బైరాగి
వైరాగ్యం వచ్చినవాణ్ణి బైరాగి అంటారు.
వైరాగ్యమంటే రాగరహితులు కావడమే. రాగమనేది
ఒక విధంగా ఆసక్తి అని చెప్పవచ్చు. ఆ ఆసక్తి
నశించడమే వైరాగ్యము. ఆసక్తి అనేది
సాధారణంగా బ్రహ్మజిజ్జ్ఞాసలో కలుగుతుంది.
బ్రహ్మ అంటే ఈ లోకాన్ని మరియు లోకులను
సృష్టించినవాడు. ఆ సృష్టికర్త ఎవడు మరియు
ఎలా ఉంటాడు అని తెలుసుకోవడమే బ్రహ్మ
జిజ్ఞాస. తెలుసుకోవాలనే కోరికనే మనము
జిజ్ఞాస అని అంటాము..
ఈ నెల చర్చలో భాగంగా మనము బైరాగి గూర్చి
తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము.
కొంతమంది ఇతరులకోసము శ్రమించినట్లు తమ
కోసము, తమ కుటుంబము కోసము మరియు తన
వారికోసము శ్రమించరు. ఇది కూడ వైరాగ్యము
లెక్కలోనికే వస్తుంది. మరికొంతమంది
దేనిపైనా మక్కువ పెంచుకోకుండ సమయాన్ని
గడపడానికి ప్రయత్నిస్తారు. కొందరు ఇల్లు
వదిలిపెడితే కొందరు బట్టలు వదిలినవారు,
కొందరు క్షవరమును వదిలినవారు, కొందరు
కాషాయము ధరించినవారు, కొందరు కాషాయముతో
బాటు దండమును ధరించినవారు ఇలా రాగాతీతుల
వేషములు మరియు రూపములను అనేకములుగ మనము
చూస్తున్నాము.
ఈ విధంగా మనిషి బ్రహ్మాన్వేషణ చేయడానికి,
మనిషి సన్యసించడానికి, మనిషి
నిర్లిప్తభావన కలిగి ఉండడానికి కారణము
గ్రహప్రభావమే. గ్రహములు అందరినీ
ప్రభావితులను చేసినా ఆ ప్రభావము అందరిమీద
ఒకే రకముగా ఉండదని మనకు తెలిసిన విషయమే.
ఏదో ఒక గ్రహము మిగిలిన వానికన్నా
ప్రభావశాలి అయినపుడు మనిషి ఆ గ్రహ
స్వభావానుకూలముగ వ్యవహరిస్తాడు. అదే అన్ని
గ్రహములు ఇంచుమించు ఒకే బలమును కలిగి
ఉన్నప్పుడు ఏ గ్రహప్రభావమును పూర్తిగా
పొందని ఆ జాతకుడు సన్యస్తభావమును కలగడం
సర్వసాధారణవిషయము. ఇదే విషయాన్ని జ్యోతిష
గ్రంధములు వక్కాణిస్తున్నాయి. అన్ని
ఫలితజ్యోతిష గ్రంధములలోను ప్రవ్రజ్య అను
యోగము వర్ణించబడియున్నది ప్రవ్రజ్య అనే
దానికి సన్న్యాసము అని అర్థము.
ఏకస్థైశ్చతురాదిభిర్బలయుతైర్జాతాః
పృథగ్వీర్యగైః
శాక్యాజీవికభిక్షువృద్ధచరకా
నిర్గ్రన్ధవన్యాశనా
మాహేయజ్ఞగురుక్షపాకరసితప్రాభీకరీనైః
క్రమాత్
ప్రవ్రజ్యా బలిభిః సమాః
పరజితైస్తత్స్వామిభిః ప్రచ్యుతిః
బృహజ్జాతకములోని ప్రవ్రజ్యాయోగాధ్యాయములో
మొదటి శ్లోకము ఇది. ఈ ఒక్క శ్లోకము ఈ యోగము
యొక్క స్వరూపమును పూర్తిగ విశ్లేషించు
సత్తాను కలిగిఉంది.
సన్న్యాసయోగము
బలయుక్తులైన నాలుగు లేక అంతకన్న ఎక్కువ
గ్రహములు ఒకచోట ఉన్నప్పుడు ప్రవ్రజ్యా
యోగము ఏర్పడుతుంది. ఆ నాలుగు లేక అంతకన్న
ఎక్కువ గ్రహములలో మిగిలిన వారిని
ప్రభావితము చేయగల స్థితిలో కుజుడు ఉన్నచో
జాతకుడు రక్తవస్త్రమును ధరించు సన్యాసి
అగును. బుధుడు బలవంతుడైన ఒక దండమును
ధరించువాడు(ఏకదండి) అగును. గురువు
బలవంతుడయనేని భిక్షువు అగును. చందృనివలన
కాపాలికుడు, శుకృనివలన చక్రధరుడు, శని వలన
దిగంబరుడు, సూర్యుని వలన వనములయందు
కందమూలాదులను భుజించుచు కాలము గడుపువాడు
అగును.
సన్న్యస్తస్వరూపములో
మార్పు
నాలుగు మొదలగు ఆ గ్రహములలో ఎన్ని గ్రహములు
బలమును అధికముగ కలిగి ఉన్నవో అన్ని రకముల
సన్న్యాసి జాతకుడు అవగలడు. ఆ బలయుతములైన
గ్రహములలో అధిక బలము గలిగిన గ్రహమునకు
సంబంధించిన ప్రవ్రజ్య యోగము మొదట గలుగును.
ఆ తదుపరి క్రమముగ మిగిలిన గ్రహముల
స్వరూపమును మనిషి పొందు అవకాశమున్నది.
సన్న్యాసత్యాగము
ఏ గ్రహమువలనైతే మనిషికి సన్న్యసించే
అవకాశము లభిస్తోందో ఆ గ్రహము వేరే గ్రహము
చేత గ్రహయుద్ధములో ఓటమి పాలైనచో జాతకుడు
మొదట సన్న్యాసమును గ్రహించి కొంతకాలము
తదుపరి ఆ సన్న్యాసమును విడుచు అవకాశమున్నది.
సన్న్యస్తభక్తి
ఉన్ననూ సన్న్యసించలేకపోవుట
సన్న్యాసమును ఇచ్చు గ్రహము
సూర్యకిరణప్రభావముచే అస్తంగతమైనచో ఆ
వ్యక్తి సన్న్యాసమునందు నిశ్చలభక్తి
గలవాడైననూ సన్న్యసించలేడు. దీక్షాపరుడు
కాలేడు. అదే గ్రహము మిగిలిన గ్రహములచే
ఓటమిని పొందినచో గురువు ఆశ్రమములో ఉంటూనే
గురువు వద్ద దీక్షను పొందలేడు.
నాలుగు లేక ఎక్కువ
కలిస్తేనే సన్న్యాసా?
నాలుగు లేక ఎక్కువ గ్రహములు కలిస్తే
సన్న్యాసని తెలుసుకున్నాము. కానీ గ్రహములు
ఒక చోట కలిసి లేకపోయినను పరిపూర్ణ
సన్న్యస్తయోగములు కలిగే అవకాశములు
లేకపోలేదు. జన్మరాశ్యాధిపతి ఏ గ్రహము
యొక్క దృష్టిని కలిగి ఉండక శనిని చూచినచో
సన్న్యాసమును స్వీకరించు అవకాశమున్నది. ఈ
సందర్భములో శని ప్రభావముచే కలుగు
సన్న్యాసము కలుగును. శని మరియు
జన్మరాశ్యధిపతుల దశ మరియు అంతర్దశా కాలములో
జాతకుడు సన్న్యాసమును గ్రహించే అవకాశము
ఏర్పడుతుంది. అదే విధముగ బలహీనుడైన
జన్మరాశ్యధిపతిని శని చూచిననూ, శనికుజుల
ద్రేష్కాణము లేక నవాంశలలో ఉన్న చందృని శని
చూచిననూ జాతకుడు సన్న్యాసము స్వీకరించే
అవకాశమున్నది.
లాభమేమి?
ఈ యోగములను మనము చర్చించుకోవడము
వలన మనకు ఏర్పడు లాభమేమిటి అని
ప్రశ్నించుకునే సమయము వచ్చింది. రాబోయే
కాలములో వైరాగ్యమును పొందబోవు వ్యక్తి
వివాహమాడిన, సన్న్యాసయోగములేని వ్యక్తి
సన్న్యసించదలచి సర్వస్వమును విడచిన పిదమ
మరల తన పూర్వవైభవమును కోరుకున్న, తమ
సంతానము (కుమారుడు లేక కుమార్తె)
విరక్తభావమును కలిగి ఇంటనే ఉన్నప్పుడు ఏమీ
చేయలేని స్థితిలో తల్లిదండ్రులు
ఉన్నసందర్భములలో మనకు ఈ యోగములు చాలా వరకు
ఉపయోగిస్తాయి. గ్రహకృతములైన యోగములు లేక
అవయోగములను గుర్తించడము రోగిలోని రోగమును
గుర్తించడము వంటిది. రోగపీడితుడు వైద్యము
దొరకనపుడు ఆ రోగకారణమున ఏ విధముగానైతే
కష్టపడతాడో అదే విధముగ గ్రహపీడితుడు
కష్టపడతాడు.
నిదానము లేని వైద్యము ఎలానైతే నిరుపయుక్తమో
నివారణలేని ఫలాదేశము కూడ అటువంటిదే. ఇది
కేవలము ఫలమును తెలుసుకోవడానికి మాత్రమే
ఉపకరిస్తుందనుకుంటే పొరబాటే.
గ్రహకృతఫలములను గుర్తించుట శుభఫలములను
పెంచుటకు మరియు పాపఫలములను తృంచుటకు
మాత్రమే. అలా కానినాడు ఈ చర్చ నిరర్థకమే.
ఋషి పరంపర అర్థరహితమే.
సశేషము…….
|