Sujanaranjani
           
  శీర్షికలు  
  దేవుడున్నాడా? ఓ చర్చా వేదిక - 12
 

 - రచన: ముత్తేవి రవీంద్రనాథ్

 
 

దేవుడున్నాడని నిరూపించే ఉద్దేశ్యంతో వివిధ భావవాద సిద్ధాంతాలు ప్రతిపాదించిన మరికొందరు పాశ్చాత్య  తాత్త్వికుల సిద్ధాంతాలు కూడా  ఏమేరకు శాస్త్రీయమైనవో ఇప్పుడు  పరిశీలిద్దాం.

భౌతిక  వస్తువులనన్నింటినీ కేవలం భగవంతుడు లేక ప్రత్యగాత్మల మనస్సులలోని భావనల స్థాయికి దిగజార్చిన బర్కిలీ  యొక్క స్వీయాత్మక భావవాదం, బలమైన తాత్త్విక పునాదిపై నిర్మితం కాని కారణంగా  ఒక ఆమోద యోగ్యమైన, సంతృప్తికరమైన సిద్ధాంతంగా మనలేకపోవడం మనం గమనించాం. 

ఆధునిక పాశ్చాత్య తత్త్వశాస్త్రానికి పితామహుడనదగిన రెనే డేకార్ట్(Rene Descartes-1596-1650)

అనే ఫ్రెంచి తత్త్వవేత్త మరియు గణిత శాస్త్రజ్ఞుడి దైవ సిద్ధాంతం గురించి కూడా మనం కొంత  చెప్పుకోవాలి. ఈయన బర్కిలీ కంటే దాదాపు వందేళ్ళ ముందరి కాలానికి చెందినవాడు. ఈయనకి హేతువాద పితామహుడని(Father of Rationalism) కూడా పేరు. గణిత  శాస్త్రజ్ఞుడిగా ఈయన ఎనలిటికల్ లేక  కో-ఆర్డినేట్ జామెట్రీని  కనిపెట్టాడు. ఆయన పేరిటే దాన్ని కార్టీజియన్ మాథమాటిక్స్ (Cartesian Mathematics) అంటున్నారు. ఈయన రచించిన 'మెడిటేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఫిలాసఫీ' అన్న గ్రంథం నేటికీ విశ్వవిద్యాలయ స్థాయిలో తత్త్వశాస్త్ర విద్యార్థులకు టెక్స్ట్ బుక్ గా ఉండడం విశేషం.ఈయన తన 'Discourses on Method' లో ఒక గణిత శాస్త్రజ్ఞుడిగా తన శక్తియుక్తులన్నీ వినియోగించి దేవుడున్నాడని నిరూపించపూనుకున్నాడు.ఆయన తత్త్వ  విచారణలో ఓ సరికొత్త మార్గాన్ని అనుసరించాడు.అదేమిటో క్లుప్తంగా చూద్దాం.

 గణిత శాస్త్రం లోని' 2+2=4', '2x2=4' వంటి ప్రాథమిక సూత్రాలవలె తత్త్వశాస్త్ర సత్యాలను కూడా ఎవ్వరూ కాదనలేని విధంగా(Axiomatic గా) తయారు చెయ్యడమే ఆయన లక్ష్యం.'నేనున్నానా?','ఈ ప్రపంచం వాస్తవమైనదేనా?',

'భగవంతుడున్నాడా?','ఈ ప్రపంచాన్ని గురించి ఏమైనా తెలుసుకోవడం సాధ్యమేనా?','అయితే ఎలా?' మొదలైన ప్రశ్నలు అన్నింటికీ సమాధానాలు వెదికాడాయన.ముందుగా తనను తాను 'నేను సత్యమేనా?' అని ప్రశ్నించుకున్నాడు. ఈ శంకలు  ఎవరికి వస్తున్నాయి? నా మనస్సుతో నేను ఆలోచిస్తున్నాను కనుకనే నాకు ఈ అనుమానాలన్నీ వస్తున్నాయి. కనుక నేను అనుమానిస్తున్నదీ, ఆలోచిస్తున్నదీ వాస్తవం.నేనే అస్తిత్వంలో లేకుండా ఉంటే అసలు  ఆలోచించడం ఎలా సాధ్యం? కనుక నేను ఆలోచించడం ఎంత సత్యమో నేను ఉండడం కూడా అంతే సత్యం. 'Cogito,ergo sum' (Latin phrase meaning ' I think - therefore I am').'నేను  ఆలోచిస్తున్నాను;కనుక నేను ఉన్నాను' అనే నిర్ధారణకు వచ్చాడు.

ఒకాయన  ఒక ఎర్ర రంగు గుండ్రని మైనపు బిళ్ళను తీసుకున్నాడు.ఒక అంగుళం మందంలో నున్నగా మెరుస్తూ ఉందది.తాకితే చల్లగా ఉంది.ఆ మైనపు బిళ్ళ భౌతిక లక్షణాలు: ఎర్రని రంగు,గుండ్రగా ఉండడం,ఘన పదార్థంగా ఉండడం,అంగుళం మందం కలిగి ఉండడం,దాని ఉపరితలం నున్నగా ఉండడం,అది మెరుస్తూ ఉండడం,తాకితే చల్లగా ఉండడం మొదలైనవి.

ఆ తరువాత అతడు  ఆ మైనపు బిళ్ళను ఒక గిన్నెలో వేసి పొయ్యి మీద వేడిచేశాడు.అది కరిగి వేడి  ద్రవ పదార్ధంగా  తయారైంది.దాని మునుపటి  ఎర్రటి రంగు కోల్పోయింది.దాని గుండ్రనితనం, నునుపు,మెరుపు గల ఉపరితలం,అంగుళం మందం కల దాని ఘన స్వరూపం,స్పృశిస్తే చల్లగా ఉండే స్వభావం -- ఇవన్నీ కోల్పోయింది ఆ  మైనపు బిళ్ళ.అది కరిగిపోయి ఆ గిన్నెలో ద్రవరూపంలో ఉన్నప్పటికీ ఆ ద్రవం మైనపు ద్రవమేననే విషయం మన మనస్సుకు మాత్రమే తెలుసు.మన జ్ఞానేంద్రియాలు ఆ గిన్నెలో ఉన్న ద్రవం ఏమిటో చెప్పలేవు.కానీ మన మనస్సు చెప్పగలదు.కనుక ఇంద్రియాల కారణంగా చేకూరే జ్ఞానం లోప భూయిష్టమైనది. ప్రత్యేకించి ఆత్మలు, భగవంతుడు మొదలైన విషయాలలో ఇంద్రియ జ్ఞానం మనకు అక్కరకు రాదు.అది మనం ఆదారపడదగినంత సత్యమూ కాదు.ఆ విషయాలలో మనస్సు, హేతు తత్త్వం మాత్రమే నిజ నిర్ధారణలో మనకు తోడ్పడతాయి.మైనం బిళ్ళ ఉదాహరణ మూలంగా ఆకృత ి(Extension) కలిగిన భౌతిక పదార్థాలు నిత్య సత్యాలు కాదని , వాటికంటే ఎటువంటి ఆకృతి లేనట్టి మనస్సు(ఆత్మ) నిత్యమైనది, నికరమైనదీ కనుక ఆదారపడదగినదనీ తేలుతుంది.మన జ్ఞానేంద్రియాలు  కేవలం రూపం, ఆకృతి కలిగిన విషయాలను మాత్రమే అనుభూతి చెందుతాయి.కాని ఎలాంటి ఆకృతి, రూపం లేనట్టి  మనస్సు మాత్రమే  అన్ని సత్యాలనూ  అనుభూతితో తెలుసుకోగలదు.

ఈ నిర్ధారణతో ముందుకు సాగిన డేకార్ట్  తన మనస్సులోని 'దైవ భావన' గురించి తర్కించాడు.తాను ఆలోచిస్తున్నాడు  కాబట్టి తన ఉనికి సత్యం.ఆలోచించే తన మనస్సు కూడా సత్యమే.ఈ మనస్సులో పలు భావాలు ఉంటాయి.

అలాంటి భావాలలో' దైవ భావం' ఒకటి.ఈ భావనను  ఎవరు కల్పించారు? ప్రతిదానికీ ఒక సృష్టికర్త లేక కారణం ఉండాలిగదా?  మరి ఈ దైవ భావనకి  కారణం (Cause) ఎవరు? విశ్వంలో ఎక్కడచూసినా కార్యం(Effect) కంటే కారణం(Cause) ఎప్పుడూ గొప్పదిగా ఉండడాన్ని మనం గమనించవచ్చు.

ఉదాహరణకు సూర్యుడిని  గురించిన మన మనస్సులోని భావన.సూర్యుడిని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. వేడిని, వెలుతురును   నేరుగా అనుభవిస్తున్నాం. కనుకనే సూర్యుడిని గురించిన భావన మనస్సులో ఏర్పరచుకున్నాం.ఈ భావనకు కారణం(Cause )  సూర్యుడేననీ, ఆ భావం కంటే వాస్తవ సూర్యుడు మరింత  శక్తిమంతుడనీ మనకు తెలుసు.సూర్యుడు ఇంద్రియ గోచరుడు. ఇక నా  మనస్సులోని దైవభావన విషయానికొద్దాం. భగవంతుడు ఇంద్రియ గోచరుడు కాడు. మరి భగవంతుడిని గురించిన   ఈ భావన  నా మనస్సులోకి ఎక్కడినుంచి వచ్చింది?నిస్సందేహంగా దీనికి సృష్టికర్తను నేనైతే కాదు.ఒక పరిమితాత్మ (Limited Self) అయినట్టి డేకార్ట్ పరమాత్మ భావనకు సృష్టికర్త ఎలా అవుతాడు?నాలాగే పరిమితాత్మలు అయినట్టి ఏ ఇతర మానవుడూ ఈ దైవ భావనకు సృష్టికర్త కాడు. కార్యం  ఉన్నప్పుడు దానికో  కారణం  ఉండితీరాలి. ఆ కారణం కార్యం కంటే శక్తిమంతంగానూ  ఉండాలి గదా? కనుక నా మనస్సులోని ఈ దైవ భావన (Idea of God)  ను సృష్టించింది నేనుగానీ వేరొక  మానవుడుగానీ కాదనేదీ , దాన్ని నాలో కల్పించింది ఆ భగవంతుడు తప్ప వేరొకరు కాదనేది స్పష్టం.కాబట్టి నా మదిలోని  దైవ భావన అనే కార్యం (Effect)ఉన్నప్పుడు ఆ భావానికి కారణం(Cause) అయినట్టి భగవంతుడు ఉన్నట్లేగా? ఇదీ డేకార్ట్ దైవ సిద్ధాంతం టూకీగా.

చదివేవారందరికీ  ఈ వాదన చాలా సమంజసంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే డేకార్ట్ సిద్ధాంతంలోని కొన్ని తార్కిక లోపాల కారణంగా అదికూడా అశాస్త్రీయమైన సిద్ధాంతంగానే  మిగిలిపోయింది.

కార్యం కంటే కారణం శక్తిమంతమైనది కావడం జీవ  ప్రపంచంలో  దాదాపు సహజమైన విషయం. అక్కడైనా  అదేమీ సార్వత్రిక నియమం కాదు. తల్లిదండ్రుల కంటే బలమైన, తెలివైన,బుద్దిమంతులైన సంతానం కలగడం కూడా లోకంలో ఉంది.పుట్టినప్పుడు ఈ తెలివి,బలం, బుద్ధి వగైరాలు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ పెరుగుదలలో కొందరు ఆధిక్యం సాధిస్తారు.

అలా లోకంలో' తండ్రికి తగ్గ తనయుడు' అనిపించుకున్నవారే కాదు.'తండ్రిని మించిన తనయుడు' అనిపించుకున్నవారూ ఉన్నారు.పుట్టినప్పుడు మాత్రం ప్రతిజీవీ నిస్సందేహంగా తన సృష్టికర్త కంటే బలహీనంగా ఉండడం సహజం. అయితే జీవుల విషయంలోనే ఇది మనం చూస్తాం.ఒక శిల్పి ఒక పెద్ద శిలను శిల్పంగా మారుస్తాడు.తనకంటే రూపంలో అందమైనదిగా కూడా దాన్ని తీర్చిదిద్దుతాడు. అలాగే ఒక చిత్రకారుడు తనకంటే అందమైన ఓ వ్యక్తి వర్ణచిత్రాన్ని చిత్రించవచ్చు.పట్టుమని పాతిక కిలోలు మొయ్యడానికి కూడా ఇబ్బంది పడే ఓ సాంకేతికుడు వందల టన్నులను అవలీలగా ఎత్తగల క్రేన్లనూ,వేయింగ్ మెషీన్లను తయారు చేస్తాడు.పరిమితమైన శక్తియుక్తులుకల ఓ ఎలక్ట్రానిక్ ఇంజినీరు అపరిమిత సామర్ధ్యం కల సూపర్ కంప్యూటర్ తయారు చేస్తాడు.

ఇక్కడ ఆ శిల్పానికి జీవం లేనందున దానికి శిల్పిలా  స్వంత ఆలోచన, బుద్ధి మొదలైనవి లేకపోవచ్చు.అయినా ఎత్తు,బరువు వంటి కొన్ని విషయాల్లోనైనా అది శిల్పి  కంటే అధికమైనదే .అలాగే  ఆ వర్ణచిత్రం, యంత్రాలూ, కంప్యూటర్లూ కూడా,కనీసం  ఏదో ఒక విషయంలోనైనా తమ సృష్టికర్త కంటే అధికమైనవి కావడం మనం గమనించవచ్చు. ఇక  ఆలోచనా ప్రపంచం విషయానికొస్తే మన ఆలోచనలకు సృష్టికర్తలం మనమే కనుక మనం ఎలాంటి ఆలోచన కావాలనుకుంటే అలాంటి ఆలోచనను సృష్టించుకుంటాం.ఒక శక్తిమంతమైన వ్యక్తిని గురించిన భావనను మన మనస్సులో సృష్టించుకోనడానికి మనం అతడి అంత బలవంతులం అయితీరాల్సిన అవసరం ఏమీ  లేదు.మనం సృష్టించుకునే కలల్లో మన అభీష్టం మేరకు మనం అతి బలశాలురను  కూడా ఓడించినట్లు కలగనవచ్చు.ఏనుగులతో, సింహాలతో తలపడి వాటిని లొంగదీసుకున్నట్లు ఊహించుకోవచ్చు. వేగంగా నడిచే ట్రెయిన్ ను ఒక' సూపర్ మాన్' లాగా ఎదురొడ్డి నిలిపేసినట్లు కలగనవచచు.అలాగే ఎత్తైన భవనం మీంచి దూకినా మనం ఒక్కసారిగా కిందపడం.అలాపడితే మనకి తీవ్రగాయాలు అవుతాయనే స్పృహ కలగనే  మనస్సుకి ఉంటుంది కనుక, ప్రతివారికీ కలలో కూడా తమ వ్యక్తిగత భద్రతే ముఖ్యం కనుక ,మనం ఒక ఈకలా మెల్లమెల్లగా మనకి ఏ దెబ్బలూ తగలని విధంగా  కిందికి పడినట్లు కలగంటాం. ఊహల్లోకానీ,కలల్లోకానీ మనం ఏర్పరచుకునే భావాలు తప్పనిసరిగా  భౌతిక వాస్తవాలపై ఆధార పడాల్సిన అవసరమూ లేదు.బయట ఎక్కడా మనం ఎప్పుడూ చూడనట్టి వింత వింత జంతువులు,భయానకమైన ఆకృతులను మన కలలలో సృష్టించుకుంటాం.మన మనస్సులలో మనం ఏర్పరచుకునే భావనలన్నీ వాస్తవ సత్యాలు కానక్కరలేదు.'దైవ  భావన' నా మనస్సులో ఉన్నది కనుక అది దైవం వాస్తవంగా  ఉన్నాడనేందుకు ఒక రుజువుగా భావించే వీలులేదు. దైవం సర్వశక్తి సమన్వితుడని నా  మనస్సులో ఒక అభిప్రాయం ఉంటే,ఆ అభిప్రాయానికి సృష్టికర్త అంతటి శక్తి కలిగిన భగవంతుడే కావాల్సిన అవసరమేమీ లేదు. మనం చేయలేని పనులన్నీ చేసినట్లుగానూ,  ఎన్నడూ చూడని భయంకరాకారాలను చూసినట్లుగానూ మన మనస్సులు కలలలో ఊహించుకోవడం లేదా?అచ్చం అలాగే మనం ఎన్నడూ చూడకున్నప్పటికీ  సర్వశక్తి సమన్వితుడైన ఒక భగవంతుడు ఉన్నాడనే భావనను మనం మన మనస్సులలో ఏర్పరచుకున్నాం. మన బాల్యంలో ఎవరో పెద్దలు లేక గురువుల బోధ కారణంగానే 'దైవ భావన' మన మనస్సులలో నాటబడింది.అలా సామాజిక జీవనం చేసే మానవుల మనస్సులలోనే 'దైవ భావన' సాటి మానవులచే  ప్రవేశపెట్టబడింది.ఇదే 'దైవ భావన' జంతువులలోనూ, సామాజిక జీవనం లేని రాబిన్సన్ క్రూసో వంటి మరుదీవులలో నివసించే  ఒంటరి మానవులలోనూ లేదేం?  కనుక  ఈ భావన స్వయంగా భగవంతుడే మన మెదళ్ళలో ప్రవేశ పెట్టాడనే డేకార్ట్ నిర్ధారణ కూడా ఎట్టి ఆధారమూ లేనిదే.అలాగే  ఆ నిరాధార నిర్ధారణే దేవుడున్నాడనేందుకు రుజువని భావించడమూ అశాస్త్రీయమే.

ఇకపోతే  పంచేంద్రియాల ద్వారా  మనం తెలుసుకునే జ్ఞానం మనల్ని తప్పుదోవ పట్టిస్తుందనీ, కేవలం మనస్సు లో మనం ఏర్పరచుకునే భావాలు మాత్రమే నమ్మదగినవని డేకార్ట్ చేసిన వాదన కూడా అశాస్త్రీయమైనట్టిదే.తన వాదనను బలపరుస్తూ ఆయన పేర్కొన్న మైనం బిళ్ళ ఉదాహరణ కూడా లోపభూయిష్టమైనదే.నిజమే- కేవలం మనస్సు మాత్రమే ఆ వేడి మైనపు ద్రవంలో ఉన్నది అంతకు ముందర ఉండిన ఎర్ర మైనపు బిళ్లేనన్న నిజాన్ని  గ్రహించగలదు.అందుకు కారణం?

ఆ బిళ్ళ కరగిపోక ముందు ఎర్రటి దాని రంగు,గుండ్రటి రూపం, నున్నగా మెరిసే గుణం,దాని మందం, చల్లదనం  మొదలైనవన్నీ ఇంద్రియాల ద్వారా తెలుసుకుని ఆ సమాచారాన్ని మనస్సు నిక్షిప్తం చేసుకుంది.తిరిగి ఆ బిళ్ళ కరిగిపోయిన తరువాత  ఆ ఇంద్రియాలే ఆ బిళ్ళ వేడి ద్రవంగా మారి, తన ఎర్రదనాన్ని కోల్పోయిన సమాచారాన్ని కూడా మనస్సుకి చేరవేయడం  జరిగింది. అలా ఇంద్రియాలు  అనుభూతుల సేకరణ (Perception) చేస్తే మనస్సు ఆ సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి(Analysis) అనుభవాల రూపంలో భద్రపరుస్తుంది.నిజనిర్ధారణకు నమ్మదగిన  ఇంద్రియానుభూతులు ఎంత అవసరమో వాటి హేతుబద్ధమైన  విశ్లేషణ కూడా అంతే అవసరం.ఇంద్రియజ్ఞానంయొక్క పరిమితులను అంతగా నొక్కిచెప్పిన డేకార్ట్ మనస్సు చేసే అభూతకల్పనలు, అది కనే ఆచరణసాధ్యం కాని పగటికలలు, అది పడే భ్రమలు,అది లోనయ్యే భ్రాంతుల కారణంగా తరచు నిజనిర్ధారణ ఎంత లోపభూయిష్టమూ,ఎంత  కంటకప్రాయమూ  అవుతుందో గుర్తించినట్లు లేదు. ఆ కారణంగానే డేకార్ట్ ఇంద్రియజ్ఞానాన్ని కొట్టిపారేసి, మనోభావాలకు పెద్దపీట వేశాడు.ఇంద్రియ జ్ఞానసముపార్జనతో నిమిత్తం లేకుండా మనస్సులలో మనం ఏర్పరచుకున్న 'దైవ భావన' నే పట్టుకు వేలాడాడు.అశాస్త్రీయమైన వాదన ఆధారంగా ఆ' దైవ భావన' మన మనస్సులలో నేరుగా  భగవంతుడే ప్రవేశపెట్టాడనే తప్పుడు నిర్ధారణకి వచ్చాడు.ఆ విధంగా డేకార్ట్ దైవసిద్ధాంతం కూడా  శాస్త్రీయంగా నిలబడలేనట్టిదై పూర్వపక్షం చేయబడింది. 

జి.డబ్ల్యూ.లీబ్నిజ్(1646-1716) అనే జర్మన్ తాత్త్వికుడు,గణిత శాస్త్రజ్ఞుడు  ఈ విశ్వంలోని సమస్త భౌతిక వస్తువులకు ప్రత్యక్షానుభూతితో  తమను చూసే ఆత్మలతో నిమిత్తం లేని ఒక స్వతంత్రమైన అస్తిత్వం ఉందన్నాడు.'నేను వాటిని చూసినా చూడకున్నా ఆ టేబుల్, గులాబి, కుర్చీ  వగైరాలు ఎవరైనా వాటిని తొలగించేవరకు  అక్కడే ఉంటాయి.వాటి ఉనికి వాటిని నేనో లేక జగచ్చక్షువో చూడడం మీద ఆధారపడిలేదు', అన్నాడు లీబ్నిజ్.అయితే లీబ్నిజ్ అభిప్రాయం ప్రకారం భౌతిక పదార్థాలుగా మనం భావిస్తున్నవన్నీ కేవలం ఆత్మికమైనవే(Spiritual).

ప్రతి వస్తువూ కూడా' మొనాడ్స్ '(Monads) అనే చిన్ని ఆత్మలతో నిర్మితమైందని ఆయన భావన. మనస్సు లేక ఆత్మ మాత్రమే అంతిమ సత్యమని(Ultimate Reality) భావించే సిద్ధాంతం కనుక ఇది కూడా  భావ వాదమే.అయితే  బర్కిలీ సిద్ధాంతంలా (కేవలం మనస్సులు మాత్రమే సత్యమనీ,బాహ్య వస్తువుల ఉనికి చూసే మనస్సు పైనే ఆధారపడి ఉందని చెప్పే స్వీయాత్మక భావవాదం (Subjective Idealism)లా) కాక   మనస్సుల వెలుపలి వస్తువులు కూడా వాస్తవాలేనని లీబ్నిజ్ ప్రతిపాదించాడు కనుక దీన్ని Objective Idealism అన్నారు.ఈ ప్రపంచమంతా అసంఖ్యాకమైన ఆత్మలతో నిండి ఉన్నదని   చెప్పే సిద్ధాంతం కనుక దీన్ని ప్లూరలిజం(Pluralism) అనికూడా అంటారు.

నాటి భౌతికవాదులు ఈ విశ్వంలోని అన్ని వస్తువులూ పరమాణువులు (Atoms) అనే అతి చిన్న(ఇక విభజించ వీలుగానంత చిన్న) భౌతిక పదార్థాల  కలయికతోనే ఏర్పడ్డాయని నమ్మారు.తరువాత కాలంలో ఆధునిక శాస్త్రజ్ఞులు  పరమాణువులను కూడా  విభజించగలమనీ , వాటిలో  మరింత చిన్న పార్టికిల్స్ అయినట్టి ప్రోటాన్,ఎలక్ట్రాన్,న్యూట్రాన్ వగైరాలున్నాయని కనుగొన్నారు.అది వేరే సంగతి.లీబ్నిజ్ పరమాణువులు పదార్ధం కనుక,పదార్ధం విభజించగలిగేది  కనుక , అంతిమ సత్యం పరమాణువు అనే  పదార్ధం కావడానికి వీల్లేదన్నాడు.పదార్ధం అంటే దానికొక ఆకృతి ఉంటుంది.ఆకృతి గల ఏవస్తువునైనా మనం మరింతగా విభజించవచ్చు.కాబట్టి పరమాణువు అవిభాజ్యం కావడానికి వీల్లేదు కనుక అది  అంతిమ సత్యం కావడానికి వీల్లేదన్నాడు లీబ్నిజ్. ఆయన అభిప్రాయం ప్రకారం అంతిమ సత్యం ఆత్మ లేక  మనస్సే. అతి చిన్న ఆత్మిక శకలాలు ' మొనాడ్ 'లు.అవి చిట్టి ఆత్మలు.మానసిక లేక ఆత్మ శక్తికి అవి కేంద్రాలు.వాటికి చావులేదు. అవి నశించనివి.నశించడం అనేది వాటి ఆకృతిని విభజించడం వల్లనే సాధ్యం.మోనాడ్ లు అవిభాజ్యాలు కాబట్టే అవి అంతిమ సత్యాలు(Ultimate Realities).అవి   అసంఖ్యాకమైనవి.అయినా అన్నీ ఒకేలా ఉండవు. వాటి వాటి అభివృద్ధి స్థాయినిబట్టి అవి వేర్వేరుగా ఉంటాయి.అన్నింటిలోకీ అధమ స్థాయిలో ఉన్న మోనాడ్ లను నగ్న మోనాడ్లు అనీ సుప్త మోనాడ్లు(Sleeping Monads)అనీ అంటారు.ఇవి సుషుప్త్యావస్థ (Swoon or dreamless sleep) లోని మన మనస్సులవంటివి.భౌతిక వస్తువులన్నీ ఈ స్లీపింగ్ మొనాడ్లతోనే ఏర్పడ్డాయి.వీటికంటే పై స్థాయికి చెందిన మొనాడ్లు (Sentient Monads) నిర్హేతుకమైన,విచక్షణారహితమైన  ఆత్మలు.ఇవి జంతువులలో ఉండే ఆత్మలు.జంతువుల శరీరాలన్నీ సుప్త మొనాడ్లతో ఏర్పడినా, వాటి ఆత్మలు లేక కేంద్ర మొనాడ్లు  (Central Monads)మాత్రం ఈ రెండవ తరగతికి చెందినవే.వాటికి ఇంద్రియానుభూతులు, జ్ఞాపకాలు ఉంటాయి కానీ, వాటికి ఎటువంటి విచక్షణ, చైతన్యం,నైతిక స్వేచ్చ ఉండవు.లీబ్నిజ్ అభిప్రాయం లో జంతువులకు కూడా ఆత్మ ఉంటుంది.అభివృద్ధిలో అన్నింటికంటే ఉన్నత స్థాయిలోని మొనాడ్లు హేతుబద్ధమైన మొనాడ్లు(Rational Monads).అవి మానవుల ఆత్మలు. వాటికి విచక్షణ,స్వంత  చైతన్యం ఉంటాయి.అవి హేతుబద్ధతతో కూడిన నైతిక ఆత్మలు. ఏపనులు చేయవచ్చో, ఏవి కూడదో ఎంచుకుకునే నైతిక స్వేచ్చ వాటికి ఉంటుంది.ఇక అత్యుత్తమమైన మొనాడ్(Supreme Monad) భగవంతుడు.అనాదిగా స్వంత అస్తిత్వం కలిగిన మోనాడ్ భగవంతుడే. అతడే అన్ని ఇతర మొనాడ్ల (Finite Monads) సృష్టికర్త.అతడు శుద్ధాత్మ (Pure Spirit).ఆయన శరీరం ఎలాంటి ఇతర మొనాడ్ల కలయికతో నిర్మితమైనది కాదు.ఆయన అనంతుడు (Infinite), శాశ్వతుడు(Eternal),అత్యంత  విజ్ఞుడు,ఉత్తముడు.

ప్రతి  మోనాడ్  విలక్షణమైన  వ్యక్తిత్వం  కలిగి  ఉంటుంది.తన దృష్టి కోణం నుంచి అది ఈ విశ్వాన్ని చూస్తుంది.

ప్రతిబింబిస్తుంది.ప్రతి మోనాడ్ కూ గత స్మృతులు , భవిష్యత్ కి అవసరమైన శక్తి యుక్తులూ ఉంటాయి. ప్రత్యగాత్మలను (Finite Monads) భగవంతుడు ఒక క్రమ పద్ధతి లో  అమర్చాడు.మన శరీరం,మనస్సుల మధ్య ఒక చక్కటి సంధానం ఉండే విధంగా ఈ మొనాడ్ల అమరికను భగవంతుడు చేశాడు.మన శరీరానికి సంబంధించిన మొనాడ్లకూ,మనస్సుకు సంబంధించిన మొనాడ్లకూ ఒక పూర్వ నిర్ధారిత సామరస్యం(Pre-established Harmony) ఉండే  విధంగా  భగవంతుడు  ఏర్పాటు  చేసాడు .మనం పదార్థంగా భావిస్తున్న ప్రతి సూక్ష్మ కణంలోనూ ఓ జీవ ప్రపంచం దాగి ఉంది.ఈ విశ్వమంతా ఆత్మల సముచ్చయం.ఇది ఒకరకంగా సర్వాత్మ సిద్ధాంతం(Panpsychism).వృక్షాలు, జంతువులు మొదలైన సకల జీవుల శరీరాలు ఒక నదిలోని నీటి బిందువులు క్షణ క్షణం మారుతూ వాటి స్థానం లో  కొత్త నీటి కణాలు వచ్చి చేరుతున్నట్లు ఎప్పుడూ నిరంతర మార్పుకు గురౌతూ ఉంటాయి. మొనాడ్లకు ఎటువంటి గవాక్షాలు(Windows) ఉండవు.ఇదీ క్లుప్తంగా లీబ్నిజ్ ప్రతిపాదించిన ఆత్మ-పరమాత్మ సిద్ధాంతం.

పరమాత్మ (Supreme Monad)కీ ఆత్మల(Finite Monads)కీ గల సంబంధం ఎలాంటిదో లీబ్నిజ్ ఎక్కడా స్పష్టపరచ లేదు.అవి పరమాత్మచేత సృష్టించబడ్డాయని ఆయన పేర్కొన్నాడు.అలాంటప్పుడు అవి భగవంతుడిచే సృష్టించ బడక పూర్వం లేవనే కదా! అప్పుడు  అవి భగవంతుడితో  సరిసమానంగా శాశ్వతమైనవి(Co-eternal) కావడానికీ వీల్లేదు.  ఏది సృష్టించబడిందో అది నశించితీరుతుంది కనుక అవి భగవంతునిలా శాశ్వతాలూ కాదు.ఆత్మలు పరమాత్మవలె శాశ్వతాలని భావిస్తే భగవంతుడు ఈ విశ్వానికి సృష్టికర్త కాలేడు.  ఒక విగ్రహం చెక్కిన శిల్పి అందుకువాడిన శిలను ఎలా సృష్టించలేదో,  ఒక భవనాన్ని నిర్మించిన ఇంజినీరు ఇటుకలు,ఇసుక, సిమెంటు వగైరాలకు ఎలాగైతే సృష్టికర్తకాదో,అలాగే భగవంతుడు కూడా కేవలం విశ్వాన్ని నిర్మించినవాడే అవుతాడుగానీ, సృష్టించినవాడు కాలేడు.ఈ ప్రత్యగాత్మలు విశ్వాత్మ యొక్క శకలాలో కాదో కూడా ఎక్కడా స్పష్టం చేయలేదు. పైపెచ్చు అవి వేటికవి స్వతంత్ర అస్తిత్వం కలిగి ఉంటాయని కూడా ఆయన పేర్కొన్నాడు.

పరమాత్మ , ప్రత్యగాత్మలను ఒక ముందే నిర్దేశించిన సామరస్యం (Pre-established Harmony) లో ఉంచుతాడనే   సిద్ధాంతం కూడా తార్కికంగా విమర్శలపాలయింది.ప్రతి క్షణం ప్రతి ఆత్మ ఏవిధంగా ప్రవర్తించాలో ముందుగానే నిర్ణయిస్తాడనడం ఒక అర్థం లేని సిద్ధాంతంగా విమర్శకులు కొట్టిపారేశారు. ఉదాహరణకు  మన శరీరంలోని అవయవాలు ఒక్కోసారి అసంకల్పంగా కొన్ని పనులు చేస్తాయి.మన కంటికి దగ్గరగా ఏ వస్తువు వచ్చినా మనం  కనురెప్పలు అసంకల్పితంగానే మూస్తాం.ఇలాంటి సందర్భాలలో పూర్వ నిర్దేశిత సామరస్యాన్ని భగవంతుడు ఏర్పరిచాడనడం హాస్యాస్పదమని అనిపించకపోదు.ముందుగా దురదపెట్టాలనే సంకేతాన్ని  మనస్సుకు అందజేయమని చర్మం లోని మొనాడ్లకు,ఆ వెంటనే గోక్కోవాలనే ఆదేశాలను చేతులకివ్వమని మనస్సులోని మొనాడ్లకు భగవంతుడు ఎప్పుడో ముందుగానే ప్రవర్తనా నియమావళిని తయారుచేసి పెట్టాడనడం కూడా  హాస్యాస్పదం కాక ఇంకేమిటి?   పైపెచ్చు ఆత్మలకు గవాక్షాలు ఉండవనే లీబ్నిజ్  భావనకూడా తార్కికంగా అర్థరహితం.అప్పుడిక ప్రతి ఆత్మా ఒక మూసుకున్న వృత్తం (Closed Circle) అవుతుంది.ఇది Solipsism(Self alone exists- ఆత్మ ఒక్కటే సత్యం)  అనే భావనకి దారితీస్తుంది.

అలా లీబ్నిజ్ యొక్క దైవ సిద్ధాంతం కూడా పలు చిక్కులతో కూడుకున్నట్టిది. అది తార్కికంగా నిలబడలేనిది గానూ,  ఆశాస్త్రీయమైనదిగానూ విమర్శకులచే భావించబడి అంతిమంగా  కొట్టివేయబడింది.

కాంట్  దైవ సిద్ధాంతం ఏమిటో మనం ఇదివరకే కొంతమేరకు  చర్చించాం. ఆయన భావనల ప్రకారం అంతిమ సత్యం మనకు తెలిసినదీ కాదు; తెలుసుకోగలిగేదీ కాదు.దానినే  ఆయన thing-in-itself అనీ, noumenon అనీ అంటాడు.మనం phenomenal  ప్రపంచంలో ఉన్నామనీ, ఈ ప్రపంచంలో ఉంటూ మనం Noumenon గురించి  ఇదమిద్ధంగా ఏమీ చెప్పలేమనీ అంటాడాయన. ఈ ప్రపంచం, ఆత్మలు, భగవంతుడు-- ఈ మూడూ అజ్ఞేయాలు(Noumena).వాటి అంతిమ స్వరూపమేమిటో మనమెవ్వరం చెప్పలేం.అయితే మనకి ఈ దృశ్య ప్రపంచం ఎలా కనిపిస్తుందో, మిగిలిన రెండూ  ఎలా అనిపిస్తున్నాయో మాత్రం చెప్పవచ్చు.వాస్తవానికి ఈ అజ్ఞేయాలగురించీ, అదృశ్య ప్రపంచాన్ని గురించీ సాధికారంగా చెప్పడానికి మనదగ్గర ఎట్టి ఆధారాలూ లేవు. ఎలా కనిపిస్తుందో చెప్ప వచ్చేమోగానీ,ఈ దృశ్య ప్రపంచం యొక్క అంతిమ స్వరూపమో, లేక అంతస్స్వరూపమో ఏమిటంటే చెప్పడమూ మనకి సాధ్యం కాదు.ఈ దృశ్య ప్రపంచంలో మన జ్ఞానమంతా phenomena కు మాత్రమే సంబందించినట్టిది.ఆ కారణంగానే కాంట్ ప్రతిపాదించిన భావవాదాన్ని phenomenalistic idealism అన్నారు.

దేవుడున్నాడనేందుకు భావవాదులు ప్రతిపాదించిన మూడు సంప్రదాయ రుజువులను అశాస్త్రీయాలని రుజువు చేసిన కాంట్, సమాజంలో నైతికత కోసం భగవంతుడిని నమ్మి తీరాల్సిందేనంటూ, నాల్గవ రుజువైన Moral Proof ను ప్రతిపాదించిన విషయం మనమీవరకే తెలుసుకున్నాం.మానవుడికి ఇచ్చా కర్తృత్వ స్వేచ్చ (మంచి చెడులలో తాను ఏది చేయాలో నిర్ణయించుకునే స్వేచ్చ- Free Will) ఉన్నదని మనం నమ్మాలి. లేకుంటే తప్పు చేసే ప్రతివాడూ తనకు ఆ తప్పు చేయడంలో ఎలాంటి ప్రమేయం లేదనీ, అంతా భగవత్సంకల్పం కారణంగానే జరిగిందని తప్పుకునే అవకాశం ఉంది.అలాగే ఆత్మల అమరత్వం(Immortality of Souls) సత్యమనీ, ఈ  విశ్వానికి ఓ నైతిక పాలకునిగా(Moral Governor )నూ, కర్మఫలదాతగానూ (పుణ్య కార్యాలకు పురస్కారాలనూ,పాప కార్యాలకు శిక్షలనూ వేసేవాడు) వ్యవహరించే ఒక భగవంతుడిని  నమ్మకపోతే సమాజంలో నైతిక జీవనం సాధ్యం కాదు-- ఇదీ కాంట్ సిద్ధాంత సారాంశం.అంతిమ సత్యం విషయంలో ఏమీ నిర్ధారణగా చెప్పలేమని అజ్ఞేయవాదానికి(Agnosticism) కట్టుబడిన కాంట్ మన నైతిక వర్తనకు తోడ్పడే అనుభూతులకు  మాత్రం భగవంతుడే కారణమని ఎలా నిర్ధారించగలడు ? ఆత్మల గురించీ, భగవంతుడి గురించీ అధిభౌతికమైన సమాచారం ఏమీ లేకుండానే నైతిక సమాజం కోసం ఆత్మలు, భగవంతుడు ఉన్నట్లు విశ్వసించాలనే కాంట్ సిద్ధాంతం బలహీనమైనది.Faith is never a good substitute for Reason and if Faith be the only guiding 

factor, we may believe in pure fictions of our mind.

పలువురు తత్త్వవేత్తలచే ఇలా కాంట్ సిద్ధాంతం కూడా  పూర్వపక్షం చేయబడ్డది.

                 వచ్చే  వ్యాసంలో మరికొందరు పాశ్చాత్య భావవాదుల సిద్ధాంతాలను స్థూలంగా చర్చించి ఆ తరువాత భారతీయ వేదాంత దర్శనాల శాస్త్రీయత గురించి చర్చిద్దాం. ప్రస్తుతానికి సెలవు. 


ముత్తేవి రవీంద్రనాథ్: నమస్కారం!

పిల్లలమఱ్ఱి కృష్ణ కుమారు గారి స్పందనపై నా ప్రతిస్పందన.

నా మానాన నేను కేవలం తత్త్వశాస్త్ర సంబంధిత విషయాలను వివరిస్తూ, నా వ్యాస పరంపరలోని చర్చనంతా 'దేవుడున్నాడా ?' అనే తత్త్వ శాస్త్రపు మౌలిక ప్రశ్నపైనే కేంద్రీకరిస్తూ ఉంటే, అక్టోబర్ 2012 సంచికలో ప్రచురితమైన నా వ్యాసానికి స్పందిస్తూ పిల్లలమఱ్ఱి కృష్ణ కుమారు గారు' సనాతన ధర్మం ప్రకారం మన పూర్వీకులు ఎక్కడా సంఘాన్ని అణగదొక్కిన, ఇతర దేశాలపై దండెత్తి వాటిని ఆక్రమించి అణగదొక్కిన దాఖలాలు లేవు'అంటూ సామాజిక విషయాలను వారే ముందుగా ప్రస్తావించారు.

మనది స్వచ్చమైన సంస్కృతి, లోక కళ్యాణం తప్ప వేరే ఏ ప్రయోజనం ఆశించని ధర్మ శాస్త్రాలు మనవి -- అని కృష్ణ కుమారు గారిలాగే నమ్ముతున్న వారిని కొంతైనా ఆలోచింపజేసే ఉద్దేశంతో మన ధర్మం, మన సంస్కృతిలో కూడా ఉన్న పీడన, మాలిన్యాల గురించి కొంచమైనా వివరించడం ఉచితమని భావించి తప్పనిసరై ఆ పని చేశాను.

ఇప్పుడేమో వారు " ' దేవుడున్నాడా ?' అనే పేరుతో తాత్త్విక విషయాలపై చర్చను మొదలెట్టి, దానిలో ఇలాంటివన్నీ దూర్చడం ఎందుకు ? " అని నన్ను ప్రశ్నిస్తూ 'మీ సామాజిక దృక్పథం మీద నేనేమీ దండెత్తలేదే ?'అని నన్ను నిలదీస్తున్నారు. ఇది విడ్డూరంగా ఉంది. స్వయంగా వారు లేవనెత్తిన విషయాలపై వివరణ ఇస్తే చర్చ పక్కకు మళ్లించినట్లా ?

ఏది ఏమైనా ఇకమీదట ఈ చర్చలో ఎవరైనా చర్చాం శానికి బయటి విషయాలను ప్రస్తావించినప్పటికీ, వాటికి నేను సమాదానమివ్వను.ఎవరు చర్చను దారి మళ్లించే వ్యాఖ్యలు చేసినా వాటిని పట్టించుకోను. చర్చనంతా కేవలం తాత్త్విక విషయాలకే పరిమితం చేస్తాను. గమనించగోరతాను.


ముత్తేవి రవీంద్రనాథ్ గారి 'తెనాలి రామకృష్ణ కవి-శాస్త్రీయ పరిశీలన' అనే తొలి రచనకే  కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ పొందడం విశేషం. వీరికి "కావ్యనుశీలన కళా సమ్రాట్టు" అనే బిరుదుతోబాటు,విజయవాడ,ఒంగోలు,గుంటూరు,తెనాలి,చీరాల, అద్దంకి మొదలగు చోట్ల ఘన సత్కారాలు జరిగాయి. కమ్యూనిస్టు ఉద్యమంలో కాకలు తీరిన కుటుంబ నేపథ్యం గలిగి, సైన్స్ విద్యార్థిగా శాస్త్రీయ దృష్టినీ,సహేతుక దృక్పథాన్నీ అలవరచుకుని,స్వయం సంపాదిత సాహితీ నేపథ్యంతో రచనలు చేస్తున్న రవీంద్రనాథ్ గారు సంఘ సేవా తత్పరులు కూడా కావడం అదనపు గౌరవానికి ఆలంబనమైన విషయం. వీరు  'శ్రమ వీరులు' పేరిట కొన్ని శ్రామిక సామాజిక వర్గాల చరిత్ర, స్థితిగతులపై పరిశోధనాత్మక గ్రంథం రాశారు. జనరంజకమైన  హరికథా రూపంలో దైవ ప్రస్తావన లేకుండా ' మహాకవి శ్రీ శ్రీ - సిరి కథ' అనే రచన చేశారు. 'పాండురంగ మాహాత్మ్యము-పరిచయం','మన ప్రాచీనుల ఆహారం,ఆరోగ్యం, వైద్యం' వీరి ఇటీవలి రచనలు. 2009 లో వాణిజ్య పన్నుల అధికారిగా పదవీ విరమణ చేసిన వీరు తత్త్వశాస్త్రం, చరిత్ర, వర్తమాన రాజకీయాలు, సైన్సు,పర్యావరణం వగైరా భిన్న, విభిన్నమైన  అంశాలపై  పలు దిన, వార, మాస పత్రికలలో రాస్తున్న వ్యాసాలు చదువరులలో ఆసక్తినీ,ఆలోచననూ రేకెత్తిస్తాయి. హేతుబద్ధమైన   ఆలోచన, శాస్త్రీయ దృష్టితోబాటు, వివిధ శాస్త్రాలు, భాషలలో చక్కటి ప్రవేశమున్న రవీంద్రనాథ్ గారి అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నమే చర్చా వేదిక.

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech