సుజనరంజని / శీర్షికలు  / శ్రీ శనీశ్వర శతకం-2


శ్రీ శనీశ్వర శతకం-2

                                              - అక్కిరాజు సుందర రామకృష్ణ

 

కారణ మెద్దియైన సమకాలపు వారలు మెచ్చుకున్న నా
తీరున ధైర్య చింతన నదే పని చొప్పుకు పోయి ముందుకున్
సూరిగ నొక్కవెల్గు కడు సొంపుగ వెల్గిన ‘చేమకూర’కున్
హారతు లిత్తు భక్తిమెయి అంజలి సల్పుచు శ్రీ శనీశ్వరా - 11

ఆధునికాంధ్రమందు తనదైన యశంబును నిల్పుకున్న వి
ద్యా ధనుడౌ బుధుండు, చరితార్ధుడు సత్కవి ‘విశ్వనాథ’-బల్
సాధకుడౌ మహామహుడు, సారయశస్కుడు, రామభద్రు నా
రాధకుడా ఘనుల్ మివుల ప్రస్తుతి జేసెద శ్రీ శనీశ్వరా - 12

‘పావని’ శాస్త్రియంచు తన పట్టికి పేరునొసంగెగా, చిరం
జీవిగ వర్ధిలన్ సుకవి శేఖరుడాతడు ‘విశ్వనాథ’ ; ఆ
దైవము సల్పె నే డయయొ దారుణమౌగతి రామ రామ; నే
నే విధి దూరినన్ ఫల మదేమియు లేదుర - శ్రీ శనీశ్వరా - 13

సద్యశుడైన పండితుడు, సత్కవితాగుణుడౌ తపస్వి; ఆ
రాధ్యుడు తెల్గు జాతికని ప్రస్తుతులందిన సద్గురుండు; శ్రీ
విద్యకు పట్టుగొమ్మ! కడు విజ్ఞుడు ‘నోరి నృసింహ శాస్త్రి’ - ఆ
విద్యల రాణి నందనుని వేడ్కనుతించెద - శ్రీ శనీశ్వరా! - 14

బాల కవీంద్రుడంచు బుధవంద్యులచేత ప్రశంసలంది - మీ
సాలవి రాకముందె వరశక్తిని అద్భుతమైన పెక్కు, కా
వ్యాలను వ్రాసి - వాణి కృప వర్ధిలు చుండిన - ‘మాలకొండ - ఉం
డేల’ కూర్మి భక్తి ప్రకటించెద సన్మతి శ్రీ శనీశ్వరా! - 15

మించిన భక్తి భారతిని మేలు భజించెడు వాని; వాక్కునన్
మంచి పటుత్వమున్న అసమాన కవీంద్రుని, పద్య విద్యయం
దంచుల నెల్లమించి పరమాద్భుత శైలిని ‘అశ్వధాటి’ చూ
పించగలట్టి సోదరుని విశ్రుత కీర్తిని; ప్రేమ నాయెడన్
పంచుచు తమ్ముడన్న ప్రియభావన చూపుచు, మధ్య మధ్య శా
సించుచు సర్వమున్ మరచి, చిక్కని పద్యమునల్లు విద్య నే
ర్పించిన ‘చిల్లరా’ న్వయుని - ప్రీణిత బాంధవు ‘కృష్ణమూర్తి’ న
భ్యంచిత భక్తి గొల్తు కుసుమాంజలు లిచ్చుచు శ్రీ శనీశ్వరా! - 16

అతని వాక్కు హృద్యమరయంగను - అంతకు నూరు రెట్లు, ఆ
పాత మనోహరం బతని పద్యము - ‘వేదిక’ లవ్వెసాక్షి, వి
ఖ్యాతుడు, స్నేహశీలి; ఎవరాతడు - మా ‘రసరాజె’ యంచు, నే
ప్రీతిగ పల్ సభాస్థలుల ‘బేగడ’ పాడుదు శ్రీ శనీశ్వరా - 17

మించిన గాన మాధురుల మేలుభళాయని విశ్వమంత హ
ర్షించగల వెల్గెనెవ్వడు వశీకృతచిత్తుడు తెల్గువారిదౌ
సంచిత పుణ్యకర్మమున జన్మము నందిన ‘ఘంటసాల’ నా
కంచు గళంబు ‘మాస్టరు’ నఖండుని గొల్చెద - శ్రీ శనీశ్వరా! - 18

మాకు గురూత్తముల్ బుధులు ‘మద్దులపల్లి’ని ‘వారణాసి’నిన్
వ్యాకరణంబు చెప్పిన మహావిదుడాతని ‘తూములూరి’ నిన్
ప్రాకట సద్యశుల్ సుకవి రాజులు తక్కిన అయ్యవార్లకున్
చేకొనుడంచు ప్రస్తుతుల, చేతులు మోడ్చెద - శ్రీ శనీశ్వరా! - 19

గురుని కటాక్ష వీక్షణము కొద్దియె గొప్పయొ లేకయున్న, ఏ
నరుడును పూర్ణ జీవియగు జ్ఞానిగ వెల్గుట దుర్లభంబు - వా
నరపతి సర్వలోకముల జ్ఞానవరేణ్యుల నగ్రగణ్యుడై
బరగెనటన్న సద్గురుడు ‘భాస్కరు’ పుణ్యమె - శ్రీ శనీశ్వరా! - 20

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech