Sujanaranjani
           
  కబుర్లు  
  సత్యమేవ జయతే  - అమెరికాలమ్ – 23
 

మైకాసురులు

 
 

- రచన : సత్యం మందపాటి

 
 

కొన్నేళ్ళ క్రితం జరిగిన సంఘటన.

అవి తంతా తెలుగు సంఘం వారి జులై నాలుగవ తారీకున ఏటేటా జరిగే తెలుగు తిరునాళ్ళు.

అవును సార్! మీరు అంటున్నది నిజమే. తంతా అని అమెరికాలో తెలుగు సంఘం లేదు. మొదట్లో తానా వుండేది. తర్వాత అది రెండయి తానా, ఆటాలు వచ్చాయి. తర్వాత తెలుగు సాంస్కృతిక ధర్మాన్ని అనుసరించి, కలిసివుంటే లేదు సుఖం కనుక  నాటా, నాట్స్ వచ్చాయి. ఇంకొక రెండేళ్ళలో రోజులు బాగుంటే కానా, రాటాలు వస్తాయి. రోజులు బాగుండకపోతే బానా, వాటాలు కూడా వస్తాయి. అందుచేత ఈ వ్యాసం కోసం తంతా అని చెప్పుకుందాం. అదీ కాకుండా ఈ అన్ని సంఘాలలోనూ నాకు మిత్రులు వున్నారు కనుకా, ఊర్లూ పేర్లన్నీ చెప్పేస్తే నన్ను "తంతా"రు కనుకా అవేమీ చెప్పకుండా ఈ సంఘటన చెబుతాను.    

          తంతావారి తిరునాళ్ళు ఇంకో రెండు మూడు నెలల్లో వున్నాయనగా, అక్కడి నించీ సాహిత్య సదస్సు  నిర్వాహకులు ఫోన్ చేశారు. అది ఒక ప్రఖ్యాత భావకవి పుట్టిన నూరవ సంవత్సరం. అందుకుని ఆయనకి నివాళిగా ఒక విభాగం నిర్వహిస్తూ, నన్ను ఆ భావకవి గురించి ఒక పదిహేను నిమిషాలు మాట్లాడమన్నారు. దానికి కారణం నేను అయన గురించి అంతకు ముందు ఓ రెండు వ్యాసాలు వ్రాసి పత్రికల్లో ప్రచురించటమే నా ఒక్కగానొక్క అర్హత. అంతకన్నా ఏమీలేదు. నాకు ఆ కవిగారంటే ఎంతో ఇష్టం కనుక సరే అన్నాను. అంతేకాక ఆ కవిగారి మేనకోడలు గారు - నాకింకా ఎంతో ఇష్టమైన గాయని, సంగీత దర్శకురాలు, రచయిత్రి కూడాను. అందుకని ఆవిడ ఆయన గురించి మాట్లాడితే బాగుంటుందని సూచించాను. వారూ నా సలహాని మన్నించి ఆ తంతా సాహిత్య సభలో ఒక గంట - మధ్యాహ్నం మూడు గంటల నించీ నాలుగు గంటలదాకా ఆ కవిగారికి నివాళి కార్యక్రమం. ప్రముఖ నర్తకి, కవిగారి మనవరాలు చేత ఆ అంశం నిర్వహణతో, భవదీయుడి నాలుగు మాటలతో సహా ఆ కార్యక్రమం నిర్వహించటానికి పెద్దలు నిర్ణయించారు.

          సరే ఆరోజు రానే వచ్చింది. నేనూ నా అభిమాన గాయనిగారూ.. ఆవిడ నేనంటే అచ్చం మా అమ్మగారి లాగానే ఎంతో అభిమానంగా వుంటారు కనుక అమ్మగారు అందాం ఇకనించీ, మనవరాలుగారూ అందరం మూడు గంటలకి పదినిమిషాలు ముందుగానే సాహిత్య సభాస్థలికి వెళ్ళాం.

అక్కడ ఇంకొక సాహిత్య అంశం జరుగుతున్నది. భారతదేశం నించి వచ్చిన ఒక పండిత పుత్రుని ఆహ్వానిస్తున్నారప్పుడే. మాట్లాడటానికి ఇరవై నిమిషాల సమయం ఇచ్చారాయనకి. 

          ఆయన ముందుగా సభా నిర్వాహకులు తనకి ఇరవై నిమిషాలు మాత్రమే సమయం ఇచ్చినందుకు బాధ పడుతూ ఇచ్చిన విషయం మీద క్లుప్తంగా మాట్లాడాల్సి వస్తున్నదని ఒక పావుగంట వాపోయాడు. తర్వాత ఇచ్చిన విషయానికి నూటాభై మైళ్ళ దూరంలో నుంచుని, ఇంకొక అరగంట మాట్లాడాడు. "అసలు విషయానికి వస్తున్నాను" అంటూ ఇంకో అరగంట సేపు "అసలు విషయం" వేపు అసలు కన్నెత్తి చూడలేదు.

          తర్వాత ఇంకొక పావుగంటకి అసలు విషయానికి వచ్చాడు. వస్తూ వస్తూ మళ్ళీ అన్నాడు ఈ విషయం మీద మరీ ఇరవై నిమిషాల్లో మాట్లాడమన్నారు నిర్వాహకులు...  అంటూ ఇంకో అరగంట గడిపాడు. మైకు వదలని అక్రమార్కుడిలా, అలా.. అలా... మాట్లాడుతూనే వున్నాడు.  

          నా పక్కనే కూర్చున్న అమ్మగారు అన్నారు ఇదేమిటండీ మన కార్యక్రమం మూడు గంటలకే అన్నారు, ఇప్పుడు నాలుగున్నర అయింది... ఇంకా ఈయన మైకు వదిలిపెట్టటంలేదు... మరి... 

నేనూ అదే అనుకుంటున్నాను కనుక "అవునమ్మా! నేను కనుక్కుంటానుండండి" అని, కొంచెం అవతలగా కూర్చున్న ఒక నిర్వాహకుడిని అడిగాను.

ఏంచేయమంటారు సార్! ఈయనేమో ఆపడు. దిగడు. కదలడు. వదలడు. భారతదేశం నించీ వచ్చాడు కదా దింపటం మర్యాద కాదని ఆలోచిస్తున్నాను అన్నాడు.

వచ్చిన ప్రేక్షకులు కూడా ఈయన బాధ భరించలేక వెళ్ళిపోతున్నారు! చూశారా మరి! అన్నాను.

"అవును గమనించాను" అంటుండగా, భావకవిగారి మనవరాలుగారు వచ్చారు మా దగ్గరికి.

"నిర్వాహకులుగారూ, నిర్వాహకులుగారూ! నా డాన్స్ కార్యక్రమానికి వేళయింది. వెళ్ళిపోతున్నాను!" అని వెళ్ళిపోయారు.

ఇంకో ఇరవై నిమిషాలు ఆయన ఈసారి అడిగిన విషయం మీద మాట్లాడుతూ... వుంటే, అప్పటి దాకా గోడ గడియారం మీద వున్న నా చూపు, పక్కనే వున్న కాలెండరు మీదకి వెళ్ళింది.

"ఇదిక అయేటట్టు లేదు. మనమూ వెడదాం! అమ్మాయి డాన్స్ కార్యక్రమం చూద్దాం" అన్నారు అమ్మగారు.

మనసులో ఒకసారి "భశుం" అనుకుని, నేనూ లేచాను - నా అభిమాన భావకవిగారికి మనసులోనే నివాళి అర్పించుకుని. 

                             ౦                           ౦                            ౦    

గత 15 సంవత్సరాలుగా మా టెక్సస్ లో సంవత్సరానికి రెండుసార్లు చొప్పున, టెక్సస్ తెలుగు సాహిత్య సదస్సులు నిర్వహిస్తున్నాం. ఆస్టిన్, హ్యూస్టన్, డల్లస్, శానాంటోనియో, టెంపుల్ నగరాల్లో తెలుగు సాహితీ మిత్రులమంతా కలిసి వాటిని నిర్విఘ్నంగా, విజయవంతంగా నిర్వహిస్తున్నాం.

ఈ కార్యక్రమం మొత్తం నిర్వహించటం ఒక ఎత్తు, పట్టపగ్గాలు లేని ఈ మైకాసురులకి పగ్గాలు వేసి, సమయాన్ని సరిగ్గా వాడుకునేలా చేసి, వివిధ అంశాలపై మాట్లాడే మిగతా వక్తలకి ఇచ్చిన అవకాశం పోకుండా కాపాడటం ఒక ఎత్తు. పాపం ఎంతో కష్టపడి, కావాల్సిన సమాచారం అంతా సేకరించుకుని, మాట్లాడటానికి సిధ్ధపడి వచ్చిన కొందరికి సమయం చాలక, క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చేది. అందులోనూ టెక్సస్ లాటి పెద్ద రాష్ట్రంలో, విశ్రాంతి తీసుకోవాల్సిన శనివారం రోజున ప్రొద్దున్నే నిద్రలేచి, కొన్ని వందల మైళ్ళు కార్లల్లో వచ్చిన సాహితీ మిత్రులు మరి.  వారిని నిరుత్సాహ పరచటం భావ్యం కాదు కదా!

దాదాపు ప్రతి కార్యక్రమంలోనూ ఒకళ్ళో ఇద్దరో మైకాసురులనబడే మైకు వదలని అక్రమార్కులు వస్తూనే వున్నారు. వక్తల్లో చాలమంది, అమెరికాలో వుంటున్నందు వల్ల, సమయం పాటిస్తారు. కానీ కొంతమంది మాత్రం అమెరికాలో వున్నా తెలుగుదేశంలో పుట్టినందువల్ల, వాళ్ళ జన్మహక్కుని పాటిస్తూ సమయం గుర్తించకుండా అలా

మాట్లాడుతూనే వుంటారు.  

ఇక్కడ అమెరికాలో సెమినార్లకి వెళ్ళినప్పుడు, ఇలాటి మైకాసురులకి పగ్గాలు ఎలా వేస్తారో చూస్తూనే వున్నాం. రెండు నిమిషాల ముందు సమయం మించిపోతున్నదని మర్యాదగా చెప్పటం, ఒక చిన్న సైన్ బోర్డ్ మీద రెండు నిమిషాలే వుందోచ్ అని చూపించటం, లైట్ ఆర్పి వెలిగించటం, చిన్న బెల్ కొట్టటం లాంటివి చేస్తుంటారు. చివరికి నిర్వాహకులం అంతా చర్చించి నిశ్చయించిందేమిటంటే, రెండు నిమిషాలే వుందోచ్ అని బాపు అక్షరాలతో అందంగా వ్రాసి చూపించటం. అందంగా ఏమిటి నా ముఖం. బాపు అక్షరాలంటేనే అందంగా వుంటాయని కదా అర్ధం. 

అలాగే చేశాం కూడా. కానీ మమల్ని మించిపోయారు మైకాసురులు. అప్పటిదాకా సభాధ్యక్షుడిని చూస్తూ మాట్లాడుతున్న వక్తలు, అటువేపు చూడటం మానేశారు, చూస్తే ఎక్కడ చూపులు కలుస్తాయో, ఏం ముంచుకొచ్చి తమ వాక్ప్రవాహాన్ని ముంచేస్తుందో అని. బాపుగారి అందమైన అక్షరాలను కూడా పట్టించుకోలేదు మరి! 

ఈ పద్ధతి పనిచేయటం లేదని, రెండు నిమిషాల ముందుగా గంట కొడదామని నిర్ణయించుకున్నాం.

మా రావుగారు వారి ఇంట్లోని రామాలయం నించి ఒక కంచు గంట తెచ్చేవారు. కొంతమంది ఆ గంటలు పట్టించుకోలేదు. అవి పట్టించుకున్నవాళ్ళల్లో కొందరు, "ఇదిగో ఈ ఒక్క పద్యంతో పూర్తిచేస్తున్నా" అంటూ ఇంకో ఇరవై మూడు పద్యాలు టీకా తాత్పర్యంతో సహా చెప్పేస్తున్నారు. కొంతమంది - ఇంకా పెద్దనందిపాడు గవర్నమెంట్ స్కూల్లోనే వున్నామనుకుని - మూడో గంట కోసం ఎదురు చూస్తూ తమ ఉపన్యాసం కొనసాగిస్తూనే వున్నారు. కాకపోతే ప్రేక్షకుల్లో అప్పటిదాకా నిద్రావస్థలో వున్న కొందరు పెద్దలు, గంట శబ్దం వినగానే ప్రసాదం టైం అయిందనుకుని చటుక్కున లేచి, చేతులు చాపి ఇటూ అటూ చూడటం మొదలుపెట్టేవారు.

ఇహ ఇదీ లాభం లేదనుకుని సభాధ్యక్షుడి చేత "మర్యాదగా" చెప్పిస్తే బాగుంటుందని పెద్దలు నిశ్చయించారు. 

ఈసారికి అలాగే కానిద్దాములే అనుకుని, మోహనరావుకి ఆ బాధ్యత ఇచ్చాం. కానీ ఆయనకి ముఖమాటం ఎక్కువ. చెబితే ఏమనుకుంటారోనని ఒకటే హైరానా పడిపోయేవాడు. ఆయన్ని కూర్చోపెడితే ఇరవై నిమిషాల్లో పూర్తవాల్సిన ఉపన్యాసాలు, సరిగ్గా అరవై నిమిషాలు పట్టేవి. అసలే ఆయనకి రక్తపు పోటు. ఆయన భార్యగారి నుదుటి బొట్టు కాపాడాలనే సదుద్దేశ్యంతో ఆయనకో వేడివేడి కాఫీ ఇచ్చి ప్రేక్షకుల్లో కూర్చోపెట్టాం.

ఆడవాళ్ళు చెబితేనైనా మాట వింటారేమోనని, అనంతలక్ష్మిగారికి ఆ బాధ్యత అప్పచెప్పాం ఒకసారి. ఆవిడ గోదావరి జిల్లా మనిషి కనుక, మంచీ మర్యాదా ఎక్కువ. అందుకని ఎంతో మర్యాదగా చెప్పేవారు. మైకాసురులంటేనే అసురులు. వాళ్ళకి ఇలాటి దేవతలు చెబుతుంటే తలకెక్కుతుందా, ఏ మాత్రమూ ఎక్కలేదు. వీళ్ళల్లో కూడా ఒక మాష్టారుగారు మాట్లడుతానన్న విషయం తప్ప, అర్ధంలేని అర్ధంకాని విషయాలెన్నో మాట్లాడతాడు. ఇలాటివారితో ఎందుకులే పాపం ఆవిడని ఇబ్బంది పెట్టటం అని, ఆవిడని పకోడీల విభాగానికి కార్యకర్తగా చేశాం. (ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఆవిడ ఉల్లిపాయ పకోడీలు చేస్తే, టెక్సస్ రాష్ట్రమంతా గుభాళించేవి) 

రంగారాయుడుగారయితే గొంతు గంభీరంగా వుంటుందని, ఈసారి ఆయన్ని కూర్చోపెట్టాం. ఈ జన్మలో ఆయన పొరపాటున ఆంధ్రదేశంలో పుట్టాడు కానీ, పూర్వజన్మలో ఆయన హిట్లర్ అయివుంటాడని ఆయన ఎడమ చేతి గీతల్లోనూ, నొసటి మీదా జర్మన్ భాషలో వ్రాసివుందిష. మరి మాకు అంతకన్నా కావల్సిందేముంది. ఆయన చేతికి ఇచ్చాం ఒక గడియారం, బెత్తం.

ఆయన ముందు నయనా నొప్పింపక, తర్వాత భయానా నొప్పించి ఉపన్యాసకులని  స్వయాన ఒప్పించేవాడు.

ముందు "రెండు నిమిషాల్లో మీరు పూర్తిచేయండి. తర్వాత ఫలనాగారు వ్యాసం చదువుతారు. ఫలానాగారూ! మీరు సిధ్ధంగా వుండండి" అని చిత్తూరి నాగయ్యగారిలా సాదరంగా చెప్పేవాడు. 

రెండు నిమిషాలు అవగానే, తెలుగు సినిమాలో గుమ్మడిలాగా ఉదారంగా "ఇంక దిగు బాబూ, దిగు నాయనా" అని సముదాయించేవాడు.

ఇంకా దిగకపోతే, ఎస్వీ రంగారావులా భీకరంగా ఒక్క అరపు అరిచేవాడు. భుజం మీద గద ఒక్కటే తక్కువ!

౦                           ౦                           ౦         

          ఈమధ్య ఫీనిక్సులో నేనొక ఇంజనీరింగ్ సెమినారుకి వెళ్లాను. “లీన్ మాన్యుఫాక్త్యరింగ్“ అనే విషయం మీద ఇరవై నిమిషాలు నన్ను మాట్లాడమన్నారు. ప్రొద్దున్న పది గంటల నించీ పదీ ఇరవై దాకా. సరిగ్గా పది గంటలకి నన్ను ఆహ్వానించారు.

          స్లైడ్స్ చూపిస్తూ మాట్లాడుతుంటే సమయం చకచకా గడిచిపోయింది. పంథొమ్మిది నిమిషాలు అవగానే ఒక్కసారి స్టేజ్ మీద లైట్ అర్పి వెలిగించారు. వెంటనే ముగింపు వాక్యాలు చెప్పి ఇంకో అర నిమిషంలో దిగిపోయాను. నా ఒక్క ప్రెజంటేషనే కాదు, అ రెండు రోజులూ జరిగిన అన్నీ అలాగే టైం ప్రకారం జరిగిపోయాయి. అంతేకాదు నేను అమెరికాలో వెళ్ళిన ఎన్నో సెమినార్లలో ఇలాగే జరిగింది.

          పడమటి దేశాల నించీ మనం నేర్చుకోవలసిన ఎన్నో విషయాల్లో, మనం పట్టించుకోనిది, అయినా ఎంతో ముఖ్యమైనది ఇదొకటి.

          సమయ పాలన!

 
 
నా రచనలకు స్ఫూర్తీ, స్పందనా ఇచ్చిందీ ఇస్తున్నదీ నా అభిమాన రచయితల కథలూ, నా చుట్టూ ఉన్న ప్రజలూ ప్రపంచం.

చైతన్య భారతి, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, ఆటా, తానా, వంశీ కల్చరల్ ట్రస్ట్, ఫ్రెండ్ షిప్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, వంశీ ఇంటర్నేషల్, సప్నా, సిరి ఫౌండేషన్, శీ సువర్చలా ఛారిటబుల్ ట్రస్ట్ అంతర్జాతీయ సాహితీ పురస్కారం, రచన మాసపత్రిక కథాపీఠం పురస్కారం, అంతర్జాతీయ తెలుగు సాంస్కృతిక - సారస్వత సంఘం మొదలైన సంస్థల ద్వారా బహుమతులూ, పురస్కారాలూ, అభిమానుల ఉత్తరాలూ, పాఠకుల స్పందనా, పత్రికా సంపాదకుల ప్రోత్సాహం నాకూ, నా రచనలకూ విటమిన్లు.
1968 వ సంవత్సరం నించీ ఆనాటి యువ, జ్యోతి, ఆంధ్రపత్రిక, ఆంద్రజ్యోతి, ఆంధ్రప్రభల నుంచీ ఈనాతి స్వాతి, విపుల, ఆంధ్రభూమి, రచన, చతుర, ఇండియా టుడే, స్వప్న మొదలైన భారత్దేశంలోని దాదాపు అన్ని తెలుగు పత్రికల్లోనూ, అమెరికాలోని తానా పత్రిక, అమెరికా భారతి, తెలుగునాడి, సుజనరంజని, కౌముది మొదలైన పత్రికల్లోనూ 350కి పైగా నా రచనలు వచ్చాయి. మొత్తం తొమ్మిది పుస్తకాలు ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, రచన, సుజనరంజని, కౌముది, స్వప్న మొదలైన పత్రికల్లో ధారావాహికంగా నా శీర్షికలు ప్రచురించబడ్డాయి.
సాలూరి వాసూరావు సంగీత దర్శకత్వంలో, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శైలజలు పాడిన సంగీత నృత్య రూపకం ‘వేయి వసంతాలు’ అట్లాంటా ఆటా కార్యక్రమంలో ప్రదర్శించబడింది.
ట్రివేండ్రంలో నాలుగు సంవత్సరాలు, హ్యూస్టన్ లో రెండు సంవత్సరాలు, ఆస్టిన్ లో ఎన్నో సంవత్సరాలుగానూ తెలుగు బడి నిర్వహిస్తున్నాను. 1998 నుంచీ టెక్సాస్ లో తెలుగు సాహిత్య సదస్సులు సంవత్సరానికి రెండుసార్లు, సాహితీ మిత్రుల సహకారంతో నిర్వహిస్తున్నాం.

సత్యం మందపాటి

 

పుట్టింది తూ.గో.జిల్లాలో ఆత్రేయపురం. పెరిగింది గుంటూరు.
చదువు గుంటూరు, కాకినాడ, విశాఖపట్టణం. ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ.
ట్రివేండ్రంలో పదేళ్ళు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో సీనియర్ మేనేజర్ గా ఉద్యోగం.

ప్రస్తుతం, అంటే మూడు దశాబ్దాలుగా అమెరికాలో, టెక్సాస్ రాష్ర్త్ర రాజధాని ఆస్టిన్ నగరంలో.
వృత్తి ఇంజనీరింగ్ అయితే, ప్రవృత్తి సాహిత్యం. సాహిత్యరంగంలో ఒక చిన్న దీపం వెలిగించడానికి నాలుగు దశాబ్దాలుగా ఎన్నో కథలు, కవితలు, నాటికలు, నవలలు, శీర్షికలూ, మూడు సీడీలకు (వేయి వసంతాలు) పాటల ద్వారా ప్రయత్నం.

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     
 
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech