Sujanaranjani
           
  శీర్షికలు  
  ఎందరో మహానుభావులు

కళా పోషకుడూ - కళాకారుడూ..జగన్మోహనుడూ...శ్రీశ్రీశ్రీ ఆనందగజపతి మహారాజ! (1850-1897)

 

 

 - రచన : తనికెళ్ళ భరణి    

 

శ్రీ కృష్ణదేవరాయల పేరు ఎత్తగానే మనకి అష్టదిగ్గజాలు గుర్తొచ్చి ప్రబంధ పరిమళాల్తో మనసంతా హాయి అనిపిస్తుంది...

అలాగే భోజమహారాజు పేరెత్తగానే...కవికుల గురువు కాళిదాసు స్పురణకొచ్చీ... ఉజ్జయినీ నగరంలోని మహాకాళేశ్వరుడి మందిరంలో ఊదిన శంఖధ్వని...గుండెల్లో ప్రతిధ్వనిస్తుంది.

అలాగే ప్రభువులకీ- కళాకారులకీ విడదీయలేని అనుబంధం. ఆ అనుబధాన్ని... అందమైన మైత్రిగా మల్చుకున్న ప్రాతఃస్మరణీయుడు ఆనంద గజపతి మహారాజా...

ఆపందిరిని ఆసరా చేసుకొని ఎన్ని మల్లెలు - మొల్లలు,సంపెంగలు...సన్నజాజులు తమ కళాసౌరభాన్ని అన్ని దిశలా విస్తరింపజేసాయో...

డ్యూక్ ఆఫ్ బంకింగ్ హామ్ వంటి పాశ్చాత్యుల చేత ప్రిన్స్ చార్మింగ్ (జగన్మోహనుడు)గా పేరొందినవాడు ఆనంద జగపతి...

అసలా పేరులో లాలిత్యంతో కూడిన గాంభీర్యం కనిపిస్తుంది

గురజాడ అప్పారవుగారన్నట్లు He is a great scholar who has attracted to his court literary stars of the first magnitude. నిజంగా అతిశయోక్తి కాదు గానీ... అరవై నాలుగు కళల్లో ఏ కళలో ప్రావీణ్యం ఉన్నా సరే ఆనందగజపతుల వారి ఆస్ఠానంలో బతుకంతా హాయిగా గడిచిపోయేది. అంతటి రసికుడాయన...

ఇటు కర్ణాటక సంగీతంతో బాటు - అటు హిందుస్థానీ సంగీతం మీద కూడా మోజు పెంచుకునీ...

వీణవెంకట రమణదాసు, దూర్వాసుల సోమయాజులు వంటి వారితో పాటు... ఉస్తాద్ మహబత్ ఖాన్ - ఉస్తాద్ నిషావల్లీ అబీదుల్లా - మనవ్వర్ ఖాన్ లను ఆస్ఠాన విద్వాంసులుగా ఆదరించాడు...

ఇక ఆయన స్వయంగా... వీణ,సితార్ వాయించడంలో ప్రవీణులు...తెలుగులో ఎన్నోజావళీలు, స్వరజతులు, తానవర్ణాలు రాశారు. దృపద్ ఖయాల్, తిల్లానా వంటి వాటిల్లో ఆనందగజపతి ప్రతిభ అమోఘం! ఆనంద గజపతి గారి పత్ని శ్రీమతి వనకుమారీదేవి పేరున తచ్చూరి సింగరాచార్య సోదరులు రాసిన రచనలని రాజావారే ముద్రింపించారు.అలాగే పూనా గాయక సమాజ్ శాఖకు...

అప్పట్లో ఆరువేల రూపాయలు బహుమానంగా ఇచ్చారు.

ముందే చెప్పినట్లు ఈ జగన్మోహనుడి రూపం చూసే వాళ్ళందర్నీ కట్టిపడేసేది...అందువల్ల వొచ్చిన చిరు అహంకారం ఆనందగజపతుల వారికి అలంకారంగా భాసించేది.

ఆ కాలంలో రాజనర్తకీమణులూ. దేవాలయాల్లో దేవదాసీలుగా జీవిస్తున్న వారి మీద రాజా వారికి సానుభూతి ఉందేది.

అంచేత వేశ్యావృత్తికి తిలోదకాలిచ్చీ... ఆత్మ గౌరవాన్ని కలిగించే లలిత కళల్ని నేర్చుకోమని ఎంతో మందిని ప్రోత్సహించారు.  

అందులో చాలా మంది మహారాజా గారి సలహా పాటించి లలిత కళల్లో నిష్ణాతులై... అటు డబ్బూ ... ఇటు కీర్తి కూడా సంపాదించి తమ మార్గనిర్దేశకుడైన ఆనందగజపతి వారి ఫోటోకి దీపం పెట్టుకుంటూ బతికారు.

ఆనంద గజపతుల వారి వారసులు నిర్మించిన విజయనగరం సంగీత కళాశాలకి ఓ చరిత్ర ఉంది... అందేంటంటే...

రాజా వారి అంతరంగిక కార్యదర్శి చాగంటి జోగారావు. రాజావారు, జోగారావు గారు...

సాయంత్రాల పూట వ్యాహ్యాళికి బయలుదేరి పిచ్చాపాటి మాట్లాడుకుంటున్న సందర్బంలో జోగారావుగారు మీఅబ్బాయేంచేస్తున్నాడయ్యా?

"......"

జోగారావుగారు మిమ్మల్నే....

కళ్లనిండా నీళ్లు కుక్కుకున్నాడు జోగారావుగారు.

అదేమిటండీ.... ఏవయిందీ...

వాడు పుట్టుగుడ్డి బాబు... ఏమి చేయలేని అసమర్థుడు.

రాజావారి కడుపులో చేయ్యెట్టి దేవినట్టయింది

చాలానొచ్చుకున్నారు...

ఓపన్జేస్తే...మీవాడికి సంగీతమేమన్నా నేర్పిస్తే

నేర్పిస్తే ఏదో కాలక్షేపంగా ఉండొచ్చు... నసిగారు జోగారావు గారు....

కాలజ్షేపం కాదండి జీవనభృతి... అపారమైన కీర్తినూ...

సరే వెంటనే... ఫలానాచోట ... సంగీత కళాశాల నిర్మిద్దాం...

మా ఒక్క కుర్రాడి కోసం-కళాశాలా...

ఏమోనండీ ఏది ఎలా జరగాలో అలాగేజరుగుతుందీ.. ఈవిజయనగరం సంగీత కళాశాలకి మి వాడి వల్ల బీజం పడాలని రాసివుందీ... జరిగిందీ...!

అంతే చాగంటి జోగారావుగారు పాదాల మీద పడిపోయారు. రాజా వారు అతణ్ణి లేపి అక్కున చేర్చుకుంటూ... ఇది నా అదృష్టమండీ...మీ పిల్లవాడికి కళ్లు లేక పోవడం వల్ల నాకు ఈకోణంలో కళ్లు తెరచుకున్నాయ్...

అక్కణ్ణించీ.... ఆంధ్రప్రదేశమంతా ఓ వేలుగు వెలిగింది. విజయనగరం సంగీత కళాశాల... వందమంది సంగీతకారులు అందులోంచి వచ్చారు. శ్రీ ఆది భట్ల నారాయణదాసుగారు... ద్వారం వెంకటస్వామి నాయుడు గారు... ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ... ఎస్.జానకి...ఎన్నో వేలమంది...

ఆనందగజపతి మహారాజావారి విద్యా వైదుష్యాల గురించి పుంభావ సరస్వతి భట్ల నారాయణ దాసు గారిలా రాశారు. రాజావారి ఆస్థానంలో ఒకడు రోజు రోజంతా సభ దద్దరిల్లి పోయేలా రాగాలాపన చేస్తాడు. మరొకడు ఫిడేలు మీద విచిత్ర వర్ణాలు వాయిస్తాడు... ఒకడు మృదంగం మీద ఇంద్ర ధనస్సుల్ని సృష్టిస్తాడు...మరొకడు వీణ మీద రాగంతో పాటు సువాసనలు కూడా పుట్టిస్తాడు... ఒకరు కవిత్వం,ఒకరు సాముగరిడీ,మరొకరు రుద్రవీణ.మరొకరు రుద్ర తాడవం....ఇన్నెందుకూ... ఆనందగజపతుల వారి సభ ముందు.. ఇంద్రసభ దిగదుడుపు...

ఆనందగజపతీంద్రుని

కే నరులున్ సాటిగాంచ రీవిన్, ఠీవిన్

గానకవిత ప్రవీణత

ధీ.నయ బలరూప సంగతిన్, పితృభక్తిన్.

ఎన్నో రచనలు చేసిన ఆనంద గజపతి మహారాజా వారి ఒకే ఒక తాన వర్ణం మాత్రం లభ్యమయింది.... తానా వర్ణానికున్న లక్షణాన్ని బట్టి- సాహిత్యానికి చాలా ప్రాధాన్యం గానూ...రాగాన్ని తానయుతంగా పాడుకోడానికి వీలుంటుంది!..

ధన్యాసి రాగం-ఖండజాతి ఆదితాళంలో అమ్మవారి మీద సంస్కృతంలో రాసిన - దేవిత్వం యదధిరనుపశ్యతి

చరణం మాత్రం కైవల్యదాయినీ అన్న ఏకపద వాక్యం.

తన సంస్థానాన్ని మరో భువన విజయం లా తయారు చేసిన ఆనందగజపతి... ..ఆంధ్ర ప్రజలకి ఆచంద్రతారార్కంగా గుర్తుండిపోతారు.


 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     
     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech