కులాలను కాలక్రమేణా రూపుమాపాలని కోరుకున్నాడు. అంటరానితనాన్ని ప్రోత్సహించిన హిందూమతాన్ని, బానిసత్వాన్ని పోషించిన ఇస్లాం మతాన్ని ఆయన నిరసించాడు. ఈ మతాలను సంస్కరించడం వెంటనే అయ్యే పని కానందున, తన సిద్ధాంతాలకు దగ్గిరదైన బౌద్దమతాన్ని స్వీకరించడమే తాను వెంటనే చేయగల పని అని అనుకున్నాడు.  అలా హిందూమతాన్ని సైతం వదిలి, తన కులానికే దూరంగా వెళ్ళిపోవాలని అనుకున్నాడు, దాన్ని మరిచిపోవాలనుకున్నాడు. అలా బౌద్ధమతాన్ని స్వీకరించి, తన కులాన్ని పరిత్యజించాడు.

ఆయన తన కులాన్ని అలా మరిచిపోయినా, తరువాత ఆయనే చనిపోయినా,... ...  నేడు  ... ... ఆయనది ఫలానా కులం అని, ఆయన మావాడేనని, ఆయన దళితుడేననీ, మళ్ళీమళ్ళీ సభలుపెట్టి గుర్తు చేస్తూనే వున్నారు, ఆయన పేరుని తమతమ రాజకీయప్రయోజనాలకు యధేచ్చాగా వాడుకుంటూ, ఆయనకు ఒక కులము పేరుని అంటకడుతూనే వున్నారు. ఇదా అంబేడ్కర్ ఆశించిన కులనిర్మూలనము? కులరహిత సమాజము?

డిసెంబరు 6వ తేదీ నాడు అంబేద్కర్ వర్దంతి! ఈ సందర్భంగా ఆయన ఆదర్శాన్ని గౌరవిస్తూ మరొకసారి ఆలోచించండి!

మీ

రావు తల్లాప్రగడ

 


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
   

 

 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

 
     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 
 
 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech
 
Sujanaranjani