సమాజ జీవనం చలనశీలం కలిగినదే అయినా, ఒక్కొక్కప్పుడు నిశ్చలనంగా, స్తబ్ధతతో ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఆ నిశ్చలన స్థితిలా కనిపించే జీవనంలోని కల్లోలాల అంతర్జ్వాలనీ,చలనస్థితినీ పట్టుకోగలిగినరచయిత చైతన్యవంతమైన రచన చేయగలుగుతాడు.
అలాంటి ఆలోచనాశీలి, మేధాసంపన్నుడు, జ్ఞానభాస్కరుడు,
కథాశిల్పమర్మజ్ఞుడు అయినప్పుడు, ఆ రచయిత కలం నుండి ఉత్తమ కథానికలు సాహితీలోకానికి అందుతాయి.అలా ఉత్తమ కథానికల్ని అందిస్తున్న ఎందరో రచయితల్లో ఒక గొప్ప రచయిత అంపశయ్య నవీన్. నవీన్ పేరు సాధించుకున్న అంపశయ్య అనే ప్రిఫెక్స్ నవలాకారుడుగా వారి ప్రథితనీ,
ప్రాచుర్యాన్నీ చెప్పకయే చెప్తోంది!
నవీన్ కథల్లో నేపథ్యం చాలా విలక్షణమైనదీ, విస్తృతమైనదీ కూడా. తెలంగాణా ఆరాట పోరాటాలూ, వాటి పరిణామాలు, ప్రభావాలూ, పర్యవసానాలూ వారి కథల్లో వస్తు శిల్పాల గంగాయమునల మధ్య సరస్వతిలా కథాంతర్గతంగా ప్రవహిస్తూ ఉంటాయి. దీనివలన వాచ్యంకాని, నినాదప్రాయంకాని,
చిక్కనైన, సాంద్రమైన భౌతికవాస్తవాలు చదువరి మేథలో అనేక ఆలోచనల్ని గిరికీలు కొట్టిస్తాయి. ఆ ఆలోచనలే కదా అతన్ని ఉన్నత పథంలోకి పయనింపజేసే ప్రేరకాలు!
’ప్రజలడబ్బు’
కథ ఉంది.
నిరుద్యోగంతో కష్టాల్లో మునిగి తేలుతున్న సోమయ్యకి మిత్రుడు చంద్రయ్య సలహా ఇస్తాడు. అన్నలమని చెప్పుకొని లక్షలు చందాలు వసూల ుచేస్తున్నారంట.
నువ్వు గూడా గా పని చెయ్యి గట్ల కొంతకాలం బతుకు.
పోలీసులు పట్టుకుంటే జైలుకు పో. జైళ్ళ గింత తండైతే బెడ్తరు గద!...అని. సోమయ్య ఆ సలహాని ఆచరణలో పెడతాడు.
పెద్ద బిజినెస్ మేగ్నెట్, దానకర్ణుడూ అవుతాడు.
ఎవరడిగినా లేదనకుండా చందాలిస్తూ ఉంటాడు. ఇప్పుడతని ఫిలాసఫీ
ఈడబ్బనేది ఎవరిదో ఒకరిదని
ఎలాచెబుతాం?
ఇదంతా ప్రజల డబ్బు.
డబ్బెప్పుడూ ఒకరి దగ్గరే ఉండకూడదు. అది ఒకరి దగ్గర నుంచి మరొకరి దగ్గరకు ప్రవహిస్తూ ఉండాలి అని!
ప్రజలంతా అతన్ని సన్మానాలతో సత్కరిస్తున్నారు.పెద్ద పెట్టున చప్పట్లు కొడుతున్నారు. అంటూ కథ ముగుస్తుంది.
ఈజీమని పట్ల ఆకర్షణే కాకుండా,
ఈజీమీన్స్ పట్ల కూడా అది ప్రబలుతోంది. సామాజిక శ్రేయస్సుని కోరి, సిద్దాం నిబద్ధతతో పోరాటం సలుపుతున్న అన్నలకు నకీలీలుగా తయారై, అసలు వారికి ఎసరు పెడుతున్న వైనం, అన్యాయార్జిత విత్తానికి గొప్పదనాన్ని ఆపాదిస్తూ, మిథ్యావితరణని ప్రచారం చేసుకోవడం, ఇవన్నీ సామాజిక అనారోగ్యాన్ని ప్రోదిచేసే చర్యలే. అయితే వీటన్నిటిపట్ల నిరసనని లేక ఆమోదాన్ని రచయిత తానుగా
(కథ ద్వారా) చేయటం లేదు. అతని కంఠస్వరం ఎక్కడో బ్యాక్ గ్రౌండ్ లో ఉంది. చదువరిలో అలోచనల్ని కలిగిస్తుందా ధ్వని. బుచ్చిబాబు అన్నట్టు కళాత్మక వాస్తవికతని చిత్రంచటమే కథా శిల్ప పరమార్థం!
దొమ్మీల్లో ఆందోళనల్లో షాపుల్లో ఎలక్ట్రానిక్ పరికరాలూ,
వస్తువులూ లూటీ చేయడం ఒక భాగం.
అలా దోపిడీ చేసేవారిని దొంగసొత్తు భయం వెంటాడుతూనే ఉంటుంది. మనస్సాక్షి భాధిస్తూనే ఉంటుంది.
చివరికి ఏదో జీవితాశయం నెరవేర్చుకున్నట్టు తెచ్చుకున్న టీవీ సెట్టుని తీసుకుపోయి చెరువులో పారేసి రిలీఫ్ ఫీల్ కావడం గాజు తెర కథలో కనిపిస్తుంది.
క్రికెట్ పిచ్చి కలిగిన కుర్రాడు టీవీ మోజులో పడి దాన్ని సాధించడం, వదిలొంచుకోవడం ప్రధానాంశం.
కాని, కథాంతరంలో కలిమిపైన లేమి భావాలు, కసీ, కోపం, అలజడీ, ఆందోళనల వికృత పరిణామం ఇవన్నీ వలయాలుగా సుడితిరుగుతూ ఉంటాయి.
మనిషి బహిరంతరవర్తనలోని నివురుగప్పిన నిప్పునిచూపటమే ఉత్తమకథా శిల్ప ప్రయోజనం. నవీన్ వంటి ఉత్తమ రచయితల కలానికి ఆ శిల్ప నిర్వహణా నైపుణ్యమే బలం!
పొరపాటు కథలో ఎరుకల ఎల్లిగాడి మీద ఒకదాని తర్వాత ఒకటిగా అన్నీ చెయ్యని నేరాలే మోపబడుతూ ఉంటాయి.అతడు ఆవస్థల పాలవుతూ ఉంటాడు
.కడకు,ఒకరోజు నడిరోడ్డు మీద కాల్చి చంపివేయబడతాడు.ఎందుకు చంపారో,ఎవరుచంపారో తెలీదు.
కొద్ది రోజుల తర్వాత యెల్లయ్యను మారువేషంలో ఉన్న కానిస్టేబుల్ గా పొరపడి మేమే చంపామని, ఈపొరపాటుకు యెల్లయ్య కుటుంబ సభ్యులు మమ్మల్ని క్షమించాలని విప్లవ పార్టీ వాళ్ళిచ్చిన స్టేట్ మెంట్ అని పత్రికలు ప్రచురించాయి అంటూ కథ ముగుస్తుంది.విషయం ధ్వనిమయం చేయబడింది.’మిస్టేక్స్ ఐడెంటిటీ’
పర్యవసానం.కొన్ని సంభవాలకి హేతువుని ఆపాదించుకోగల మేమో గానీ,
కార్యాకారణ సంబంధాల మూలాన్ని తరచుకుంటూ
,తవ్వుకుంటూ పోలేమూ.అలాంటి బతుకులు,కథలూ కూడా అర్థాంతరంగా ముగిసిపోవటంలో ఆశ్చర్యం లేదు!
నవీన్ కథా వస్తువుల్లో వైవిధ్యం చాలా విస్తృతమైంది.’కార్యేషు దాసి’లో సారిక ఎంతో ఆత్మస్థ్తైర్యం కలిగిన స్త్రీ. ఒక శాడిస్ట్ భర్త హింసకు ముక్తాయింపుగా, నేను నా ఆత్మ్గ్గ గౌరవాన్ని కాపాడుకోవడం కోసం వాడినీ,వాడి దేశాన్నీ వదలివచ్చేశాను’
అని నిర్ద్వంద్వంగా చెప్తుంది. పురుషాధిపత్య ధోరణీ, అణచివేతలపై స్త్రీ నిరసన స్పష్టాకృతి పొందిన కథ ఇది.
అలాగే
’అన్నమాటకాదు,ఉన్నమాటే!కథ లో దివ్య
- పక్కనే భార్యని పెట్టుకుని పరాయిస్త్రీ అందాన్ని పొగుడుతూ వుండే భర్తని నిగ్గదీస్తుంది.మీరు ఎందుకంత గింజుకుంటారు?
నాకు ఎంతమందైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉండొచ్చు.కానీ నా భార్యకు మాత్రం చెప్పేస్తుంది.
స్త్రీ పురుష సంబంధాల్లో వస్తున్న మార్పులకి నిదర్శనం ఈ కథ.
తాగుడు వలన అనర్థాన్ని ఎత్తిచూపుతూ మత్తు కథ రాసిన,నవీన్ దానిలో అంతర్లీనంగా మానవీయమైన విలువల రాహిత్యం గురించి చాలా ప్రశ్నలు సంధించారు.
ఈకథ గురించి సుప్రసిద్ద కథాఋషి మనిపల్లె రాజుగారు ఒక్కమాట అన్నారు.
"ఇది ఒఅక కరుణాత్మక గాథగా రచయిత అంతర దృష్టితో మలచబడింది"
అని అక్షర సత్యమైన అభినందన!
జీవితానికీ,మనుషుల విశ్వాసాలకీ సంబంధించిన మంచి కథ.
మరణకాంక్ష
- జీవితేచ్చ అనేది జ్యోతిష్యం మీద నమ్మకం, అపనమ్మకం మీద నడచిన కథ.
చాలా సంక్లిష్టమైన మానవ జీవితాన్ని ఏదో ఒక సిద్దాంతం అనే చట్రంలో బొగించుకోకపోతే తృప్తిగా బతుకలేం. అందుకే ఇన్ని పురస్కారాలు.
. . ఇన్ని యజ్ఞాలు...
ఇన్ని యాగాలు ...అన్నాడు సుదర్శన్ రావు. మిత్రుడు కృపాకర్ రెడ్డి అంటాడు.అవును.
మనిషికి కావాలిసింది పూర్తి సత్యం కాదు.ఆత్మతృప్తి.బహుశ అసలు అబ్సల్యూట్ ట్రూత్ అనేది లేనేలేదేమో.
ఉన్నామనకది తెలియదేమో!
యేదో ఉందనుకొని తృప్తి పడాలి"
అని.
ఏది సత్యం,
ఏది అసత్యం అన్న ఆలోచనల్ని రేకెత్తించి,పాఠకుల మేధకు పదును పెడ్తుందీ కథ.
జీవితాన్ని ఉన్న దున్నట్లు చూడమనీ,నమ్మకం అపనమ్మకం మీద ఎంత చర్చ చేసినా చివరికి వైయక్తికమైన అనిభవాలపట్టికని మాత్రమే తయారు చేసుకుంటామనీ చెప్తున్న మంచికథ ఇది!
వర్తమాన సమాజ జీవనంలోని అస్తవ్యస్త పరిస్థితుల్నీ,సంఘర్షణల్నీ,సంక్లిష్టతనీ చిత్రిస్తున్న కథల్ని మాత్రమే కాక,
మనిషి అంతరంగ చిత్రణనీ సునిశిత పరిశీలనతో వెలర్చారు నవీన్.
శైలీ శిల్పాల దృష్ట్యా నవీన్ కథలు చదివిస్తాయి.అలరిస్తాయి ఆలోచింపచెస్తాయి.గొప్ప కథల ప్రయోజనం అదే మరి!
సమకాలీన సమాజం,సమకాలీన జీవనం రెండూ తన కథారచనకు రెండుచక్రాలుగా కూర్చుకుని పురోగమిస్తున్న అంపశయ్య నవీన్ సాహిత్య ప్రస్థానం చైతన్య వంతమైనది మాత్రమే కాదు.
ఉజ్జ్వలమైనది కూడా!
ఆ ప్రస్థానంలో
’ప్రజల డబ్బు’
వంటి గొప్ప కథలు నిస్సందేహంగా మైలురాళ్ళే!
|