Sujanaranjani
           
  సారస్వతం  
   

సంస్కృతంలో చాటువులు, విశేష న్యాయాలు. (19వ భాగం)

 

- రచన : " విద్వాన్" తిరుమల పెద్దింటి  నరసింహాచార్యులు. M.A.,M.Phil               

 

 

 
 

 గగనకుసుమ న్యాయం (2 భాగం.)

స్త్రీలని గౌరవించడం మన సాంప్రదాయం. ప్రహ్లాదుడు  కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృ భావము జొచ్చి మరలువాడు అని పోతన వివరిస్తాడు. సీతని పరాభవించి రావణుడు, ద్రౌపదిని అవమానపరచి  కౌరవులు ఎలా నాశానమయ్యారో మనకి తెలుసు. ఇన్ని తెలిసినా, ప్రగతి పథంలో పయనించే ఆధునిక యుగంలో నవ నాగరిక సమాజంలో  కార్యాలయాల్లో,కళాశాలల్ల, అన్నిచోట్లా స్త్రీలు వేదింపబడటం శోచనీయం. చాటింగులు, డేటింగులతో, సెల్ ఫోను సంభాషణలతో యువత విచ్చలవిడిగా సంచరిస్తూ,లేత వయస్సు లోనే విషయవాంఛలకు లోబడి జీవితాలను నాశనం చేసుకోడం చూస్తూనే ఉన్నాం. స్త్రీలపై యాసిడ్ దాడులు, గొంతులు కోయడాలు, అత్యాచారాలు ఇలా ఎన్నోదురాగాతాలు సమాజంలో జరగడానికి కారణం క్రమశిక్షణా లోపమే. 

ఎంత చదువు చదివినా,ఎంత విజ్ఞానం సంపాదించినా, అరణ్యరోదనన్యాయంలాపనికి రాకుండా పోతోంది. అసమానతలు తొలగి, ఆభిజాత్యాలు మరచి, అందరు సుఖశాంతులతో జీవించాలన్నా,సమతా,మమత, మానవతలు సమాజంలో వెల్లివిరియాలన్న- ఒక్కటే మార్గం.అది మన సంప్రదాయాలని పాటిస్తూ, పెద్దలుచేప్పిన మార్గంలో పయనించడమే. 

ప్రతి ఇంట్లో దేవుడు అమ్మరూపంలో ఉన్నాడు కనుకనే మాతృదేవోభవ అని వేదాలు బోధించాయి. అలాగే  మనువు. మనుస్మృతిలో స్త్రీలను గూర్చి ఎంతగొప్పగాచెప్పాడో చూడండి--  

యత్ర నార్యస్తు పూజ్యంతే/ రమంతే తత్ర దేవతాః/

యత్రైతాస్తు నపూజ్యంతే/సర్వాస్తత్రాఫలాక్రియః.

ఎక్కడ స్త్రీలు పూజింప బడతరో,అక్కడ దేవతలు నివసిస్తారని, ఎక్కడ పూజింప బడరో అక్కడ కార్యాలన్నీ నిష్ఫలాలని తెల్పి, స్త్రియః శ్రియశ్చ గేహేషు./ నవిశేషోస్తి కశ్చన. స్త్రీలు గృహంలో గృహలక్ష్ములే,ఇంతకన్న వేరే విశేషపదం లేదని స్త్రీని కీర్తిస్తాడు. అందుకనే వివాహ సమయంలో కన్యాదాతలక్ష్మీ నామ్నీం కన్యాం లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ దదాతి. అనిచెప్పి కన్యాదానం చేస్తారు. తమ ఇంటబుట్టిన ఆడపిల్లని తండ్రి,సోదరుల బాగా చూసుకోవాలని,అమ్మాయికి కావలసినవి సమకూర్చాలని మనువు ఎంతో విపులంగా వివరిస్తాడు.

              పితృభి: భ్రాత్రుభిశ్చైతాః పతిభిర్దేవరైస్తథా:/

పూజ్యా భూషయితవ్యాశ్చ/ బహు కళ్యాణమీప్సుభి అనగా తండ్రి, భర్త,సోదరుల అందరు స్త్రీలని  గౌరవించాలని, వారుకోరిన భూషణాలు,వస్త్రాల ఇచ్చి సంతృప్తి పరచాలని చక్కగా వివరిస్తాడు. స్త్రీకి పురుషుడు సదా  అండగా ఉండాలని మనుధర్మ శాస్త్రం బోధిస్తుంది. ఇదే అర్థంలో

పితారక్షతి కౌమారే/ భర్తారక్షతి యౌవ్వనే / రక్షంతి

వార్ధకే పుత్రా: / నస్త్రీ స్వాతంత్ర్యమర్హతి. చిన్నతనంలో తండ్రి, యౌవ్వనంలో భర్త, వార్ధక్యంలో పిల్లలు రక్షణ కల్పించాలి అని, రక్షణ లేకుండా ఉంచకూడదని మనువు స్త్రీలకి అధిక ప్రాధాన్యతనిస్తే, మనువుని, ప్రాచీన సంప్రదాయాలని ఇష్టపడని ఆధునిక వితండవాదులు కొందరు పైశ్లోకం మొత్తం గ్రహించకుండా చివరి పాదం నస్త్రీ స్వాతంత్ర్యమర్హతి అన్నది మాత్రం గ్రహించి మనువు స్త్రీలకి వ్యతిరేకి, స్త్రీలకి స్వేఛ్చ లేదన్నాడని వాదిస్తారు. అట్టి వారికి ఎంత నచ్చ చెప్పినా మహాబధిర శంఖారావ న్యాయంలా వినరు, తమ ప్రవర్తన మార్చుకోరు. అస్తు. వారిని అలాగే వదిలేద్దాం.

వినేవారికే మనం కొన్ని మంచిమాటలు చెప్దాం. బాల్యంనుండే మంచిఅలవాట్లు, సత్ సంప్రదాయాలు నేర్పిస్తే, భావితరాలైనా బాగుపడతాయి. ( అదే వ్యాసకర్త కోరిక! మన్నిస్తారుకదూ.) స్త్రీలని గూర్చి మనువు ఇంకా ఇలా చెప్తాడు.

  శోచంతి జామయోయత్ర/ వినశ్వత్యాశు తత్కులం/

    నశోచంతితు యత్రైతా/వర్ధతే తద్ధిసర్వదా అనగా ఆడపడుచులు

ఏయింట సోదరులచే ఆదరించ బడతారో ఆయింట వంశం వర్ధిల్లుతుంది. లేదా నశిస్తుంది.అనితెలిపి,

  తస్మానేతాన్సదా పూజ్యాః/ భూషనాచ్చాదనాశనై

    భూతికామైర్నరైర్నిత్యం/ సత్కారేషూత్సవేషుచ.

తమ ఇంట పండుగలు శుభకార్యాలు జరుపుకోనేటప్పుడు, ఆడపడుచులను పిలచి మంచి భోజనం పెట్టి, వస్త్రాలు, భూషణాదులనిచ్చి సంతృప్తి  పరచాలని చాలా విపులంగా, చక్కగా మనుస్మృతి వివరిస్తుంది. కనుకనే పండగ రోజులలో కూతుళ్ళని, అల్లుళ్ళని పిలచి, ఉన్నంతలో వారికి కట్నకానుకలిచ్చి సంతృప్తి పరచే సంప్రదాయం మనం పాటిస్తున్నాం. ఇలా శృతి,స్మృతి,పురాణాలలో, వేదాలలో, ఉపనిషత్తులలో  స్త్రీకి ఎంతో ఉన్నత స్థానంకల్పించ బడింది. 

ఇక భార్యాభర్తల సంబంధంగూర్చి ఎంతగోప్పగా చెప్పారో చూడండి.—వివాహ సమయంలో సప్తపది అనే తంతులో చదివే మంత్రాలలో ఒకమంత్రం ఇలా తెలపుతుంది.

 సఖా సప్త పదాభవ, సఖావౌ సప్త పదా బభూవః,

  సఖ్యంతే గమేయం, సఖాత్తేమాయోషం,

సఖ్యాన్మేమాయోష్టా: అనగా ఏడడుగుల బంధంతో భార్య,భర్తలమైన మనం ఇకపై స్నేహితులగా ఉంటూ, పరస్పరం స్నేహ భావాన్ని విడవకుండా పయనిద్దాం. ఎంత ఉదాత్తమైనభావన! ఆపత్సు మిత్రం జానీమః కష్టాలలో ఆదుకొను వాడే మిత్రుడు. అట్టిమిత్రభావంతో భార్యాభర్తలు ఉంటే, వారిమధ్య కలతలు, కార్పణ్యాలు, ఆవేశకావేశాలు, అసమానతలకు తావు లేకుండా నిత్య వసంతంలా వారి జీవితం సాగిపోతుంది.

ఇంకా

సంతుష్టో భార్యయాభర్తా/ భర్తా,భార్యా తధైవచ/

     యస్మిన్నేవ కులేనిత్యం/కళ్యాణం తత్రవై ధృవం అనగా

భార్యా,భర్తల పరస్పరం ఒకరిని,ఒకర గౌరవిచుకొంటూ,ప్రేమానురాగాలత సంతుష్టులుగా ఉంటారో ఆయిల్లు నిత్యకల్యాణం, పచ్చతోరణంగా విలసిల్లుతుంది అని

                               యదిహ స్త్రీనరోచేత/ పుమాంసంన ప్రమోదాయేత్/

                                 అప్రమోదాత్ పునః పుంసః/ ప్రజనం నప్రవర్తతే.

భావం

 భార్యని భర్త కష్టపెడితే, ఆభార్య భర్తకి సహకరించదు. అపుడు ఇంట వశం వర్థిల్లదు. అని వివరించి,

                                     అనుకూల కళత్రోయః/ తస్య స్వర్గ యిహైవహి/

                                      ప్రతికూల కళత్రస్య/ నరకో నాత్ర సంశయః/ అని,

                                  స్త్రియాంతు రోచమానాయాం/ సర్వం రోచతేకులం/

                                     స్త్రియామరోచమానాయాం/ సర్వమేవ నరోచతే.

భార్యలు అనుకూలంగా ఉండి, సంతోషంగా ఉంటే గృహం స్వర్గమే. లేకుంటే నరకమే. ఇలా ఎన్నోవిధాలుగా వేలవేల సంవత్సరాలకు పూర్వమే స్త్రీలకి అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది, అని మన ప్రాచీనసాహిత్యం తెలుపుతోంది. మరి కాలంలో స్త్రీలు అన్నిరంగాలలో ముందుకు దూసుకు వెళ్తున్నారని గొప్పగా చెప్పుకొంటున్నాము. కాని నానాటికి ఆడపిల్లలసంఖ్య తగ్గిపోతోంది. పుట్టేది ఆడపిల్ల అని తెలిస్తే కడుపులోనే వారిని కడతేరుస్తున్నాం. “పున్నామో నరకాత్ త్రాయత ఇతి పుత్రః  అని, మొగవారికి ఇచ్చినంత ప్రాధాన్యత ఆడపిల్లలకి ఇవ్వలేకపోతున్నాము. ఆధునికులుకొందరు పిల్లలకి స్వేఛ్చ ఉండాలని తలచి వారికి స్వేచ్చనిస్తే, స్వేచ్చని బ్రహ్మకైనపుట్టురిమ్మతెగులు అన్నట్లుండె విపరీత వస్త్రధారణ, (క్షమించాలి ఇలాంటివి, పాశ్చాత్యనాగరికతకు వర్తిస్తుందేమో కాని భారతీయ సంప్రదాయానికి, మన స్ధితిగతులకు వర్తించదు. అనితెల్పడమే తప్ప, ఎవరిని కించపరచే ఉద్దేశ్యంకాదు.అని రచయిత మనవి.) సెల్ ఫోను సంబాషణ, చదువు పేరుతో ఇంటికి ఆలస్యంగా వస్తూ, బైకులపై షికారులు చేస్తూ  కాలాన్నిదుర్వినియోగ పరుస్తూ, పతనమయే యువతను కూడా మనం చూస్తున్నాం. విధానంలో ఆడపిల్లలే ఎక్కువగా నష్టబోతున్నారు. విసుగు, కోపం, అలజడి, మానసిక అశాంతి, అసంతృప్తి, భార్యా,భార్తలమధ్య అవగాహనారాహిత్యం, పిల్లల్ని సరిగా పట్టించుకోనందున అధిక స్వేఛ్చవంటి అవగుణాలు సమాజంలో పెరుగుతూ,సంబంధ, బాంధవ్యాలను తెంచుతూ, యాంత్రిక జీవన విధానాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. కారణంప్రాచీన సంప్రదాయాలని, పెద్దలమాటలని పట్టించు కోకుండా కొత్తవింత పాత రోత అనితలంచడమే అని విజ్ఞుల అభిప్రాయం. 

ఉదయకాల ఉషోదయాలని తిలకిస్తూ, పచ్చని చెట్లు, పక్షుల కిలకిలారావాలు, వికసించే పుష్పాలు, వాటిలోని పుప్పొడి పై నుంచి వచ్చే చల్లని పిల్లగాలుల సుఖస్పర్శలు, వెన్నెల ాత్రులలో నదీసైకత వేదికపై విహారాలు, పచ్చని కంబళ్ళు పరచినట్లుండే పర్వత సానువుల సోయగాలు తిలకిస్తూ, కదిలేమబ్బుల్ని,ఎగిర కొంగలబారుల్నిచూస్తూ, దేవాలయాల ఘంటా నాదాల్ని,గుడి గోపుర గుహలలోని పావురాయి కువకువలు వింటూ, ఒడ్డును తాకి విరిగి,ఒరిగ సముద్ర కెరటాలని, పసిపాపల నవ్వుల్నీ, పతంగాల(గాలిపటాల) విహారాలని, రంగు రంగుల సీతాకోక చిలుకల్ని, నీలి మేఘాలలో,గాలికెరటాలలోదోబూచులాడ నిండు పున్నమిచంద్రుణ్ణి, ఎలమావి చివురులు మెసవి కూసే పిక కూజితాలని, “ఆగండాగండి! అసలువిషయం వదలి ఏదో కవిత వ్రాస్తున్నాను అనుకొంటున్నారు కదూ? కాదండి బాబూ

ప్రకృతిలోని ఇంత మంచి అందాలని,ఆనందాలని హాయిగా అనుభవించమని పరమాత్మ మనకిస్తే,  ప్రకృతిని కలుషితం చేస్తూ,మనం ఇంకేదో కావాలని, లేనిదానికోసం,తెలియని దానికోసం పరితపిస్తూ,పరిభ్రమిస్తూ కాలాన్ని మన మేధని, విజ్ఞానాన్ని, వృధాపరుస్తూ నిస్సారంగా బ్రతికేస్తున్నాం. అలాకాకుండా శృతి,స్మృతి, వేదోపనిషత్తులలో చెప్పిన విషయాలను చదివి ఆకళింపుజేసుకుని, మన సంప్రదాయాలని ఆచరిస్తే జగమంతా నిత్యకల్యాణం పచ్చతోరణంగా విలసిల్లుతుంది అనుటలో సందేహంలేదు.లేకుంటే  గగనకుసుమ, అరణ్యరోదన, భధిరశంఖారావ, అజాగళ స్తన న్యాయాలలా జీవితం వ్యర్ధమైపోతుంది. ఇదినిజం.ఇదేనిజం.

   ( వచ్చేనెల మరోన్యాయం)


 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech