సుజనరంజని / సారస్వతం / సంస్కృతంలోచాటువులు, విశేష న్యాయాలు

సంస్కృతంలో చాటువులు, విశేష న్యాయాలు. (7వ భాగం)

                                     రచన :- " విద్వాన్" తిరుమల పెద్దింటి నరసింహాచార్యులు. M.A.,M.Phil

 
 
12. అంధ కరదీపికా న్యాయ:—

అనగా `'గుడ్డి వాని చేతిలో దివ్వె'' అని అర్ధం. చీకటిలో ఉన్నపుడు కళ్ళున్న వాడి చేతిలో జ్యోతి ఉంటే అంతా కనబడుతుంది గాని, గుడ్డివాని చేతిలో దివ్వె (కరదీపం) ఉంటే లాభం లేదు కదా. అని ఈ న్యాయం తెల్పుతుంది. దీనిని పోతనగారి భాగవతంలోని ప్రహ్లాద చరిత్రతో వివరిస్తాను. తండ్రి అయిన 'హిరణ్యకశిపుడ' ప్రహ్లాదునితో 'చదువని వాడజ్ఞుండగు, చదివిన సదసద్వి వేక చతురత కల్గున్.'(అన్న పద్యంలో) చదువు కొంటే, మంచి చెడులు తెలుస్తాయి చదువు లేకపోతే అజ్ఞానంతో ఏమి తెలియదు.' అని తెల్పి. గురువుల వద్దకి పంపు తాడు. కొంతకాలం తరువాత కొడుకుని పిలిపించు కొని 'ఎలా చదువు తున్నావు. గురువులు ఎటువంటి చదువు చెప్పార' అని అడుగుతాడు.(ఈకాలం ప్రోగ్రస్ రిపోర్టు వలే) అప్పుడు ప్రహ్లాదుడు చక్కని సమాధానం చెప్తాడు.

'చదివించిరి నను గురువులు,
చదివితి ధర్మార్ధ ముఖ్య శాస్త్రంబులు నే
చదివినవి గలవు పెక్కులు ,
చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ.'

అనేక శాస్త్ర విద్యలు చదివి, వాటిలోని మర్మం అంటే సారాంశం గ్రహించాను. అంటాడు. గుడ్డిగా ఏది పడితే అది చదవకుండా తనకి కావలసినది, ఇష్ట మైనది,చదివేను అని చెపుతాడు. ఇది ఆధునిక కాలానికి కుడా పనికివచ్చే సమాధానం. 'తల్లిదండ్రులు తమ అభిరుచికి తగినట్లు కాకుండా, పిల్లల అభిరుచికి తగిన చదువు చెప్పించడం మంచిది.' అనే మంచిమాటని ఆనాడే ప్రహ్లాదుడు చెప్పాడు.

ఇంకా,
'కానని వానినూతగొని
కానని వాడు విశిష్ట వస్తువుల్ కాననిభంగ' న్న పద్యంలో గుడ్డి వాడు గుడ్డి వాని సాహాయం తీసుకొంటే ఏది చూడలేడు.
ఆ విధంగా గురువులు చెప్పిన విద్య ఉన్నదని తెల్పి, అది చదివితే 'అంధేదూదయముల్, మహాబధిర శంకారావముల్, మూకస గ్రంధాఖ్యాపనముల్, నపుంసక వధూ కాంక్షల' అన్న పద్యంలో గుడ్డివానికి చంద్రోదయము, చెవిటివానికి శంఖధ్వని,మూగ వానిని పుస్తకం చదవమని చెప్పడం, వరాహానికి (పందికి) మంచి గంధం పూయడం  ఇట్టివి వ్యర్ధమైన కార్యాలు. అట్లే శ్రీహరిని గూర్చి తెల్పేదే సద్విద్య అని,మిగిలినవి వ్యర్ధమైనవి అని తండ్రితో,' హరిన్ నమ్మి యుండుట భద్రంబంచు తలతున్ సత్యంబు దైత్యోత్తమా”అని తెల్పి,ఇంకా శరీరం,మనసు,ఇంద్రియాలు,బుద్ధి అన్నీ ఆపరమాత్మ కోసం వినియోగించాలని,ఇల్లనే చీకటి బావిలో ఈదులాడుతూ,మతిభ్రమించిన వారివలే ఉండక అఖండం, అభిన్నం,ఆనందమయం అయిన బ్రహ్మ తత్త్వాన్ని తెలుసుకోవాలని,అదే సరియగు విద్యయని,మిగతా విద్యలు నేర్చుకొంటే 'అంధ కరదీపికా న్యాయం'లా పనికి రావని.తండ్రికి వివరించి,అనేక బాధలు అనుభవించి, తాను నమ్మిన శ్రీహరివల్ల రక్షింపబడి, భక్తులలో అగ్రగణ్యుడుగా కీర్తింప బడతాడు.ఇది అందరికి తెలిసిన కథ.(భాగవతం చదివి పూర్తిగా తెలుసుకోగలరు.) దీని వలన సత్ అసత్ అనేవి తెలుసుకొని,సత్ ని ఆచరించి,అసత్ ని వదలాలని. అసత్తుని ఆచరిస్తే పై న్యాయంలో చెప్పినట్లు పనికిరాకుండా పోతుందని తెలుసుకోవాలి.

ఇంకా ఈన్యాయాన్నిమరికొన్ని విశేషాలతో వివరిస్తాను.
భగవత్స్వరూప నిరూపణకు శబ్దం ముఖ్యమైనది. దీనినే శబ్ద బ్రహ్మ అని వేదం తెల్పుతుంది. ఈ శబ్ద బ్రహ్మకి. “పరా, పశ్యంతీ, మధ్యమ, వైఖరి అని నాలుగు ముఖాలు. ఈ శబ్దం నాభి, హృదయం, గొంతులో ఉండే స్వర పెటికా, నాలుకల ద్వారా అక్షరాల రూపంలో వెలువడుతుంది.

'అనాది నిధనం బ్రహ్మ శబ్ద తత్త్వం యదక్షరం
వివర్తతేర్ధ భావేన ప్రక్రియా జగతో యత:'

పూర్వ కాలం నుంచి శబ్ద బ్రహ్మ అక్షర రూపంలో ఈ జగత్తులో వ్యాపించి ఉందని ఉపనిషత్తు వివరిస్తుంది. అందుకనే గీతలో పరమాత్మ 'అక్షరాణామకారోస్మి' అనగా అక్షరాలలో ఆకారాన్ని నేను. అనితెల్పి అకార, ఉకార, మకారాలకి ఆవల తీరంలో ఉన్న ఓం కారమే శబ్ద బ్రహ్మ స్వరూపమని, అది 'ఆది,మధ్య,అంతం లేనిది, లోపల బైట అంతటా ఉండునది, ఈ సమస్త బ్రహ్మాండాల చలనంలో(భ్రమణం లో) ప్రతిధ్వనించేది ఏదైతే ఉందో అదే ఓంకారం, అదే శబ్ద బ్రహ్మమ'. అని ఉపనిషత్తు తెల్పుతుంది.

ఈ అక్షరాల ఉత్పత్తిని పాణిని అనే ఋషి ఎంత చక్కగా వివరించారో చుడండి. 'అకుహ విసర్జ నీయానాం కంట; ఇచుయశానాంతాలు, ఋ టురషానాం మూర్దా' లుతు లసానాం దంతాః

మొదలైన సూత్రాల ద్వారా, అనగా ఆ కారం, హకారం గొంతుక నుండి, ఇకారం, చకారం నాలుక దంతాలను తాకడంవల్ల, ఋ కారం, ట కారం శిరస్సు నుండి, ఉకారం, పకారం పెదవులనుండి, జ్ఞాకార, నకార, ణకార, మకారాలు నాసిక అనగా ముక్కునుండి' ఇలా అక్షరాలన్నీ నాభి నుండి బయలు దేరిన వాయువు (గాలి ) స్వరపేటికను తాకి ఆయా స్ధానాల నుండి బయటకి వచ్చినపుడు,అక్షరాలు పుడతాయని,ఆధునిక విజ్ఞానం(లింగ్విస్టిక్ సైన్స్) తెల్పిన దానికన్నా ముందే అంటే కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే “అక్షర బ్రహ్మగా”దీనిని వివరించారు.

ఇట్టి అద్భుత విషయాలను తెలుసుకొని, మానవుడు 'సర్వ మానవ కల్యాణానికి' పనికి వచ్చే సద్విద్యను తెలుసుకోవాలి, కాని అసద్విద్య (పనికిరానిచాదువు) నేర్చుకొంటే 'అందకరదీపికా' న్యాయం లా వ్యర్ధం అని ఈన్యాయం తెల్పుతుంది.

( వచ్చేనెల మరికొన్ని.)
(సశేషం.)

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech