Sujanaranjani
           
  కథా భారతి  
 

 భార్యా అనుకూలవతి శత్రువు
 

 

 

                                                                             రచన: కుంతి

   ప్రియమైన దివ్య, -

ఎంతగానో ప్రిపేరై నీకీ నాలుగు ముక్కలు వ్రాస్తున్నాను. నీవు గెలిచావు. నేను ఓడిపోయాను. నిన్ను ప్రత్యర్థిగా చేసుకొని, నీవు ఆడని నేను ఆడిన ఆటలో నీవు గెలిచావు. నీఔన్నత్యము, ఔదార్యము, కారుణ్యము, మానవత్వము ప్రేమత్వము ఇంతై వటుడింతై అన్నట్లుగా హిమాలయాలను మించగా, నా మూర్ఖత్వము, దౌర్బల్యము, నీచత్వము నన్ను కుంచింపచేస్తూ, గంగ ఆకాశము నుండి నేలకు ఆపై పాతాళానికి దిగినట్లుగా నన్ను పాతాళానికి చేర్చింది. ఔను! నిన్ను ఓడించాలని నేను గెలవాలని అనుకుంటే నీవు గెలిచావు. నేను గెలవాలని నీవు అనుకుంటే నేనోడిపోయాను.

ఏమిటి ఇదంతా? ఏమిటి వ్రాస్తున్నాడు? అర్థము కాలేదు కదూ. మన రెండేళ్ళ సంసారములో నీవు నాకొక తెరచిన పుస్తకము. నేను నీపాలిటి ప్రహేళీక. చిత్రకవిత్వము. నేను పెళ్ళి చూపుల్లో నిన్ను చూడగానే ఒక్కసారిగా నాకు కలిగిన అదృష్టానికి అబ్బురపడ్డాను. ఆతరువాత భయపడ్డాను. నీవి చాలాఅందమైన దానివి. బాగా చదువుకున్న దానివి. ఆస్తిపాస్తులున్న దానివి. ఉన్నతోద్యోగివి. ఉన్నత సంస్కృతీ, సంప్రదాయ కుటుంబం నుండి వచ్చిన దానివి. మరి నేను కురూపిని, పెద్దగా చదువుకోలేదు ఆస్తిపాస్తులు లేవు. కాంట్రాక్ట్ ఉద్యోగిని. నాదొక ఇరుకు ఇల్లు, నావాళ్ళొక కరుకు మనుషులు. నేను నీకు యే రకంగానూ సరిపోను. టోటల్లీ మిస్ మ్యాచ్. పెళ్ళిలో మీ వాళ్ళ అతిధ్యము, స్నేహము మా బంధువుల్లో నిన్ను, నీ కుటుంబ సభ్యులను అంతెత్తున నిలబెట్టింది.

అప్పటి నుండి నాలో, ఇంత ఉన్నతమైన లక్షణాలు గల స్త్రీ నన్ను పెళ్ళి చేసుకోవడమేమిటి? ఇంత ఉన్నతమైన కుటుంబానికి నేను నచ్చడమేమిటి? అన్న సందేహాలు రాసాగాయి. నీవు మా ఇంటికి వచ్చినప్పటి నుండి మా గంపెడు సంసారాన్ని నెత్తిన కెత్తుకొని ఒక వైపు ఆఫీసు పనులు, మరొక వైపు ఇంటి పనులతో సతమత మౌతూనే నాపై అపరిమితమైన అనురాగాన్ని చూపేదానివి. నేను నీతో బాగానే ఉంటున్నప్పటికీ, నా మెదడులో నీ గూర్చి ఆలోచనలు తొలచి వేసేవి.

అప్పుడప్పుడు తీరిక వేళ్ళల్లో మనము చెస్ ఆడేవారము. ఎప్పుడు నేనే గెలిచేవాడిని. నిజానికి నాకు చెస్ అంతగారాదు నేనెందుకు గెలుస్తున్నాను అన్న సందేహం కలిగేది. ఒకసారి నీవు లేనప్పుడు నీ పెట్టెను వెదికాను. అందులో చెస్ లో నీవు పొందిన సర్టిఫికెట్లు కనిపించాయి.

అదేవిధంగా నాకు వెహికిల్ డ్రైవింగ్ రాదు. మనమెక్కడికి వెళ్ళినా నీవు డ్రైవ్ చేస్తే, నీవెనుక నేను కూర్చునేవాడిని.. నీవు, నీకు డ్రైవింగ్ అంతగా తెలియనట్లుగా, నాకు తెలిసినా నీతో డ్రైవింగ్ చేయిస్తున్నట్లుగా మాట్లాడుతూ డ్రైవింగ్ లో మెళకువలు, సలహాలు అడిగేదానివి.

ఇక నీ ఆధ్యాత్మికత జ్ఞాన సౌగంధిక పరిమళము, సాహిత్యము లోకపు లోతైన జ్ఞానము, అనేక భాషల పట్ల నీకున్న పట్టు నన్ను ఉక్కిరి బ్క్కిరి చేసేది. అయితే నాదగ్గర పామరత్వము వహించి ఉండే దానివి. నాకు మాట్లాడడమే చాతకాదు.నీ సంభాషణా చాతుర్యము అమోఘము. ఇక నామొహానికి నవ్వే తెలియదు.’నీవు నవ్వినా యేడ్చినట్లుంటుందని’నన్ను నా మిత్రులు అనేసేవారు. మరి నీ మోములో పండు వెన్నెల వాన. నాలో నేను నాకై బ్రతుకుతాను. నీవు పదిమందితో, పది మందికై బ్రతకగలవు.

అయినా నీకన్న ఎక్కడైనా ఒక మెట్టు ఎక్కువ ఉండాలని తపించే వాడిని. అంతరంతరాలలో అన్ని రంగాలలో నాకంటే ఎత్తుగా ఉండేనిన్ను సహించలేకపోయే వాడిని. నా పురుషాహంకారము, మగడు ఆన్న భావము నీకంటే తక్కువగా ఉండడము సహించకపోయేది.

అన్నట్లు మగడు అంటే గుర్తుకు వచ్చింది.. నాలో నేను ముడుచుకుపోయే గొంగళిపురుగు తనము వల్లనో మరెందు వల్లనో ఆ మధ్య కొన్ని రోజులు పడగ్గదిలో మగాడిని కాలేకపోయాను. అది గమనించి నీవు నాదేమి తప్పు లేదనట్లుగా, నీలో లోపమే దానికి కారణమన్నట్లుగా చెప్పే దానివి. కాని నిజము నాకు తెలుసు.

ఏమిటీ? నాలో ఇన్ని లోపాలున్నా. ఇన్ని తక్కువలున్నా ఈమె ఇలా ఉంటుందేమిటి? అంటే వీటన్నిటికి మించి ఇంకా యేదైనా పెద్ద లోపము ఉందా? పూర్వ వైవాహిక జీవితములో యేదైన పాపము చేసిందా? అసలు ఈమె పెళ్ళికి ముందు కన్య యేనా?.....

ఇలాంటి ఆలోచనలు రాగానే నీగురించి ఆరా తీసాను. నీవు చదివిన కాలేజీలకు వెళ్ళాను.నీ పాత స్నేహితురాళ్ళను కలిసాను. నీలో యే చెడు నడత లేదని తెలుసుకున్నాను. నీవు చేసే ఆఫీసులో నీ ప్రవర్తన గురించి కనుక్కున్నాను.

నిప్పుకు చెదలు అంటదని, నాకళ్ళకు పచ్చ కామెర్లని తెలుసుకున్నాను.

నీ కేమైనా పెద్ద రోగాలు ఉన్నాయేమో, అని దాచుకొని నాతో కాపురము చేస్తున్నావేమోనని పించింది. వేంటనే జనరల్ చెకప్ పేరుతో నిన్ను హాస్పిటల్ కు తీసుకు వెళ్ళాను. డాక్టర్ల డయాగ్నసిస్ లో, నీవు పర్ ఫెక్ట్ లీ ఆల్ రైట్ అని, నేను మెంటల్లీ సిక్ అని తేల్చాయి.

అన్ని రంగాలలో ఎంతో ఎత్తులో ఉన్న నీవు మామూలు గృహిణిలా అత్తా మామలకు, భర్తకుసేవ చేయగలవో, లేదో చూడాలని అనుకున్నాను. ఆమధ్య ఒక సారి కావాలనే మాయరోగము తెచ్చుకొని పడకేసాను. ఇంట్లో వాళ్ళను ఇటు పుల్ల అటు పెట్టవద్దు అని హుంకుం జారీ చేసాను. నీవు నన్ను కంట్లో పెట్టుకొని చూసుకున్నావు. మావాళ్ళను నెత్తిన పెట్టుకొని చూసావు. ఒక వైపు ఉద్యోగము, మరొకవైపు సాహిత్యము, సామాజిక సేవలు చేస్తూనే నన్నూ, నా వాళ్ళను అంతకటే ఎక్కువగా సేవించావు.

నీకు నేను ఆడే నాటకాలన్నీ తెలుసు, తెలిసినట్లుగా ఉండవు. సూత్రధారుడి ఆదేశాలతో పాత్రధారుడిలాగా చేస్తూ పోతావు.

ఒకసారి నాపుట్టిన రోజు సందర్బముగా నీవు మా యీంటిల్లీపాదికి కొత్త బట్టలు తెచ్చావు. నేనవి వెసుకొని ఆఫీసుకు వెళ్ళాను. ’చింపాంజీకి సూట్ తొడిగినట్లుంది’ అని ఒకరు, పెళ్ళాము సంపాదిస్తుంటే కులుకుతున్నాడని మరొకరు... ఇలా తలా ఒకరు తలా ఒక కామెంట్ చేసారు.

ఆ రోజు నీపై చాలా కోపము వచ్చింది నిన్ను యేవిధంగానైనా చంపేయాలని అనిపించింది. కాని ఆ ప్రయత్నాలు చేయలేదు.

ఇంకొక విషయము గుర్తుకు వస్తుంది. ఒకసారి మనము మాఊరికి వెళ్ళాము. అక్కడ చెరువు గట్టు మీద నడుస్తూ, నేనేదో చెబుతూ ఉంటే నీవు ఊకొడుతున్నావు. మాటల్లో నీకు నీళ్ళంటే భయమన్నావు. నీలో మొదటిసారిగా లోటు కనిపించింది. నాలో యేదో తెలియని కసి నిన్ను భయపెట్టాలనికున్నాను. నీ భుజాలు పట్టి నీళ్ళలోకి తోసినట్లుగా చేసి, నీకళ్ళలో భయాన్ని చూడాలనుకొన్నాను. నీళ్ళంటే భయపడని నా అధిక్యతను చూపాలనుకొన్నాను. కానీ విచిత్రము అక్కడ ఉన్న బురదలో కాలు జారి నేను నీళ్ళలో పడిపోయాను. నాకు ఈతరాదు. నీవు వెంటనే చెరువులోకి దూకి, నన్ను ఒడ్డున చేర్చావు. నా అల్పత్వము బయటపడింది. బయటపడినందుకు చచ్చేంత సిగ్గుపడ్డాను... చచ్చినా బాగుండు అనుకున్నాను. ఆతరువాత నీళ్ళంటే భయము కదా అన్నాను. ఔను! కానీ ఈత వచ్చు. చిన్నప్పుడు నేర్చుకున్నాను. అది ఇప్పుడు ఉపయేగపడింది అన్నావు.

ఇలా మన రెండు సంవత్సరాల కాపురములో అనుక్షణము నిన్ను పరీక్షించాను. ప్రతి పరీక్షలో నీవు గెలుస్తూ, నేను ఓడుతూ వచ్చాను. నాయీ భాధ, స్థితి నా మిత్రుడికి చెప్పుకున్నాను. నీభార్య దేవత. ఆమె, మామూలు మనుష్యులకుండే అసూయ, ద్వేషాలు వంటి స్థితిని యేనాడో దాటింది. ఆమె నీకు దేవుడిచ్చిన వరము. ఇక నీవో మూర్ఖుడివి. చేతిలోనున్న బంగారాన్ని మట్టి ముద్ద అనుకుంటున్నావు. నీకున్నది ఆత్మన్యూన్యతా భావము, అనుమాన రోగము. దీనికి తోడు మగాడిని అన్న అహము .ఆమె పైన ఎలాగైనా అధిక్యత కనబరుచుకోవాలనే తపనతో నీవీ పరిస్థితిలోకి వచ్చావు. కొందరి మగాళ్ళకు భార్యా రూపవతి శత్రువు కాని నీ విషయములో భార్యా అనుకూలవతి శత్రువు. నీవు అల్పుడవు. నీగురించి, నీవు చేసిన పనుల గురించి తలుచుకుంటేనే కంపరము పుడుతుంది. వీలైతే నీఆలోచనా విధానన్ని మార్చుకో. యేదైనా ఒక రంగములో బాగా కృషి చేసి, పేరు ప్రఖ్యాతులను సంపాదించుకో. ఆమె కన్న ఎత్తున ఎదుగే ప్రయత్నము చేయి. కాని ఆమె నీకన్నా ఎత్తున ఉండని ఆమె కంఠాన్ని కోసే ప్రయత్నము చేయకు. వెళ్ళు! వెళ్ళి నీ భార్యను మనస్పూర్తిగా ప్రేమించు. ప్రపంచములో యేకొద్ది మందికో లభించే అరుదైన భార్యను పొందావు. మతిహీనుల భాగ్యాన్ని పొంది కూడా, ఆభాగ్యాన్ని ఆస్వాదించలేరు. ఆకోవలోకి నీవువెళ్ళకు అని తెగేసి చెప్పాడు.

ఈ సంఘటనల పరంపరలో నీవు దినదినము మరింత ఎదుగుతూ మహాభారత యుద్దములో అర్జునుడికి దేదీప్యమానంగా విశ్వ రూప సందర్శనమిచ్చిన శ్రీ కృష్ణుడిలా, బలిని మూడు అడుగులు కోరి ముల్లోకాలను దర్శింప చేసిన వామనుడిలా కనిపించసాగావు.

నేను నున్ను జయించాలన్న తపనలో నీచమైన ఎత్తుగడలనే పాకుడు రాళ్ళను పట్టుకొని ఎగబాకాలని ప్రయత్నిస్తూ, అంతకంతకు దిగ జారిపోయాను. నేత్ర రోగి దీపము చూడలేనట్లు నేను నీ ప్రాభవాన్ని చూడలేకపోయాను.

పురాణాలలో, ఇతిహాసాలలో మహా మునుల కోపాగ్నికి శపించబడి, రాక్షస కృత్యాలు చేస్తున్న కొందరిలో, పూర్వ జ్ఞానము ఉండి, తాము చేసేది తప్పు అని తెలిసి ఉన్నట్లుగా, నేనిన్ని చేస్తున్నా నాలోని నాకు ఇవన్ని తప్పులను తెలుస్తునే ఉన్నాయి. నన్ను అను నిత్యము సచేతన పరుస్తునే ఉన్నాయి.

నాకొక విషయం అర్థమైంది. నీవు దేవతవు. నీకు చెడు తెలియదు. నీవు ప్రేమించగలవు క్షమించగలవు. నేను అల్పుడిని అసమర్థుడిని. ఈ స్థితిలో నీతో కలిసి, బ్రతకలేను. విడాకులు తీసుకుందామా అంటే యే దోషము నీపై ఆ రోపించాలి. ఒకవేళ విడాకులు కావాలంటే, నీ పై దోషాలు ఆరోపించుకోని, నేను కోరిన విధంగా నాకు దూరంగా ఉండగలవు.పోనీ వదిలి వేసి దూరంగా ఉందామా అంటే నాకై జీవితాంతము ఎదురు చూస్తూ ఉండాగలవు.

ఎట్లాచచ్చేది
ఔను ఎట్లాచచ్చేది?

పరిష్కారము కాదు. నేను చనిపోయినా, నాకుటుంబానికి సేవ చేస్తూ జీవితము గడిపేస్తావు. కాని తప్పదు. అందుకే భర్తగా శాసిస్తున్నాను. నీవు నేను చనిపోయిన తరువాత మా ఇంటికి దురంగా వెళ్ళిపో. సర్ నేమ్ మార్చుకో, గోత్రము త్రెంచివేయి. కొత్త జీవితము ప్రారంభించు. ఈ కాంప్లెక్స్ సైకాలజీ రోగిని క్షమించు.

నాకు తెలుసు పరువనేది కసాయి కొట్టులోని కత్తిని సహితము బంగారముగా మార్చినట్లు, నీవు ఎవరినైనా క్షమించగలవు. కన్ఫూషియన్ తేలు కధలో, నేను నీవు కన్ఫూషియసువు. క్షమిస్తావని ఆశిస్తూ_.....

నీభర్త
సుమన్
--------------------------------------------
లోనంగా ఉత్తరము వ్రాయడము అయిపోవడముతో కలము ప్రక్కన పెట్టి కుర్చీలో వెనక్కి వ్రాలాడు మృదువైన చేతులు తగిలాయి. వెనక్కి తిరిగి చూసాడు.

కళ్ళలో నీళ్ళు ఆపుకుంటూ, ఎంతో సేపటి నుండి అక్కడ నిలబడి ఉన్నట్లుగా ఉంది.
అంతా చూసావా అన్నట్లుగా చూసాడు.
ఔనూ! అన్నట్లుగా తలూపింది.
కుర్చీలోనుండి లేచి వేళ్ళి, ఆమె భుజాల చుట్టు చేతులు వేసి దగ్గరకి తీసుకున్నాడు.
ఆమె అతడిపై వాలి...... పోయింది.

ఈ దేశము లో నీ లాంటి భార్యలెవ్వరు తమ భర్తల దిగులు తో కుమిలిపోవడము తట్టుకోలేరు. నేను చనిపొయి నిన్ను గెలిపించాలనుకున్నాను. నీవు చనిపోయి నన్ను ఓడించావు. ఔను! మళ్ళీ నేనే ఒడిపోయాను అనుకున్నాడు. 

 

 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 
సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech