సుజనరంజని /  కబుర్లు   /  సత్యమేవ జయతే

సత్యమేవ జయతే - అమెరికాలమ్ – 12

భజన చేయండీ...

                                                        సత్యం మందపాటి

 

  కైలాసంలో పరమ శివుడు పరమానందంతో తాండవం చేస్తున్నాడు. ఒక చేత్తో ఢమరుకం వాయిస్తూ, మధ్యే మధ్యే చేతిలోని శంఖం పూరిస్తూ, విజృంభించి నృత్యం చేస్తున్నాడు.
పార్వతీదేవి కూర్చుని దీక్షగా ఆ శివతాండవాన్ని వీక్షిస్తున్నది. ఆమెకి ఇరువైపులా వినాయకుడు, కుమారస్వామి కూర్చుని వున్నారు. ఆ నాట్యం పూర్తయిన తర్వాతనే అందరికీ భోజనాలు.
వినాయకుడి మనసంతా ఆ నృత్యం మీద కాక, పెద్ద పెద్ద బంగారు పళ్ళాలలో వున్న రకరకాల అన్నాలు, ఉండ్రాళ్ళు, భక్ష్యాలు, పిండివంటల మీదే వుంది.
కుమారస్వామి మాత్రం 'ఆ ఢమరుకం, శంఖం ఇంకెవరికైనా ఇవ్వచ్చు కదా. అవి కూడా వాయిస్తూనే తాండవం చేయటం ఎందుకు?" తండ్రి మీద ప్రేమతో అనుకున్నాడు మనసులో.
శివుడు నృత్యం ఆపటం, "నారాయణ! నారాయణ!" అంటూ నారదుడు ప్రవేశించటం ఒకేసారి జరిగాయి.
"రా నారదా! రా! సమయానికి వచ్చావ్. ఇంకాసేపట్లో భోజనాలకి కూర్చోబోతున్నాం. ఇంతలో నువ్వు కూడా వచ్చేశావ్. మాతోపాటూ భోజనం చేసి వెడుదువుగాని" అన్నాడు ఈశ్వరుడు మెడ మీద పట్టిన చెమటని బంగారు జరీ ఉత్తరీయంతో తుడుచుకుంటూ. ఆ జరీ తనకి తగలకుండా శివుని మెడలోని పాము కొంచెం పక్కకి తప్పుకుంది.
పార్వతీదేవి నారదులవారిని చూసి పలకరింపుగా చిరునవ్వింది.
"నేను మీ తాండవ వ్యాయామ కార్యక్రమానికి అడ్డు రాలేదు కదా" అడిగాడు నారదుడు.
"ఏమాత్రమూ లేదు. నేను రోజుకి మూడుసార్లు ఇలా చేస్తాను కాబట్టి ఒక్కొక్కసారి చిన్న అవాంతరం వచ్చినా ఫర్వాలేదు. నేను గంగలో జలకమాడి వస్తాను. నువ్వు చిరంజీవులతో మాట్లాడుతూ వుండు" అని, స్నానానికి వెళ్ళాడు శివుడు.
నారదుడు "మహా గణపతీ! నాకు ఒక సందేహం వుంది. ఆమధ్య అలా భారతదేశంలోకి తొంగి చూస్తే
కాకాలూకీయం అనే ఒక మాట వినిపించింది. అది ఇటు సంస్కృతంలో కానీ, అటు తెలుగులో కానీ లేని మాట. దానికి అర్ధం మీలాటి గొప్ప తెలివితేటలు వున్న మేధావులకి మాత్రమే తెలియాలి. ఆ మాటకి కొంచెం అర్ధం చెప్పి, నన్ను ధన్యుడిని చేయండి. అంతేకాదు ఈ కాకాలూకీయంతో పైకి కూడా వెడతారుట. పైకి అంటే కైలాసానికి కాదు కదా!" అన్నాడు.
ఆ మాటలకి వినాయకుడు పగలబడి నవ్వాడు. అతని నవ్వుకి పొట్టతోపాటూ తొండం కూడా ఎగిరెగిరి పడుతున్నది. మరీ అంతగా నవ్వితే సభ్యంగా వుండదని నవ్వుని మధ్యలోనే ఆపి అన్నాడు. "అడగదలుచు కున్న ప్రశ్న, జవాబు సులభంగా తెలిసే పద్ధతిలో అడిగారు నారద మునీంద్రులు! ఒకరి దగ్గరనించీ ఏదయినా సహాయం కావలసినప్పుడూ, వారివల్ల ఏదైనా లాభం వున్నప్పుడూ, వారిని ఉబ్బేసి తబ్బిబ్బు చేసేసి, పని జరిపించుకోవటాన్నే కాకాలూకీయం అంటారు. ఉదాహరణకి మీరు నాకన్నా వయసులో పెద్దవారు. అయినా నన్ను మహాగణపతీ అని సంభోధించారు. నన్ను మేధావిని తెలివిగలవాడిని అన్నారు. అదే కాకాలూకీయం"
నారదుడు చిన్నబుచ్చుకోవటం చూసి "పిల్లవాడి మాటలు పట్టించుకోకండి మునీంద్రా! సర్వసంగ పరిత్యాగులు మీకు అవసరాలేముంటాయి" నవ్వుతూ అన్నది ఉమాదేవి.
నారదుడు కూడా నవ్వుతూ "ఎలాగూ ఈ విషయం గురించి చెప్పావు కనుక, ఈసారికి దీని గురించే మాట్లాడదాం విఘ్నేశ్వరా! తెలుసుకోవాలని కుతూహలంగా వుంది. కొంచెం వివరంగా చెప్పు?" అన్నాడు.
"అవును. శివుడు గంగతో జలకాలాటలకి వెళ్ళాడు కదా! రావటానికి కొంచెం సమయం పడుతుంది. ఈలోగా కాలక్షేపం కోసం నీకు తెలిసిందేదో చెప్పు గణపతీ" అంది గిరిజ.
గణపతి చెబుతున్నాడు. "ఈ కాకాలూకీయం అనేది మనందరికీ తెలిసిందే! దాన్ని మనం పౌరాణిక భాషలో భజన అంటాం. శ్రీఆంజనేయస్వామివారు లంకాపురికి ఎగిరి వెళ్ళటానికి తటపటాయిస్తుంటే అందరూ ఆయన్ని నువ్వింతటివాడివి ఇంతటివాడివి అని ఉబ్బితబ్బేస్తుంటే, ఆయనకి ఎక్కడలేని ఉత్సాహం వచ్చి, పైకి ఎగురుకుంటూ వెళ్లి అవలీలగా సముద్రం దాటి లంకకి వెళ్ళాడు. ఆయన చేసినది సీతా సంరక్షణ కోసమే అయినా, ఆయన చేత ఆ పని చేయించుకోవటానికి అలా భజన చేయవలసివచ్చింది. ఎక్కువగా స్వలాభం కోసం ఈ భజనలు చేసి లాభాలు చేసుకుంటారు. అదే అసలైన కాకలూకీయం"
"అవును. నేను భూలోకంలోకి తొంగిచూసినప్పుడల్లా గమనిస్తుంటాను. ఉద్యోగస్తులలోనూ రాజకీయ నాయకుల దగ్గరా, అంతెందుకు జీవితంలో ప్రతి సందర్భంలోనూ ఈ కాకాలూకీయం స్వలాభం కోసం వాడటం కనిపిస్తుంది" అన్నాడు నారదుడు.
"నిజమే! వివరంగా చెప్పమన్నావు కనుక చెబుతున్నాను. వినండి. ఇలాటి స్వలాభం కోసం చేసే భజనలు మూడు రకాలు. మొదటిది పర భజన. అంటే ఇతరుల్ని పొగిడి, వారి దగ్గర చేతులు నలిపి, నక్క వినయం చూపిస్తూ, అవునండీ చిత్తం చిత్తం అంటూ వారిని చిత్తు చేయటానికీ, ఉద్యోగాలు సంపాదించటానికీ, ఆ ఉద్యోగాల్లో త్వరత్వరగా పైకి పోవటానికీ, పదవులు సంపాదించటానికీ, ఆ పదవుల్లో పైకి పోవటానికీ, వాటిల్లో డబ్బు సంపాదించటానికీ... ఈ పర భజన బాగా ఉపయోగపడుతుంది” ఆగాడు వినాయకుడు.
“అవును. గణపతి చెప్పింది నిజమే. భస్మాసురుడు మొదలైన దుర్మార్గులు పరమేశ్వరుడికి ఇలాగే పర భజన చేసి వరాలు పొందారు. మా అయన వట్టి బోళా శంకరుడు. ఆ భజనకి పడిపోయి ప్రాణానికి తెచ్చుకున్నాడు” అంది భవాని నారదుడితో.
“లెస్సగా పలికావు తల్లీ! ఇది నాకు తెలిసిన కథే కదా!” అన్నాడు నారదుడు.
“రెండవది స్వంత భజన. అడగనిదే అమ్మయినా పెట్టదని సామెత వుందే, అదన్నమాట. భూలోకంలో పెద్ద పెద్ద వ్యాపారసంస్థలు ఎంతో సొమ్ము ఖర్చుపెట్టి వాళ్ళ గురించి వాళ్లే కొన్ని సత్యాలు, ఎన్నో అసత్యాలతో ప్రకటనలు ఇచ్చుకుంటారు. దానివల్ల వాళ్లకి అమ్మకాలు పెరిగి లాభాలు వస్తాయి. ఒక్కొక్కప్పుడు స్వంత డబ్బా కొట్టుకుంటూనే, ఇతరుల్ని దూషించవలసిన అవసరం కూడా రావచ్చు. అంటే పరదూషణ స్వంత భజనలో భాగం అన్నమాట. రాజకీయాల్లో పదవులు కావాలంటే, ఈ స్వంత డబ్బా, పరదూషణ అవసరం. అలాగే ఉద్యోగస్తులు. స్వంత డబ్బా ఎంత కొట్టుకుంటే అంత లాభం. కొంతమంది ఉద్యోగస్తులు కార్యాలయంలో ఒక పక్కన కూర్చుని, ఇతరుల్ని పట్టించుకోకుండా కష్టపడి తమ పని తాము చేసుకుంటూవుంటారు. ఇలాటి వారు ఎక్కువగా పని చేస్తున్నా, వారి గురించి తెలియవలసిన వారికి ఆ సంగతి తెలిసే అవకాశం లేదు. వారి బాసాసురులు వీళ్ళ కష్టంమీద బ్రతుకుతూ, స్వంత లాభం కోసం అసలు విషయం బయటికి రానీయరు. ఇది స్వంత భజన చేసుకోకపోవటం వల్ల జరిగే నష్టం. అంతేకాదు. ఈ స్వంత భజన చేసుకునేటప్పుడు, స్వంత భజనలా కనపడకుండా వుండేలా చేయటం అవసరం. లేకపోతే అది బెడిసికొట్టే అవకాశం వుంది”
దీక్షగా వింటున్న కుమారస్వామి, ఏమీ మాట్లాడకుండా పక్కనే పురి విప్పి నాట్యం చేస్తున్న తన వాహనం నెమలి అందాలను చూస్తూ కూర్చున్నాడు.
గణపతి పొట్ట నిమురుకుంటూ అన్నాడు. “ఇక మూడవ భజన పరస్పర భజన. అంటే నువ్వు ‘నా వీపు గోకు, నేను నీ వీపు గోకుతా’ అనే ఒప్పందం మీద జరిగే భజన అన్నమాట. ఒకళ్ళ గురించి ఇంకొకళ్ళు భజన చేస్తూ, ఇద్దరూ పైకి వెళ్ళటం అన్నమాట. ఇద్దరూ నమ్మకస్తులే అయితే ఫరవాలేదు కానీ, వాళ్ళల్లో ఏ ఒక్కరో రెండవ వారిని ముంచేసే అవకాశం వుంది. అందుకని పరస్పర భజన చేసేటప్పుడు ఎంతో జాగ్రత్త అవసరం. ఇప్పుడు భారత దేశంలో రాజకీయ నాయకులూ, కొన్ని వార్త పత్రికలూ చేస్తున్నది అదే. పత్రికలు ఆ రౌడీ నాయకులని మహానాయకులుగా, ప్రజా బంధువులుగా, న్యాయమూర్తులుగా చిత్రించి గొప్పగా వ్రాస్తుంటాయి. ఆ రాజకీయ నాయకులు, ఆ పత్రికలకి రకరకాలుగా సహాయం చేసి పైకి తెస్తుంటారు”
“మా గణపతికి ఇలాటివన్నీ బాగా తెలుసు” అంటూ బొజ్జ గణపతిని ముద్దుగా దగ్గరకు తీసుకుంది శైలజ. గణపతి పొట్ట క్రింద పడి నలిగిపోకుండా, ప్రాణ రక్షణార్ధం చకచకా పక్కకి పారిపోయింది గణపతి వాహనం మూషికం.
అప్పటిదాకా మౌనంగా కూర్చుని వింటున్న కుమారస్వామికి ఒక్కసారిగా కోపం వచ్చింది. “ఎందుకు తెలీదు? చేసే పనులన్నీ అలాటివే కదా!” అన్నాడు ఇక వుండబట్టలేక.
“కుమారా! ఎందుకు ఆ ఆవేశం?” అడిగాడు నారదుడు.
“ఎందుకా? మా తండ్రిగారు మాలో ఒకరికి గణాధిపత్యం ఇద్దామని ఆలోచిస్తున్నప్పుడు ఏమయింది? అయన లోకంలోని అన్ని పుణ్య క్షేత్రాలకీ వెళ్లి దైవ దర్శనం చేసుకుని, మాలో ఎవరు ముందుగా కైలాసానికి తిరిగి వస్తే వారికే గణాధిపత్యం ఇస్తానని చెప్పారు కదా! నేను అయన చెప్పింది అక్షరాలా పాటిస్తూ, ఒక్కొక్క పుణ్యక్షేత్రానికీ వెళ్లి దైవ దర్శనం చేసుకుంటుంటే, ఈ గణపతి నాన్నగారి చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేస్తూ, ఆయనే లోకమని, లోకేశ్వరుడనీ స్తుతిస్తూ భజన చేశాడు. నేను అంత కష్టపడి తిరిగీ తిరిగీ వస్తే, గణాధిపత్యం నాకు ఇవ్వకుండా, తనకి భజన చేసిన గణపతికి ఇచ్చాడు మా నాన్న” అక్కసుతో అన్నాడు కుమారస్వామి.
ఈలోగా పరమేశ్వరుడు వచ్చి “నా స్నానం అయిపోయింది. ఇక అందరం భోజనాలకి లేద్దాం. నారదా! లేచి కాళ్ళు కడుక్కుని రా!” అని తొందరపెట్టాడు.
 
 

సత్యం మందపాటి

పుట్టింది తూ.గో.జిల్లాలో ఆత్రేయపురం. పెరిగింది గుంటూరు.
చదువు గుంటూరు, కాకినాడ, విశాఖపట్టణం. ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ.
ట్రివేండ్రంలో పదేళ్ళు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో సీనియర్ మేనేజర్ గా ఉద్యోగం.

ప్రస్తుతం, అంటే మూడు దశాబ్దాలుగా అమెరికాలో, టెక్సాస్ రాష్ర్త్ర రాజధాని ఆస్టిన్ నగరంలో.
వృత్తి ఇంజనీరింగ్ అయితే, ప్రవృత్తి సాహిత్యం. సాహిత్యరంగంలో ఒక చిన్న దీపం వెలిగించడానికి నాలుగు దశాబ్దాలుగా ఎన్నో కథలు, కవితలు, నాటికలు, నవలలు, శీర్షికలూ, మూడు సీడీలకు (వేయి వసంతాలు) పాటల ద్వారా ప్రయత్నం.

 
 

 

 

నా రచనలకు స్ఫూర్తీ, స్పందనా ఇచ్చిందీ ఇస్తున్నదీ నా అభిమాన రచయితల కథలూ, నా చుట్టూ ఉన్న ప్రజలూ ప్రపంచం.

చైతన్య భారతి, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, ఆటా, తానా, వంశీ కల్చరల్ ట్రస్ట్, ఫ్రెండ్ షిప్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, వంశీ ఇంటర్నేషల్, సప్నా, సిరి ఫౌండేషన్, శీ సువర్చలా ఛారిటబుల్ ట్రస్ట్ అంతర్జాతీయ సాహితీ పురస్కారం, రచన మాసపత్రిక కథాపీఠం పురస్కారం, అంతర్జాతీయ తెలుగు సాంస్కృతిక - సారస్వత సంఘం మొదలైన సంస్థల ద్వారా బహుమతులూ, పురస్కారాలూ, అభిమానుల ఉత్తరాలూ, పాఠకుల స్పందనా, పత్రికా సంపాదకుల ప్రోత్సాహం నాకూ, నా రచనలకూ విటమిన్లు.
1968 వ సంవత్సరం నించీ ఆనాటి యువ, జ్యోతి, ఆంధ్రపత్రిక, ఆంద్రజ్యోతి, ఆంధ్రప్రభల నుంచీ ఈనాతి స్వాతి, విపుల, ఆంధ్రభూమి, రచన, చతుర, ఇండియా టుడే, స్వప్న మొదలైన భారత్దేశంలోని దాదాపు అన్ని తెలుగు పత్రికల్లోనూ, అమెరికాలోని తానా పత్రిక, అమెరికా భారతి, తెలుగునాడి, సుజనరంజని, కౌముది మొదలైన పత్రికల్లోనూ 350కి పైగా నా రచనలు వచ్చాయి. మొత్తం తొమ్మిది పుస్తకాలు ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, రచన, సుజనరంజని, కౌముది, స్వప్న మొదలైన పత్రికల్లో ధారావాహికంగా నా శీర్షికలు ప్రచురించబడ్డాయి.
సాలూరి వాసూరావు సంగీత దర్శకత్వంలో, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శైలజలు పాడిన సంగీత నృత్య రూపకం ‘వేయి వసంతాలు’ అట్లాంటా ఆటా కార్యక్రమంలో ప్రదర్శించబడింది.
ట్రివేండ్రంలో నాలుగు సంవత్సరాలు, హ్యూస్టన్ లో రెండు సంవత్సరాలు, ఆస్టిన్ లో ఎన్నో సంవత్సరాలుగానూ తెలుగు బడి నిర్వహిస్తున్నాను. 1998 నుంచీ టెక్సాస్ లో తెలుగు సాహిత్య సదస్సులు సంవత్సరానికి రెండుసార్లు, సాహితీ మిత్రుల సహకారంతో నిర్వహిస్తున్నాం
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech