Sujanaranjani
           
  సారస్వతం  
 

                                                          రచన :  డా.అయాచితం నటేశ్వర శర్మ

 

శకుంతల (పద్యకావ్యం) - 11      ప్రథమాశ్వాసం              

 

నిత్యము బ్రహ్మచర్యమున నిండగు ధర్మము నాచరించు సం

స్తుత్యపథానువర్తియగు సువ్రతు కీ మునికన్య యెట్లగున్?

సత్యత నాత్మ జాత యన జాతకమున్ వివరించి నాకు నౌ

చిత్యము విప్పి చెప్పుము విచింతను బాపగ వాగ్విలాసినీ!           81

వ్యాఖ్యానం: నిత్యబ్రహ్మచర్యంతోనూ, నిండైన ధర్మాచరణంతోనూ,సత్యమార్గంలో  ప్రవర్తించే సదాచారసంపన్నుడైన కణ్వమహామునికి ఈ కన్య ఆత్మజ ఎలా అవుతుంది? ఈ కన్య పుట్టుకకు సంబంధించిన సకల వృత్తాంతాన్ని విశదంగా నాకు చెప్పి నా సందేహాన్ని తీర్చి, ఔచిత్యాన్ని ప్రకటించవలసిందిగా కోరుతున్నాను.చక్కగా  మాట్లాడగల సామర్థ్యం గలదానా! నాకు వివరించి చెప్పుమా! 

అన విని రాజ సంశయము నావల ద్రోయ వచించె నామె `యో

ఘనగుణగణ్య! కౌశికుడు గాదె మహోజ్జ్వల రాజమౌనియౌ

మునివరుడప్సర:ప్రవర మోహన మేనక జూచి మోహమం

దనుపమ గూడి పొందె మహితాత్మజ నీ సుకుమారకన్యకన్.               82 

వ్యాఖ్యానం: దుష్యంతమహారాజు తన చెలి అయిన శకుంతల జన్మ వృత్తాంతాన్ని గూర్చి సందేహంతో అడుగగానే అనసూయ ఆ రాజు సందేహాన్ని తీరుస్తూ -` ఓ  గుణనిలయుడా! ఉజ్జ్వలతేజోమూర్తి అయిన కౌశికుడు అనె మౌనిని గూర్చి విన్నారు కదా! అతడే విశ్వామిత్రుడు అనే పేరుతో వెలుగొందే రాజర్షి. ఆ మునీంద్రుడు ఘోరతపస్సులో ఉండగా అతని తపస్సును భంగం చేయడానికి దేవతలు పంపగా వచ్చిన అప్సరస మేనకను చూసి, ఆమె రూపలావణ్యాలకు ముగ్ధుడై ఆ మహర్షి ఆమెను చేపట్టగా వారిద్దరి ప్రణయానికి ఫలంగా జన్మించినదే ఈ సుకుమారసుందరి అయిన శకుంతల.ఇదీ మా చెలి జన్మవృత్తాంతం.

దేవనియుక్తి మౌనివర దీర్ఘ తపోనియమమ్ము విఘ్నమై

పోవగ మేనకాప్సరస పోవగ వీడుచు నీ కుమారికన్

జీవదయాకరుండును వశీకృతసత్త్వుడు కణ్వదేశికుం

డీ వనితాలలామ గని ఈ వని పోషణ జేసి పెంచగన్              83

వ్యాఖ్యానం: అలా దేవతల నియోగంతో వచ్చిన అప్సరస మేనక వల్ల విశ్వామిత్రుని తపస్సు విఘ్నమై పోయింది. అప్సరస మేనక కూడా ఈ శకుంతలను ప్రసవించి, ఆ తరువాత ఈ వనంలోనే వదలి, దేవలోకానికి వెళ్ళిపోయింది.అప్పుడు కణ్వమహర్షి ఈ వనంలో తిరుగుతూ ఉండగా అతనికి ఈ బాలిక కనబడింది. అపారకరుణామయుడూ, జితేంద్రియుడూ అయిన ఆ మహర్షి ఈ శకుంతలను పెంపుడు కూతురు వలె లాలించి, పోషించి,పెంచి పెద్ద చేశాడు. 

పోషితాత్మజయై సత్త్వపూర్ణయగుచు

కణ్వమౌనీంద్రవరపుత్రిగా జెలంగి

ఆశ్రమమునకు రత్నమై యవతరించె

కాన తెలియుము రాజర్షి! కాంతచరిత.               84 

వ్యాఖ్యానం: ఇలా ఈ శకుంతల కణ్వమహామునికి పెంపుడు కూతురై, చిన్ననాటి నుండే సత్త్వగుణాన్ని అలవరచుకొని, కణ్వమునికి వరపుత్రికారత్నంగా వెలుగొందుతూ వచ్చింది. ఇప్పుడు ఈ ఆశ్రమానికే ఒక రత్నంలా భాసిల్లుతోంది. కనుక ఓ రాజర్షీ! మా చెలియ విశిష్టతను గ్రహించండి అని వివరించింది ( ఈ పద్యంలో కాంతచరిత అనే పదంలో చక్కని శ్లేష దాగి ఉంది.కాంత యొక్క చరిత అంటే శకుంతల కథ అని అర్థం. కాంతం అయిన చరిత అన్నప్పుడు కమనీయమైన కథ అని అర్థం) 

వెండి పురుప్రముఖ్యుడు సువేద్యత నిట్లనెనో ప్రియ్తోన్ముఖీ! 

మండనయోగ్యమీ పలుకు మానిని వృత్తము హృద్యమయ్యెడిన్

నిండు తటిల్లతారుచులు నిక్కము నింగిని పుట్టు గాని యె

ట్లుండును భూమిపుట్టుకగ నూర్జితదైవవిలాససత్కృతిన్?                 85 

వ్యాఖ్యానం: అలా అనసూయ శకుంతల జన్మవృత్తాంతాన్ని వివరించగానే సంతృప్తుడైన  ఆ రాజర్షి -`ఓ ప్రియభాషిణీ! నీవు పలికిన మాటలు నా సందేహాన్ని పూర్తిగా తొలగించాయి. ఈ సుందరి కథ హృదయంగమం.ఈమె అప్సరస కూతురు కనుకనే ఇంతటి సౌందర్యం ఈమెకు లభించింది. సామాన్య మానవస్త్రీకి ఇంతటి సౌందర్య రాశి జన్మిస్తుందా? మెరుపుతీగలు ఆకాశం లోనే పుడతాయి గాని భూమిపై పుట్టవు కదా! ఇదంతా ఆ విధివిలాసమే కానీ అన్యం కాదు.

భవదభిమానభాషణము భక్తిని పెంచెను గాన నా యెదన్

చివర మరొక్క సంశయము చింతగ నిల్చెను దాని దీర్పగా

సువిశదమౌను మానసము సూనృతభాషణ! వెల్లడింపవే

యవసరమంచు పల్కెద హృదంతరకామనతోద నిప్పుడే!               86 

వ్యాఖ్యానం: ఓ సత్యభాషిణీ! మీ అభిమానవచనాలు నాలో మీ పట్ల భక్తిని పెంచాయి.కనుక ఆ స్వాతంత్ర్యంతో మరొక సందేహాన్ని తీర్చుకోవాలని అనుకుంటున్నాను. ఈ సందేహాన్ని తీర్చుకోవాలని నా మనస్సు ఉవ్విళ్ళూరుతోంది అని దుష్యంతుడు ప్రియంవదతో అన్నాడు. 

ఈ మునికన్య తద్వరుని నెప్పటిదాక వరింపబూనదో

కామనతోడ న్న సమయగమ్యము దాక మునివ్రతంబులన్ 

కోమలిజేయునో? మరి యకుంఠితతాపసదీక్ష శాశ్వత

ఖ్యామహితమ్ముగా నొనరగా సమకట్టునొ మౌనియాజ్ఞతో!             87 

వ్యాఖ్యానం: ఈ కణ్వముని పెంపుడు కూతురు అయిన శకుంతల తనకు నచ్చిన వరుడు  లభించేదాక ఇలా ఈ తపోవనంలోనే సేవలు చేసుకుంటూ ఉంటుందా? లేక కణ్వుని ఆజ్ఞతో అకుంఠితదీక్షతో తపస్సు చేస్తూ శాశ్వతంగా బ్రహ్మచారిణిగానే ఉండిపోతుందా? అని రాజు ప్రియంవదను ప్రశ్నించాడు. 

అనుచు ప్రశ్నింప నా చెలి యనియె నిట్లు

ధర్మవర్తనమనిన సదా ప్రియంబు

గాన మత్సఖి తాపసకర్మజేయు

గాని శాశ్వతముగ నుండగాదు వనుల.                 88 

వ్యాఖ్యానం: ఇలా ఆ రాజు అడుగగానే ప్రియంవద-ఓ మహాశయా! మా చెలికి ధార్మికకర్మలంటే సదా ఇష్టం. కనుక తన ఇష్టపూర్వకంగానే ఇలా తపోవనంలో సేవలు చేస్తోంది గానీ,ఇక్కడే శాశ్వతంగా బ్రహ్మచర్యంచేయడానికి కాదు అని పలికింది. 

కణ్వమౌనియు యోగ్యత గలుగు వాని

కీమె నొసగగ యత్నించు నెప్పుడైన 

గాన సంశయ దూరత గనుము  శమము

ప్రబల చింతను కుందుట పాడి గాదు.                89 

వ్యాఖ్యానం: కణ్వమహాముని కూడా ఈమెకు అనురూపుడైన వరుడు దొరికితే వివాహం చేయాలనే తలంపుతో ఉన్నారు.కనుక ఏ క్షణంలోనైనా ఈమె వివాహం జరుగవచ్చు. కావున ఓ మహానుభావా! నీ మనస్సులోని సంశయాన్ని దూరం చేసుకో! 

అనిన ప్రియంవదోక్తులకు హర్షతరంగిణులందు దేలుచున్ 

మనమును గూర్చి లోబలికె మానస! తీరెను బాధ ఈ సమా

ధానమనూనమోదజనితానుభవమ్మును పొందజేసి,నా

ధ్యానము యోగ్యమంచు తెలియంగ వచించినదీ క్షణంబునన్.            90 

వ్యాఖ్యానం: ఇలా ప్రియంవద శకుంతల వివాహవిషయాన్ని వివరించి చెప్పగానే ఎంతో సంతోషంతో ఉప్పొంగిపోయిన ఆ దుష్యంతుడు తన మనస్సులో -`ఓ హృదయమా! ఈ ప్రియంవద సమాధానంతో నీలోని బాధ తీరిపోయింది. నీ నిర్ణయం

సరి అయినదే అని నిశ్చయమైందీ. 

ఇట్లు ప్రియసఖీరాజన్యులెలమి భాష

ణముల నాత్మ వృత్తాంతము నమర జేయ

వ్రీడితాత్మయై మునికన్య వేగ నడచె

ఆశ్రమస్థ కుటీరము నాశ్రయింప.                  91 

వ్యాఖ్యానం: ఇలా ప్రియంవదా దుష్యంతులు తన వివాహ విషయాన్ని గూర్చి సంభాషిస్తుంటే విని సిగ్గుతో అక్కడ నిలువలేక ఆశ్రమంలోని తన కుటీరానికి వెళ్ళేందుకు బయలుదేరింది. 

అతిథి వరేణ్యులీ వనుల కంచిత భక్తిని యాగమింపగా

వ్రతమును వీడి సేవలను బాయుట నీకుచితంబు గాదు నా

హితవచనమ్ము నొక్కపరి యిచ్చగ సంశ్రవణించి వేగమే

జతగొన రమ్ము నా కడకు సారసలోచన! రమ్యకుంతలా!             92  

వ్యాఖ్యానం: ఓ సారసలోచనా! శకుంతలా! అతిథిశ్రేష్ఠులు మన ఆశ్రమానికి ఎంతో భక్తి ప్రపత్తులతో వచ్చిన ఈ సందర్భంలో వారికి సేవలు చేయకుండా మధ్యలో ఇలా వెళ్ళిపోవడం నీకు ఉచితం కాదు.నా హితవాక్యాన్ని ఒకసారి ఆలకించి వెంటనే వెనుదిరిగి నా దగ్గరికి రా!అని అనసూయ శకుంతలతో పలికింది. 

అనుచు ననసూయ వారింప నంత నిలిచి 

ధార్మికవ్రత మరలెనుదారబుద్ధి

మనసు లోలోన రాజర్షి మరులు గొలుప

బద్ధరాగానుభావసమ్రుద్ధ యగుచు.                               93 

వ్యాఖ్యానం: ఇలా అనసూయ వారించగా విని ఆ శకుంతల అతిథిధర్మాన్ని కాపాడే ఉద్దేశంతో ఉదారబుద్ధితో వెనుకకు మరలింది. ఆమె మనసులో ఆ రాజర్షిపై ప్రేమానురాగాలు నిండిపోయాయి. ఆ అనురాగభావం కూడా ఆమెను ముందుకు వెళ్ళకుండా నిరోధించింది. 

రాజవరేణ్యుడత్తరిని రంజిలి పల్కె `సుదీర్ఘసేవచే

నోజత వీడి విశ్రమత నుండగ మేలని పోవనెంచెనో

రాజిత శీల త్వత్సఖి వరమ్మని ఇచ్చెద నుంగరమ్ము ని

ట్లీజనమాన్యతుష్టి గొన నెంతయు యోగ్య మటంచు నెంచెదన్.           94 

వ్యాఖ్యానం: అలా శకుంతల చెలుల వారింపుతో ఆగిపోయి వెనుకకు మరలగా చూచి ఆ దుష్యంతుడు -మీ సఖి చాలాసేపటి నుండి ఈ ఆశ్రమలతలకు నీరు పోసి అలసిపోయినందు వల్ల విశ్రాంతిని కోరి వెళ్ళాలనుకొన్నదేమో!  ఆమెను వెళ్ళనీయండి.ఆమెకు నా గుర్తుగా నా పేరుగల ఈ ఉంగరాన్ని ఇస్తున్నాను. దీనిని ఆమెకు ఇవ్వండీ అని ఆ రాజు అన్నాడు. 

అనుచు నామాంగుళీయమ్ము నంత మౌని

కన్యకాహస్తమున నుంచె గౌరవింప

ముదమునందిన మునికన్య ముగ్ధయయ్యె

వరమనోహరకరవశప్రాప్తి గాంచి.                 95 

వ్యాఖ్యానం: అలా ఆ దుష్యంతమహారాజు తన వేలికి ఉన్న తన నామాంగుళీయకాన్ని తీసికొని శకుంతల చేతికే అందించాడు. అప్పుడు ఆ శకుంతల దాన్ని తీసికొని సిగ్గుతో తలవంచుకొని తన మనోహరుని మనోహర కరస్పర్శకు పులకించిపోయింది.

-(సశేషం)

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

   

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech