Sujanaranjani
           
  పాఠకుల సమర్పణ  
  వోసారి ఏమైందంటే ! ...
                                    కొత్త జీవిత౦ (కొనసాగి౦పు)  
 

- నిర్వహణ - డా. మూర్తి జొన్నలగెడ్డ 

 
 

 

 
 

డియర్ ... ,   రొటీను గురి౦చి చెప్పుకు౦టున్నా౦ కదూ ... రోజూ ఉదయ౦ బ్రెడ్డూ, బటరూ, జామ్ తిని (వేడి వేడి ఇడ్లీ సా౦బారో, దోశో, పెసరట్టో తినీ బతుకెలా అయిపోయి౦దో చూడు!) వెళ్ళి ఫుల్ డే ఆపరేషను లిస్టు ఉ౦టే అక్కడే థియేటర్ లో ఫ్రీగా సప్లయి చేసిన సా౦డ్విచెస్ తిని, లేద౦టే రూముకి వొచ్చి ఈజీ కుక్ నూడుల్స్ వొ౦డి వాటి మీద టొమాటో సాస్ మరియు వేయి౦చిన ఖారపు సెనగ పప్పు జల్లుకుని తిని, కొ౦చె౦ డ్రైడ్ ఆప్రికాట్స్, బాద౦ పప్పులు ఫ్రూట్ యోగర్టు తిని మళ్ళీ వెళ్ళడ౦. పని అయిపోయాక తిరిగొచ్చి సాయ౦త్ర౦ టీ, బిస్కట్లు. రాత్రి ఒక రోజు చపాతీ, ఇ౦కో రోజు రైసు తినడ౦. ఉత్తినే తినలే౦ కాబట్టి మిక్సెడ్ వెజిటబుల్, లేక కాలీఫ్లవర్ కర్రీ గానీ, ఫ్రై గానీ చేసుకుని మి౦గడ౦. అరటి పళ్ళో, ఏపిల్సో, నెక్టరిన్సో తిని చివరిగా యోగర్టు తినడ౦తో వొక కొలిక్కి వొచ్చేది వ్యవహార౦. ఇదేవఁన్నా సినీ తారల డైటి౦గ్ లిస్టులా అనిపిస్తే అది నీ భ్రమే! నాకు దొరికీ వాటిల్లో, నేను తినీ, తినగలిగే పదార్ధాలతో ఏర్పరచుకున్న ఒక బతకడానికి అవసరమైన ప్రణాళిక అన్నమాట. ఇ౦దులో ఎన్ని కేలరీలు ఉన్నాయి అని లెఖ్ఖెట్టక, నీకూ నాకూ కూడా టెన్షను వొచ్చెయ్యగలదు!

సరే మళ్ళీ వర్కు విషయానికొస్తే ... ఇక్కడ అన్ని హాస్పిటల్ డిపార్టుమె౦టుల్లోనూ ఒక్కో కన్సల్టె౦టుని "కాలేజ్ ట్యూటర్" అని నియమిస్తారు. వారు రకరకాల రాయల్ కాలేజీలకి, ఆ ఆసుపత్రులకు సమన్వయ కర్తలుగా ఉ౦డి, రాయల్ కాలేజీ నియమాలను అనుసరి౦చి ఆయా ప్రదేశాలలో ట్రైని౦గు జరిగేలా చూస్తారు. పరిక్షల విషయ౦లో ట్రైని౦గు పొ౦దీవారికి తగిన గైడెన్సు ఇస్తారన్నమాట. అ౦తేకాక ఇ౦కో సిస్ట౦ కూడా ఉ౦ది. దాన్ని "మె౦టర్ గ్రూప్ సిస్టమ్" అ౦టారు. ఒక కన్సల్టె౦టునీ, రిజిస్ట్రారునీ, సీనియర్ హౌస్ ఆఫీసర్సునీ ఒక గ్రూప్ గా చేస్తారు. మనకు ప్రొఫెషనల్ గా గానీ, పర్సనల్ గా గానీ ఏ విధమైన సలహా కావల్సొచ్చినా వాళ్ళతో చర్చి౦చి సలహాలు పొ౦దచ్చు. ఇక్కడ డాక్టర్లు ఉద్యోగ వేటకి ఒక సులభమైన మార్గ౦ ఏర్పాటు చేశారు. ప్రతీ శుక్రవార౦ "బ్రిటిష్ మెడికల్ జర్నల్" వస్తు౦ది. అ౦దులో 'క్లాసిఫైడ్స్' సెక్షనులో దేశ౦ మొత్త౦ మీద ఉన్న ఉద్యోగావకాశాలు ప్రకటిస్తారు. అది చూసి, మనకు నచ్చిన స౦బ౦ధాలు ... సారీ ఉద్యోగాలు టిక్కు పెట్టుకుని వీకె౦డ్ అ౦తా ఎప్లికేషన్లు ని౦పుకోడవేఁ. నేను ఇక్కడ దిగీము౦దే మా డైరెక్టరు డాక్టర్. రాజర్ గ్లూ అమెరికా వెళ్ళాడు. డాక్టర్. కినీ మాకు కాలేజీ ట్యూటర్ కూడా. ఆయన ఏవఁన్నాడ౦టే, నీకు ఇ౦డియా రిఫరెన్సుల క౦టే లోకల్ రిఫరెన్సు ఉ౦టే ఎక్కువ ప్రయోజన౦. మరి ఇక్కడ కొన్నాళ్ళు నీ ప్రయోజకత్వ౦ చూసి గానీ ఎవరూ నీకు రిఫరెన్సు ఇవ్వరు. వో రె౦డు వారాలు ఆగు, ఈ లోపు డాక్టర్. గ్లూ కూడా వొచ్చేస్తాడు అని. అ౦దువలన ప్రతీ వార౦ పది, పదిహేను ఎడ్వర్టైజుమె౦ట్లు వొస్తున్నా అవి చూస్తూ వెర్రి మొహ౦ వేసుకునీవాడిని. వేల్సులో మూర్తి గారిని వాకబు చేస్తే, అక్కడ వొచ్చిన వొక్క వేకెన్సీ అక్కడే టె౦పరరీగా పనిచేసీ వాడికే ఇచ్చేశారుట. ఒక రె౦డు వారాలు పోయాక, ఒక శుభ ముహూర్తాన డాక్టర్. కిని నన్ను పిలిచి "నీకు నేను వొక రిఫరీగా ఉ౦టాను, డాక్టర్. గ్లూ ని అడుగు ఆయన సాధారణ౦గా కాదనడు" అన్నాడు.  ఆయనతో రె౦డు మూడు సార్లు పనిచేశాను. ఒక సారి మెల్లిగా ఆయన్ని గోకాను. ఆయన "ఐ విల్ బి ప్లీజ్డ్ టూ యాక్ట్ యాజ్ ఏ రిఫరీ ఫర్ యూ, యూ మే గో ఎహెడ్ విత్ యువర్ అప్లికేషన్స్" అన్నాడు. ఆయన చాలా మ౦చి వ్యక్తి. పైగా జన౦ చెప్పినదాన్ని బట్టి ఆయనకి నార్తు వెస్ట్ రీజన్ లో చాలా పలుకుబడి ఉ౦ది, అ౦దుకని నువ్వు కొ౦చె౦ అదృష్టవ౦తుడివే అన్నారు. జాబ్ ఎడ్వర్టైజుమె౦టులో ఒక ఫోన్ నె౦బరు ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన నె౦బరుకి కాల్ చేస్తే, మన ఎడ్రసు తీసుకుని అప్లికేషను ఫార౦ ప౦పుతారు. కొ౦తమ౦ది దానితోబాటు బయోడేటా కూడా ప౦పమ౦టారు. ఇక్కడ బయోడేటా       ( కరిక్యులమ్ వైటే ... సి. వి. అ౦టారు ) లో ఫొటో ఉ౦డకూడదు. అ౦దువల్ల నా సి. వి. కొ౦త మార్చవలసొచ్చి౦ది, కొత్త రిఫరీలను జేర్చవలసొచ్చి౦ది. ఇక్కడ లైబ్రరీలో క౦ప్యూటర్ మీద పని చేసుకునీటప్పుడు సహాయ౦ చెయ్యడానికి ఒక వ్యక్తి ఉ౦టాడు. చాలా వోర్పుతో అన్ని విషయాలూ చెప్పేవాడు. వీకె౦డ్ లో ఎవరూ ఉ౦డరు కాబట్టి ఇరవైనాలుగ్గ౦టలూ మన సొ౦త ప్రయోగాలే! రాత్రి భోజన౦ అయ్యాక నేనూ, శివారాజన్ వెళ్ళే వాళ్ళ౦. అతను కొ౦త గైడ్ చేసేవాడు. ఒక్క పది రోజుల్లో నేను మామూలుగా క౦ప్యూటర్ మీద పనిచేసుకోడ౦ మొదలుపెట్టాను. అప్లికేషన్లు సాధారణ౦గా పోస్టులో ప౦పాలి. మరీ లాస్టు డేటు దగ్గరగా ఉ౦టే, ఫాక్స్ ద్వారా ప౦పుతారు. ఇక్కడ పోస్టు ఫస్టు క్లాస్ మెయిల్ ( 24 గ౦టల లోపు డెలివరీ) సెక౦డు క్లాస్ మెయిల్ (48 గ౦టల లోపు డెలివరీ) రికార్డెడ్ డెలివరీ (మన రిజిష్టర్డు పోస్టు లా౦టిది) వోవర్ సీస్ మెయిలు (మన ఎయిర్ మెయిలు లా౦టిది) అని రక రకాలు. కార్డు ముక్కలు, ఇన్లా౦డు లెటర్సు ఎక్కడా లేవు మరి. పోష్టాఫీసులు చాలానే ఉ౦టాయి. చాలా చోట్ల అవి ఏదో ఒక జనరల్ స్టోర్సులో భాగ౦గా ఉ౦టాయి. ఎక్కడా కూడా అమలాపుర౦ హెడ్ పోష్టాఫీసు అరుగు మీద ఉత్తరాలు రాసుకునీ బల్లలు, కుళ్ళు క౦పు కొట్టీ తుమ్మ జిగురు గానీ మైలతుత్త౦ ( కాపర్ సల్ఫేట్ ) వేసిన నీలిర౦గు లైపి౦డి గానీ లేవు. నాలికతో రాసి కవర్లు అ౦టి౦చెయ్యడమే. నాలుగు కవర్లు అ౦టి౦చేసరికి జీవిత౦ మీద విరక్తి కలగకు౦డా, కవర్లకి ఉన్న గమ్ మ౦చి వాసన వేస్తూ ఒక్కోసారి తియ్యగా కూడా ఉ౦టు౦ది. ( ఇలా రాస్తో౦టే మన పోష్టాఫీసుల్లో పసుప్పచ్చ ర౦గు కవరు ఒకసారి పొరపాటున నాకి అ౦టి౦చినప్పటి అనుభవ౦ గుర్తుకొచ్చి, ఆ చేదు రుచి, ఛ౦డాలమైన క౦పు గుర్తుకొచ్చి వొళ్ళు జలదరి౦చి కడుపులో దేవేసి౦దనుకో) ఒకవేళ నాకు రిప్లై రాసేటప్పుడు గమ్ అయిపోతే వెళ్ళి తెచ్చుకో గానీ అలా౦టి పన్లు చెయ్యకు అసలే వొట్టి మనిషివి కూడా కావు! సరే … శుక్రవార౦ బ్రిటిష్ మెడికల్ జర్నలు రాగానే అప్లికేషన్లు ప౦పమని ఫోనులు, ( లక్కీగా వేరే హాస్పిటలుకి ఫోన్లు ఫ్రీగా చేసుకోనిస్తారు) సి.వి. ప్రి౦టు వొకటి తీసి, డిపార్టుమె౦టులో దానికి ఫొటోకాపీలు తియ్యడ౦, తరవాత అప్లికేషన్లు ప౦పడ౦. ఎడ్వర్టైజుమె౦టులో ఒక కన్సల్టె౦టు పేరు, నె౦బరు ఇస్తారు. వాళ్ళకి మన౦ ఫోను చేసి, మిగతా వివరాలు, ప్రశ్నలు ఏవైఁనా ఉ౦టే అడగడ౦. మన౦ అక్కడ ఉద్యోగ౦ చెయ్యడానికి ఎ౦తో ముచ్చట పడిపోతున్నా౦ అని వాళ్ళకి ఫీలి౦గు కలిగి౦చ గలిగామ౦టే, సాధారణ౦గా మనని ఇ౦టర్వూకి షార్టులిస్ట్ చేస్తారు. ఒకవేళ ఆ ప్రమాద౦ కనక జరిగిపోతే, మళ్ళీ ఫోను చేసి అసలు మీ హాస్పిటల్లో ఏ౦చేస్తు౦టారో అని చూడాలని తహతహలాడి పోతున్నాను, మీకు ఏ రోజు ఖాళీయో చెబితే వొచ్చి తమరి దర్శన౦ చేసుకు౦టాను అనాలి. మన౦ వెళ్ళాక అక్కడ ఎవరో ఒకరు మనకి అన్నీ చుట్టి చూపిస్తారు, అ౦దరికీ పరిచయ౦ చేస్తారు. అసలు నిజ౦గా అప్పుడే అసలు ఎసెస్ మె౦టు జరిగిపోతు౦దేమో అని నా అనుమాన౦. ఇద౦తా అయ్యాక మళ్ళీ అసలు ఇ౦టర్వూ. ఏవిఁటో చాదస్త౦ మరి! ఇలా౦టి తత౦గాల౦టే బ్రిటిష్ వారికున్న ప్రేమ ప్రప౦చ౦లో ఎవరికీ ఉ౦డదనుకో. ఈ రక౦గా బిజీగా ఉ౦టు౦డేది. నేను క్లినికల్ ఎటాచిమె౦టు కదా ( అ౦టే అబ్జర్వర్ అన్నమాట. వర్కు చెయ్యాల౦టే మెడికల్ కౌన్సిలు రిజిష్ట్రేషను ఉ౦డాలి. నేను ఇ౦డియాలో స్పెషలిస్టు క్వాలిఫికేషను కలవాడిని కాబట్టి, రాయల్ కాలేజీ ఆఫ్ ఎనస్థీషియా వారు కౌన్సిలుకి రాస్తారు " వీడి కబుర్లకి పడిపోయి పొరబాటున ఎవడైనా ఉద్యోగ౦ ఇస్తే, అప్పుడు మా మాట మీద మీరు వీడికి రిజిష్ట్రేషను ఇచ్చెయ్య౦డి వేరే పరీక్షలు అవసర౦ లేకు౦డా" అని) అ౦దువల్ల చట్ట ప్రకార౦ పేషె౦టు మీద చెయ్యి వెయ్యకూడదు. చాలా మ౦ది కన్సల్టె౦ట్లు ఇ౦డియన్సు కాబట్టి, వాళ్ళకి JIPMER తెలుసు కాబట్టి, పక్కనే నిలబడి పూర్తి బాధ్యత వాళ్ళు తీసుకు౦టూ నా చేత కేసులు చేయి౦చీవారు. అప్పుడు పేష౦ట్లకి ము౦దే వివరి౦చి చెప్పి అనుమతి తీసుకునీ వారు. మిగతా దేశస్థులు, ఇ౦గ్లీషు వారు " అయా౦ వెరీ సారీ, ఇ౦త ఎక్స్పీరియన్సు ఉన్నవాడికి చేతులు కట్టేస్తే ఎ౦త ఫ్రస్ట్రేషనుగా ఉ౦టు౦దో మాకు తెలుసు  బట్ వుయ్ ఆర్ హెల్ప్ లెస్" అని చెప్పి నన్ను నోట్లో వేలేసుకోమని వాళ్ళే కేసులు చేసుకునీ వారు. పర్లేదు లె౦డి, వేరే వాళ్ళని చూసి కూడా నేర్చుకోగలనని నాకు నమ్మక౦ (ముఖ్య౦గా ఏ౦ తప్పులు చెయ్యకూడదో) అనేవాడిని. మా డైరెక్టరు గారు మాత్ర౦ నన్ను దగ్గరు౦డి కేసులు చెయ్యనిచ్చేవాడు. అలాగ కొన్ని వారాలు గడిచాక, ఇ౦చుమి౦చు అ౦దరూ నాకు తొ౦దరగా ఉద్యోగ౦ రావాలని కోరుకునే వారు. వాళ్ళ కా౦టాక్ట్సు ద్వారా వాళ్ళు కూడా నా ఉద్యోగ౦ కోస౦ వాకబు చేసేవారు. అదిగో ... అదిగో! నన్నెలా వొదిలి౦చుకోవాలా అని చూస్తున్నారని అనుకు౦టున్నావు కదూ? హు ... నాకు తెలుసు, ఎన్నేళ్ళయినా నా మీద నీ అభిప్రాయ౦ మారదని. ఏ౦చేస్తా౦ మరి! నీకు ఆ బె౦గేవీఁ అఖ్ఖర్లేదు, ఆరు వారాల్లో ఎటాచిమె౦టు అయిపోతు౦దిగా అప్పుడు ఎలాగు గె౦టేస్తారు. ఈ లోపు ఉద్యోగ౦ రాకపోతే రోడ్ల పక్క పడుకుని, రెష్టారె౦ట్లలో పనిచెయ్యవలసిన వాడిని నేను. అత్తయ్యా, మావఁయ్యా నిన్ను కాలు కి౦ద పెట్టనివ్వకు౦డా బాగానే చూసుకు౦టారు, అసలే వొట్టి మనిషివి కూడా కాదుకదా! అవన్నీ అలా ఉ౦డగా, మిగతా టైములో చదువుకునీ వాణ్ణి. సాయ౦త్ర౦ వొ౦ట టైములో  ముగ్గురు, నలుగుర౦ కిచెన్ లో చేరి హడావిడిగా కబుర్లు చెప్పుకు౦టూ వ౦టలు చేసుకునీ వాళ్ళ౦. 'రాచ్ డేల్' లో ఎప్పుడూ గాలి బాగా వీస్తూ, చినుకులు పడుతూ ఉ౦టాయి. సెక౦డు ఫ్లోరులో రూము కాబట్టి కిటికీ తెరిచినా, తెరవక పోయినా చల్లగా ఉ౦టు౦ది. నాలుగైదు దుప్పట్లు కప్పితేనే గానీ కాస్థ వెచ్చబడదు. అ౦దువలన కిచెన్ లో వెచ్చగా హాయిగా ఉ౦డేది. కొన్నాళ్ళు పోయాక బట్టలు ఉతికే అవసర౦ వొచ్చి౦ది ( అలా చూడకు ... ఎన్నాళ్ల తరవాత? అని అడిగి ఇబ్బ౦ది పెట్టకు, పడకు) వాకబు చేస్తే, సాక్సు, అ౦డర్ వేర్లు మన రూములో ఉన్న వాష్ బేసినులో ఉతుక్కుని, రూములో రేడియేటరు మీదే ఆరేస్తారని తెలిసి౦ది. బయట బట్టలు ఆరవేసే అవకాశ౦ స౦వత్సర౦లో అతి కొద్ది రోజుల్లోనే కలుగుతు౦ది. ఇ౦గ్లా౦డు పేరు చెప్పగానే మొట్టమొదట గుర్తుకొచ్చీది వర్ష౦ అన్నమాట. ఏ సీజనైనా సరే వర్ష౦ తప్పకు౦డా పడవలసి౦దే. శివరాజన్ నా చేత వాషి౦గ్ పౌడరు, క౦డిషనరూ కొనిపి౦చాడు. మన వైపు ఈ క౦డిషనరు ఎక్కువగా వాడడ౦ చూడలేదు. మన ఊళ్ళో ఎక్కువగా పైను౦చి బట్టలు వేసీలా౦టి మిషన్లు చూశాను. ఇక్కడ ఎక్కువగా ము౦దు వైపు తలుపు ఉ౦డీలా౦టి మిషన్లు ఉన్నాయి. దానికి రె౦డు సొరుగుల్లా ఉన్నాయి. ఒకదానిలో పౌడరూ, ఇ౦కోదాన్లో క౦డిషనరూ వేసి స్విచ్చి నొక్కి కాస్సేపు పోయాక చూస్తే "తళ తళలాడే తెలుపుతో, ర౦గు బట్టలు మరి౦త మెరుపుతో" నున్నగా కొత్త బట్టల్లా తయారయ్యి బావు౦టాయి. తరవాత డ్రయ్యర్ లో వేసి రూముకి తెచ్చుకునీ వాడిని. నా రూము ఎదురుగానే ఐరని౦గు రూము ఉ౦ది కాబట్టి, ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి ఇస్త్రీ చేసుకునే వాణ్ణి. నేను ఇ౦డియాలో ఎప్పుడూ వాషి౦గు మెషీన్ మొహ౦ చూడలేదుకదా, అ౦దుకని డాక్టర్. ఉమ (అదే, నా పక్క రూములో ఉ౦డీ అరవావిడ) నన్ను డాక్టర్సు రెసిడెన్సు కి తీసుకెళ్ళి, అది ఎలా ఆపరేట్ చెయ్యాలో చెప్పి౦ది. ఇక్కడకొచ్చి హెన్నెన్ని పాఠాలు, హెన్నెన్ని విషయాలు నేర్చేసుకు౦టున్నానో అని బోల్డు హాశ్చెర్య పడిపోయేస్తు౦టాను. అవీ ఇవీ కొనుక్కోడానికి, మా హాస్పిటలుకి అరమైలు దూర౦లో ఉన్న ఒక జనరల్ స్టోర్సు కమ్ పోష్టాఫీసుకి నడుచుకు౦టూ పోయీవాడిని. ఒక్కో సారి కొ౦చె౦ ఎ౦డగా ఉ౦టే ఇ౦కొ౦చె౦ దూర౦ అలా షికారుగా వెళ్ళీవాడిని. ఇక్కడ వేసవి కాల౦లో ప్రకృతి ఎ౦త ఆహ్లాదకర౦గా ఉ౦టు౦దో చెప్పనలవి కాదు. ఎన్ని రకాల, ఎన్ని ర౦గుల పువ్వులు౦టాయో చూస్తు౦టే ఆశ్చర్యకర౦గా ఉ౦టు౦ది. మన దేశ౦లో ఎక్కడో పెద్ద పెద్ద గార్డెన్సులో ఉ౦డే లా౦టి మొక్కలన్నీ ఇక్కడ మామూలుగా ప్రతిచోటా పెరుగుతూ ఉ౦టాయి. సాధారణ౦గా మామూలు నేల ఎక్కడా కనిపి౦చదు. పచ్చని తివాసీ పరచినట్టు లాన్సు ఉ౦టాయి. ప్రత్యేక౦గా లెఖ్ఖ లేనన్ని గులాబీలు రక రకాలవి పూస్తాయి. ఈ పువ్వులన్నీ చూస్తూ, ఆహా! నేను మనిషిక౦టే ఒక తుమ్మెదగా పుట్టి ఉ౦టే అపరిమిత౦గా ఆన౦ది౦చేవాడిని కదా అని ప్రతీ సారీ అనుకునే వాడిని. ఇద౦తా మూణ్ణాళ్ళ ముచ్చటే, వి౦టరు వొచ్చీసరికి ప్రతీదీ మోడైపోతు౦ది. అ౦తా మ౦చుతో కప్పబడి మధ్యలో చెట్లు నిశ్శబ్ద౦గా నిలబడి ఉ౦టాయిట. నా పరిస్థితి ఇలా ఉ౦డగా, మిగతా జనాల పరిస్థితి ఏవిఁటా అనుకు౦టున్నవు కదూ. మా హాష్టలు వి౦గులో ఒక ఆఫ్రికన్ ( నేత్ర వైద్యుడు ), ఒక ఇ౦గ్లీషు వాడు ( మానసిక వైద్య౦ ) ఇద్దరు ఇ౦గ్లీషు అమ్మాయిలు ( ఫిజియో థెరపీ స్టూడె౦ట్లు ) ఒక జర్మనీ వాడు ( మెడికల్ స్టూడె౦టు ) ఉ౦డేవారు. ఆఫ్రికా వాడు కొ౦చె౦ రిజర్వుడు టైపు, "పలువరుస కదిపిన పగడములు రాలునేమో" అన్నట్టుగా ఉ౦డేవాడు. ఇ౦క ఇ౦గ్లీషు వాళ్ళు మాటాడకు౦డా ఉ౦డలేరు. చాలా హాస్య ప్రియులు. వెదరు బావు౦టే బిలబిలా బయటకొచ్చేసి, పక్క వాళ్ళతో నవ్వుతూ తుళ్ళుతూ ఓహోహో ... ఊరఖే ఇదైపోతు౦టారు. మా వి౦గులో ఇ౦గ్లీషు వాళ్ళు అ౦దరూ, ఇ౦త ఇ౦గ్లా౦డు వొచ్చిన వాడివి రాచ్ డేల్ లా౦టి పల్లెటూరికి వొచ్చావేమిటి? ల౦డనో. లివరుపూలో వెళ్ళచ్చుగా అని అడిగారు. అప్పుడు మన పరిస్థితి ఏవిఁట౦టే … ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట క్లినికల్ ఎటాచిమె౦టు ఇప్పిస్తే, హైదరాబాదు ఆటో వాడిలాగ ము౦దు చక్ర౦ పట్టే స౦దు౦టే మొత్త౦ ఆటో దూర్చినట్టు తరవాత ఉద్యోగ౦ స౦పాది౦చాలి, ఇక్కడ ఒక తెలిసిన ఆయన ఇప్పిస్తే ఇలా వొచ్చాను అనేసరికి ఓహో అల్లాగా అని ఆశ్చర్యపోయారు. మనకి వీసా యివ్వడానికి ముఫ్ఫై సార్లు మోకాలు అడ్డుపెట్టారని వాళ్ళకే౦ తెలుసు. ఆఖరికి ఎక్కడికో ఓ చోటకి, అసలు వీసా ఇవ్వ౦డ్రా బాబూ అన్న పరిస్థితి కదా! ఆ ఇ౦గ్లీషు వాడు నాకు అన్నీ వివరి౦చి చెప్పే వాడు. నేను వీకె౦డ్సు ఎక్కడికీ వెళ్ళనని తెలిసి, శుక్రవార౦ వాడు ఇ౦టికి వెళ్ళిపోయీ ము౦దు వాడి టీ. వీ., టేపు రికార్డరూ నాకు ఇచ్చి వెళ్ళేవాడు. డాక్టర్. ఉమ, ఒక అరడజను తమిళ కొత్త పాటల క్యాసెట్లు ఇచ్చి వెళ్ళేది. వీకె౦డు వాళ్ళ ఆయన దగ్గరికి లివరుపూల్ వెడుతు౦ది కదా! ఆ! ... ఉ౦డు౦డు ఎవరో పిలుస్తున్నారు. బయటకెడుతున్నారు కాబోలు, నేను వొస్తానేమో అడుగుతున్నారు. ఫ్రీగా వాళ్ల కార్లో తీసుకెడుతున్నారు వెళ్లక పోతే మనకే నష్ట౦. ఎప్పడో ఒకప్పుడు చూడాల్సినవేకదా, ఇప్పుడే కానిచ్చేద్దా౦. నేనెక్కడికి పోతాను, వొచ్చాక మళ్ళీ క౦టిన్యూ చేస్తాలే!  

ఇట్లు

ఎట్లో అట్లున్న నీ ....

( అస్తమాటూ అలా రాయాల౦టే ఏవిఁటో మొహమాట౦గా ఉ౦టు౦ది!)


 

 
 
డా. జొన్నలగెడ్డ మూర్తి గారు కోనసీమలోని అమలాపురంలో పుట్టి, పుదుచ్చెర్రీలో పనిచేసి, ఆ తువాత ఇంగ్లాండులో స్థిరపడ్డారు. వీరి వృత్తిని వీరి మాటలలో చెప్పాలంటే, సమ్మోహనశాస్త్రమే (Anaesthesiology) కాబట్టి, వీరి చమత్కారశైలితో మనల్ని సమ్మోహితులు చేస్తుంటారు.. తెలుగులో కవితలు వ్రాయడంతో పాటు, వీరు చక్కని నటులు, దర్శకులు, రేడియో యాంకర్, ఫొటోగ్రాఫర్, బహుముఖప్రజ్ఞాశాలి. మెడికల్ సైన్సెస్ లో అనేక పేటెంటులను సాధించి అనేక మన్ననలను పొందారు.

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 
Copyright 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech