సుజనరంజని /  కబుర్లు   /  వీక్ పాయింట్

మెడికల్ ఎంట్రెన్స్ మేడ్ డిఫికల్ట్

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 


కన్యాశుల్కంలో గిరీశం కుప్పుసామయ్యర్‌ని మేడ్ డిఫికల్ట్ చేసినట్టు- మతిలేని మన సర్కారువారు మెడికల్ ఎంట్రెన్స్‌ని మేడ్ డిఫికల్ట్ చేశారు.

రాజుల దృష్టి సోకితే రాళ్లు కూడా నుగ్గు అవుతాయంటారు. అదేమో కాని - రాజకీయ నాయకుల చేతిలో పడితే ఏ చదువైనా చట్టుబండలే. ఎంత మంచి నిర్ణయాన్నయినా ఎంత కంగాళీగా భ్రష్టు పట్టించవచ్చో వాళ్లను చూసే తెలుసుకోవాలి.
ఇక నుంచి దేశమంతటా వైద్య విద్యలో ప్రవేశాలు జాతీయ పరీక్ష ద్వారానే జరుగును. ఇది సర్కారు వారి ఆజ్ఞ. మామూలుగా అయితే ఇందులో వంక పెట్టటానికి ఏమీ లేదు. దేశంలోని మంచి మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లకోసం ఇప్పుడు పనె్నండో పదిహేడో ఎంట్రెన్సు టెస్టులు రాసి అదృష్టాన్ని పరీక్షించుకోవలసి వస్తున్నది. బోలెడు ఖర్చులు పెట్టి, బోలెడు తిరుగుళ్లు తిరిగి అనే్నసి అవస్థలు పడేకంటే - దేశమంతటకీ ఒకే ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్టు (‘నీట్’) పెట్టి దానిలోని రాంకులే అన్ని రాష్ట్రాల అన్ని కాలేజీ ల్లోని అడ్మిషన్లకూ ప్రాతిపదిక అవుతుందంటే అందరికీ సంతోషమే. ఏకకాలంలో రకరకాల సిలబసులతో కుస్తీపట్టి, అనే్నసి పరీక్షలకు తయారయ్యేకంటే ఒకే రకం పరీక్షతో అన్నీ తేలిపోవటం ఏరకంగా చూసినా మంచిదే. ఎమ్సెట్‌లో ఎంత మంచి రాంకు వచ్చినా మన రాష్ట్రంలో ఉన్నవాటిలోనే ఏదో ఒక మెడికల్ కాలేజీని ఎంచుకోవలసిరావటం కంటే... జాతీయ పరీక్షవల్ల వేరే రాష్ట్రాల్లోనూ ఛాయిస్ పెరగటం విద్యార్థికి లాభమే.

ఇన్ని ఉపయోగాలు కనపడుతున్నా కొత్త మార్పు కబురు తెలిసి కుర్రవాళ్లకు, వారిని కన్నవాళ్లకు గుండెల్లో రైళ్లు ఎందుకు పరిగెడుతున్నాయా - అంటే అక్కడే ఉంది మనలనేలినవారి ప్రతిభ! ఎప్పుడు ఏది చేయకూడదో అది చేసి, ఎంత మంచి పనినయినా చెడగొట్టటంలో వారికి వారే సాటి!


ఎన్నికలకు నెలరోజుల ముందు నియోజకవర్గాన్ని మార్చినా రాజకీయ జీవికి తేడా పెద్దగా ఉండదు. ఇక్కడ పంచే డబ్బును అక్కడ పంచి, ఇక్కడ వేసే వేషాలు అక్కడ వేసి కుర్చీ కొట్టెయ్యగలడు. తానెంతో జగమంత అన్నట్టు - చదువుల రంగమూ అంతేనని కుర్చీలెక్కిన నేతలు అనుకుంటున్నట్టుంది. సిలబస్ అంతా పూర్తయి, కాలేజీల్లో రివిజన్లు అవుతున్న దశలో హఠాత్తుగా ప్రవేశ పరీక్షను మార్చేసి ఇది కాదు - అది అన్నారు. అదేమంటే - పరిక్షకు ఇంకా ఆర్నెల్లు టైము ఉందికదా అంటున్నారు.

పెద్ద చదువుకు ప్రవేశపరీక్ష ఎన్నికల దొంగాటలాంటిది కాదు. అది కాసులతో, సీసాలతో అయ్యే పని కాదు. దానికి చచ్చేట్టు చదవాలి. ఎంతో ముందు నుంచే చచ్చేంత కష్టపడాలి. మెడికల్ ఎంట్రెన్సు పరీక్ష ఇంటర్ సెకండియర్ తరవాత జరిగినా, దానికి ప్రిపరేషను ఫస్ట్ ఇయర్ నుంచే... ఇంకా మాట్లాడితే హైస్కూలు దశనుంచే మొదలవుతుంది.


రాష్ట్రంలో లక్షలాది విద్యార్థులు ఇంతకాలమూ సాధన చేస్తున్నది ప్రధానంగా ఎమ్సెట్ కోసం. ఇంటర్మీడియట్ లాగే అందులోనూ పరీక్ష స్టేట్ సిలబసు మీద. ఎమ్సెట్‌ను తొక్కేసి ఇప్పుడు నడమంత్రంగా రుద్దిన ‘నీట్’లో అడిగే ప్రశ్నలేమో సిబిఎస్‌ఇ సిలబసు మీద! దానికీ దీనికీ లంగరందదు. అదీ సమస్య.

అలాగని - స్టేట్ సిలబసు తక్కువా లేదు; సిబిఎస్‌ఇ సిలబసు ఎక్కువా లేదు. దేని పద్ధతి దానిది. దేని గొప్ప దానిది. కాస్తంత టైమిస్తే మన కుర్రాళ్లు ఏ సిలబసునైనా విరగదియ్యగలరు. ఎంతోకాలంగా జాతీయస్థాయి ఐఐటి ఎంట్రెన్సుల్లో ఆంధ్రా పిల్లలు టాప్‌రాంకులు ఎన్ని కొట్టెయ్యటం లేదు? అలాగే - కొత్త ‘నీట్’నూ దాని ఆనుపానులు కొంచెం ముందుగా తెలిస్తే అదరగొట్టగలరు.ఎటొచ్చీ ఆ సావకాశమే సర్కారువారు ఇవ్వలేదు.

మొదట 2013 నుంచి దేశమంతటా ‘నీట్’ను స్టార్ట్ చేస్తామని డప్పుకొట్టారు. అంటే - అంతకు ముందు వరకూ పద్ధతి ప్రకారమే కదా అనుకుని 2012 బ్యాచి విద్యార్థులు ఎంసెట్‌కు రెడీ అయపోయారు. ఇంటర్ ఫస్టియర్‌ను వాళ్లు దాటేశాక కేంద్ర మానవవనరుల మంత్రి కపిల్ సిబాల్ అనే కపీశ్వరుడికి కొత్త బ్రెయన్ వేవ్ వచ్చింది. కేంద్ర వైద్య శాఖకూ, ఆయన శాఖకూ గొడవేదో వచ్చి సిబాల్ గారికి చిర్రెత్తి ‘నీట్’ను కాస్తా ఒక ఏడు ముందుకు జరిపి 2012 నుంచే కొత్త పద్ధతి అని ఆనతిచ్చారు. సుప్రీంకోర్టు కూడా ఏ కారణంవల్లో కాని అందుకు సరేనంది.

అప్పటికే చదువు సగంలో ఉన్న కుర్రాళ్ల గుండెలో రాయపడింది. అదే అవస్థ మన పొరుగున అరవపిల్లలకూ వచ్చింది. కాని తమిళనాడు గవర్నమెంటు ముందే మేల్కొని హైకోర్టుకు పోయ స్టే తెచ్చుకుంది. అదే పని మన రాష్టమ్రూ చేసి ఉంటే ఫలితం ఎలా ఉండేదో! కాని - మన పాలపడిన పాలకులకు ఎంతసేపూ ఢిల్లీకి సాగిలపడి, అతి విధేయత చూపి ఊగిసలాడే కుర్చీకి ఎలా అంటిపెట్టుకోవాలన్న ధ్యాసే తప్ప అవసరమైనప్పుడు కేంద్రానికి ఎదురుతిరిగే దమ్ము లేదు. లేదని వారికీ తెలుసు. కనీసం నిరుడు డిసెంబరులో కేంద్ర ప్రభువులు ‘2012 నుంచే నీట్’ అంటూ ఉత్తర్వు చేయగానే అయనా, రాష్ట్ర ప్రభుత్వం తన అశక్తతను అంగీకరించి, ‘అట్లే అగుకాక’ అని బుర్ర ఊపితే సరిపోయేది. అప్పటికింకా ఏడాదికి పైగా వ్యవధి ఉన్నందున కాలేజీల వాళ్లూ, పిల్లలూ కొత్త మార్పుకు సిద్ధమయ్యేవాళ్లు. విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నది కనుక ఏ మార్పుకైనా రాష్ట్రాల సమ్మతీ కావాలి. మన రాష్ట్ర ప్రభుత్వం ఏదీ తేల్చకపోవటంతో 2012 పరీక్ష ఇప్పుడున్న పద్ధతి ప్రకారమే జరుగుతుందని అందరూ అనుకున్నారు. ఇన్ని నెలలూ ఉలుకూ పలుకూ లేకుండా మిన్నకుండి, సిలబసు మొత్తం పూర్తయ్యాక ఇప్పుడేమో ‘ఎమ్సెటు కాదు; నీటు’ అని చల్లగా చెప్పారు.

దాంతో పిల్లలకొచ్చాయ తిప్పలు. ఇప్పటిదాకా చదివింది స్టేట్ సిలబసు. పరీక్షలో ఇచ్చేది సెంట్రల్ సిలబసు. దానికీ దీనికీ చాలా తేడా. పోనీ ఎలాగో కష్టపడి కొత్తదాన్ని సాధిద్దామనుకుంటే పరీక్ష పెట్టేది నికరంగా ఏ అంశాలమీద అన్నదే ఇవాల్టికీ తెలియదు. అయ్యవార్లే తెల్లబోతున్నప్పుడు పిల్లల అవస్థ చెప్పనే అక్కర్లేదు. అంతేకాదు, ఇంటర్మీడియట్ పరీక్ష ఏమో స్టేట్ సిలబసు; దానితోబాటు లాగించాల్సిన ఎంట్రెన్స్ టెస్టేమో సెంట్రల్ సిలబసు. ఒకే సమయంలో రెండు రకాల ఇనపగుగ్గిళ్లనూ నమిలెయ్యకపోతే పాస్ గోవిందా; మెడికల్ సీటు గల్లంతు! అసలే రకరకాల ఆందోళనలతో వారాల తరబడి చదువులు పాడైన వేలాది విద్యార్థులమీద ఇప్పుడు ‘నీటు’ పిడుగు. అయనా పెద్దలకు పట్టదు!

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech