సుజనరంజని /  కబుర్లు  / వార్త వ్యాఖ్య

 

      ఎటు పోతున్నాం?                                                 

 

సామాన్యుడి కోసం రూపొందిన రాజ్యాంగ వ్యవస్థలన్నీ ఇటీవలి కాలంలో అసామాన్యుల కోసం నిర్విరామంగా పనిచేస్తున్న క్రమంలో, అవి క్రమక్రమంగా తమ పూర్వ వైభవాన్ని కోల్పోతున్నాయనే చెప్పాలి. ఈ వ్యవస్థలు దారితప్పినప్పుడు సరిదిద్ది గాడిన పెట్టాల్సిన కర్తవ్యం  భుజస్కందాల మీద వున్న ‘మీడియా’ సైతం ఆరోపణల నీలినీడలను తప్పించుకోలేకుండా వుండడం మరో విషాదం.

ప్రత్యర్ధి పార్టీలను  నామరూపాలు లేకుండా చేయాలనుకోవడం రాజకీయ రంగంలో చాలా సహజమయిన విషయం. ఎన్నికల్లోనూ, ఇతరత్రా కూడా ఈ లక్ష్య సాధన కోసం రాజకీయ పార్టీలు పనిచేస్తూనే వుంటాయి. నైతికంగా ఇది తప్పే అయినా రాజకీయ కోణం నుంచి చూస్తే వాటికి ఇది  తప్పనిసరి వ్యవహారం. అందుకే ఎన్నికల్లో తేలని విషయాలను న్యాయస్తానాల ద్వారా తేల్చుకోవాలని ప్రయత్నించడం ఈ మధ్య కాలంలో ఎక్కువయింది. ఒకరకంగా చెప్పాలంటే సివిల్ కేసుల్లో సెటిల్మెంట్ మాదిరి. భూములు, ఆస్తి తగాదాలను పరిష్కరించే మిషతో లావాదేవీలు నడిపే పోలీసు అధికారులు, ఇతర సంబంధిత సిబ్బంది - ‘కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకో! మిగిలిన విషయాలు మేము చూసుకుంటాం!’  అనే రీతిలో హామీలు ఇస్తుండడం కద్దు. కోర్టు నిర్ణయాలను ప్రశ్నించడం కోర్టు ధిక్కారం కిందికి వస్తుంది కాబట్టి సెటిల్మెంట్  వ్యవహారాలు నడిపేవారికి మరింత వెసులుబాటుగా మారింది. ఇప్పుడిది రాజకీయ పార్టీలకు కొత్త అస్త్రంగా తయారయింది.
మొన్నటికి మొన్న జగన్ మోహన రెడ్డి పై ఇదే బాణం ఎక్కుబెట్టారు. మళ్ళీ ఈ రోజున అదే బాణం చంద్రబాబు వైపు తిరిగింది. అధికారం అండగా చేసుకుని ఆర్ధిక నేరాల ఆరోపణల్లో చిక్కుకున్న వారిపై దర్యాప్తులు జరిపి నేరం రుజువు చేస్తే తప్పుబట్టేవాళ్ళు ఎవ్వరూ వుండరు. అలా కాకుండా ఇది కేవలం రాజకీయ కక్షలను సెటిల్ చేసుకునే  క్రమంలో సాగే వ్యవహారం అయితే పరిణామాలు దారుణంగా వుంటాయి. పొరుగున వున్న  తమిళనాడులో ఈ విష సంస్కృతి ఇప్పటికే  వూడలు దిగివుంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా అక్కడి పార్టీలు  ప్రత్యర్ధులపై కక్షలు తీర్చుకునే విధానాలు ఏ మేరకు దిగజారాయో అందరికీ తెలిసిన విషయమే. కాకపొతే  గుడ్డిలో మెల్ల అన్నట్టు    అక్కడి ప్రధాన పార్టీల వాళ్లు తమ  పోరాట క్రమంలో రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగే రీతిగా నడుచుకోరు. కానీ మన రాష్ట్రంలో పరిస్తితి ఇందుకు పూర్తిగా విరుద్ధం. అందుకే రాజకీయ సెటిల్మెంట్ల వ్యవహారం ఇంతగా ఆందోళన కలిగిస్తోంది.

ఇది ఒక పార్శ్వం. దీన్ని మించిన  ప్రమాదకరమయిన పరిణామం మరొకటి వుంది.

జగన్ మోహన రెడ్డి మీద సీ.బీ.ఐ. దర్యాప్తుకు కోర్టు ఆదేశించినప్పుడు ఆయనకు చెందిన సాక్షి పత్రిక, సాక్షి టీవీ-   కొన్ని పత్రికలు, మరికొన్ని  మీడియా సంస్తలు అందిస్తున్న సమాచారంపై అనేక ఆరోపణలు చేశాయి. దర్యాప్తు క్రమంలో ప్రచురితమవుతున్న వార్తలను అభూతకల్పనలుగా కొట్టివేశాయి. నాలుగు గోడలమధ్య జరుగుతున్నవిచారణ సంగతులను  అక్షరం పొల్లుపోకుండా కళ్లకుకట్టినట్టు వైనవైనాలుగా వర్ణించి రాయడం  ఫక్తు  ‘ఎల్లో జర్నలిజం’ అని అభివర్ణించాయి. మీడియాలో ఒక వర్గం చంద్రబాబుకు కొమ్ముకాస్తోందని ఆరోపించాయి. గత కొద్ది రోజులుగా సాగుతూ వస్తున్న  తతంగం ఇది.

సాక్షి అభియోగాలను ఖండించాల్సిన అగత్యం ఆ మీడియాకు వుండకపోవచ్చు. కాకపొతే తాము ఇన్ని రోజులు నిస్పాక్షికంగా వార్తలు అందిస్తున్నామనీ, ఎవరిపైనో  బురదజల్లే వార్తాకధనాలు అందించడం లేదని నిరూపించుకునేందుకు  వాటికి ఇప్పుడొక సువర్ణావకాశం లభించింది. ప్రస్తుతం హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం సీ.బీ.ఐ. ఇక ముందు జరపబోయే దర్యాప్తు గరించి కూడా మునుపటి విధంగానే,  అదేవిధమయిన రీతిలో వార్తా కధనాలను అందించగలిగితే సాక్షి చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని తేలిపోతుంది. రాజకీయ దురుద్దేశాలతో వార్తలు వండివారుస్తున్నారన్న అపప్రధ కూడా తొలగిపోతుంది.

పోతే తెలుగునాట చిగురిస్తున్న కొత్త రాజకీయం గురించి కొన్ని ముక్కలు.

ఇంట్లో కరెంట్ పోయినప్పుడు ఏంచేయాలి. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి విషయం చెప్పాలి. కానీ సాధారణంగా జరిగేదేమిటి ?  పక్క వాటాలో కూడా కరెంట్ వుందో లేదో అని ఓ కంట కనిపెట్టిచూడడం మానవ నైజం. తనకు నష్టం జరిగిందన్న బాధ కన్నా పక్కవారికి కూడా అదే జరిగితే సంతోషించే రోజులివి.
సీ.బీ.ఐ. దర్యాప్తులకు న్యాయస్తానాలు ఆదేశిస్తున్న ఉదంతాలపై  ప్రస్తుతం వివిధ రాజకీయ పార్టీలు స్పందిస్తున్న తీరు కూడా ఈ స్వభావాన్నే సూచిస్తోంది.

ఏమయితేనేం! చేతులారా తెచ్చిపెట్టుకున్న సమస్యలతో కుడితినపడ్డ ఎలుకలా కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఎంతోకాలం తరువాత చక్కని  ఊరట దొరికింది.

జగన్ అండ చూసుకుని కొరకరాని కొయ్యలుగా తయారయిన కొందరు ఎమ్మెల్యేలను కట్టడి చేయలేక నిస్సహాయస్తితిలోవున్న అధికార కాంగ్రెస్ కు, కోర్టు ఆదేశాలపై సీ.బీ.ఐ. ప్రారంభించిన జగన్ ఆస్తుల కేసు విచారణ  కొంత ఊరటనిస్తే,  చంద్రబాబు అధికార దుర్వినియోగం గురించి హైకోర్టు ఆ  సీ.బీ.ఐ. నే దర్యాప్తు చేయమని తాజాగా ఆదేశించడం పూర్తి ఊరటను ఇచ్చింది. అటు  సీమాంధ్ర లో పూర్తిగా, ఇటు తెలంగాణలో ఓ మోస్తరుగా  ఏకుమేకై కూర్చున్న వైఎస్సార్ పార్టీని, తెలుగుదేశం పార్టీని రాజకీయంగా యెలా ఎదుర్కోవాలో తెలియని పరిస్తితిలో బాగా డీలా పడ్డ కాంగ్రెస్ పార్టీకి తాజా పరిణామాలు కొత్త ఊపిరి పోస్తున్నాయి. సరికొత్త ఆశలు  చిగురింపచేస్తున్నాయి.
కారణాలు ఏమయితేనేం, కారణ’భూతం’ ఏదయితేనేం చాలాకాలం తరువాత, అదీ ఏడాది పాలన పూర్తి ఐన తరుణంలో ‘కిరణ్ సర్కార్’ కొంత తెరిపిన పడింది.

ఒకే దెబ్బకు రెండు పిట్టలు అంటే ఇదే కాబోలు.

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech